అంగీరసుడు దూర్వసుని పూజించుట - ద్వాదశీ పారణము:
అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా - సుదర్శనచక్రము అంబరీషునకు అభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తకోటి దర్శనమిచ్చి అంతర్ధమైన వైనమును చెప్పి తిరిగి ఇలా నుడువ నారంభించెను.
ఆ తరువాత అంబరీషుడు దూర్వసుని పాదములపై పడి దండ ప్రణామము లాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నిళ్లను తన శిరస్సుపై చల్లుకొని 'ఓ ముని శ్రేష్ఠా! నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది, నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశీవ్రతము చేసుకొనుచు, ప్రజలకు ఎట్టి కీడు రాకుండా, ధర్మవర్తనుడనై, రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు, నన్ను మన్నింపుము. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే, తమకు అతిథ్యమియ్యవలయునని ఆహ్వానించితిని. కావున, నా ఆతిధ్యమును స్వీకరించి, నన్నూ, నా వంశమును, పావనము చేసి, కృతార్ధుని చేయుము. మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినా, మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని, మీ రాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు, నేను మీ ఉపకారము మరువ లేకున్నాను.
మహానుభావ! నా మనస్సంతోషముచే మెమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నాకండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవచేసినను, యింకను ఋణపడి యుందును. కావున, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేటట్లూ, సదా మీ బోటి ముని శ్రేష్ఠుల యందును, ఆ శ్రీమన్నారాయణుని యందును, మనస్సు గలవాడనై యుండునట్లును, నన్నాశీర్వదించుడి' అని ప్రార్థించి, సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహానించెను.
ఈ విధంగా తన పాదములపై బడి, ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, 'రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి, ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో, అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానమైనావు.
నేను నీకు నమస్కరించినచో నాకంటె చిన్నవాడవగుట వలన, నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత, నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను. పవిత్ర ఏకాదశీ వ్రతనిష్టుడవగు నీకు, మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు, నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక, మరొకటి యగునా?' అని దూర్వాసమహాముమిని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారముగ' పంచభక్ష్య పరమాన్నములతో, సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి సెలవు పొంది, తన ఆశ్రమమునకు వెళ్లెను.
ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ద ద్వాదశీ రోజున జరిగినది. కావున ఓ అగస్త్య మహాముని! ద్వాదశీ వ్రత ప్రభవమెంతటి మహాత్యము కలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి, ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆ రోజునకంతటి శ్రేష్ఠతా, మహిమ కలిగినది. ఆ దినము చేసిన పుణ్యము, ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి, పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి, ఆ రాత్రియంతయు పురాణము చదువుతూ, లేక వింటూ జాగరణచేసి, ఆ మరునాడు, అనగా, ద్వాదశీ నాడు, తన శక్తికొద్ది శ్రీమన్నారాయణుని ప్రీతికోరకు దానములిచ్చి, బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో, అట్టివాని సర్వపాపములు, ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశీఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగనే భుజింపవలయును.
ఎవరికైతే వైకుంఠములో స్థిరానివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశివ్రతము, ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ద ద్వాదశీ, అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయయింపకూడదు. మర్రిచెట్టు విత్తనము చాల చిన్నది అయినను, అదే గొప్ప వృక్షమైన విధముగా, కార్తీకమాసంలో నియమానుసారముగ జేసిన ఏ కొంచెము పుణ్యమైననూ, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందుకే, ఈ కార్తీకమాస వ్రతము చేసి, దేవతలే కాక, మానవులూ తరించిరి.
ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును. అని అత్రిమహాముని అగస్త్యునితో చెప్పెను.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'నవవి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం' సమాప్తము.
కార్తీకమాస 29వ రోజున ఆచరించవలసిన దానధర్మాలు, జపతపాది విధులు, ఫలితములు:
పూజించాల్సిన దైవము → శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము → 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్'
నిషిద్ధములు → పగటిపూట ఆహారము, ఉసిరి
దానములు → శివలింగం, వీభూతి పండు, దక్షిణ, బంగారము
ఫలితము → అకాలమృత్యు హరణం, ఆయుర్యృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం
Link: https://www.youtube.com/post/Ugz8HVHa9G5SSQAgaN94AaABCQ
No comments:
Post a Comment