Ads

21 September, 2022

ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము! Bhagavad Gita


ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము!

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (16 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 16 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ssKwn-s-CpY ]

భగవంతుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఆయనను ఎలా స్మరిస్తూ ఉండాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।।

00:55 - కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।

నీవు సమస్త జగత్తుల యందూ వ్యాపించి, వాటి యందు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగీశ్వరా, నేను మిమ్ము ఎలా తెలుసుకోగలను, మరియు ఎలా స్మరిస్తూ ఉండేను, అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో మిమ్ము చింతన చేయగలనో తెలియజేయండి భగవాన్!

ఇక్కడ యోగం అంటే, భగవంతుని దివ్యమైన శక్తి అయిన యోగమాయ. అలాగే, యోగి అంటే, యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు భగవానుడని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు ఏ విధంగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటినీ, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. సమస్త జగత్తునూ నియంత్రించి, నిర్వహించే వాడిగా, శ్రీ కృష్ణుడి మహిమలనూ, మరియు అత్యున్నత స్థాయిని గురించీ వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు.. "నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించబడటానికి, నీ దివ్య లీలలను తెలుసుకోగోరుతున్నాను. నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నా మీద కృపతో, నిన్ను అర్థంచేసుకోవడానికి, నీ యొక్క మహిమలను తెలియచేయుము." అని భగవానుడిని అడుగుతున్నాడు, అర్జునుడు.

02:18 - విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।

 ఓ జనార్ధనా! మరల విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలనూ, మరియు అవతారములనూ చెప్పుము. నీ దివ్యామృతమును వింటూ ఉంటే, అది ఎన్నటికీ తనివితీరదు.

భగవంతుని మహిమలను వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతమయమైన శ్రీ కృష్ణుడి మాటలను, ఇప్పటివరకూ తన చెవులతో త్రాగుతున్నాడు అర్జునుడు. ఇక ఇప్పుడు, "ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు." అని అంటూ, భగవంతుడిని ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది, అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు, ఇదే విషయాన్ని చెప్పారు: "శ్రీ కృష్ణుడి భక్తులైనవారికి, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా సరిపోదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే, అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది." అని వివరించాడు.

03:28 - శ్రీ భగవానువాచ ।
హంత తే కథయిష్యామి దివ్యా హ్యత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ।। 19 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ కురు శ్రేష్ఠ.. ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే, వాటి వివరణకి అంతమే లేదు.

భగవంతుని శక్తులూ, మరియు ఐశ్వర్యములూ అనంతమైనవి. నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే. ఆయనకు అనంతమైన రూపములున్నవి. అనంతమైన నామములూ, అనంతమైన ధామములూ, అనంతమైన అవతారములూ, అనంతములైన లీలలూ, అసంఖ్యాకమైన భక్తులూ, ఇలా ఎన్నెన్నో. కాబట్టి, వేదములు ఆయనను అనంతుడు అంటాయి. "భగవంతుడు అనంతుడూ, మరియు అసంఖ్యాకమైన రూపములలో ఈ విశ్వములో ప్రకటితమౌతాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించేదయినా, ఆయన అకర్త." అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలియజేస్తుంది. "భగవంతుడు అనంతుడు, మరియు ఆయన తన అనంతమైన అవతారాలలో చేసే లీలలు కూడా, అనంతములు." అని రామాయణంలో వివరించబడి ఉంది. "భగవంతుని మహిమలను లెక్కించగలమని అనుకునే వారు, అల్ప బుద్ధులు. ఈ భూమిపై ఉన్న ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చు కానీ, భగవంతుని యొక్క అనంతమైన మహిమలను గణించలేము." అని వేద వ్యాస మహర్షి దృఢంగా ప్రకటించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు ఇక్కడ, తన విభూతులలోని అతికొద్ది భాగాన్ని మాత్రమే వివరించబోతున్నానని అంటున్నాడు.

05:01 - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।

ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము.

శ్రీ కృష్ణుడు, తానేమీ జీవుడికి అంత దూరంగా, వేరుగా లేనని అంటున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ, అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. "భగవంతుడు మన ఆత్మలయందు స్థితమై ఉన్నాడు." అని వేదములు పేర్కొంటున్నాయి. అందులో కూర్చుని, ఆ ఆత్మకు జీవశక్తి, మరియు నిత్యశాశ్వత గుణమునూ ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది, మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము, మరియు చైతన్యవంతులము కాలేదు. పరమ చైతన్యవంతుడూ, మరియు సనాతనుడూ అయిన భగవంతుడు మనలోనే ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత, అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి, శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నానని అంటున్నాడు. శ్రీ కృష్ణుడే, సమస్త జీవ భూతముల మొదలూ, మధ్యా, తుది. అవి ఆయన నుండే ఉద్బవించాయి. కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవము అంతా, ఆయన శక్తి చేతనే సంరక్షింపబడి, కొనసాగింపబడుతున్నది. కాబట్టి, ఆయనే మధ్య. అలాగే, మోక్షము పొందిన వారు, ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే, నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే, భగవంతుడే అన్ని ప్రాణులకూ తుది.

06:41 - ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో, నేను విష్ణువును. ప్రకాశవంతమైన వస్తువులలో, నేను సూర్యుడను. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట, ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.

పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే, కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు. అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా, ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు. వారే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు, విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో విష్ణువుగా, వామన స్వరూపంలో తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని, కృష్ణుడు పేర్కొంటున్నాడు. అలాగే, ప్రకాశవంతమైన వాటిలో, సూర్యుడు సర్వోన్నతుడు. రాత్రి పూట అన్ని దీపాలూ, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం, రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది. అది తన విభూతి అని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, "వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు" అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలూ, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు శ్రీ కృష్ణుడు. అయితే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా, దైత్యులకు, అంటే, అసురులుకు తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా, దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డను గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో, ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేశాడు. కానీ, అది భ్రూణములుగా మారింది. ఇవి మరుత్తులైనాయి. అంటే, ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే 49 రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి, అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు, మరీచి అని కూడా ఉంది. వాయువులలో తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

09:08 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన గురించీ, తన విభూతి గురించీ కొనసాగించిన అంశాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: