Ads

Showing posts with label Kartika Masam. Show all posts
Showing posts with label Kartika Masam. Show all posts

08 November, 2021

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత? Significance of Karthika Deepam

  

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత?

కార్తీకమాసం అనగానే, తెల్లవారు ఝామున స్నానాలూ, ఉభయ సంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలూ, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం.. చక్కని సందడి!


ఇందులో దివ్యత్వంతో పాటు, ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి..

చిరు చలిలో బద్ధకాన్ని వదుల్చుకుని చేసే స్నానం, చిరు దీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం..

ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి, ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళా చాతురిని కొనియాడవలసిందే..

కార్తీకంలో, దేశమంతా ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ, దైవాన్ని కొలుచుకుంటారు.

కార్తీకం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికీ ప్రాధాన్యం..

కృత్తికా నక్షత్రం నాడు, పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం..

కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి, ఆరాధించడమే యజ్ఞం..

అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది, కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే, 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది..

కార్తీకంలో దీపార్చన, దీప దానం వంటివి, యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి..

భర్తృహరి తన శతక సాహిత్యంలో, పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం, యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు..

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా, ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి, ఉపాసించమని ఉపదేశించే మాసమిది..

ఓం నమః శివాయ!

15 December, 2020

కార్తీక పురాణం! (త్రింశోధ్యాయం - ముప్పయ్యవ రోజు (ఆఖరి రోజు) పారాయణం)

కార్తీకపురాణం ఫలశ్రుతి:

నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ, సూతమహర్షి, కార్తీక వ్రత మహిమా ఫల శ్రుతిని తెలియజేశారు. విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలను విని, అంతా ఆనందించారు. వేయినోళ్ల సూతమహర్షిని కొనియాడారు. శౌనకాది మహామునులకు, ఇంకా సంశయాలు తీరకపోవడంతో, సూత మహర్షిని చూసి, 'ఓ మహాముని! కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి, సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి, పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు, సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నా, మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి, మాకు వివరించి, మమ్మల్ని ఉద్దరించండి” అని కోరారు.

దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు, 'ఓ మునులారా! మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులు మంద బుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు, మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి. మోక్షసాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల, యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం, శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే, ఘనమైనదని ఆ శ్రీహరే సెలవిచ్చారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినా, సూక్ష్మంగా వివరిస్తాను. కార్తీకమాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. 

కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉనప్పుడు శ్రీహరి ప్రీతికోసం, మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్లి, హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా, దీపదానం చేయాలి. ఈ నెలరోజులు, విధవ వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లోగానీ, శివాలయాల్లోగానీ, ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల, సకల పాపాల నుంచి విముక్తులై, సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెలరోజులు, ఈ విధంగా పద్ధతులు పాటించేవారు, జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా.. ఆచరించక పోయినా… భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించేవారిని ఎగతాళి చేసినా… ధన సహాయం చేసేవారికి అడ్డుపడినా… వారు ఇహలోకంలో, అనేక కష్టాలను అనుభవించడమే కాకుండా… వారి జన్మాంతరంలో, నరకంలో పడి కింకరులచే, నానా హింసల పాలవుతారు. అంతేకాకుండా… వారు నూరు హీన జన్మలెత్తుతారు.

కార్తీకమాసంలో కావేరీ, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి, ముందు చెప్పిన విధంగా, నిష్టతో కార్తీక నియమాల్ని పాటించేవారు, జన్మాంతరాన, వైకుంఠ వాసులవుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో, కార్తీక మాసం ఉత్తమమైనది. అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి, కార్తీక మాస వ్రతం వల్ల, జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు, తొలగిపోతాయి. నియమ నిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు, జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెలరోజులు నియమాలు పాటించలేనివారు, కార్తీక శుద్ధ పౌర్ణమినాడు, తమ శక్తికొలదీ వ్రతమాచరించి, పురాణ శ్రవణం చేసి, జాగారం ఉండి… మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే… నెలరోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినట్లయితే… ఎన్నటికీ తరగని పుణఫ్యం లభిస్తుంది. ఈ నెలరోజులు ధనవంతుడైనా, పేద అయినా, మరెవ్వరైనా, హరినామ స్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ, దాన ధర్మాలు చేయాలి. అలా చేసేవారు, పుణ్యలోకాలను పొందుతారు. ఈ కథను చదివినవారికి, శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు.

ఇతి శ్రీ స్కాంధ పురాణాంతర్గత వశిష్ట సంప్రోక్త కార్తీక మహత్యమందలి 'త్రింశోధ్యాయం - ముప్పయ్యవ రోజు (ఆఖరి రోజు) పారాయణం' సమాప్తం..

ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు |

ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

కార్తీకపురాణం (30వ) చివరి రోజు. కార్తీకపురాణం సంపూర్ణం.

Link: https://www.youtube.com/post/Ugy0Gbg60sMK3U9_-ld4AaABCQ

 

14 December, 2020

కార్తీక పురాణం! (నవవి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం)


అంగీరసుడు దూర్వసుని పూజించుట - ద్వాదశీ పారణము:

అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా - సుదర్శనచక్రము అంబరీషునకు అభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తకోటి దర్శనమిచ్చి అంతర్ధమైన వైనమును చెప్పి తిరిగి ఇలా నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దూర్వసుని పాదములపై పడి దండ ప్రణామము లాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నిళ్లను తన శిరస్సుపై చల్లుకొని 'ఓ ముని శ్రేష్ఠా! నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది, నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశీవ్రతము చేసుకొనుచు, ప్రజలకు ఎట్టి కీడు రాకుండా, ధర్మవర్తనుడనై, రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు, నన్ను మన్నింపుము. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే, తమకు అతిథ్యమియ్యవలయునని ఆహ్వానించితిని. కావున, నా ఆతిధ్యమును స్వీకరించి, నన్నూ, నా వంశమును, పావనము చేసి, కృతార్ధుని చేయుము. మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినా, మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని, మీ రాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు, నేను మీ ఉపకారము మరువ లేకున్నాను.

మహానుభావ! నా మనస్సంతోషముచే మెమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నాకండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవచేసినను, యింకను ఋణపడి యుందును. కావున, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేటట్లూ, సదా మీ బోటి ముని శ్రేష్ఠుల యందును, ఆ శ్రీమన్నారాయణుని యందును, మనస్సు గలవాడనై యుండునట్లును, నన్నాశీర్వదించుడి' అని ప్రార్థించి, సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహానించెను.

ఈ విధంగా తన పాదములపై బడి, ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, 'రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి, ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో, అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానమైనావు.

నేను నీకు నమస్కరించినచో నాకంటె చిన్నవాడవగుట వలన, నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత, నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను. పవిత్ర ఏకాదశీ వ్రతనిష్టుడవగు నీకు, మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు, నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక, మరొకటి యగునా?' అని దూర్వాసమహాముమిని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారముగ' పంచభక్ష్య పరమాన్నములతో, సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి సెలవు పొంది, తన ఆశ్రమమునకు వెళ్లెను.

ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ద ద్వాదశీ రోజున జరిగినది. కావున ఓ అగస్త్య మహాముని! ద్వాదశీ వ్రత ప్రభవమెంతటి మహాత్యము కలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి, ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆ రోజునకంతటి శ్రేష్ఠతా, మహిమ కలిగినది. ఆ దినము చేసిన పుణ్యము, ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి, పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి, ఆ రాత్రియంతయు పురాణము చదువుతూ, లేక వింటూ జాగరణచేసి, ఆ మరునాడు, అనగా, ద్వాదశీ నాడు, తన శక్తికొద్ది శ్రీమన్నారాయణుని ప్రీతికోరకు దానములిచ్చి, బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో, అట్టివాని సర్వపాపములు, ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశీఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగనే భుజింపవలయును.

ఎవరికైతే వైకుంఠములో స్థిరానివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశివ్రతము, ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ద ద్వాదశీ, అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయయింపకూడదు. మర్రిచెట్టు విత్తనము చాల చిన్నది అయినను, అదే గొప్ప వృక్షమైన విధముగా, కార్తీకమాసంలో నియమానుసారముగ జేసిన ఏ కొంచెము పుణ్యమైననూ, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందుకే, ఈ కార్తీకమాస వ్రతము చేసి, దేవతలే కాక, మానవులూ తరించిరి.

ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును. అని అత్రిమహాముని అగస్త్యునితో చెప్పెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'నవవి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం' సమాప్తము.

కార్తీకమాస 29వ రోజున ఆచరించవలసిన దానధర్మాలు, జపతపాది విధులు, ఫలితములు:

పూజించాల్సిన దైవము → శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము → 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్'

నిషిద్ధములు → పగటిపూట ఆహారము, ఉసిరి

దానములు → శివలింగం, వీభూతి పండు, దక్షిణ, బంగారము

ఫలితము → అకాలమృత్యు హరణం, ఆయుర్యృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

Link: https://www.youtube.com/post/Ugz8HVHa9G5SSQAgaN94AaABCQ

13 December, 2020

కార్తీక పురాణం! (అష్టవి౦శోధ్యాయము - ఇరవయ్యెనిమిదవ రోజు పారాయణం)


విష్ణు సుదర్శన చక్ర మహిమ:

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవుపొంది, తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ, తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి, అంబరీషుని వద్దకొచ్చి, 'అంబరీషా, ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని, నిన్ను కష్టముల పాలుజేసి, వ్రతభంగము చేయించి, నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకువెళ్లి, ఆ విష్ణుచక్రము ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆ పురాణ పురుషుడు, నాకు జ్ణానోదయము చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పినాడు.

కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్ఠగలవాడనైనను, నీ నిష్కళంక భక్తిముందు, అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు' అని అనేక విధములుగా ప్రార్థించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, 'ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనః పూర్వక వందనములు, ఈ దూర్వాసముని, తెలిసియో, తెలియకో, తొందరపాటుగా, ఈ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను, ఇతడు బ్రాహ్మణుడు కావున, ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దూర్వసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను.

నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో, అనేక మంది లోక కంటకులను చంపితివిగాని, శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే, ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను, ఇతనిని వెంటాడుచూనే ఉన్నవు గాని, చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా ఏకమైననూ, నిన్నేమియు చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలుసు. అయినను, మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించెను.

నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి యున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను, శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము' అని అనేక విధముల స్తుతించుట వలన, అతి రౌద్రాకారముతో, నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము, అంబరీషుని ప్రార్ధనలకు శాంతించి 'ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని, వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను, దేవతలందరు ఏకమైగూడ చంపజాలని మూర్ఖులను, నేను దనుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై, శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని, నీ వ్రతమును నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి, నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఇతడు గూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరిని చంపగలదుగాని, శక్తిలో నాకంటె ఎక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నింఫియున్న నాతో, రుద్రతేజస్సుగల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడై వున్నప్పుడు, అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు, ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.

ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వసుని గౌరవించి, నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము' అని చక్రాయుధము పలికెను. ఆంబరీషుడు ఆ పలుకులనాలకించి, 'నేను దేవ, గో, బ్రాహ్మణాదులయందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో, సర్వజనులూ సుఖముగా వుండవలెననే, నా అభిలాష. కావున, శరణుగోరిన ఈ దూర్వసునీ , నన్నూ రక్షింపుము. వేలకొలది అగ్ని దేవతలు, కోట్లకొలది సూర్యమండలములు ఏకమైననూ, నీ శక్తికీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు, లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై, నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తన కుక్షియందున్న పదునాలుగు లోకములను, కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. 

కావున, నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు. అని పలికి, చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము, అంబరీషుని లేవ దీసి గాఢాలింగన మొనర్చి 'అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో, పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక , పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్య వంటి మహాపాతకములను చేయకుంటారో, అట్టివారి కష్టములు నశించి, ఇహమందును, పరమందును, వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కావున, నిన్నూ, దూర్వసునీ, రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు, ఈ ముని పుంగవుని తపశ్శక్తి పని చేయలేదు'. అని చెప్పి, అతనిని ఆశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'అష్టవి౦శోధ్యాయము - ఇరవయ్యెనిమిదవ రోజు పారాయణం' సమాప్తము.

కార్తీకమాస 28వ రోజు ఆచరించవలసిన దానధర్మలు, జపతపాది విధులు, ఫలితములు:

పూజించాల్సిన దైవము → ధర్ముడు

జపించాల్సిన మంత్రము → ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహా!

నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు → నువ్వులు, ఉసిరి

ఫలితము → దీర్ఘకాల వ్వాధి హరణం

Link: https://www.youtube.com/post/UgzK7b_zrBOqqHCEmSF4AaABCQ

12 December, 2020

కార్తీక పురాణం! (సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణం)

దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట:

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను. 'కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను'.

'ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశము ఒనర్పనెంచినాడు. 

ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. 

బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును, బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును' అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి, అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి 'సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/Ugx_DbPH8MSX5ieat0N4AaABCQ

11 December, 2020

కార్తీక పురాణం! (షడ్వి౦శోధ్యాయము - ఇరవై ఆరవ రోజు పారాయణం)


దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హిత బోధ:

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. 

ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథివై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. 

అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గి౦చుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. 

లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి 'షడ్వి౦శోధ్యాయము - ఇరవై ఆరవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/Ugyi8GCFjsIO-pxAYld4AaABCQ

10 December, 2020

కార్తీక పురాణం! (పంచవింశోధ్యాయము - ఇరవై అయిదవ రోజు పారాయణం)

దూర్వాసుడు అంబరీషుని శపించుట:

"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడు లేడు. నీవు మహా భక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి, అవమానపరచి, నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. 

అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. 

ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి, ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునియెంత ప్రార్దంచినను, వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 'పంచవింశోధ్యాయము - ఇరవై అయిదవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxeMBnJgwHLw17Rpuh4AaABCQ

09 December, 2020

కార్తీక పురాణం! (చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగవ రోజు పారాయణం)

అంబరీషుని ద్వాదశీ వ్రతము:

అత్రి మహాముని మరల అగస్త్యునితో 'ఓ కుంభ సంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంత విచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము'.

"గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల కంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. 

"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించ రాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

"ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి..

"మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు'ననిచెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యా విశారదుడును, మహా తపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి, వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి 'చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/Ugzv6HgRlgk6AM65rt94AaABCQ

08 December, 2020

కార్తీక పురాణం! (త్రయోవింశోధ్యాయము - ఇరవై మూడవ రోజు పారాయణం)


శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట:

అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా! పురంజయుడు కార్తిక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదాంగవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తికవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.

అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, "దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తిక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తిక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై,  రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తికమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తిక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తికవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహత్మ్య మందలి 'త్రయోవింశోధ్యాయము - ఇరవై మూడవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/Ugw4Tx8Rnc5pljO4UvV4AaABCQ

07 December, 2020

కార్తీక పురాణం! (ద్వావింశాధ్యాయము - ఇరవై రెండవ రోజు పారాయణం)

పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట:

మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణ్వాలయమునకు బోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిరుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతను హరిణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును జేసి హరిమూర్తిని బంగారముతో చేయింది ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తిక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ జేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను.

వచ్చి నారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహ ధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపించుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోను, వజ్రముల వంటి కత్తులతోను, ఐరావతము వంటి ఏనుగుల తోను, ఆకాశమునకు ఎగురు గుర్రములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్య జయ కాంక్షతో భయంకరమయిన సంకుల యుద్ధము జేసిరి. ఆయుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణి గూలి, బాణ శరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై రథ, గజ, సాది, పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు, రక్షించుడు అని ప్రార్థించుచుండిరి.

కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట జూచి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్దమును చాలించి మిగిలిన సేనలతో తనపురమును జేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను. హరి అనుకూలముగా ఉండిన యెడల శత్రువు మిత్రమగును. అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును. ధర్మమే అధర్మమగును. కార్తికవ్రతమును జేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన యెడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణువు తేజోవంతుడు ఇది సత్యము.

అందును కార్తిక వ్రతమునందు కోరిక యుండుట మరీ దుర్లభము గదా! కలియుగమందు హరిభక్తులై కార్తికవ్రాత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తిక వ్రతమును జేయుచు హరిభక్తి గలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి గలిగి కార్తిక వ్రాత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛ గలిగెనేని హరిభక్తి చేయవలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును.

అగస్త్య మునీంద్రా! హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును. పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు సగరాదులు హరినాశ్రయించి పరమపదమొందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతము గలవారై తానూ స్వతంత్రుడైనను అన్య తంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలయును. హరిభక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును, సమస్ర చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తీ గలవానికి కార్తిక వ్రతము సులభమని తలచెదను. కార్తిక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావిచెట్టుతో సమానమైన చెట్టును లేవు. 

ఓ విప్రా! కాబట్టి కార్తిక వ్రతము ఇష్టార్ధములనిచ్చును. సర్వ వ్రతోత్తమోత్తమము. ఇది సర్వ శాస్త్ర సారము. సర్వవేద సమ్మతము. కార్తిక మహాత్మ్య బోధకమైన యీ అధ్యాయమును నిత్యమూ వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణి జేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన యెడల పితృ దేవతలకు కల్పాంతము వరకు తృప్తి గలుగును. ఇది ముమ్మాటికి నిజము.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే 'ద్వావింశాధ్యాయము - ఇరవై రెండవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgyPFpqs0MIC0K1Ylbl4AaABCQ

06 December, 2020

కార్తీక పురాణం! (ఏకవింశోధ్యాయము - ఇరవయొక్కటవ రోజు పారాయణం)


పురంజయుడు కార్తీక ప్రభావం:

అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.

ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా, విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా, మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా, పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.

ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే, ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి.

భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై, నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి, రేపు అలా చేసినట్లయితే, పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి” అని ఉపదేశించాడు.

శ్లో|| అపవిత్ర: పవిత్రో పవిత్రోవా సర్వావస్థాంగతోపివా

య్ణ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా భంతర శుచి||

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, 'ఏకవింశోధ్యాయము - ఇరవయొక్కటవ రోజు పారాయణం' సమాప్తం.

Link: https://www.youtube.com/post/UgwgBTHKskwoYThmTpV4AaABCQ

05 December, 2020

కార్తీక పురాణం! (వింశాధ్యాయము - ఇరవయ్యవ రోజు పారాయణం)


పురంజయుడు దురాచారుడగుట:

జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యము నందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు, మరిన్ని వుదాహరణలు వినిపించి, నన్ను కృతార్దునిగా జేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో "ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి, అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదను ఆలకించు"మని, అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు, అగస్త్య మహర్షి, అత్రి మహర్షిని గాంచి, "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును గూర్చి నీకు ఆ ములాగ్రము తెలియును. కాన, దానిని నాకు వివరింపుము" అని కోరెను.

అంత అత్రిమహముని "కుంభ సంభవా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపు రాజు, అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని, రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి, పట్టభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. 

ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతును, రాజ్యాధికార గర్వముచెతను జ్ఞాన హినుడై దుష్ట బుద్ది గలవాడై, దయాదాక్షి ణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభి యై, చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులను చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా, అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ రాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్విత మైన రథమెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దుడైన వారిని యెదుర్కొన భేరీ మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి, శత్రు సైన్యములు పైబడెను.

ఇట్లు స్కాంద పురాణాతర్గ త వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'వింశాధ్యాయము - ఇరవయ్యవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxDjyeIjbM_jIvqOX94AaABCQ

04 December, 2020

కార్తీక పురాణం! (పంతొమ్మిదవ అధ్యాయము - పంతొమ్మిదవ రోజు పారాయణం)


చాతుర్మాస్య వ్రత ప్రభావం:

నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. 

సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలను విన్నా, నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మై మరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వుతో, ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక, శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను.

కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. 

ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తి గల వారిని పరీక్షించడానికి, నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీవు ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున, త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు, నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి, పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.

తిరిగి వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు, ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు, చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి, ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష బేధం లేదు. అన్ని జాతుల వారు, ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం, మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'పంతొమ్మిదవ అధ్యాయము - పంతొమ్మిదవ రోజు పారాయణము' సమాప్తము. 

Link: https://www.youtube.com/post/UgxjbNs7O86VEjeedCN4AaABCQ

03 December, 2020

కార్తీక పురాణం! (అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదవ రోజు పారాయణం)


సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత:

"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలననే కదా, మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో, నేను మహా పాపినయి, మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల, ఈ కీకారణ్యములో, తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్య ఫల ప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప, మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి, సత్కర్మలను మానవుడెట్లు అనుసరించ వలయునో, దాని ఫలమెట్టిదో, విశదీకరింపు"డని ప్రార్ధించెను.

"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలను ఆచరించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను.

అటుల స్నానము లాచరించి దేవార్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడునూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా, స్నానాదులు ఆచరించిన వారు, కోటి యాగములు చేసిన ఫలమును పొంది, వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని, మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".

తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు వారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. 

అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి  రక్షింపుమని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు యీ ముసలి వానితో మనకేమి పనియని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంతాకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!

విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! 

లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!

వందేవిష్ణుం!భవభయహారం! సర్వలోకైకనాథం ||

శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం |

శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 'అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదవ రోజు పారాయణం' సమాప్తం.

Link: https://www.youtube.com/post/UgyxSzTFc2GY2cZ7BFd4AaABCQ

02 December, 2020

కార్తీక పురాణం! (సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణం)


అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము:

'ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది' అని అంగీరసుడు చెప్పగా..

"ఓ మునీంద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యాక్యార్ధమును గురించి నాకు తెలియ జేయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె, 'ఈ దేహము అంత:కరణ వృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం'  అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖముగావుంది'  అనుకొనునదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును,  ప్రకాశింపజేయునటులే, ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన,  దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే  'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము. "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా, సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చనిపోవుట, మొదలగు ఆరు భాగములు, శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడి యున్నదో, అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ, పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు,  జీవులా కర్మ ఫలమును అనుభవింతురనియు, తెలుసుకొనుము. అందువలన, మానవుడు గుణ సంపత్తి గలవాడై, గురు శుశ్రూష నొనర్చి, సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి, విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్దియు, దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి, ముక్తి పొందును. అందువలన, సత్కర్మానుష్ఠానము చేయ వలయును. మంచి పనులు చేస్తే గాని, ముక్తి లభించదు' అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 'సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణం' సమాప్తం.

Link: https://www.youtube.com/post/UgzY4omSVy58wQ3JWiR4AaABCQ

01 December, 2020

కార్తీక పురాణం! (షోడశాధ్యాయం - పదహారవ రోజు పారాయణం)


స్థంభ దీప ప్రశంస:

తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు, ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో, అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీ స్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే, చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.

సంతానం ఉన్నవారు ఇలా చేస్తే, వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు, వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు, సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనంద దాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిధాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు, చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది. చెబుతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు..

దీపస్తంభం.. విప్రుడగుట:

రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి, ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు.

అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో ”ఫెళఫెళ”మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా, వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ! నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.

దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. 

స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పురుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి, అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా, నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల, స్తంభంగా ఉన్న నేను, నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు.

ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది? అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు, ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే, ఈ స్తంభానికి ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా, ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు, ”ఓ మునులారా! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించాడు. అంత అక్కడున్న మునులంతా, తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.

ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్య మందలి 'షోడశాధ్యాయం - పదహారవ రోజు పారాయణం' సమాప్తం.

Link: https://www.youtube.com/post/UgznoLCM0kEaDx66QkF4AaABCQ

30 November, 2020

కార్తీక పురాణం! (పంచదశాధ్యాయము - పదిహేనవ రోజు పారాయణము)


దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట:

అంతట జనకమహారాజుతో వశిష్థమహాముని, 'జనకా! కార్తీకమాహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు'మని, ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక వినుట, సాయంత్రము దేవతాదర్శనము - చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి, కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంథ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చినయెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్ధశి, పూర్ణిమ రోజులందైనా నిష్టతో పుజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసిన యెడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథకలదు. విను - మని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతి నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను.

అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి మానవరూపములో నిలబడెను. ధ్యాననిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరిచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి " ఓయీ! నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించగా "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతోనుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని, దానిని నోటకరిచి, ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగా, నా అదృష్టముకొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు, వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ యెత్తవలసి వచ్చెనో, దానికిగల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను. 

అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీకుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, ధనాశా పరుడవై దేవ పూజలు, నిత్య కర్మలు మరచి, నీచుల సహవాసము వలన, నిషిద్ధాన్నము తినుచు, మంచి వారలను, యోగ్యులను నిందించుచు, పరుల చెంత స్వార్ధచింత గలవాడై, ఆడపిల్లను అమ్మువృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక, యితరులకు యివ్వక, ఆ ధనము భూస్థాపితం చేసి, పిసినారివై జీవుంచుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందున, పుణ్యాతుడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి, నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలుచేసి, భగవంతుని ప్రార్థించుకొని, మోక్షము పొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి 'పంచదశాధ్యాయము - పదిహేనవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxnttOZHYTZNWp9yIV4AaABCQ

29 November, 2020

అరుణాచల - కార్తీక దీపం!


అరుణాచల - కార్తీక దీపం!

పవిత్ర తిరువణ్ణామలై 'కార్తీక దీపం' ఉత్సవం నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపై దీప ప్రజ్వలన గావించే (పర్వత రాజకుల) వారి వంశ చరిత్ర..

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీప ఉత్సవము నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపైన దీప జ్వలన గావించే గొప్ప అవకాశం, పర్వత రాజకులనబడే వంశస్తులచే, లేదా ఆ కులము వారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ పవిత్ర దీపమునకు కావలసిన 

పవిత్ర వస్త్రములు, సేవలుగా, పురాతన కాలంనుండి చేయడం జరుగుతోంది. ఈ వంశము వారు, తమ యొక్క ఈ మహా దివ్య కార్యాన్ని, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ సమస్త సృష్టికి, లోక నాయకుడిగా ఉదయించిన పరమేశ్వరుని మహా దివ్య రూపమే, అరుణ గిరి.

ఆ పరమ శివుడే దివ్య జ్యోతి స్వరూపముగా, కృత్తికా దీపము నాడు కనపడుచున్నారు. తిరువణ్ణామలై, పరమ పవిత్రమైన పర్వతము.   ఇక్కడ ఉన్న మట్టి కూడా, మహేశ్వర రూపమే. ప్రతీ రాయి, పరమేశ్వరుని లింగ రూపమే. ముప్పై కోట్ల దేవతలు పూజించిన స్వయంభువు రూపమే, అణ్ణామలై. సాక్షాత్తు భువి కైలాసంగా కీర్తించబడుచున్నది. మానవ జీవిత పరమార్ధం, మానవ జన్మ ప్రయోజనం చూడటమే. ఈ జ్యోతి దర్శనం. మనలోని అంతః జ్యోతి రూపుడైన ఈశ్వరుని దర్శించడమే, ఈ కృత్తికా దీప దర్శనం. విశ్వవ్యాప్తంగా, ఎంతో అఖండ ఖ్యాతిని పొందిన ఈ అరుణ గిరి పర్వతంపై మహాజ్యోతి చూడటం, ఒక వరం అయితే, అణ్ణామలైలో మహాజ్యోతి వెలిగించడం, ఈ పర్వత రాజ కులము వారు ఎంత ధన్యులో కదా!

తిరువణ్ణామలై కార్తీక పూర్ణమి నాడు, ఈ పర్వత రాజకులం వారికి ఈ మహా యోగం లభించింది. ఈ పర్వత రాజ వంశస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, అణ్ణామలై మహాదీపం వెలిగించే కార్యాన్ని నెరవేర్చేస్తున్నారు. తిరువణ్ణామలై పట్టణంలో మొత్తము, వీరివి మాత్రమే, 2 వేల కుటుంబాలున్నాయి. వారిలో (ఐదుగురు వారసుల కుటుంబం, అరుణ గిరిపై దీపం వెలిగించే హక్కును, పర్వత రాజకులం వారికి ఎలా వచ్చింది? అంటే, ఈ పర్వత రాజకుల రాజవంశంలో పర్వత రాజుకు జన్మించిన జగన్మాత పార్వతీ దేవి, ఈ వంశస్తులు కావడమే, ఆ వంశస్తులు పొందిన మహా యోగం. జగన్మాత పార్వతీ దేవి వంశస్తులే, ఈ పర్వత రాజ కులము వారు. అందుకే, అట్టి పవిత్ర పరమేశ్వరుని సాక్షాత్తు దివ్య స్వరూపమైన అరుణ గిరిని అధిరోహించడానికి. అంతే కాకుండా, అరుణ గిరిపై వెలిగించే దివ్య జ్యోతిని ప్రజ్వలించే అధికారం, ఈ పార్వతీదేవి సంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఉన్నది కనుక, తిరువణ్ణామలై  కొండలపై మహా దీపం వెలిగించే పవిత్రకార్యాన్ని నిర్వహిస్తున్నారు.

పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ ఋషి ధ్యానాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు పాప కార్యమునకు పాల్పడ్డారు. బ్రహ్మఋషి కోపాగ్నికి భయపడి, రాక్షసులు చేపలుగా మారి, సముద్రంలో కనుమరుగవుతారు. రాక్షసులను నాశనం చేయమని, లోకానికి రక్షణ ఇమ్మని, శివుని బ్రహ్మఋషి ప్రార్ధించారు. భక్త రక్షణ ఎరిగిన పరమశివుడు, పర్వత రాజుని పిలిచాడు. సముద్రంలో దాగిన రాక్షసులను చేప రూపంలో నాశనం చేయాలని, ఆయన ఆదేశం. అందుకు సాయం చేయడానికి, విశ్వకర్మ సృష్టించిన జ్ఞాని శెంపాన్ అనే పడవను ఇచ్చాడు. పర్వత రాజు సముద్రంలోకి దూకి, చేపల ఆకార రాక్షసులను పట్టుకొని సంహరించి, తీరంలో పడేసినా, మరణించిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ ప్రాణం పొంది, సముద్రంలోకి దూకి అదృశ్యమవుతున్నారు. ఇలా అనేక మార్లు జరిగి,  అలిసిపోయిన పర్వత రాజు, తన కుమార్తె అయిన పార్వతీ దేవి సాయం కోరారు. పార్వతీ దేవి అఘోరా రూపంలో సముద్రం మధ్యలో నిలబడి, రాక్షస  రూపంలో ఉన్న చేపలను మింగేసి, రాక్షస జాతిని నాశనం చేసింది.

ఆ సమయంలో అనుకోకుండా రాక్షసులకు చెలరేగిన వలలో, సముద్రం కింద తపస్సు చేసిన మీనామరీషి అనే ఋషి, తన తపస్సు భంగం అయిందనే కోపంతో, 'నీ వంశం నాశనం కావాలి. చేపలు పట్టడం వల్ల జీవించాలి' అని పర్వత రాజును శపించాడు. శాపనికి భయపడిన పర్వత రాజు వెళ్లి శివుని ప్రార్ధించాడు. కరుణామయుడు శివుడు కార్తిగై శుభదినాన తిరువణ్ణామలైలో జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాననీ, ఆ జ్యోతిని వెలిగించే పని నీ వంశమే నెరవేర్చడం వలన, ఈ శాప విముక్తి పొందుతారనీ వరం ఇచ్చి, శాప విమోచన మార్గం అనుగ్రహించారు, పరమ శివుడు. ఆ ప్రకారం, అప్పటి నుండి ఈ పవిత్ర కృత్తికా మాసంలో, కార్తీక మహా దీపం వెలిగించే హక్కు పొందిన పర్వత రాజ కులము వారి సంప్రదాయ అనుసరణగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజు వారి కుటుంబ దేవత తిమలాయ్ అంగలమ్మన్ ఆలయ పూజ నిర్వహిస్తారు. దీపమునకు వలయు వస్త్రములను తీసుకుని, ఊరేగింపుగా గిరి శిఖరములపైకి చేరుకుంటారు. రాత్రి 6 గంటలకు, కార్తీకై దీప ప్రజ్వలన చేస్తారు పర్వత రాజకుల వంశం వారు.

నేటి సాయంత్రం జ్యోతి రూపంలో దర్శనమిస్తున్న అరుణాచలేశ్వరుడు! ఓం అరుణాచలేశ్వరాయ నమః!

కార్తీక పౌర్ణమి! జ్వాలాతోరణం! Kartika Paurnami - Jwala Toranam

 

కార్తీక పౌర్ణమి! జ్వాలాతోరణం! శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలాతోరణం". కార్తీక పౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయ ప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, ఆ తరువాత భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు. దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.. ఒకటి.. త్రిపురాసురలనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడు కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీ మాత దృష్టి దోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది. రెండవ కధ.. అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగు పరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది. ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రింది నుండి వెళ్ళడం వలన నరక ద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భోవ్ భోవ్ అనే గట్టి అరుపులతో తరుముతుంది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధ పడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరక బాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా జ్వాలాతోరణం జరుపుతారు. ముఖ్యమైన విధులు.. ఈ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః | దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః || ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్ని కూడా, అవి ఎ ఎ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం. ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మన లాగే అవికూడా భగవంతుణ్ణి చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి..

Link: https://www.youtube.com/post/UgxoTsxUW1ueToux5_N4AaABCQ

కార్తీక పురాణం! (చతుర్దశాధ్యాయము - పద్నాలుగవ రోజు పారాయణము)


ఆ బోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము):

మరల వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట, మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు.

వారికి కోటి యాగముల చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృ దేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో, అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడానరకమునకుగురిచేయును. కాన ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగరముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

కార్తీకమాసములో విసర్జింపవలసినవి:

ఈ మాసమందు పరాన్న భక్షన చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహా పాపియై జన్మ జన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో|| గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.

కార్తీక మాస శివపూజాకల్పము:

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి

4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి

6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి

7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి

9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి

11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి

12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి

ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి 'చతుర్దశాధ్యాయము - పద్నాలుగవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgzaYRd_QXryDQKJm7R4AaABCQ