Ads

19 September, 2022

ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం! Manmadha reincarnated as Pradyumna


ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం!

మన్మథుడు మనుష్యుల మనస్సుల్లో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని, జన్మతః కలిగినవాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుక, అతని వాహనం. తియ్యటి చెరుకుగడే అతని విల్లు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే, అతని బాణాలు... వాటితో అతను ఎవరి మనస్సులనైనా మధించి వేయగలడు. అలా మనస్సును మథించేవాడు కాబట్టి, ఆయనకు మన్మథుడని పేరు. లోక కల్యాణం కోసం మన్మథుడు శివునిపై తన బాణాన్ని ప్రయోగించగా, ఆ సంగతి తెలుసుకుని, తన త్రినేత్రంతో అతడిని బూడిదచేశాడనే సంగతికూడా తెలిసిందే.. అయితే, శ్రీ హరి కుమారుడైన మన్మథుడు, శివుడి చేతిలో ఎందుకు మరణించాడు? భర్తను కోల్పోయిన రతీ దేవికి, దేవతలిచ్చిన వరం ఏమిటి? రుక్మిణీ దేవి పుత్ర శోకానికీ, మన్మథుడికీ సంబంధం ఏంటి – వంటి చారిత్రక అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QT_irVokuaQ ]

సంతానం కోసం విష్ణుమూర్తి ఒకప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుని వర ప్రభావంతో, విష్ణుమూర్తికి ఓ చక్కని కుమారుడు జన్మించాడు. అతనే మన్మథుడు. శంకరుని ప్రార్థించి, విష్ణుమూర్తి తనను ప్రార్థించలేదని, సతీదేవికి కోపం వచ్చింది. ఆ కోపంతో, శివుని అనుగ్రహంతో విష్ణుమూర్తికి జన్మించిన కుమారుడు, అదే శివుని ఆగ్రహంతో మరణిస్తాడని శపించింది. అప్పుడు విష్ణుమూర్తి సతీదేవిని ప్రార్థించాడు. మన్నించి శాపం తొలగించమన్నాడు. అప్పుడు సతీ దేవి, మరణించినప్పటికీ నీ కుమారుడు మరల జన్మిస్తాడని, విష్ణుమూర్తికి అభయం ఇచ్చింది. మన్మథుడు చూడ చక్కనివాడు. లోకంలోని అందం అంతా పోగయి, తీర్చిదిద్దినట్టుగా ఉంటాడతను. చిలుక వాహనంగా, చెరకుగడ విల్లుగా, అరవిందాది పుష్పాలు బాణాలుగాగలిగిన మన్మధుడికి, వసంతుడు చెలికాడు. మన్మథుని వామభాగం నుండి, ఓ కన్య జన్మించింది. ఆమె పేరు రతీదేవి. అయితే, కొన్ని ఆధారాల ప్రకారం, రతీ దేవి దక్ష ప్రజా పతి కుమార్తెగా కూడా చెప్పబడుతుంది. మన్మథుడు రతీ దేవిని భార్యగా స్వీకరించాడు. మన్మథకార్యం ఒక్కటే.. బ్రహ్మాదిదేవతలనేగాక, జితేంద్రియులయిన మహర్షులను కూడా మోహపెట్టి, వారిని కామాసక్తులను చేయడమే, తన కర్తవ్యం. తమను తారకాసురుడు హింసిస్తున్నప్పుడు, దేవతలంతా బ్రహ్మదేవుని సమీపించి, మొరపెట్టుకున్నారు. కాపాడమని వేడుకున్నారు. శివునికి పుట్టే కుమారుడు తప్ప, మరెవరూ తారకాసురుణ్ణి వధించలేరనీ, అంత వరకూ ఓర్పు వహించాలనీ అన్నాడు బ్రహ్మ. ఆ సమయంలో పరమనిష్ఠతో, శివుడు ఘోరతపస్సు చేస్తున్నాడు. ఆయనను వివాహం చేసుకోవాలని, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వేచి ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు, దేవతలు. అందుకే మన్మథుణ్ణి ఆశ్రయించారు.

శివుని మనస్సు పార్వతిపై లగ్నమయ్యేటట్లుగా చేయమని, మన్మథుడిని ప్రార్థించారు. శివుని మీదకు పూలబాణాలు ప్రయోగించసాగాడు. ఆ బాణాలకు శివుని ఏకాగ్రత మళ్ళి, మనస్సు చెదిరింది. తననలా చేసింది ఎవరన్నట్టుగా, కోపంతో కళ్ళు తెరచి చూశాడు శివుడు. ఎదురుగా మన్మథుడు కనిపించాడు. రెట్టించిన కోపంతో, మూడవకన్ను తెరవడంతో, మన్మథుడు బూడిదయ్యాడు. భర్త బూడిదయిపోయాడని తెలిసి, రతీదేవి విలపించింది. అతని వియోగాన్ని తట్టుకోలేక రోదించింది. అప్పుడు దేవతలు, మరణించిన మన్మథుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడని, తెలియజేశారు. ఆమెను ఓదార్చారు. కొన్నాళ్ళకు నారదుడు, రతీదేవిని సందర్శించాడు. రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుడతాడనీ, అయితే, అతన్ని శంభరాసురుడు చంపేందుకు ప్రయత్నిస్తాడనీ, చెప్పాడు. తన భర్తను కాపాడుకునేందుకు రతీదేవి భూలోకానికి విచ్చేసింది. మాయావతి పేరుతో శంభరాసురుని ఇంట చేరి, అతడికి సేవలు చేయసాగింది. కొద్దిరోజులు గడవగా, ద్వారకలో రుక్మిణీదేవికి చక్కని కుమారుడు జన్మించాడు. అతడే ప్రద్యుమ్నుడు.

నాడు శివుని మూడవకంటికి బూడిదయిన మన్మథుడు, కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తికి కుమారుడయ్యాడు. ప్రద్యుమ్నుడు జన్మించి, వారం రోజులు కూడా గడవక ముందే, ఆపద ముంచుకొచ్చింది. జటాసురుని పుత్రుడైన శంభరాసురునికి, ప్రద్యుమ్నుని కారణంగా మరణం ఉన్నదని తెలిసింది. ఆ సంగతి ఆకాశవాణి చెప్పి, శంభరాసురుడిని హెచ్చరించింది. దాంతో శంభరాసురుడు, కాకిరూపంలో రుక్మిణి ఇంట ప్రవేశించి, ప్రద్యుమ్నుని ముక్కున కరచుకుని తీసుకుపోయి, సముద్రంలో పడవేశాడు. మాగన్నులో ఉన్న రుక్మిణి, పొత్తిళ్ళలో పిల్లాడు ఉన్నాడనుకున్నది. మెలకువ తెచ్చుకుని చూసే సరికి, పిల్లవాడు లేడు. రాజ్యమంతా ప్రద్యుమ్నుని కోసం వెదకసాగారు. కానీ, ఎవరికీ దొరకలేదు. కాకి రూపంలో వచ్చిన శంభరాసురుడు, ప్రద్యమ్నుణ్ణి సముద్రంలో పడవేయగా, ఒక చేప మింగి వేసింది. దైవవశాన ఒక జాలరి వలకు చిక్కింది. వలలో చిక్కిన చేపను చూసి ముచ్చటపడ్డాడు, జాలరి. దానిని కానుకగా, రాజైన శంభరాసురునికి బహూకరించాడు. వంటవారు ఆ చేపను కోసి చూడగా, దాని కడుపులో ఉన్న బాలుణ్ణి చూసి, ఆశ్చర్యపోయారు.

అక్కడున్న మాయావతికి పిల్లాడి సంగతి చెప్పి, ఏం చేద్దామని ప్రశ్నించారు. ఆలోచనలో పడింది మాయావతి. ఈ పిల్లాడు ఎవరయి ఉంటాడంటూ, తర్జనభర్జన పడసాగింది. అప్పుడు నారదుడు వచ్చాడక్కడికి. మాయావతిగా ఉన్న రతీదేవికి జరిగిన సంగతంతా వివరించాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, నీ భర్తే అని అన్నాడు. శంభరాసురుడు సముద్రంలో పడవేస్తే, చేప మింగిందన్నాడు. రతీదేవి సంతోషించి, ప్రద్యుమ్నుణ్ణి జాగ్రత్తగా పెంచసాగింది. ప్రద్యుమ్నుడు యువకుడయ్యాక, అతనికి పూర్వగాథంతా చెప్పింది, రతీదేవి. తారకాసురుని కారణంగా అప్పుడలా విడిపోయి, ఇప్పుడిలా కలుసుకున్నామని చెప్పింది, రతీ దేవి. శంభరుని వల్ల ప్రమాదం ఉన్నదని చెప్పి, అతనికి మహామాయావిద్యను ఉపదేశించింది. ఆమె చెప్పిన విద్యను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న ప్రద్యుమ్నుడు, శంభరాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇద్దరి మధ్యా ఘోరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శంభరాసురుడు, అనేక మాయలు ప్రయోగించాడు. ఆ మాయలన్నింటినీ తను నేర్చుకున్న మహామాయావిద్యతో, తుత్తునియలు చేశాడు ప్రద్యుమ్నుడు. చివరికి శంభరాసురుణ్ణి సంహరించాడు. రాక్షస సంహారానంతరం, భార్య రతీదేవితో సహా, ఆకాశానమార్గాన ద్వారకకు పయనమయ్యాడు ప్రద్యుమ్నుడు.

సరాసరి అంతఃపురంలో దిగిన ప్రద్యుమ్నుని చూసి, చెలికత్తెలు కృష్ణుడనే అనుకున్నారు. తర్వాత అతని పక్కన ఉన్న రతీదేవిని చూసి, కాదనుకున్నారు. ప్రద్యుమ్నుని చూసి రుక్మిణీదేవి, ఆనాడు తను కోల్పోయిన బిడ్డ పెరిగి పెద్దయితే ఇంతవాడయ్యేవాడు కదా! అని అనుకున్నది. పట్టి పట్టి ప్రద్యుమ్నునిలో పోలికలను వెదకసాగింది. అప్పుడక్కడికి నారదుడూ, దేవకీవసుదేవులతో సహా శ్రీకృష్ణుడు కూడా వచ్చారు. రుక్మిణికి జరిగిన కథంతా తెలియజేశాడు, నారదుడు. ఈ కుర్రవాడు నీ కొడుకే అని నారదుడు చెప్పడంతో, రుక్మిణీ దేవి ఎంతో ఆనందించింది. వెంటనే సతీసమేతంగా ప్రద్యుమ్నుడు, తల్లిదండ్రులకూ, పెద్దలకూ నమస్కరించాడు. వారి ఆశీర్వాదాలందుకున్నాడు. అయితే, ప్రద్యుమ్నుడు, మేనమామ రుక్మి కుమార్తె అయిన రుక్మావతిని కూడా వివాహం చేసుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి మరీ, రుక్మావతిని సొంతం చేసుకున్నాడు. బావ – బావమరుదులుగా, రుక్మి, కృష్ణులకు శత్రుత్వం ఉన్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం, తెగిన బంధుత్వాన్ని కలుపుకోవడం కోసం, రుక్మావతితో ప్రద్యుమ్నుని వివాహానికి ఇరువురూ అంగీకరించారు. రుక్మావతీ ప్రద్యుమ్నులకు, ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అనిరుద్ధుడు. అతను తండ్రి తాతలు ఇరువురికీ, సరి సమానుడిగా ప్రసిద్ధిగాంచాడు.

కృష్ణం వందే జగద్గురుం!

No comments: