Ads

Showing posts with label Lord Krishna. Show all posts
Showing posts with label Lord Krishna. Show all posts

29 January, 2021

భగవంతుడితో అనుబంధం ఎలా ఉండాలి? How should we be attached to god!


భగవంతుడితో అనుబంధం ఎలా ఉండాలి?

ఆ తండ్రితో, మనలో చాలామందికి వ్యాపార బంధమే తప్ప, ప్రేమానుబంధం లేదు.. సాధారణంగా మన మొక్కులన్నీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సాగుతుంటాయి. ‘నా ఫలానా కోరిక తీరిస్తే, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను.. ఫలానా కానుకలిస్తాను.. ఫలానా పూజలు చేయిస్తాను..’ మనలో చాలామంది చేసే దైవ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి..

[ సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి? శుక్ర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/2UA7CE0A80E ]

నవవిధ భక్తులనే తొమ్మిదిరకాల అనుబంధానికి, భగవంతుడి దగ్గర ఆస్కారం ఉంది. వాటిలో ఏ ఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా, ఆయన మనల్ని వదలడు.. అలా కాకపోతే, మనకు ఆయన దొరకడు. భగవంతుడు సర్వేశ్వరుడనే విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు.. మనం చేసే యాంత్రిక పూజలూ, వాటంతటవే అక్కరకు రావు.. దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే, మనం ఒక మంచి బిడ్డగా జీవించాలి.. ఆయన్ను ఏ రూపంలో ఆరాధించినా, ఈ పద్ధతి పాటించాలి.. శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న ఆంజనేయుడు, 'భక్తుడిగానూ, దేవుడిగానూ' పూజలందు కుంటున్నాడు.

మధుర సంకీర్తనలతో అన్నమయ్యా, త్యాగయ్యలు, దైవాన్ని మెప్పించి, తమ సన్నిధికి రప్పించుకున్నారు.. తులసీదాసు తన ‘రామచరిత మానస్‌’ ద్వారా, శ్రీరాముడి మనస్సును దోచాడు. మూఢ భక్తితో, కన్నప్ప తన రెండు కళ్లనూ శివుడికి సమర్పించి, దివ్య సాక్షాత్కారం పొందాడు. తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి, రావణబ్రహ్మ ముక్కంటిని మెప్పించాడు..

సుదీర్ఘమైన కాల ప్రవాహంలో, ఎందరో భక్తులు పూజా పుష్పాల్లా తేలియాడి, పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేకపోయినా, వారి గాథలు శిలాక్షరాల్లా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ గాథలన్నీ, భగవంతుడితో మన అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి. నిత్యమూ లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. భగవంతుడికి వారు ఏమి ఇస్తున్నారు? ఏమి తీసుకెళ్తున్నారు? కోరికల జాబితా ఇస్తున్నారు.. తమ కోరికలు తప్పక నెరవేరతాయనే గట్టి నమ్మకాన్ని వెంట తీసుకువెళ్తున్నారు.. దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం? ప్రాపంచిక బంధాలనే సంకెళ్లతో, మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాం. భక్తి పూర్వకంగానే అనుకుంటూ, కనులు మూసి చేతులు జోడిస్తున్నాం.. మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతుంటుంది.. దేవుడు మాట మాటకూ, ప్రతి భక్తుడి బూటక భక్తికీ నవ్వలేక, శిలాదరహాసం చేస్తుంటాడు. ఆ మందహాస మర్మం, మన మనోనేత్రం తెరుచుకొనిదే మనకు అర్థంకాదు..

ఈ భ్రమా భరిత భక్తినాటకం నుంచి మనం బయటపడాలి. నిలువు దోపిడి ఇచ్చినట్లు, మనసునంతా ఖాళీ చేసి, ఆయన పాదాలముందు గుమ్మరించాలి. కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు, నీలాలు లేని తలతో నిలబడినట్లు, ఆయన ఎదుట నిస్సహాయుడిగా, ‘నీవే దిక్కు తండ్రీ’ అన్నట్లు, చేతులు జోడించి నిలబడిపోవాలి. మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో, భగవంతుడు మంచి భక్తుడి కోసం, అలాగే ఎదురుచూస్తాడు.. పరిపక్వత చెందిన మనస్సే ఫలంగా, కోరికలు లేని సమర్పణా భావాలు సుగంధ పుష్పాలుగా, సర్వలోక క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా సమర్పించాలి.. అలా, అతికొద్దిమంది మాత్రమే చేయగలరు. ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండ కూడదు? తిరుమలలో ఒక గదినుంచి మరో గదికి వెళ్తూ, చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం.. మన మనస్సు అనుక్షణమూ, అన్నమయ్య ఆర్తిని అనుభవిస్తూ, దైవంతో అనుబంధానికి తపించాలి.. వెన్న తినే వేలుపు ఆయన.. వెంటనే మన ఆర్తికి కరిగిపోతాడు.. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించి, ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు.. అదే అసలైన అనుబంధం..

Link: https://www.youtube.com/post/UgzYHCTe6U7eW3tIq8B4AaABCQ

24 January, 2021

‘కృష్ణ’ శబ్దంతో ఏం పొందగలం! Lord Krishna


‘కృష్ణ’ శబ్దంతో ఏం పొందగలం!

సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు మరో రూపమే, శ్రీకృష్ణ భగవానుడు.. ద్వాపర యుగంలో పుట్టి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు, కారుణ్యశీలుడు, ఆదర్శ పురుషుడు.. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.. భగవద్గీత ద్వారా, అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు.. యుగ ధర్మాలనూ, సాంఘిక న్యాయాలనూ, అనంతమైన విశ్వతత్త్వాన్నీ తెలియచెప్పిన మహనీయుడు.. అలాంటి శ్రీకృష్ణ మంత్రం, బాహ్యశత్రువులనూ, అంతః శత్రువులనూ హరించే శక్తిగలది..

సకల వేదాంతాలయందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది.. సమస్త సంసార చింతనలను దూరంచేసి, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునికి భక్తి పూర్వకంగా ఒక్కసారి నమస్కరిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. 'శరీకృష్ణు'నికి త్రికరణశుద్ధిగా, భక్తి శ్రద్ధలతో నమస్కరించినంత మాత్రాన్నే, జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే, సదానందము.. లేక సచ్చిదానందమని అర్థం..

కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో, అలాంటి వారు, సాక్షాత్తూ శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. 'ఓం'కారం మొదలు, వేదాల వరకూ, ‘కృష్ణ’ అనే రెండక్షరాలు, సమస్త విఘ్నాలనూ హరించి, మనోభీష్టాలను నెరవేరుస్తున్నాయి.. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు, కారణజన్ముడు.. మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథీ అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే, దుష్టశిక్షణ కొరకు.. కంసుని దురాగతాలను అంతమొందించడానికీ, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికీ అవతరించినవాడు..

గోకులంలో పెరిగాడు కాబట్టి, గోపాల కృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో, కాళీయ మర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే, తన నోటిలో అండ పిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం.. సాక్షాత్తూ శ్రీహరి అంశ అయిన కృష్ణునికి, లెక్క లేనన్ని పేర్లు.. ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా, ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు..

రామ శబ్దానికీ, కృష్ణ శబ్దానికీ భేదం లేదు. ఈ రెండు అవతారాలూ సాక్షాత్తూ శ్రీహరి అవతారాలే కావడం వల్లనే, ఆ స్వాముల నామస్మరణ, సాక్షాత్తూ శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే, ‘హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ’ అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే, సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి, కటాక్షిస్తాడు.. కుచేలుడూ, సుధాముడి లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని ప్రసాదించిన అపురూప దైవం, శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులూ, సిద్ధులూ యోగాభ్యాస సమయంలో 'శ్రీకృష్ణుని' సహస్రారమందు ధ్యానిస్తూ, ప్రాణాయామం నిలిపి, మోక్షాన్ని పొందారు. వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకునిపోయే సహజ శక్తి ‘కృష్ణ’ శబ్దానికి ఉంది. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు, ఆయా అక్షరాలకు స్థానాలగు దవడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువూ, శబ్దమూలమున, శిరస్సునగల సహస్రార చక్రం వరకూ, సహజ సిద్ధంగా చేరుకుంటుంది. అపుడు ‘వాయువు’ను అంటి, చలించే స్వభావంగల వనస్సును, యోగ ప్రక్రియచే, వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలుప వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ, మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.. ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా, మహాభారతంలో, శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది..

కృష్ణనామ స్మరణం కలిదోష నాశకం!

కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే, అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి, కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలో కూడా కృష్ణనామాన్ని స్మరిస్తే, యమపురికి పోకుండా, పరంధామానికి చేరుకుంటారంటారు. 

భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే, పాపాలన్నీ సంపూర్ణంగా నశిస్తాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమమని పురాణ వచనం. పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే, పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది. 

కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎలా? అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా, ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ, కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని, ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం, పరబ్రహ్మ వాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.

‘కృష్ణః’ అంటే, పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అన్న పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం, ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న 'ఆ' కారం శ్వేత ద్వీప వాసియైన విష్ణు వాచకం. విసర్గం, నర నారాయణార్ధకం. కనుక, కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి. ‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని, కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రాన్నే, పదివేల యజ్ఞాలూ, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందనీ, వ్రతాల వలన కూడా నశించని పాపాలు, 'కృష్ణ' అనే నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయనీ, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వారి శరీరం, ఎన్నటికీ అపవిత్రం కాజాలదనీ, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి, కృష్ణునిపై మనసు లగ్నమవుతుందని, శ్రీకృష్ణ నామ మహిమ గురించి, సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం, స్కందపురాణంలో ఉంది. ‘నా కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల, నాకెంతో ప్రీతికలుగుతుంది. ఇతర నామాలు కోటిసార్లు జపించినా, నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు. 

నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి, నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. కనుక, కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ, నామ మహిమనూ, లోక ధర్మాలనీ చెప్పిన కారణంగా, 'శ్రీకృష్ణావతారం' కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. 'భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే, 'భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు' అని అర్ధం. మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోవడానికి, శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు. చాంద్రాయణాది వ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని చేసినా, ఆ పాపం పోదు. కానీ, శ్రీకృష్ణ నామం జపిస్తే, ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా, నశిస్తుంది. అందుకు కారణం, శ్రీకృష్ణ నామంలో 'క్లేశఘ్ని-పాపఘ్ని' అనే బలవత్తరమైన శక్తులుండడమేనని.. ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తినీ, తత్త్వజ్ఞానాన్నీ, భగవద్ తృప్తినీ కలిగిస్తుంది.

కృష్ణ నామ జపం చేసేవారికి, విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది. పురుషోత్తముడూ, స్థితప్రజ్ఞుడూ అయిన శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు, ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి. ద్వాపర యుగంలో, రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో, ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడుదయించినట్టు, శరణాగత వత్సలుడు దేవకీదేవికి జన్మించడం.. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడేననీ, భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు, భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి, మన జీవితాలను ధన్యం చేసుకుందాం..

జై శ్రీ కృష్ణ!

కృష్ణుడికి సంబంధించిన ఈ వీడియోలు చూడండి:

[ ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? = ఈ వీడియో చూడండి: https://youtu.be/451l4ymbZFs ]

[ శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన సంఘటనలు!: https://youtu.be/-X6UbycGTdI ]

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]

[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

[ భగవద్గీతలో మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!: https://youtu.be/nq9T9mD0Cng ]

Link: https://www.youtube.com/post/Ugw1keF9G32zE4EjOVN4AaABCQ

13 December, 2020

Unusual things Occurred on the night of Lord Krishna's Birth | శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన విచిత్ర సంఘటనలు!

 

శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన విచిత్ర సంఘటనలు!

అహం సర్వస్య ప్రభవో, మత్తః సర్వం ప్రవర్తతే ।

ఇతి మత్వా భజంతే మాం, బుధా భావసమన్వితాః ।।

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/-X6UbycGTdI ]

ముళ్ల దారిని పూల బాటగా మలుచుకుని, ఎన్ని ఇబ్బందులెదురైనా, మోముపై చిరునవ్వు చెదరనీయకుండా, తన ప్రక్కనున్న వారికి అండగా నిలుస్తూ, సహాయం అడిగిన వారికి అభయ హస్తం అందిస్తూ, యుగయుగాలకూ ఆదర్శ మూర్తిగా నిలిచాడు, శ్రీ కృష్ణ పరంధాముడు. ఆ లీలా మానుష రూపధారి జీవితం, నర్మ గర్భం అనేది సత్యం. కృష్ణుడి గురించి ఎన్ని ఎన్ని నిగూఢ సత్యాలు తెలుసుకున్నా, ఇంకా వేనవేలు మిగిలే ఉంటాయి. ఆయన చేసిన లీలలూ, ఆయన చూపిన మహిమలూ, అసంఖ్యాకం. ఈ విశాల విశ్వం గురించీ, నర్మ గర్భమైన శ్రీ కృష్ణుని జీవితం గురించీ, పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమేనని, మన పెద్దలు చెబుతారు. భగవద్గీతలో, శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు.. ‘నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో, నాలోనే విలీనమై, మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్నీ నేనే. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడినీ, ఆశ్రయాన్నీ, బీజాన్నీ, శరణునొసగేవాడినీ, సాక్షినీ, సృష్టి స్థితి లయ కారకుడనూ, సత్‌స్వరూపుడనూ, అమృతుడనూ నేనే’. ముందు చెప్పిన శ్లోకంలో శ్రీ కృష్ణుడు, ‘అహం సర్వస్య ప్రభవో’ అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమునూ, మరియు సర్వ కారణ కారణమునూ" అని. అటువంటి అవతారపురుషుడైన శ్రీ కృష్ణ పరమాత్ముడు, కన్నయ్యగా అవతరించిన ఆ నిశి రాత్రిలో చోటుజేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

శ్రావణమాసం బహుళ పక్షంలో, ప్రజాపతి నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో, అర్థరాత్రి వేళ, అష్టమి తిథి నాడు జన్మించాడు, శ్రీ కృష్ణ పరంధాముడు. ఆ భగవానుడు, దేవకి గర్భాన ఎనిమదవ సంతానంగా, మేనమామైన కంసుని చెరసాలలో జన్మించినప్పుడు, అక్కడున్న వారితోపాటు, కాపలాదారులందరూ, యోగ మాయ ప్రభావం కారణంచేత, గాఢ నిద్రలోకి వెళ్లి పోయారు. వసుదేవుడు చిన్ని కృష్ణయ్యను బయటకు తీసుకురావడానికి, చెరసాల తలుపులు కూడా, వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ పరమాత్ముడు, రాక్షస సంహారం కోసం, మానవ అవతారమెత్తిన సమయంలో, కుంభ వృష్ఠిగా వర్షం కురిసింది. ఆ వర్షంలోనే, వసుదేవుడు, ఓ బుట్టలో చిన్ని కృష్ణయ్యను పడుకోబెట్టుకుని, మధుర నుంచి, రేపల్లెకు బయలుదేరాడు. భారీ వర్షాల కారణంగా, రేపల్లె దగ్గరున్న యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ, ఉగ్రరూపం దాల్చివుంది.

వసుదేవుడు, బుట్టలో కన్నయ్యను తీసుకుని, యమునా నదీ తీరానికి చేరుకోగానే, అక్కడొక అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు, చిన్ని కృష్ణయ్య పాద స్పర్శకు పులకించి, దారి ఏర్పరచింది. రెండు భాగాలుగా విడిపోయి, యమునా నది మధ్యలో ఏర్పడ్డ మార్గంలో ప్రయాణించి, వసుదేవుడు గోకులాన్ని చేరుకున్నాడు. అప్పటికే, గోకులంలోని నందుడి భార్య యశోద, ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను వసుదేవుడు తీసుకుని, చిన్ని కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి వెళ్లాడు. అయితే, నందుడికి ఈ విషయం అంతా తెలుసు. తన భార్యైన యశోద, కూతురుకి జన్మనిచ్చినప్పుడే.., వసుదేవుడు చిన్ని కృష్ణుడిని తీసుకువస్తున్నాడనీ, ఆ బాలుడిని తన ఇంట ఉంచి, తనకు పుట్టిన పాపను అతనితో పంపించాలనీ, తలుపు దగ్గరే నిలబడి వేచి వున్నాడు. వసుదేవుడు వచ్చిన తరువాత, తన భార్య దగ్గర కన్నయ్యను ఉంచి, తన పాపను అతనితో పంపించాడు. అయితే, తరువాత ఈ సంఘటన ఎవ్వరికీ గుర్తులేదు. యోగమాయ కారణంగా, నందుడు తన కూతురుని వసుదేవునికిచ్చిన సంగతీ, దేవకీ దేవి జన్మనిచ్చిన కన్నయ్య, తన ఇంటికి చేరాడన్న సంగతీ, మరచిపోయాడు.

అలా కన్నయ్య, దేవకి తనయుడి నుంచి, యశోద సుతుడిగా మారాడు. నందుడి ఇంట్లో, చిన్ని కృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం, వసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా, మధురా నగరంలో ఉన్న కంసుడి చెరసాలకు, చేరుకున్నాడు. దేవకి ప్రక్కకు చేరుకున్న వెంటనే, ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. దాంతో, అక్కడున్న భటులు, దేవకి తన అష్టమ సంతానానికి జన్మనిచ్చిందన్న విషయాన్ని, కంసునికి చేరవేశారు. విషయం తెలుసుకున్న కంసుడు, హుటా హుటిన అక్కడకు చేరుకుని, దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుని చంపబోతుండగా, ఆ శిశువు అకస్మాత్తుగా గాలిలో పైకి లేచి, ‘నిన్ను తుదముట్టించే నీ చెల్లెలి అష్టమ గర్భం, వేరోక చోట క్షేమంగా పెరుగుతోంది. నీ మరణం అతని చేతిలో తథ్యం’ అని, తన దైవిక రూపాన్ని ప్రదర్శించి, కంసుడికి తన మరణం గురించి తెలియజేసి, అంతర్ధానమైపోయింది. 

అనంతరం, యశోద గర్భాన జన్మించిన ఆ పాపే, దేవతా మూర్తిగా, వింధ్యాచల దేవిగా, వింధ్యాచల పర్వతాలపై వెలసి, భక్తులచేత పూజింపబడుతోంది. కృష్ణయ్య జన్మించిన రాత్రి, అందరూ గాఢ నిద్రలో ఉండడం, చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకోవడం, ఉవ్వెత్తున పారుతున్న యమునా నది, రెండుగా విడిపోయి దారివ్వడం, కన్నయ్య రాక కోసం, గోకులంలో నందుడు ఎదురుచూడడం, యశోద కూతురుని వసుదేవుడు, దేవకి చెంతకు చేర్చడం, ఈ విషయాలన్నింటినీ, వసుదేవుడూ, నందుడూ మరచిపోవడం, ఇవన్నీ ఆ భగవంతుడి లీలలే. ‘కృష్ణ’ అంటే మాయ అనే అర్థం అందరికీ తెలుసు. ఆ కృష్ణపరమాత్ముడు తన లీలలను, పుట్టినప్పటి నుండీ చూపిస్తూనే ఉన్నాడడానికి, ఈ సంఘటనలే సాక్ష్యాలు. కృష్ణం వందే జగద్గురుం!

09 December, 2020

శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! 5 Mothers of Lord Krishna!


కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, 

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం |

సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ,

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి ||

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]

శ్రీకృష్ణుడంటే హిందూమతానికీ, హిందూధర్మానికీ అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తుకురాకుండా, హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చు. అంతేకాదు, నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా, శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. పెదవులపై వేణువూ, మెడపై పసుపూ, తలపై నెమలి ఫించంతో కనిపిస్తూ, సర్వకళలనూ తనలో మిళితం చేసుకుని, సర్వ మానవాళి శ్రేయస్సుకై, శ్రీ హరి ఎత్తిన అవతారమే శ్రీ కృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, ఈ భూమిపై ఉన్నంత కాలం, మానవ సంక్షేమం కోసమే తన జీవనం కొనసాగించాడు. అంతే కాకుండా, సహయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకున్నాడు. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీ కృష్ణుడు, ప్రతీ ఒక్కరి కష్టాలనూ కడతేర్చే భగవద్గీత అనే దివ్య జ్ఞానాన్ని మనకందించాడు. చిన్నతనంలో, గోకులంలో చేసిన ఆయన లీలలకు, ఎంతో మంది ఆకర్షితులయ్యారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం, అష్టమి తిథిన, రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి, వసుదేవుని భార్య అయిన దేవకి కన్న తల్లిగా, నందుని భార్య యశోదమ్మ పెంచిన తల్లిగా, అందరికీ తెలుసు. కానీ, కన్నయ్యకు మొత్తం ఐదుగురు తల్లులు ఉన్నారు. దేవకీ, యశోద కాకుండా మరో ముగ్గురుని, ఆ కృష్ణ భగవానుడు తనకు మాతృసమానులుగా భావించాడు. మరి శ్రీ కృష్ణుడి తల్లులైన ఆ మిగతా ముగ్గురి గురించి కూడా, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

1. దేవకి

వసుదేవుడి సతీమణి అయిన దేవకి, శ్రీ కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు, చెరసాలలో బంధించిన నేపథ్యంలో, శ్రావణ మాసంలో, కృష్ణ పక్షం, అష్టమి తిథిన, కంసుడి కారగారంలోనే, కన్నయ్యకు జన్మనిచ్చింది, దేవకీ మాత. దేవకి, మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు, దేవకిని అల్లారుముద్దుగా చూసుకుని, ప్రేమగా ఆదరించాడు. కానీ, దేవకికి వసుదేవునితో పెళ్లై వెళ్లబోతుండగా, ఆకాశవాణి పలుకులతో ఆగ్రాహావేశుడయ్యాడు. దేవకి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని, దేవకినీ, ఆమె భర్త వసుదేవుడినీ, చెరసాలలో బంధించాడు. దేవకిని, దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా కొందరు భావిస్తారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకున్న కారణంగా, శ్రీ కృష్ణుడిని, దేవకీ నందనుడూ, వాసుదేవుడూ అని పిలుస్తారు.

2. యశోద

కృష్ణయ్యకు జన్మనివ్వకపోయినా, కంటికి రెప్పలా చూసుకుంది, యశోద. గోకులంలోని గ్రామ పెద్దయిన నందుడికి భార్య యశోద. కంసుడి బారి నుండి తప్పించడానికి, తండ్రి వసుదేవుడు, వీరింట కన్నయ్యను విడిచివెళ్ళాడు. తన అల్లరి పనులతో, ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో, యశోద చెంతనే పెరిగాడు కృష్ణుడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు, తన నోట చతుర్దశ భువనభాండాలను చూపి, ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేశాడు చిన్ని కృష్ణయ్య. భాగవతం ప్రకారం, యశోదకు కలిగి అదృష్టం, ముక్తీ, ఆ బ్రహ్మా, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి, అతడిని మందలిస్తూనే, ఎంతో ప్రేమగా చూసుకున్న యశోదమ్మ, కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.

3. రోహణి

వసుదేవుడు, దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకున్నాడు. బలరాముడూ, సుభద్రా, ఏకాంగి దేవీ, వీరి సంతానం. దేవకీ-వసుదేవుల ఏడవ సంతానాన్ని, రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా, ఆమెకు బలరాముడు జన్మించాడు. రోహిణి, తన కుమార్తే, కుమారుడితో కలిసి, యశోద దగ్గర నివసించేది. శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడూ, ఆయన సవతి తల్లి అయిన రోహిణీ, నాగ జాతికి చెందిన వారని, కొంతమంది అభిప్రాయం. అంతేకాకుండా, హస్తినాపురానికి రాజైన శాంతనవుడి సోదరుడు బాహిలిక కుమార్తె రోహిణి అని, మరికొంత మంది వాదన.

4. సుముఖి దేవి

సాందీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా, తల్లి హోదా ఇచ్చాడు, శ్రీ కృష్ణుడు. ఎందుకంటే, కృష్ణుడూ, బలరాముడూ, సుదాముడూ, సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే, సుముఖి దేవి, కృష్ణుడిని తన కుమారుడుగా ఉండమని, గురు దక్షిణ అడిగింది. అందుకు కారణం, శంఖాసురుడి అధీనంలో ఉన్న ఆమెను, అతడి చెర నుంచి విడిపించినందుకు, మాధవుడిని పుత్ర సమానుడిగా భావించింది. కన్నయ్యకు గురమాతైన సుముఖీ దేవి, ‘నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవ్వద’ని ఆశీర్వదించింది. అందుకే, కృష్ణుడు తనువు చాలించేవరకూ, ఆయన తల్లైన దేవకి కూడా జీవించే ఉంది.

5. పూతన

శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు, కంసుడు పూతన అనే రాక్షసిని పంపాడు. పాలు త్రాగే వయస్సులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వచ్చి, తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని, చిన్ని కృష్ణుడిని చంపాలని చూసింది. అయితే, పసిరూపంలో ఉన్న కన్నయ్య, ఆ విషయాన్ని ముందే గ్రహించి, రొమ్ముల ద్వారా పాలతో పాటు, రక్తాన్ని పీల్చి ఆమెను హతమార్చాడు. పూతన మరణం తర్వాత, ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో, ఆమె శరీరం, గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీని గురించిన వివరణ, భాగవతంలో సమగ్రంగా పేర్కొనబడింది. రాక్షసైన పూతన చనుబాలు త్రాగిన కృష్ణుడు, ఆమెకు కూడా తల్లి హోదా ఇచ్చినట్లు వివరించబడి ఉంది.

ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమా, అమ్మ కంటే గొప్ప భద్రతా ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మాతృ దేవో భవ!

Link: https://www.youtube.com/post/Ugx5Tq2zcPEj2y7mSYh4AaABCQ

25 November, 2020

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు!

 

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్‌!

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!!

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ సమయంలో, ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా? ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా, ఈ కోవిడ్ సమయంలో ప్రాణం విడిస్తే, కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ‘ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్రలో పట్టుమని, పదిమంది కూడా లేకుండానా?’ అని చాలామంది, మరింతగా కృంగిపోతూ ఉంటారు. అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి సమయాల్లో, ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం, క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.

ఎక్కడో ద్వారక.. దానికి చాలా దూరంలో తపోవనం.. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ, బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య, ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 

ఆ కార్యక్రమం ముగిశాక, అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని, వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు.. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాకూడదని కూడా అనుకున్నాడు. అర్జునిడితో పాటున్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే, అర్జునుడిని ఓదార్చారు. 

అప్పటికే శ్రీకృష్ణుడు, ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల, దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇప్పటి కరోనాలాగానే, అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది. ఆ విషయం మరో వీడియోలో తెలుసుకుందాము. 

సరిగ్గా అప్పుడే ద్వారక సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉండడంతో, ఇక ఆ జీవం లేని దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక, అక్కడే, అర్జునుడొక్కడే, అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి, అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప, ఇంకెవ్వరూ లేరు. 

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి, ఇద్దరు కొడుకులున్నా, వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలూ, ఊరటలూ, మార్గనిర్దేశకాలూ అవుతాయనడానికి, ఇదొక ఉదాహరణ. 

మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు, ఎవరికి, ఎలా నిర్ణయిస్తుందో, ఎవరూ చెప్పలేరు. అంతా దైవేఛ్ఛగా భావించి, ముందుకు సాగిపోతూ ఉండడమే. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgzIvT0iVN-GvHBdjON4AaABCQ