శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట:
అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా! పురంజయుడు కార్తిక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదాంగవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తికవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.
అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, "దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తిక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తిక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.
అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.
ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.
పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తికమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తిక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తికవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహత్మ్య మందలి 'త్రయోవింశోధ్యాయము - ఇరవై మూడవ రోజు పారాయణం' సమాప్తము.
Link: https://www.youtube.com/post/Ugw4Tx8Rnc5pljO4UvV4AaABCQ