Ads

26 September, 2022

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?

 

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?
కీటక వేదవ్యాసుల సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేసిన భీష్ముడు!

అంపశయ్యపై ఉన్న భీష్ముడు, ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే, ఒకనాడు భీష్ముడిని చూడడానికి వచ్చిన బృహస్పతిని, ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు.. ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమమయినదని అడిగాడు. అందుకు బృహస్పతి, ఆ ఆరూ గొప్పవే కానీ, అందులో అహింస అత్యుత్తమమని చెప్పి, భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి వెళ్ళిపోయాడు. నిజంగానే అహింస అన్నింటికన్నా గొప్పదా? మరి అహింసకు సంబంధించి, భీష్ముడు చెప్పిన సత్యం ఏంటి? అహింస కారణంగా, కురుక్షేత్రంలో మరణించిన వారు ఎటువంటి లోకాలను పొందారు? అనేటటువంటి జీవిత సత్యాలను ఎరుకపరచే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Piy6yV5J-9M ]

బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు, అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో, "పితామహా! మునీశ్వరులంతా ముక్తకంఠంతో, అహింస చాలా ఉత్తమమని అంటున్నారు. అది ఎందుకంత గొప్పది?" అని అడిగాడు. అందుకు భీష్ముడు, "మనో వాక్కాయ కర్మలతో హింస, మాంసభక్షణం అనేవి చతుర్విధ ఘోర పాపాలు. మాంసభక్షణం మహాపాపంతో సమానం. అయితే, మాంసం రుచి మరిగిన వారు, దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే, మాంసభక్షణను విడిచి పెట్టడమే అహింసగా", ఆర్యులు విశ్వసించారని తెలియజేశాడు.  అందుకు వెంటనే ధర్మరాజు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. "పితామహా! మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమనీ, పైతృక క్రియను మాంసంతోనే నిర్వర్తించాలనీ పెద్దలంటారు. అలాంటప్పుడు, జంతువధ తప్పనిసరి కదా?" అని అడిగాడు. అయితే, సమాధానం తెలియజేయడానికి ముందు భీష్ముడు చిన్న చిరునవ్వి నవ్వి, "ధర్మరాజా! మాంసభక్షణను మానుకోవడం, అశ్వమేధయాగం కన్నా గొప్పది. వధించమని చెప్పడం, వధా... ఈ రెండూ మహాపాపాలు. అయితే, పితృకార్యాలలోనూ, యజ్ఞయాగాదులలోనూ, వేదం చెప్పినట్టుగా చేయడంతో, ఆ హింస వల్ల పాపం ఎంతమాత్రం అంటుకోదు. అయితే, మాంసం మీద మోజుతో, కావాలని ప్రాణుల్ని హింసిస్తే, అది మహాపాపం. తనను నమిలి మింగిన వాణ్ణి, మాంసం నమిలి మింగడం ఎప్పటికయినా జరిగి తీరుతుంది. మాంసం మహారుచిగా ఉంటుంది. అందుకే, దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని కాదనుకుని, మాంసాన్ని విసర్జించినవాడు, దేవతలతో సరిసమానుడని పెద్దల ఉవాచ.

రాళ్ళల్లోనూ, చెట్లలోనూ, మాంసం లభించదు. లభించేది ప్రాణుల వల్లనే! ప్రాణులను కత్తికో కండగా నరుకుతున్నప్పుడు, తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో, అతను అందుకు మళ్ళీ పూనుకోడు. మాంస భోజనాన్ని విడిచిపెడితే, అతనిలోని హింసా ప్రవృత్తి దానంతటదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే, ఆయురారోగ్యాలు పెరుగుతాయని, మార్కండేయాది మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే, దేవతలు రాక్షసులను అవలీలగా గెలువగలిగారు. దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ, అహింస ముందు దిగదుడుపే. నూరు సంవత్సరాలు చేసిన తపశ్చర్యా, మాంసాహారాన్ని మానుకోవడం, రెండూ ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు, దాన ధర్మాలతో, బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ, మాంసాన్ని ముట్టని వారికి, బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టని వారికి, ఆయురారోగ్య బలకీర్తులు, అనాయాసంగా లభిస్తాయని పెద్దలంటారు." అని, మాంసాహారానికి సంబంధించిన విషయాలను భీష్ముడు వివరించగా, అందుకు ధర్మరాజు, "పితామహా! మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పదనం ఉంది కదా, మరెందుకు మనుషులు మాంసాన్ని విసర్జించరు?" అని ప్రశ్నించాడు.

అప్పుడు భీష్ముడు, "ఎందుకు విసర్జించరంటే, అది మహారుచి. పైగా, దానిని తిన్నవారు, శృంగారంలో బలిమి కలిగి ఉంటారు. ఎంత దూరం నడిచినా, వారికి అలుపు రాదు. శరీరం మీది గాయాలు మానిపోతాయి. బక్కచిక్కిన వాడికి, మాంసభక్షణ పుష్టి కలిగిస్తుంది. అందుకే దానిని వదలరు. అయితే ఒక్క విషయం, ప్రాణభయం, జీవాలకన్నింటికీ ఒకటే! అందుకే, తోటి ప్రాణుల్ని దయగా చూడమంటారు. అలా చూసిన వాడు, బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు. దానం, తపస్సు, సత్యం, యజ్ఞం, శౌచం, మంత్ర తంత్రాలూ.. ఇవన్నీ అహింసా స్వరూపాలు." అని చెప్పి, భీష్ముడు ముగించాడు. అప్పుడు ధర్మరాజుకు, అహింస వలన కురుక్షేత్రంలో మరణించిన వారికి ఎలాంటి గతులు కలుగుతాయనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని భీష్ముడికి తెలియజేయగా, భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన సంవాదాన్ని, ధర్మరాజుకి తెలియజేశాడు..

రణరంగంలో రథాలు పరుగుదీస్తున్నాయి. అయితే, వాటికన్నా వేగంగా ఓ కీటకం పరుగుదీస్తూ, రథాలను దాటిపోతోంది. వేదవ్యాసుడు దానిని గమనించి, ఆ కీటకాన్ని ప్రశ్నించాడు.. "ఎందుకంత వేగం? ఏమిటి కారణం?" అని. అందుకు కీటకం కాస్త ఆగి, "ఏం చెప్పమంటావు మునీంద్రా! ఒకదాని వెనుక ఒకటిగా, రథాలు వస్తున్నాయి. రథ చక్రాల ధ్వని మారుమ్రోగుతున్నది. గుర్రాలను అదిలిస్తున్న వారి గొంతులు, మహా భీకరంగా వినవస్తున్నాయి. భయం వేస్తోంది. బ్రతుకంటే ప్రాణికి మహాసుఖం. చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేను. చనిపోవడం ఇష్టం లేదు. అందుకే విపరీతమైన వేగంతో పరుగుదీస్తున్నాను. ప్రాణభీతి కన్నా, పరమ ఆందోళనకరం ఇంకేముంది?" అని వేద వ్యాసుడి దగ్గర వాపోయింది. "నీలాంటి జీవులకూ ఇంద్రియ సుఖం ఉంటుందా? ఉన్నా అది ఏ మాత్రం? ఎప్పుడూ దుఃఖంతో ఉండే నువ్వు, బతికి ప్రయోజనం ఏముంది? చనిపోవడమే సుఖం కదా? బాగా ఆలోచించు.. నీకే అన్నీ తెలుస్తాయి." అని బోధించాడు వ్యాసుడు. అప్పుడు ఆ కీటకం, "అదేమిటి మౌనీ, అంతమాటన్నావు? పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్టుగా మాట్లాడతావేమిటి? మాకూ మా స్థాయిని బట్టి, ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. వాటిని మేము అనుభవిస్తున్నాము. కాబట్టే, చావంటే భయపడుతున్నాను. నీకీ సంగతి తెలియక కాదు. నా చేత చెప్పించాలని అడిగావు. అంతేనా?" అంది కీటకం. అందుకు వ్యాసుడు నవ్వగా, "మహామౌనీ, నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది. చెబుతాను, వింటావా?" అని అడిగింది. అందుకు వ్యాసుడు సరేనన్నాడు. 

అప్పుడు కీటకం, ‘ఓ మహాముని, గత జన్మలో నేను బాగా డబ్బున్న వాణ్ణి. అయినా, ఇంకా సంపాదించాలనే అత్యాశతో, ఇతరుల డబ్బు కూడా కాజేశాను. కోప తాపాలతోనూ, పెద్దల పట్లా, ప్రముఖల పట్లా వినయాన్ని ప్రదర్శించక, యథేచ్ఛగా తిరిగాను. అయితే, నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆమెను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి. ప్రేమగా చూసేవాణ్ణి. ఒకనాడు, ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. అతను అడిగినవన్నీ సమకూర్చి పెట్టి, దణ్ణం పెట్టాను. ఆ కారణంగానే, నాకీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మంచి చేస్తే మంచే జరుగుతుందని, నాకప్పుడు తెలిసింది. మహామౌనీ, అడుగుతున్నానని ఏమీ అనుకోక పోతే, పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు చెప్పండి. ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తోంది. చెప్పండి స్వామీ" అని అడిగింది కీటకం. అందుకు వ్యాసుడు, "ప్రత్యేకించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. పాపాలు చేశావు, పురుగుగా జన్మించావు. ఆ సంగతి నీకూ తెలుసు. అలాగే పుణ్యం చేసి, పూర్వజన్మ జ్ఞానం సంపాదించావు. ఇదీ నీకు తెలిసిందే! నీ గురించి ఇదంతా తెలిసినందువల్లే, నేను నీతో మాట్లాడాలనిపించి, మాట్లాడాను. ఇకపోతే, నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు. తపోబలాన్ని మించింది లేదు. మానవజన్మ స్వీకరించి, పుణ్యం చెయ్యి. అది నీకెంతో శుభప్రదం. పాప పుణ్యాల వల్లనే, మనిషికి గొప్ప జన్మలూ, అధమాధమ జన్మలూ ప్రాప్తిస్తున్నాయి. నువ్వు చేసిన పుణ్యం కారణంగానే, నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు, నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు. నీకిక సమున్నత స్థితి లభిస్తుంది. త్వరలోనే మానవజన్మను సాధిస్తావు. మానవజన్మలో కూడా, నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. దాంతో నీకు ధర్మతత్పరత అలవడుతుంది." అని చెప్పి, వెన్నెలంత చల్లగా, అమృతం కురుస్తున్నంత హాయిగా, ఆ కీటకాన్ని చూసి, "శుభం భూయాత్‌" అని ఆశీర్వదించాడు.

వెంటనే వ్యాసుని పాదాలను తాకి అతనికి ప్రణమిల్లి, అక్కడే ప్రాణత్యాగం చేసిందా కీటకం. వ్యాసమహర్షి ఆశీస్సులకనుగుణంగా, మరణానంతరం మానవునిగా అనేక జాతులలో జన్మించింది, ఆ కీటకం. పుణ్యకర్మలు ఆచరించి, చివరికి క్షత్రియవంశంలో వర్ధిల్లింది. రాజయింది. రాజయి, ఏనుగుపై కూర్చుని, వేలకొలదీ కొమ్ముటేనుగులతో, ఛత్రచామరాలతో, రకరకాల కేతనాలతో పరుగులుదీసే పరివారంతో, వ్యాసమహర్షిని మళ్ళీ సందర్శించింది. అతని పాదాలకు నమస్కరించి నిల్చుంది. రాజు అణకువను ఎంతగానో మెచ్చుకున్నాడు, వ్యాసుడు. అభిమానంగా అక్కున చేర్చుకుని, "రాజా! ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు. తర్వాత గోవుల కోసంగానీ, బ్రాహ్మణుల కోసంగానీ యుద్ధం చేసి, యుద్ధభూమిలో మరణిస్తే, పై జన్మలో బ్రాహ్మణత్వం సాధిస్తావు." అని అన్నాడు. అలా మహర్షి చెప్పినట్టుగానే చేశాడు, ఆ రాజు.

బ్రాహ్మణునిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలెన్నో చేశాడు. యూప స్తంభావళిని నెలకొల్పాడు. లోకారాధ్యుడయ్యాడు. మరణించి స్వర్గలోకంలో దేవేంద్రునికి మిత్రుడయ్యాడు. కొన్నాళ్ళకు కైవల్యాన్ని అందుకున్నాడు. అని ఆ కీటకం గురించి చెప్పి, ‘ధర్మరాజా! యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారోనని ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు సంగతి చెబుతున్నాను, విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ, ఉత్తమలోకాలనే పొందారు. ఈ విషయమై నీకిక ఆందోళన అనవసరం.’ అని తెలియజేశాడు భీష్ముడు.

కృష్ణం వందే జగద్గురుం!

No comments: