Ads

Showing posts with label Hinduism. Show all posts
Showing posts with label Hinduism. Show all posts

20 November, 2020

దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

 


దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

నిజమే! శపిస్తే పోతారు. కానీ, వారికి ఆ అధికారం లేదు కాబట్టి, శపించరు. ఎందుకు ఇలా? అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం ఈ విషయం తర్కించి చూద్దాం. కొన్ని ఉదాహరణలు తీసుకుని, ఈ తర్కం తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1UPRUEqFKdI ]

ముందుగా విశ్వామిత్రుడిని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మర్షి అయినాడు. ఆయన కోపం వలన, కామం వలన, ఎన్నో సార్లు తన తపః శక్తిని వృధా చేసుకుని, ప్రాయశ్చిత్తంగా, మరల కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి, పూర్వపు స్థితికి చేరుకోగలిగాడు. ఆయన క్రోధం వహించి, తాను చేస్తున్న యాగం సంపూర్ణం చెయ్యడానికి, ఆ రాక్షసులను ఒక్క హుంకారంతో చంపి వెయ్యగలడు.. కానీ, దాని వలన ఆయన చేస్తున్న యాగం, ఆ యాగసంకల్పం  సంపూర్ణం కాదని, ఆయనే స్వయంగా చెప్పారు.

ఆయనే తన వద్దనున్న బల-అతిబల విద్యలను, ఎన్నో దివ్యాస్త్రాలను సమంత్రకంగా రామునికి ఉపదేశించి, ఆయన నుండి రక్షణ కోరాడు. ఇందులో ఎన్నో దైవరహస్యాలు దాగి ఉన్నాయి.

1. పరమాత్ముడు శ్రీరాముని అవతారం తీసుకుని వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆయనకు తన వద్దనున్న విద్యలన్నీ ధారబోసి, సర్వస్వ శరణాగతి కోరాడు
2. రామునికి విద్య నేర్పి దివ్యాస్త్రాలు ఇవ్వవలసిన గొప్ప బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారు. 
3. రావణుడు కేవలం మానవుల, వానరుల చేతిలో మరణించే అవకాశం మాత్రమే ఉంది. రావణుని అడ్డు పెట్టి, ధర్మవర్తన అందరికీ తెలుపవలసిన దివ్యనాటక రచనలో, ఆయన తన పాత్రను పోషించాలి.
4. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా, అతడు చేస్తున్న దుందుడుకు కార్యాలకు చావమని శాపం ఇవ్వక, పడతి అనుమతి లేకుండా, వారిని మరోలా తాకితే, తల వెయ్యి ముక్కలు అయ్యే శాపం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే, ఆయన పాత్ర కూడా, కేవలం అక్కడితో ఆగిపోతుంది. చెయ్యవలసిన కార్యం కోసం, రావణుడిని అడ్డుపెట్టుకుని, ఈ భూమి పై అడుగుపెట్టి, ధర్మాన్ని నిలుపవలసిన మహత్కార్యం ఉంది. 
5. ఆ మాటకు వస్తే, రావణుడు వాలి చేతిలోనూ, కార్తవీర్యార్జునుని చేతిలోనూ దారుణంగా నిహతుడు అయ్యే అవకాశం ఉన్నా, వారి పరిమితికి లోబడి, వారు కేవలం ఆ రాక్షసుని చెర మాత్రమే పట్టి, ఇతరుల ఆదేశం మేరకు వదిలేసారు.
6. ఒకవేళ రావణుడంతటి రాక్షసుని చంపవలసి వస్తే, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు ధారబోసి, క్రోధం పూని, అతడిని చంపవచ్చు. కానీ, మరల ఆయనకు అంత ఆయుర్దాయం ఉండడం, అనుకున్న గొప్ప కార్యం నేరవేతుందన్న నమ్మకం ఉందా? కాబట్టి, మహర్షులు తమ క్రోధాన్ని అణగద్రొక్కుకుని, తమకూ, లోకానికీ, రక్షణ ఇచ్చే బాధ్యత ఉన్న ఆ ధరణీపతిని శరణు వేడి, ఆయన చేత రక్షణ పొందారు. 
7. అసలు విశ్వామిత్రునికి ఆ దివ్యాస్త్రాలు, పరబ్రహ్మ అనుమతి వలనా, ఆయన అనుగ్రహం వలనా వచ్చినవే. ఆయన ఇచ్చిన విద్యను ఆయనకే ఇచ్చి, నువ్వు తప్ప నాకు మరొక దిక్కులేదు, నన్ను బ్రోవుమా అనే గొప్ప శరణాగతి తత్త్వం, ఇందులో కనబడుతుంది.  ఎప్పుడూ 'నాదేమీ లేదు, నువ్వే దిక్కు' అని ఆయనను ఆశ్రయిస్తే, గజేంద్రమోక్ష వరదుడు, సంసార కూపం నుండి ఉద్ధరించి, ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు. 
8. ఎవరి పని వారు చెయ్యాలి. రక్షణ చెయ్యడం, క్షత్రియుని బాధ్యత. తపస్సు చేసి, అందరికీ మార్గదర్శనం చెయ్యడం, మహర్షుల కర్తవ్యం. వారికి అప్పజెప్పిన పనిని, అతిక్రమించరు వారు. 
9. ఎవరెవరి కర్మఫలం ఎలా వుందో, వారి విషయంలో, మహర్షులు మామూలుగా జోక్యం చేసుకోరు. ఎవరైతే, ఆ రాక్షసుల చేతిలో బాధలు అనుభవిస్తున్నారో, వారి కర్మఫలం అలా వున్నది. ఎప్పుడైతే వారందరూ స్వామికి శరణాగతి చేస్తారో, అప్పుడు వారిని కాపాడే బాధ్యత ఆయన తీసుకుని, వారిని రక్షిస్తాడు.

ఇంకా ఎన్నో దేవరహస్యాలు ముడిపడి ఉంటాయి. మనకు తార్కికంగా అర్ధం చేసుకోవడానికి ఈ కారణాలు చాలు. 

ఇలా మనం భారతంలోనూ, భాగవతంలోనూ చూస్తే, ఇటువంటి ఎన్నో తార్కాణాలు కనబడతాయి. అన్నింటికీ, పైన చెప్పుకున్న విషయాల కారణంగా, ఋషులు జోక్యం చేసుకోరు. ఒక్కోసారి మరీ అధర్మం పెచ్చరిల్లితే, వారికి అందిన ఆదేశం ప్రకారం, వారు అప్పుడప్పుడు దండిస్తూ ఉంటారు. ఒకసారి ఇక్ష్వాకు వంశంలో, వేనుడు అన్న వాడి ఆగడాలు మితిమీరిపోతే, వాడికి మంచి బుద్ధులు చెబుదామని వెళ్ళిన ఋషులూ, మునులను బంధించి, కేవలం తననే దైవంగా పూజించమని నిర్బంధించినప్పుడు, వారంతా చేసిన ఒక్క హుంకారానికి ఆ వేనుడు చావగా, అతడిని మధించి, వంశోద్ధారకుని పుట్టించారు. కానీ, ఇటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. ఒకరి పాపం పండినప్పుడు, వారిని అంతం చెయ్యడానికి, దైవమే ఒక అవతారం తీసుకుని, భువికి వస్తారు. అప్పటివరకు, ఎవరి కర్మఫలాలనుబట్టి, అటువంటి నరకబాధలు ఎవరెవరు అనుభవించాలో, వారు వీరి బారిన పడి, బాధలు అనుభవిస్తూ ఉంటారు. 

ఈ ప్రపంచం అంతా, ఆ పరాత్పరుని నియమానికి లోబడి నడుస్తుంది. ఆయన ఆజ్ఞ లేనిదే, ఏదీ జరగదు. ఒకొక్కప్పుడు, దేవతలకు తమలో ఉన్న సత్త్వ గుణాన్ని తొక్కి, రజో, తమో గుణాలు ప్రకోపించినప్పుడు, వాటిని అదుపు చెయ్యడానికి, ఆ పరమాత్మ ప్రతినిధులైన ఆ మహర్షులు, వారిని శపించి, తగిన శాపవిమోచనం బోధించి, వారిని సరైన దారిలో పెడతారు. ఈ రాక్షసులు అలా శాపకారణంగా, వారిలో ఉన్న తమోగుణం పోగోట్టుకోకపోగా, మరింత పెచ్చరిల్లే అవకాశం ఉన్నందున, వారిని దునుమాడవలసిన అవసరం ఉన్నప్పుడు, ఆ పరమాత్ముడిని ఆశ్రయించక తప్పదు. కాబట్టి, వారు ఏం చేసినా, లోకకళ్యాణం కొరకేగనుక, వారికి అనుమతి ఉన్న కార్యాలు మాత్రమే చేస్తారు, ఆ మహర్షులు. వారి తపః ఫలితంగా, ఆ పరమాత్మ వారికి సశరీరంగా అనుగ్రహించి, వారిని భౌతికంగా రక్షించి, ఆధ్యాత్మికంగా వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. 

ఆ మాటకొస్తే, నేటికి కూడా, అంతటి గొప్ప మహర్షులు మన భారతదేశంలో ఉన్నారు. మన కంచి కామకోటి పీఠాధిపతులు, ఇలలో నడయాడిన పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి, సరైన దారిలో పెట్టారు తప్ప, శపించి వారి శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. ఒక్కసారి మన భౌతిక స్థాయిని దాటి ధ్యానం చేస్తే, మన వాంగ్మయం మీద సంపూర్ణ నమ్మకంతో, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే, ఆ పరమాత్మే మనను అనుగ్రహించి ప్రచోదనం చేస్తారు.

ఓం నమో వేంకటేశాయ!