Ads

23 November, 2020

నేటికీ మహిమలు చూపిస్తున్న గురు రాఘవేంద్ర స్వామి!


ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, పీఠాధిపతిగా ఎదిగిన గురువు, శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆయన జీవితం, ఆదర్శ ప్రాయం. వేంకటేశ్వరుని వర ప్రసాదంగా జన్మించిన రాఘవేంద్రులు, ఎన్నో మహిమలూ, అద్భుతాలూ చేశారు. ఆయన అసామాన్య ప్రజ్ఞాపాటవాలూ, మేధో శక్తి, అమోఘం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర, ఆయన మహిమలూ, సమాధి స్థితిని పొందేవరకూ ఆయన చేసిన కృషి గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R3-1D7fdPts ]

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ||
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

1571 లో, కాంచీపురం సమీపంలోని భువనగిరిలో, ఒక నిరుపేద కుటుంబంలో, తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులకు జన్మించారు రాఘవేంద్రులవారు. వేంకటేశ్వరుని కృపతో జన్మించిన ఆయనకు, తల్లిదండ్రులు వెంకటనాథుడని నామకరణం చేశారు. ఈయన తాతగారు, శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే, తల్లిదండ్రులు గతించారు. ఆనాటి నుండి, తన బావగారి సంరక్షణలో ఉంటూ, సర్వశాస్త్ర పారంగతులయ్యారు. వెంకటనాథుడికి యుక్త వయస్సులోనే, సరస్వతి అనే మహిళతో, వివాహం జరిగింది. తరువాత వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆనాటి నుండి, వెంకటనాధుడికి కుంటుంబ పోషణ భారంగా మారింది. ఏం తోచని నిస్సహాయ స్థితిలో, భువనగిరిని వదిలి, కుంభకోణానికి చేరుకున్నారు వెంకటనాధుని కుంటుంబం. ఆయనకు తాత్కాలికంగా, సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది. వేంకటనాధుని అసామాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయారు, సుధీంద్ర తీర్థులవారు. ఆయన మేథాశక్తినీ, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్నీ అభినందించకుండా ఉండలేకపోయారు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలూ, చిత్తశుద్ధీ, గురువైన సుధీంద్ర యతీంద్రులను, బాగా ఆకర్షించాయి. 

వయోభారంతో వున్న సుధీంద్రుల వారు, ఒకనాడు శిష్యుడైన వెంకటనాధుణ్ణి పిలిచి, "వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు, నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి" అని తన మనస్సులోని కోరికను బయటపెట్టారు. అందుకు వెంకటనాధుడు, తనకు భార్యాబిడ్డలున్నారనీ, కుటుంబ పోషణ భారం తనదేననీ, వారిని మధ్యలో వదిలేసి రాలేననీ, గురువుతో చెప్పి వెళ్లిపోయారు. తనకు కష్ట కాలంలో సహయం చేసిన గురువు గారి మాటను కాదని వచ్చేశాసనే బాధతోనే, ఆ రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు కలలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై, ‘నాయనా వెంకటనాథా.. నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేథా శక్తితో, సద్గురువువై, దారి తప్పిన జనాలకు దారి చూపు. నీవు నీ గురువు చెప్పినట్టు చెయ్యి' అని చెప్పిందట. వెంటనే నిద్ర నుండి మేల్కొన్న వెంకటనాధుడు, గురువు సన్నిధికి చేరుకున్నాడు. అప్పుడు సుధీంద్ర తీర్థులు ఎంతో సంతోషించి, వెంకటనాథుణ్ణి తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి, పీఠాధిపత్య బాధ్యతలు అప్పగించారు. అప్పుడే, వెంకటనాథుడి పేరును, రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారు. రాఘవేంద్ర స్వామిగా సన్యాస దీక్ష తీసుకునేనాటికి, ఆయన వయస్సు 23 సంవత్సరాలు. ఆ తరువాత 40 ఏళ్ల పాటు, అతి పవిత్ర జీవనం గడిపి, నియమ నిష్టలతో, నిత్యం మూలరాముణ్ణి ఆరాధించేవారు. 

రాఘవేంద్రుడు ఎన్నో మహిమలూ, అద్భుతాలూ చేశారు. ఒకనాడు ఆ ప్రాంత నవాబు, రాఘవేంద్రులను పరీక్షింపదలచి, రెండు బుట్టలతో మాంసం పంపాడు. కానీ, శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా, అందులో పళ్లూ, పువ్వులూ ఉన్నాయి. దాంతో, నవాబు తన తప్పు తెలుసుకుని, రాఘవేంద్ర స్వామిని సత్కరించాడు. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోసి, తన మహిమను దశదిశలా వ్యాప్తింపజేశారు. ఇలాంటి ఎన్నో మహిమలను, రాఘవేంద్ర స్వామి సోదరి కుమారుడైన నారాయణాచార్యుడు, రాఘవేంద్ర విజయమ్‌ అనే గ్రంథంలో, నిక్షిప్తం చేశారు. రాఘవేంద్రుల వారు, 40 ఏళ్లపాటు పీఠాధిపతిగా కొనసాగిన తరువాత, ఒకనాడు, తన శిష్యుడైన వెంకన్నను పిలిచి, తుంగభద్రా తీరాన, మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి, అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. ఆ విధంగానే, చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు వెంకన్న. 1671వ సంవత్సరంలో, శ్రీ రాఘవేంద్రస్వామి, వీణతో సహా సమాధి స్థితినొందారు. ఆయన బృందావన సమాధిని, 1200 సాలగ్రామాలతో మూసివేశారు, శిష్యులు.

రాఘవేంద్ర స్వామిని, విష్ణు భక్తుడైన భక్తప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. సమాధి గతుడైన తర్వాత కూడా, రాఘవేంద్రుల వారు చూపిన మహిమలూ, చేసిన అద్భుతాలూ, కోకొల్లలు. సమాధి నొందిన 700 సంవత్సరాల వరకూ, సూక్ష్మరూపంతో బృందావనంలో ఉండి, భక్తులను అనుగ్రహిస్తానని అయన మాటిచ్చిన విధంగానే, నేటికీ ఆయన మహిమలను ఆస్వాదిస్తున్నారు భక్తులు. ఆయన స్వతంత్ర రచనల్లో, జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం, 'భట్ట సంగ్రహం' భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి, మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని గుభాళింపజేశారు.

ఐతరేయోపనిషత్తు మినహా, తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థుల చంద్రికకు, ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో, పరిమళాచార్యుడిగా వాసికెక్కారు, శ్రీ రాఘవేంద్ర స్వామి. గురు పూర్ణిమ నాడు, మంత్రాలయంలోని రాఘవేంద్రుల వారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ రోజు దేశ నలుమూలల నుండి, అనేక మంది భక్తులు, రాఘవేంద్రుని బృందావన సమాధిని దర్శించడానికి వస్తుంటారు.

[ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జీవిత రహస్యం! వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://youtu.be/2tXUZIGS2Vc ]

కార్తీక పురాణం! (ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదవ రోజు పారాయణము)

 

శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం:

వశిష్టుడు చెప్పినదంతా విని 'మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగుననియూ, అది నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు, నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణ సంకరులై, రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు, యింత తేలికగా మోక్షము పొందుట, వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున, దీని మర్మమును విడమర్చి, విపులీకరించ ప్రార్ధించుచున్నాను' యని కోరెను.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి, 'జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పటి౦చితిని. వానిలో కూడా, సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి, ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము, అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమనగా- ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

ఆజా మీళుని కథ: 

పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. 

ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, 'నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని 'నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. 

ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక 'నారాయణా నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట 'నారాయణా'యను శబ్దము వినబడగానే, యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగు శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి 'ఓ యమ భటులారా! వీడు మావాడు. మేము వీనిని వైకు౦ఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా, యమదూతలు 'అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా, విష్ణు దూతలు యిట్లు చెప్పదొడ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgzJ5dPoe5PGSgIQKMN4AaABCQ

22 November, 2020

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!



తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nq9T9mD0Cng ]

ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది. 

కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు. 

పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.

అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’ అనే వీడియోను చూడండి. వీడియో లింక్, క్రింద పొందుపరిచాను. అది కనిపించని వారు కామెంట్ చేస్తే, రిప్లైలో లింక్ పంపిస్తాను.. 

[ Link: మరణం తర్వాత ఏం జరుగుతుంది? - https://www.youtube.com/watch?v=lOH5s... ]

ధర్మో రక్షతి రక్షితః!