Ads

Showing posts with label Sri Ramanuja Charya. Show all posts
Showing posts with label Sri Ramanuja Charya. Show all posts

06 December, 2020

‘తిరుమల మూలవిరాట్టు ఎవరో నిరూపించిన’ రామానుజాచార్యులు! Part 2!


‘తిరుమల మూలవిరాట్టు ఎవరో నిరూపించిన’ రామానుజాచార్యులు! Part 2!

మమతనూ, మానవతనూ ప్రవచించిన సమతా మూర్తీ, అత్యంత దయాళుడు, వేదానికి సరైన నిర్వచనం చెప్పి, సనాతన ధర్మం గొప్పదనాన్నీ, ఆధ్యాత్మికతనూ, మానవీయ విలువలనూ.., శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం.., విశిష్టాద్వైత గొప్పదనాన్నీ ప్రచారం చేసిన మహనీయులు, శ్రీ రామానుజాచార్యులు. ఆయన సమాజంలో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణల గురించీ, విశిష్టాద్వైతానికి ఆయన చేసిన కృషి గురించీ, ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజు ఆయన జీవితంలో చిరస్మరణీయంగా నిలిచి, నేటి తరానికి సాక్ష్యంగా మిగిలిన కొన్ని సంఘటనల గురించి, తెలుసుకుందాం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/d5_mFcDNQ9o ]

కంచిలోని, యాదవ ప్రకాశుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో, గురువుతో అనేక వాదోపవాదాలు చేశారు, రామానుజులు. ఉపనిషత్తులలోని వ్యాఖ్యానాలను వివరిస్తూ, తప్పుగా బోధిస్తున్న వ్యాఖ్యానాలకు సరైన వివరణలిచ్చారు, రామానుజాచార్యులు. దాంతో, ఆయన యెక్క పాండిత్యం, ఆస్థికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం, భక్తిపూరితమైన వ్యాఖ్యానాలూ, యాదవ ప్రకాశునికి నచ్చక, ఆయనని తన శిష్యుల నుండి తొలగించిన విషయం, గత భాగంలో తెలుసుకున్నాము. రామానుజాచార్యుల మేధస్సు గురించి తెలుసుకున్న, ఆళవందార్ గా ప్రసిద్ధి చెందిన యమునాచార్యులు, ఆయనను శిష్యునిగా చేసుకోవాలని భావించారు. తన ఉద్దేశ్యాన్ని, మహాపూర్ణుడనే శిష్యుని ద్వారా, రామానుజులకు తెలియచేశారు. రామానుజులు ఆళవందార్ ను కలుసుకోవడానికి శ్రీరంగం వచ్చేసరికి, ఆయన తన ఆఖరి శ్వాసను విడిచారు. అంత్యక్రియలకు సిద్ధమైన యమునాచార్యుల కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకుని ఉండటం, రమానుజుచార్యులు గమనించారు.

ఆ మూడు వేళ్ళూ, తాను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన రామానుజులు, మూడు శపథాలను చేశారు. వైష్ణవ సంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మా, దివ్య ప్రబంధ బోధనా, శరణాగతితో కూడిన మత ప్రతిపాదనా ప్రచారం అనే విధులను, తప్పక నిర్వర్తించటం, వేదాంతానికి మూలస్తంభాల వంటి వేదాంత సూత్రాలకు, సరిక్రొత్త వ్యాఖ్యానాలు వ్రాయడం, భాగవత, విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించడం వంటి శపథాలను చేస్తుండగా, మరణించిన యమునాచార్యుల వారి ఒక్కో వ్రేలు తెరుచుకుంది. ఆ సంఘటనను చైసిన ఆయన శిష్యులు నివ్వెరపోయారు. వారిలో పెరియనంబి అనే శిష్యుడు, రామానుజులతో, తిరుక్కొట్టియూర్ లో, గోష్టిపూర్ణులనే గొప్ప పండితులున్నారు. వారి వద్ద నీవు తిరుమంత్రం, చరమశ్లోకం, అర్ధవిశేషాలను తెలుకోమని సూచించాడు.

దాంతో రామానుజులు, గోష్టిపూర్ణుల దగ్గరకు వెళ్లి, స్పష్టంగా దండ ప్రణామం చేసి, ‘ఆచార్యా! నేను మీ దాసుణ్ణి. మీ వలన తిరుమంత్రం, చరమశ్లోకాలను ఉపదేశంగా పొందాలని వచ్చాను. ఆశీర్వదించండి’ అన్నారు. అతని వినయసంపదకు గోష్టిపూర్ణులు ఎంతో ఆనందపడ్డారు. మంత్రం కోసం వచ్చిన రామానుజులు నిజంగా తపనతో, ఆర్తితో వచ్చాడా, లేక అందరిలా మంత్రోపదేశం పొందడానికి వచ్చాడా? అత్యంత ఆర్తిలేని వారికి, పరమ పవిత్రమైన మంత్రాన్ని ఉపదేశించకూడదనుకుని, 'రామానుజ! ఆ మంత్రోపదేశానికి కొన్ని అర్హతలుండాలి. అవి నీలో ఉన్నాయో లేదో చూసి, అప్పుడు మంత్రోపదేశం చేస్తానని అన్నారు, గోష్టిపూర్ణులు. అలా అయన పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలబడి, గురువు వద్ద నుండి మంత్రోపదేశం పొందారు, రామానుజలు. దివ్యమంత్రోపదేశంతో పులకించిపోయింది, రామానుజుల దేహం. అయన ముఖ పద్మం, మంత్ర భాస్కర కాంతులతో ప్రఫుల్లమైంది. తరువాత నెమ్మదిగా లేచి, ఆచార్యులకు నమస్కరించి, బయలుదేరారు.

మార్గ మధ్యలో, ఇంత ఆర్తితో ఉన్న నాకు, ఈ మంత్రం లభించడం ఇంత కష్టమైతే, మిగిలిన వారు ఈ దివ్య మంత్రాన్ని పొందడం వీలు పడదు కదా? అని ఆలోచించారు. వెంటనే తన గురువు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని, శ్రీరంగం లోని తిరుకొట్టియూర్ ఆలయ రాజగోపురం పైకెక్కి, అందరికీ వినబడేలా బిగ్గరగా ఉపదేశించాడు. దాంతో, గురువు అక్కడకు చేరుకుని, ఈ మంత్రాన్ని బహిరంగంగా చెబితే, 'నీవు నరకానికి వెళతావు' అని అనగా, అందుకు రామానుజులు, దీనిని తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ, స్వర్గానికి వెళతారు. అది చాలు నాకు. అని బదులిచ్చారు. తరువాత కాలంలో ఒకనాడు, తిరుమలలోని మూలవిరాట్టైన ధ్రువబేరం, విష్ణుమూర్తి విగ్రహం కాదనీ, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చన్న వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు, శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి, వాదించారు. 

తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపు చేయించి, శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా, ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు, యాదవరాజు కొలువుకు వెళ్ళి, వాదించారు. శైవులతో జరిగిన వాదనలో, పలు పౌరాణిక ఆధారాలనూ, శాస్త్ర విధానాలనూ సాక్ష్యాలుగా చూపి, వారిని ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారని, రామానుజులు, వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట, బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలూ, శైవాయుధాలూ, శక్తి ఆయుధాలూ పెట్టి, నీవు ఏ దైవానివైతే, ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి, తలుపులు మూసేసారు. ఆ రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ గడవగా, తెల్లవారిన తరువాత, తలుపులు తెరిచి చూసే సరికి, ధ్రువబేరానికి శంఖ చక్రాలు అలంకరించి కనిపించాయి. 

ఆ సంఘటనతో, తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని నిర్ధారణై, తిరుమలపై వైష్ణవ ఆరాధనలు కొనసాగించడానికి, యాదవరాజు అంగీకరించారు. తిరుమలలో, కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు, రామానుజులు, ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. అదే, తర్వాతి కాలంలో, జీయర్ల వ్యవస్థగా పరిణమించి, స్థిరపడింది. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది, రామానుజులు. యాదవరాజు, ఆ ఆలయం చుట్టూ, ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి, తన గురువుగా భావించే రామానుజుని పేరిట ‘రామానుజపురంగా’, దానిని రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు, తాను పాంచరాత్రాగమాన్ని పాటించే వ్యక్తయినా, తిరుమలలో పరంపరాగతంగా వస్తోన్న వైఖానస ఆగమాన్ని, కొనసాగించారు. అయితే, అప్పటికున్న వైదికాచారాలతో పాటుగా, కొన్ని ద్రవిడ వేదాలనూ, పాంచరాత్రాగమ ఆచారాలనూ, తిరుమల అర్చనా విధానంలో చేర్చారు.

Link: https://www.youtube.com/post/UgxNh1WW33dJNiRuZOV4AaABCQ

29 November, 2020

శ్రీరంగం ఆలయంలో వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దేహం!


వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దేహం! 

వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ క్షేత్రం, శ్రీరంగం. అక్కడ విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు, మన పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఏడు ప్రాకరాలతో, ప్రపంచంలో అత్యంత పెద్ద ఆలయంగా పేరుగాంచిన శ్రీరంగంలో, ఎన్నో అద్భుతాలు నెలకొని ఉన్నాయి. వాటిలో ఒకటి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించిన రామానుజాచార్యుల వారి దివ్య దేహం. వెయ్యేళ్ల నాటి శరీరం ఇంకా భద్రంగా ఉందా? రామానుజాచార్యుల వారి విశిష్ఠతలేంటి, ఆయన చరిత్రేంటి? శ్రీరంగంలో ఉన్న ఆయన దివ్య శరీరం వెనుక దాగిన రహస్యం ఏంటి? అనే విషయాలు, 2 భాగాలలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ag0Uayj7C-c ]

రామానుజాచార్యుల వారి జననం ఒక అద్భుతం. ఆయన శ్రీహరి వర ప్రసాదం. మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ పెరుంబుదూరులో, 'సర్వక్రతు' ఆసూరి కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అనే పుణ్యదంపతులకు జన్మించారు. తండ్రి కేశవ సోమయాజులు, వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి, 'సర్వక్రతు' అనే బిరుదును పొందారు. కేశవులకు చాలా ఏళ్ల పాటు సంతానం కలుగలేదు. అందుకు భార్య కాంతిమతితో కలిసి, తిరువల్లిక్కేణి ఒడ్డున ఉన్న పార్ధనారాయణ స్వామి దేవాలయంలో, పుత్ర కామేష్ఠి యాగం చేసి, స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. అంతటి గొప్ప శేషాంశ సంభూతులు రామానుజాచార్యులు. ఈయన సామన్య శకం 1017 ఏప్రిల్ 13 న జన్మించారు. రామానుజాచార్యులు పుట్టిన రాశి, దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ రాశులతో సరిపోవడం వల్ల, రాముని అనుజులు అనే అర్థంతో, రామానుజ అని నామకరణం చేశారు. 

ఆయన  మేనమామ అయిన పెరియ తిరుమలనంబి, బాలుడి శరీరంపై ఉన్న పవిత్రమైన గుర్తులను చూసి, ఈ శిశువు ఆది శేషుని అవతారమని భావించి, 'ఇళయపెరుమాళ్' అనే నామధేయంతో పిలిచేవాడు. రామానుజాచార్యులవారికి, పదహారవ ఏట తంజమ్మాళ్ తో వివాహం జరిగింది. వివాహానంతరం, తండ్రి కేశవ సోమయాజులు పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, రామానుజాచార్యుల వారు, కాంజీపురానికి తరలివెళ్ళారు. అక్కడ పేరుపొందిన యాదవ ప్రకాశుడనే గురువు వద్ద, విద్యాభ్యాసం చేయసాగారు, రామానుజాచార్యులు. కానీ, యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు, అకర్మికమూ, అనాస్తికములుగా ఉండటంతో, ఆయనతో తరచూ, వాగ్వాదానికి దిగేవారు రామానుజులు. బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలనూ, తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని, యాదవ ప్రకాశులతో వాదించేవారు. ఆ కారణంగా, రామానుజాచార్యుని తన శిష్యులలో నుండి తొలగించారు యాదవ ప్రకాశులు. రామానుజాచార్యులపై పెంచుకున్న అమిత ద్వేషంతో, ఆయనను హతమార్చడానికి కూడా ప్రయత్నించారు, గురువైన యాదవ ప్రకాశులు. 

రామానుజులు తమ జీవితకాలంలో, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లోని మూర్తులను, విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలూ, పరిపాలన పద్ధతులనూ ఏర్పరచడం వంటి గొప్ప కార్యాలను చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం, తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. శ్రీ రామానుజాచార్యులు, గీతాభాష్యమూ, తర్కభాష్యమూ, వేదార్ధ సంగ్రహమూ, న్యాయామృతమూ, వేదాంత ప్రదీపమూ, వేదాంత తత్వసారమూ, నారదీయ పంచరాత్రాగమమూ, రంగనాధ స్తవమూ, గద్యత్రయమూ వంటి పెక్కు స్వరూప గ్రంధాలను రచించారు. రామానుజాచార్యులు, విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్తా, హేతువాదీ, యోగి. త్రిమతాచార్యులలో ద్వితీయులు, రామానుజాచార్యులు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయలన్నీ, అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఇవన్నీ దేవుడిని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలేకానీ, వైదికమతానికి బదులుగా పఠించవలసినవికాదనీ నిరూపించారు. ఆదిశంకరుని అద్వైత సిద్దాంతానికి మరిన్ని సొగసులద్ది, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వేదవ్యాసుని అభిమతానికనుగుణంగా, బ్రహ్మసూత్రానికి పరిపూర్ణ వ్యాఖ్యగా, శ్రీ భాష్యాన్ని అందించిన శ్రీ సాంప్రదాయ ప్రవర్తకులు, రామానుజాచార్యులు.

'గతులన్నీ ఖిలమైన కలియుగమందున, గతి ఈతడే చూపె, ఘన గురుదైవము' అన్న అన్నమాచార్య కీర్తనకు సరితూగగలిగిన వారు, ఆసూరి రామానుజాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచార కర్తగా, ఎంతో కృషి చేసిన రామానుజులు, 120 ఏళ్లు జీవించారు. సామాన్యశకం 1137లో, రామానుజాచార్యులు, శ్రీరంగంలో తన దేహాన్ని విడిచి, శ్రీహరిలో ఐక్యమయ్యారు. అయన ఆత్మ ఈ లోకాన్ని వదిలినా, ఆయన దేహం మాత్రం, నేటికీ దర్శనమిస్తోంది. సుమారు వెయ్యేళ్ల నాటి ఆయన శరీరం, నేటికీ దేదీప్యమానంగా, శ్రీరంగ ఆలయంలోని 4 వ ప్రాకరంలో, కొలువుదీరి ఉంది. ఆయన శరీరానికి ప్రత్యేక లేపనాలద్ది భద్రపరిచారు. ఈ ఆలయాన్ని కోన్ని కోట్ల మంది దర్శించినా, అది రామానుజాచార్యుల వారి దివ్య శరీరం అన్న విషయం, కొంతమందికి మాత్రమే తెలుసు. పద్మాసనంలో, యోగ భంగిమలో కూర్చున్న రామానుజులు, వారి శ్వాసనూ, శరీరాన్ని అక్కడే విడిచిపెట్టారు. ఆ దివ్యశరీరం నేటికీ మనకు గోచరిస్తుంది. 

ప్రతీ ఏటా, రెండు సార్లు, రామానుజాచార్యుల వారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలోనే, ఆయన శరీరానికి కర్పూరం, కుంకుమ పువ్వులనూ ముద్దగా నూరి పూస్తారు. అందుకే, ఆయన శరీరం ఎర్రని వర్ణంలో, విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంటుంది. హారతినిచ్చే సమయంలో, ఆయన కళ్లూ, గోళ్లను, మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనం లేని ఆ భాగాలు, హారతి వెలుగుల్లో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. నేటికీ ఆయన శరీరం, ఆలయంలో శోభాయమానంగా ఉండడం విశేషం. బౌద్ధ సన్యాసి విగ్రహంలో బయటపడ్డ అస్థిపంజరం, గోవాలో భద్రపరచబడిన క్రైస్తవ ప్రచారకుడైన జేవియర్ శరీరం వంటివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా, వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దివ్య శరీరం, నేటికీ, ఏ ప్రచారమూ లేకుండా, రహస్యంగానే మిగిలిపోయింది. ఇకపై శ్రీరంగం దర్శించే భక్తులు, తప్పనిసరిగా, రామానుజాచార్యుల వారి పవిత్ర దేహాన్ని దర్శించండి..

రామానుజాచార్యులు చేసిన సంఘ సంస్కరణలూ, ఆయన చేసిన గొప్ప కార్యాలూ, మానవాళికిచ్చిన అద్భుత సందేశాలూ, మన తదుపరి వీడియోలో తెలియపరుస్తాను..

Link: https://www.youtube.com/post/UgwAgKbCxmOjq19AaCt4AaABCQ