శ్రీమహాలక్ష్మి ఈ ఐదింటా వుంటుంది!
క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తున్న స్థితిని ఎంతో అద్భుతంగా వర్ణించారు పోతన. ఆ తల్లి ఈ లోకములన్నింటినీ అనుగ్రహించడం కొసం పైకి వస్తుంటే.. శిరస్సు నుంచి పాదాల వరకూ, ఆ రూప వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించారు.
[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]
తొలకరి ప్రారంభమయ్యే సమయంలో, ఆకాశంలో వచ్చేటువంటి మెరుపుని, సౌదామిని అంటాం. అది కంటిని ఆకర్షిస్తుంది. తళుక్కు తళుక్కు మనే మెరుపుకి, అందరూ ఆ దిశగా చూస్తారు. లక్ష్మీ దేవి మెరుపు కూడా అలాంటిదే. లక్ష్మీ దేవి వైభవాన్ని ఎక్కడ ఎవరు వర్ణించినా, స్తుతించినా, శ్లాఘించినా, మెరుపు తీగతో పోల్చి చెబుతారు. ఎందుకంటే, అందరి కంటినీ అమితంగా ఆకర్షించే శక్తి, మెరుపుకి వుంటుంది. విద్యుల్లతలా ఆమె కరుణా కటాక్షాలు కూడా, లోకం పట్ల కాంతులు వెదజల్లుతూ వుంటుంది. ఆమె ఒక్కసారి కన్ను తెరిచి, క్రీగంట చూస్తే చాలు.. లోకములన్నీ బ్రతుకుతాయి. చైతన్యాన్ని విప్పుకుంటాయి.
ఆమె శరీరం అంతా కూడా మిలమిలా, ధగధగా మెరిసిపోతూ వుంటుంది. ఆమె ఒక కాంతి పుజం. ఆ కరుణా వీక్షణాలు ప్రసరించిన ఉత్తర క్షణానే, ఇక ఆ ఐశ్వర్య వైభవం, మాటలకందని రీతిలో వుంటుంది. ఆ ఉత్సాహం కానీ, ఉల్లాసం కానీ, ఐశ్వర్యం కానీ, పూనిక కానీ, సంపద కానీ, అన్నీ, అంత పుష్కలత్వాన్ని పొందుతాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని అందరూ గ్రహించాల్సి వుంటుంది.
'ఐశ్వర్యము' అంటే, కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. లక్ష్మి అంటే ఎవరని అభిప్రాయపడుతున్నారు?
మనల్ని విశేషంగా సత్కరించాలనుకుంటే, ఆ తల్లి ఆడపిల్లగా ఇంటికొస్తుంది. ఆడపిల్ల అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం. ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి, తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో, ఇరు వంశీకులనూ తరింపచేస్తుంది. మగపిల్లాడికి, ఆ అవకాశం లేదు.
అసలు ఆడపిల్ల ఇంటికొచ్చిందంటేనే, లక్ష్మీ దేవి వచ్చినట్టే. 'ఆడపిల్ల' అటు వెనక పదితరాలనూ, ఇటు ముందు పది తరాలనూ, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది. మగపిల్లాడికి పెళ్లయ్యాక, ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే, అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది.
ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు, తానెక్కడెక్కడ నివాసముంటుందో, స్వయంగా తానే చెప్పింది..
కైలాసంలో 'పార్వతీ దేవి'గా,
వైకుంఠంలో 'లక్ష్మీ దేవి'గా,
బ్రహ్మ లోకంలో 'సరస్వతీ దేవి'గా,
మహా రాజు దగ్గర 'రాజ్యలక్ష్మి'గా
ప్రతి ఇంటి ఇల్లాలిలో, 'గృహలక్ష్మి'గా వుంటానని చెప్పింది.
'గృహము' అని ఎప్పుడంటారంటే, ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే! ఇంటి యజమాని ఎంత అలసిపోయినా, ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం వున్నా, ఎన్ని కోట్లు వున్నా, ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు. లక్ష్మీ దేవిని దర్శించడం ఎంత సులువైనదీ అంటే, నీ భార్య లో, సాటి వారి ఇల్లాలిలో, సోదరిలో చూడవచ్చు. ఈ భావన చాలు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు. ఈ ఒక్క భావన హేతువు గా నిలుస్తుంది.
దేశానికి అరిష్టం ఎక్కడ పట్టుకుందీ అంటే, కనపడిన ప్రతి ఇల్లాలి వంకా చూడకూడని చూపు చూడటం వల్ల, అది దోష భూయిష్టమౌతోంది. అలా కాకుండా, ప్రతి ఇల్లాలిని గనక లక్ష్మీ స్వరూపంగా, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి వుంటే, దేశమంతా కూడా, లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది, వర్ధిల్లుతుంది.. అందుకే లక్ష్మీ ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది శాస్త్రం.. అవేమిటంటే :
1. గోవు యొక్క వెనుక వైపు.
రోజుకొక్క సారైనా, గోవు వెనక భాగం చూసిన వారూ, ప్రదిక్షణ చేసిన వారూ, లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు, చేతులారా పండూ, ఫలమూ, పరకని తినిపించిన వాడు, సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.
2. పద్మం - పద్మము లక్ష్మీ స్థానం.
3. ఏనుగు యొక్క కుంభస్థలం.
4. సువాసినీ యొక్క పాపిట ప్రారంభ స్థానం.
5. మారేడు దళం. ఈ ఐదూ లక్ష్మీ దేవి నెలవుండే స్థానాలు.
లక్ష్మి లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ వుంటే, అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుండటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడిదే అసలైన లక్ష్మీకటాక్షం.
Link: https://www.youtube.com/post/UgyamqAVZ9rbAarYEi54AaABCQ
No comments:
Post a Comment