Ads

13 December, 2020

కార్తీక పురాణం! (అష్టవి౦శోధ్యాయము - ఇరవయ్యెనిమిదవ రోజు పారాయణం)


విష్ణు సుదర్శన చక్ర మహిమ:

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవుపొంది, తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ, తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి, అంబరీషుని వద్దకొచ్చి, 'అంబరీషా, ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని, నిన్ను కష్టముల పాలుజేసి, వ్రతభంగము చేయించి, నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకువెళ్లి, ఆ విష్ణుచక్రము ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆ పురాణ పురుషుడు, నాకు జ్ణానోదయము చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పినాడు.

కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్ఠగలవాడనైనను, నీ నిష్కళంక భక్తిముందు, అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు' అని అనేక విధములుగా ప్రార్థించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, 'ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనః పూర్వక వందనములు, ఈ దూర్వాసముని, తెలిసియో, తెలియకో, తొందరపాటుగా, ఈ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను, ఇతడు బ్రాహ్మణుడు కావున, ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దూర్వసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను.

నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో, అనేక మంది లోక కంటకులను చంపితివిగాని, శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే, ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను, ఇతనిని వెంటాడుచూనే ఉన్నవు గాని, చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా ఏకమైననూ, నిన్నేమియు చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలుసు. అయినను, మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించెను.

నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి యున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను, శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము' అని అనేక విధముల స్తుతించుట వలన, అతి రౌద్రాకారముతో, నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము, అంబరీషుని ప్రార్ధనలకు శాంతించి 'ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని, వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను, దేవతలందరు ఏకమైగూడ చంపజాలని మూర్ఖులను, నేను దనుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై, శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని, నీ వ్రతమును నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి, నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఇతడు గూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరిని చంపగలదుగాని, శక్తిలో నాకంటె ఎక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నింఫియున్న నాతో, రుద్రతేజస్సుగల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడై వున్నప్పుడు, అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు, ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.

ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వసుని గౌరవించి, నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము' అని చక్రాయుధము పలికెను. ఆంబరీషుడు ఆ పలుకులనాలకించి, 'నేను దేవ, గో, బ్రాహ్మణాదులయందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో, సర్వజనులూ సుఖముగా వుండవలెననే, నా అభిలాష. కావున, శరణుగోరిన ఈ దూర్వసునీ , నన్నూ రక్షింపుము. వేలకొలది అగ్ని దేవతలు, కోట్లకొలది సూర్యమండలములు ఏకమైననూ, నీ శక్తికీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు, లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై, నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తన కుక్షియందున్న పదునాలుగు లోకములను, కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. 

కావున, నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు. అని పలికి, చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము, అంబరీషుని లేవ దీసి గాఢాలింగన మొనర్చి 'అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో, పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక , పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్య వంటి మహాపాతకములను చేయకుంటారో, అట్టివారి కష్టములు నశించి, ఇహమందును, పరమందును, వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కావున, నిన్నూ, దూర్వసునీ, రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు, ఈ ముని పుంగవుని తపశ్శక్తి పని చేయలేదు'. అని చెప్పి, అతనిని ఆశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'అష్టవి౦శోధ్యాయము - ఇరవయ్యెనిమిదవ రోజు పారాయణం' సమాప్తము.

కార్తీకమాస 28వ రోజు ఆచరించవలసిన దానధర్మలు, జపతపాది విధులు, ఫలితములు:

పూజించాల్సిన దైవము → ధర్ముడు

జపించాల్సిన మంత్రము → ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహా!

నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు → నువ్వులు, ఉసిరి

ఫలితము → దీర్ఘకాల వ్వాధి హరణం

Link: https://www.youtube.com/post/UgzK7b_zrBOqqHCEmSF4AaABCQ

No comments: