Ads

Showing posts with label Significance of Pushya Masam. Show all posts
Showing posts with label Significance of Pushya Masam. Show all posts

17 January, 2021

పుష్య మాసం విశిష్టత! Significance of Pushya Masam

 

పుష్య మాసం విశిష్టత!

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. 'పుష్య' అనే మాటకు 'పోషణ శక్తి కలిగినది' అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులూ, ధ్యాన పారాయణలకూ శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం 'పుష్యం'. పుష్య పౌర్ణమి, వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు, పుష్య పౌర్ణమి వరకూ, వేదాలూ, మంత్రాలూ నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది.

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే, ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారి పట్ల, శని ప్రసన్నుడై, శుభాల నొసగుతాడని, పురాణ ప్రవచనం.

[ అద్భుతమైన శనీశ్వరుడి చరిత్ర! = ఈ వీడియో చూడండి: https://youtu.be/qXPHHrAPYf8 ]

ఏలిననాటి శనితో బాధపడేవారు, ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి, శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు, శనికి తైలాభిషేకం జరిపించి, నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం, ఆహారంలో భాగం చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం ఏంటంటే, ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి, చలి నుంచి రక్షిస్తాయి.

'శని' ధర్మ దర్శి.. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు.. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమనూ, పవిత్రతనూ ఉద్ధరిచేవాడు ఆయనే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠులు పాటించినట్లయితే, శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక, గరుడ పురాణంలో, 'నాభిస్థానం' శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికీ, శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి.

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం, అనాదిగా వస్తోన్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా, శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే, సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే, సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు, కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే, సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో, వారికి ఆ రోజు అంత పవిత్రమైనది.

ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు, పితృ దేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని, 'పుత్రద ఏకాదశి' అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే, పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్య మాసంలో వస్తద్రానం, విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధ పడే వారిని ఆదుకోవడమే, ఈ నియమం వెనుక సదుద్దేశం.

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ 'సంక్రాంతి'.  సంక్రాంతి ముందు జురుపుకునే పండుగ 'భోగి'. చీకటితోనే లేచి, చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో, గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే, మకర సంక్రాంతి.

ఆ రోజు నుండీ, భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు, రాత్రి పూట భోజనం చేయకూడదని, పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవు నేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే, దారిద్ర్యం తొలగిపోతుందనీ, సకల భోగ భాగ్యాలు కలుగుతాయనీ ప్రతీతి.

సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ, వ్యవసాయంలో సహకరించే పశువులనూ, లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని 'విమలైకాదశి', 'సఫలైకాదశి', 'షట్తిలైకాదశి', 'కల్యాణైకాదశి' అని పిలుస్తారు. తెలగ పిండితో ఒంటిని రుద్దుకుని, నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచి నీటిలోనూ నువ్వులు కలుపుకుని త్రాగడం, తిలదానం చేయడం, ఈ ఏకాదశి రోజు చేస్తారు.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను, 'చొల్లంగి అమావాస్య' అంటారు. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’, తూర్పు గోదావరిలోని చొల్లంగిలో, సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని, భక్తుల విశ్వాసం.

Link: https://www.youtube.com/post/Ugx90XdxVRK3MHROLiF4AaABCQ