Ads

Showing posts with label Death Mystery of Subhash Chandra Bose. Show all posts
Showing posts with label Death Mystery of Subhash Chandra Bose. Show all posts

23 January, 2021

సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాలు! Death Mystery of Subhash Chandra Bose


సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాలు!

అఖండ భారతావని మొత్తం ప్రళయకాలంలో వీచే గాలి ఘోషలా వందేమాతరం అన్న మాట వినిపించే కాలం అది.. ఒక చోట కొన్ని వేల మంది నిల్చుని ఒక వ్యక్తి ప్రసంగాన్ని వింటున్నారు.. అతడి మాటలు నిప్పులుచిమ్మే శతాగ్నితూటాలలా వస్తుంటే, అది విన్న ప్రజల రక్త నాళాలలోని రక్తం సలసల మరిగే లోహంలా ప్రవహించింది. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను స్వాతంత్ర్యానిస్తాను, అని చెప్పిన అతడి మాటకు, కొన్ని వేల మంది కళ్లల్లో నిప్పుల వర్షం కురిసింది. అతడే భరత మాత వీర తిలకం, అలుపెరుగని స్వాతంత్ర్య యోధుడూ, వర్థంతి యెరుగని మహావీరుడూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. భరత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి అతను చేసిన విప్లవ పోరాటం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతల వెన్నులో వొణుకు పుట్టించింది. మాతృభూమి విముక్తికి, అతడు చేసిన నిరంతర పోరాటం, 1945 ఆగష్టు 18 న ఒక్కసారిగా నీరుగారిపోయింది. ఆధునిక భారత చరిత్రలో, ఒక యుగ పురుషుడు అస్తమించిన రోజుగా ప్రకటించబడింది. అఖండ భారతావని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన అధినేత, అంతిమ శ్వాస వదిలిన రోజుగా, ప్రాచుర్యం పొందిన రోజది. అయితే, నేటికీ ఆయన మరణం ఒక మిస్టరీగా నిలిస్తే, ఆయన మరణంపై జరిగిన ఎన్నో చర్చలూ, ఆధారాలూ, మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారా, లేదా? చనిపోకపోతే ఆయన ఏమయ్యారు? ఆయన సమాచారాన్ని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఎందుకు దాచింది? ఆయన కుటుంబాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎందుకు నిఘా నీడలో పెట్టింది? అనే ప్రశ్నలకు, ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/0PE6u2C7iqo ]

బోస్ 22 సంవత్సరాల వయస్సులోనే, బ్రిటీష్ సివిల్ సర్వీస్ లో చేరి, రెండు నెలలకే ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని, భారతావనికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడమే, పరమావధిగా ముందుకు దూకారు. మన చెంప పగలగొట్టిన వాడి చేయి విరిస్తేనే, మన బలం తెలుస్తుందనే సిద్ధాంతంతో, బ్రిటీష్ ప్రభుత్వంపై సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో, ఆయనను గృహ నిర్బంధంలో ఉంచడమే కాకుండా, ఎన్నో ఆంక్షలు విధించారు. ఆ సమయంలో, ఆంగ్లేయుల కళ్లు గప్పి, జర్మనీ చేరుకున్నారు. భరత భూమి విముక్తికి, సైనిక పోరాటమే అసలైన దారని భావించిన బోస్, బ్రిటీష్ ఆర్మీ తరుఫున రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి, యుద్ధ ఖైదీలుగా దొరికిన 5 వేల మంది భారతజవాన్లను, జర్మనీ సాయంతో కూడగట్టారు. ఆ ప్రయత్నంలో, 1941 నుండి, 1943 వరకూ జర్మనీలో ఉన్న బోస్, అక్కడే, ఎమిలీ షెంకెల్ అనే యువతిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, హిట్లర్ తనకు చేస్తానన్న సహాయాన్ని మరచి, తన పనిలో తానున్నాడనే విషయం గ్రహించి, అక్కడి నుండి జర్మనీకి చెందిన U-180 అనే సబ్ మెరీన్ ద్వారా సముద్రంలో ప్రయాణించి, మధ్యలో జపాన్ కు చెందిన I -28 సబ్ మెరీన్ లోకి మారి, జపాన్ చేరుకున్నారు. అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్య సభ్యులైన రాజ్ బిహారీ వంటి వారితో కలిసి, టోక్యో, సింగపూర్, రంగూన్ లలో భారీ ఆర్మీని సమకూర్చుకున్నారు. రేడియో ద్వారా ఆయన చేసిన ప్రసంగాలకు ప్రభావితులైన కొన్ని వేల మంది భారత యువ కెరటాలు, పెద్ద ఎత్తున ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు.

జపాన్ వారి సహకారంతో సైనికులకు శిక్షణ ఇప్పించి, ఆయుధాలను సమకూర్చుకుని, బ్రిటీష్ సైన్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విప్లవ వీరుడు, సుభాష్ చంద్రబోస్. ఆయన తెలివితో, సాహసంతో, బ్రిటీష్ అధికారుల వెన్నులో వొణుకు పుట్టించి, మూడు చెరువుల నీళ్లు త్రాగించిన విప్లవ ధీరుడు, సుభాష్ చంద్రబోస్. ఆయన సైన్యంలో మగవారే కాకుండా, ఎంతోమంది వీర వనితలు కూడా చేరారు. వారి కోసం, ప్రత్యేక మహిళా రెజిమెంట్ ఏర్పరచి, దానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ రెజిమెంట్ అనే నామకరణం కూడా చేశారు. ఆ మహిళలకు రంగూన్ లో సైనిక శిక్షణ ఇప్పించి, కదనరగంలో కరాళ నృత్యం చేయించారు. చలో ఢిల్లీ అనే నినాదంతో, యుద్ధ ప్రణాళికలు రచించి, ఇంఫాల్, అండమాన్ నికోబార్ లను జయించి, స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసిన తొలి విప్లవ సూర్యుడు సుభాష్ చంద్రబోస్. ఆ తరువాత జరిగిన పరిణామాలలో, హిట్లర్ తుది శ్వాస వీడడం, జపాన్ చేతులెత్తేసి యుద్ధంలో లొంగిపోవడంతో, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి సహాయం నిలిచిపోయింది. దానికి తోడు, ప్రకృతి ప్రకోపం వల్ల, తీవ్ర అనారోగ్యాలకు గురై చాలా మంది సైనికులు చనిపోతుంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటీష్ సైన్యం, మిత్ర దేశ సైన్యాలతో మరింత బలపడి, బోస్ సైన్యానికి అన్ని దారులూ మూసివేసింది. దాంతో, తమ నాయకుడి రక్షణే పరమావధిగా భావించిన బోస్ అనుచరులు, ఆయనను బలవంతంగా ఒప్పించి, అజ్ఞాతంలోకి పంపించారు.

ఈ క్రమంలోనే, 1945 ఆగష్టు 18 న, సింగపూర్ నుంచి నేతాజీ, రేడియో ద్వారా ఆఖరి ప్రసంగం చేసి, 1945 ఆగష్టు 18 న, జపాన్ కు చెందిన యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ, తైపే సమీపంలోని కొండలలో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల కూలిపోవడంతో, ఆ ప్రమాదంలో బోస్ మరణించినట్లు, 1945 ఆగష్టు 23 వ తేదీన జపాన్ వారు ప్రకటించారు. దాంతో, భారత విప్లవ జ్యోతి ఆరిపోయిందని అందరూ భావించినా, అక్కడి నుండే, ఎన్నో సందేహాలూ, మరెన్నో చర్చలూ, బోస్ మరణంపై పుట్టుకొచ్చాయి. విమాన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బోస్ కాదనీ, ఆయన ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని, రష్యాను సహాయం కోరడానికి వెళ్లిపోయారనీ, కానీ, అప్పటి స్టాలిన్ ప్రభుత్వం, బ్రిటీషు వారితో చేతులు కలపడంతో, ఆంగ్లేయుల అభ్యర్థన మేరకు బోస్ ను సైబీరియాలో బంధించినట్లూ, ఆయన అక్కడే పదేళ్లు జైలు శిక్ష అనుభవించి మరణించినట్లూ, కొన్ని కథనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ వార్తలపై నిజాలను నిగ్గు తేల్చడానికి, అప్పటి ప్రభుత్వం, 1956 మే నెలలో, నలుగురు సభ్యులతో కూడిన ఒక కమీషన్ ను ఏర్పాటు చేసినా, అప్పట్లో తైవాన్ తో మనవారికి మంచి సంబంధాలు లేకపోవడంతో, వారి ప్రయత్నం వృధా అయ్యిందని, అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, ఇదంతా నాడు బోస్ మరణంపై వచ్చిన వివాదాలకు చెక్ పెట్టడానికి, నాటి కాంగ్రెస్ పెద్దలు చేసిన కుట్రగా, చాలామంది భావించారు. ఎందుకంటే, అప్పటి భారత ప్రధాని నెహ్రు, బోస్ కుటుంబంపై నిఘా ఉంచమనీ, వారికి వచ్చే లేఖలను పరిశీలించి, వాటిలో అనుమానస్పదంగా ఉన్న వాటిని, వారి కుటుంబ సభ్యులకు చేరనివ్వు వద్దనీ, ఆదేశించాడట. అదే నిఘా వ్యవస్థను, నెహ్రూ కుమార్తె అయిన ఇందిరా గాంధీ కూడా కొన్నేళ్ల పాటు కొనసాగించింది. ఈ విషయాలు చాలా ఏళ్లపాటు, బెంగాల్ ని పాలించిన ఎర్ర జెండా ప్రభుత్వం దాచిపెట్టిందని, విమర్శలు కూడా ఉన్నాయి. బోస్ చనిపోయినా, వారి కుటుంబంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే, బోస్ చనిపోలేదనే విషయం, అప్పటి కాంగ్రెస్ నాయకులకు తెలుసనీ, ఆయన మళ్లీ తిరిగొస్తే, కొంతమందికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే దురుద్దేశ్యంతో, ఈ పనికి ఒడిగట్టారనీ చాలా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం, 1999 లో, ముఖర్జీ కమీషన్ ను ఏర్పాటుచేసింది. ముఖర్జీ కమీషన్, బోస్ మరణంపై విచారణ చేపట్టి, 2005, నవంబర్ 8 న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం, 1945 ఆగష్టు 18 న ఎటువంటి విమానం కూలిపోలేదని చెప్పడంతో పాటు, ఆనాటి రష్యన్ మిలిటరీ ఫైల్లలో కూడా, ఎక్కడా బోస్ మరణం గురించి ప్రస్థావించలేదని, ఆధారాలను చూపించింది.

అన్నీ ఆధారాలతో, బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని సమర్థిస్తూ, అమెరికా ప్రభుత్వం కూడా, కమీషన్ కు ఒక లేఖ వ్రాసింది. అయితే, 2005 నాటికి భారత ప్రభుత్వ అధికారం, హస్తం చేతులలోకి వెళ్లగా, మన్మోహన్ సింగ్ మంత్రిగణం ఆధ్వర్యంలో, 2006 మే 17 న ముఖర్జీ కమీషన్ ఇచ్చిన నివేదికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా, అందులో బోస్ చనిపోలేదనే ఆధారాలతో పాటు, టోక్యోలోని Renkō-ji గుడిలో ఉన్న చితాభస్మం బోస్ ది కాదని తేల్చిచెప్పేసింది. అయితే, ఈ కమీషన్ నివేదికను మాత్రం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని వచ్చిన వాదనలని, కొన్ని సంఘటనలు కూడా మరింత బలపరుస్తున్నాయి. 1964 మే 28 న, నెహ్రు అంత్యక్రియలకు సుభాష్ చంద్రబోస్, ఒక బౌద్ధ భిక్షువు రూపంలో వచ్చినట్లు, నాటి సమాచార శాఖ వారి దగ్గరున్న వీడియో డాక్యుమెంటరీ ద్వారా తెలుసిందని, దేశ వీదేశీ పత్రికలు, అప్పట్లో వార్తలు ప్రచురించాయి. బోస్ ని, లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరుండి మరీ నెహ్రు భౌతికకాయం దగ్గరకు తీసుకు వెళ్ళారని, అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే, ఆయన అంత్యక్రియల తరువాత, బోస్ ఎక్కడి వెళ్లిపోయారనేది ఒక మిస్టరీగా కొంతమంది భావిస్తే, 1980 లలో, అయోధ్య దగ్గరలో, ఫైజాబాద్ లో నివసించిన గుమ్నామి బాబా అనే వ్యక్తి, సుభాష్ చంద్రబోసేననీ, ఆయనే గుమ్నామి బాబాగా వేషం మార్చుకున్నారనీ, చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయన్ని అక్కడి వారు భగవాన్ జీ గా, బోస్ బాబాగా కూడా పిలిచేవారు.

ఈ చర్చకు ప్రధాన కారణం, ఈ బాబా రూపురేఖలు అచ్చంగా బోస్ మాదిరిగా ఉండడం, బాబా సన్నిహితుల దగ్గర తానే బోస్ అనే విషయాన్ని, నాలుగు సార్లు వెల్లడించడంతో, బోస్ అభిమానులు, బాబానే బోస్ అని గట్టిగా నమ్మేవారు. 1985 సెప్టెంబర్ లో, గుమ్నామి బాబా మరణించగా, బోస్ అభిమానుల విజ్ఞప్తి మేరకు, అప్పటి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, బాబా వస్తువులను పరిశీలించి సరైన ఆధారాలు దొరకలేదు కాబట్టి, బాబాకీ, బోస్ కీ ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేసింది. కానీ, హిందూస్తాన్ వంటి, పలు స్వతంత్ర సంస్థలు, బాబా చేతిరాతను, బోస్ పలు లేఖలలో రాసిన వ్రాతతో పోలుస్తూ, ఒక పరిశోధన చేశాయి. ఆ పరిశోధనలో, బాబా చేతి వ్రాత, బోస్ వ్రాతతో సరిపోవడంతో, గుమ్నామి బాబానే బోస్ అని తేల్చారు. దీంతో, బాబానే బోస్ అనే వివాదం, పెద్ద ఎత్తున, దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏది ఏమైనా, కొంత మంది స్వార్థం వల్లనో, వారి రాజకీయ భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోతుందనే భయంతోనో, ఒక మహావీరుని ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఓటమి ఎరుగని బ్రిటీష్ ప్రభువుల తలపొగరును తన కాలి క్రింద త్రొక్కిపెట్టి, వారికి ఓటమి అనే చేదు రుచిని చూపించిన స్వాతంత్ర్య పోరాట ధ్రువ తారకి, స్వత్రంత్ర్య స్వరాజ్యంలో తగిన గుర్తింపు ఇవ్వలేని స్థితిలో మన ప్రభుత్వాలున్నాయి. అయినా, ఆ విప్లవ వీరుడిపై ఉన్న భక్తిజ్యోతి, ప్రజల గుండెల్లో ఇంకా వెలుగుతూనే ఉంది. ‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను’, అని బోస్ చెప్పిన మాటలు, ఇంకా ప్రజల కర్ణభేరులలో మార్మోగుతూనే ఉన్నాయి. ఇంకా ప్రజల కళ్లల్లో, ఆ ఆధునిక యుగ పురుషుని నిలువెత్తు రూపం పదిలంగానే ఉంది.

Link: https://www.youtube.com/post/UgyZ6nm615_ypgWU8mp4AaABCQ