Ads

29 November, 2020

శ్రీరంగం ఆలయంలో వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దేహం!


వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దేహం! 

వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ క్షేత్రం, శ్రీరంగం. అక్కడ విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు, మన పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఏడు ప్రాకరాలతో, ప్రపంచంలో అత్యంత పెద్ద ఆలయంగా పేరుగాంచిన శ్రీరంగంలో, ఎన్నో అద్భుతాలు నెలకొని ఉన్నాయి. వాటిలో ఒకటి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించిన రామానుజాచార్యుల వారి దివ్య దేహం. వెయ్యేళ్ల నాటి శరీరం ఇంకా భద్రంగా ఉందా? రామానుజాచార్యుల వారి విశిష్ఠతలేంటి, ఆయన చరిత్రేంటి? శ్రీరంగంలో ఉన్న ఆయన దివ్య శరీరం వెనుక దాగిన రహస్యం ఏంటి? అనే విషయాలు, 2 భాగాలలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ag0Uayj7C-c ]

రామానుజాచార్యుల వారి జననం ఒక అద్భుతం. ఆయన శ్రీహరి వర ప్రసాదం. మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ పెరుంబుదూరులో, 'సర్వక్రతు' ఆసూరి కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అనే పుణ్యదంపతులకు జన్మించారు. తండ్రి కేశవ సోమయాజులు, వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి, 'సర్వక్రతు' అనే బిరుదును పొందారు. కేశవులకు చాలా ఏళ్ల పాటు సంతానం కలుగలేదు. అందుకు భార్య కాంతిమతితో కలిసి, తిరువల్లిక్కేణి ఒడ్డున ఉన్న పార్ధనారాయణ స్వామి దేవాలయంలో, పుత్ర కామేష్ఠి యాగం చేసి, స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. అంతటి గొప్ప శేషాంశ సంభూతులు రామానుజాచార్యులు. ఈయన సామన్య శకం 1017 ఏప్రిల్ 13 న జన్మించారు. రామానుజాచార్యులు పుట్టిన రాశి, దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ రాశులతో సరిపోవడం వల్ల, రాముని అనుజులు అనే అర్థంతో, రామానుజ అని నామకరణం చేశారు. 

ఆయన  మేనమామ అయిన పెరియ తిరుమలనంబి, బాలుడి శరీరంపై ఉన్న పవిత్రమైన గుర్తులను చూసి, ఈ శిశువు ఆది శేషుని అవతారమని భావించి, 'ఇళయపెరుమాళ్' అనే నామధేయంతో పిలిచేవాడు. రామానుజాచార్యులవారికి, పదహారవ ఏట తంజమ్మాళ్ తో వివాహం జరిగింది. వివాహానంతరం, తండ్రి కేశవ సోమయాజులు పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, రామానుజాచార్యుల వారు, కాంజీపురానికి తరలివెళ్ళారు. అక్కడ పేరుపొందిన యాదవ ప్రకాశుడనే గురువు వద్ద, విద్యాభ్యాసం చేయసాగారు, రామానుజాచార్యులు. కానీ, యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు, అకర్మికమూ, అనాస్తికములుగా ఉండటంతో, ఆయనతో తరచూ, వాగ్వాదానికి దిగేవారు రామానుజులు. బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలనూ, తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని, యాదవ ప్రకాశులతో వాదించేవారు. ఆ కారణంగా, రామానుజాచార్యుని తన శిష్యులలో నుండి తొలగించారు యాదవ ప్రకాశులు. రామానుజాచార్యులపై పెంచుకున్న అమిత ద్వేషంతో, ఆయనను హతమార్చడానికి కూడా ప్రయత్నించారు, గురువైన యాదవ ప్రకాశులు. 

రామానుజులు తమ జీవితకాలంలో, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లోని మూర్తులను, విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలూ, పరిపాలన పద్ధతులనూ ఏర్పరచడం వంటి గొప్ప కార్యాలను చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం, తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. శ్రీ రామానుజాచార్యులు, గీతాభాష్యమూ, తర్కభాష్యమూ, వేదార్ధ సంగ్రహమూ, న్యాయామృతమూ, వేదాంత ప్రదీపమూ, వేదాంత తత్వసారమూ, నారదీయ పంచరాత్రాగమమూ, రంగనాధ స్తవమూ, గద్యత్రయమూ వంటి పెక్కు స్వరూప గ్రంధాలను రచించారు. రామానుజాచార్యులు, విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్తా, హేతువాదీ, యోగి. త్రిమతాచార్యులలో ద్వితీయులు, రామానుజాచార్యులు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయలన్నీ, అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఇవన్నీ దేవుడిని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలేకానీ, వైదికమతానికి బదులుగా పఠించవలసినవికాదనీ నిరూపించారు. ఆదిశంకరుని అద్వైత సిద్దాంతానికి మరిన్ని సొగసులద్ది, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వేదవ్యాసుని అభిమతానికనుగుణంగా, బ్రహ్మసూత్రానికి పరిపూర్ణ వ్యాఖ్యగా, శ్రీ భాష్యాన్ని అందించిన శ్రీ సాంప్రదాయ ప్రవర్తకులు, రామానుజాచార్యులు.

'గతులన్నీ ఖిలమైన కలియుగమందున, గతి ఈతడే చూపె, ఘన గురుదైవము' అన్న అన్నమాచార్య కీర్తనకు సరితూగగలిగిన వారు, ఆసూరి రామానుజాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచార కర్తగా, ఎంతో కృషి చేసిన రామానుజులు, 120 ఏళ్లు జీవించారు. సామాన్యశకం 1137లో, రామానుజాచార్యులు, శ్రీరంగంలో తన దేహాన్ని విడిచి, శ్రీహరిలో ఐక్యమయ్యారు. అయన ఆత్మ ఈ లోకాన్ని వదిలినా, ఆయన దేహం మాత్రం, నేటికీ దర్శనమిస్తోంది. సుమారు వెయ్యేళ్ల నాటి ఆయన శరీరం, నేటికీ దేదీప్యమానంగా, శ్రీరంగ ఆలయంలోని 4 వ ప్రాకరంలో, కొలువుదీరి ఉంది. ఆయన శరీరానికి ప్రత్యేక లేపనాలద్ది భద్రపరిచారు. ఈ ఆలయాన్ని కోన్ని కోట్ల మంది దర్శించినా, అది రామానుజాచార్యుల వారి దివ్య శరీరం అన్న విషయం, కొంతమందికి మాత్రమే తెలుసు. పద్మాసనంలో, యోగ భంగిమలో కూర్చున్న రామానుజులు, వారి శ్వాసనూ, శరీరాన్ని అక్కడే విడిచిపెట్టారు. ఆ దివ్యశరీరం నేటికీ మనకు గోచరిస్తుంది. 

ప్రతీ ఏటా, రెండు సార్లు, రామానుజాచార్యుల వారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలోనే, ఆయన శరీరానికి కర్పూరం, కుంకుమ పువ్వులనూ ముద్దగా నూరి పూస్తారు. అందుకే, ఆయన శరీరం ఎర్రని వర్ణంలో, విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంటుంది. హారతినిచ్చే సమయంలో, ఆయన కళ్లూ, గోళ్లను, మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనం లేని ఆ భాగాలు, హారతి వెలుగుల్లో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. నేటికీ ఆయన శరీరం, ఆలయంలో శోభాయమానంగా ఉండడం విశేషం. బౌద్ధ సన్యాసి విగ్రహంలో బయటపడ్డ అస్థిపంజరం, గోవాలో భద్రపరచబడిన క్రైస్తవ ప్రచారకుడైన జేవియర్ శరీరం వంటివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా, వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దివ్య శరీరం, నేటికీ, ఏ ప్రచారమూ లేకుండా, రహస్యంగానే మిగిలిపోయింది. ఇకపై శ్రీరంగం దర్శించే భక్తులు, తప్పనిసరిగా, రామానుజాచార్యుల వారి పవిత్ర దేహాన్ని దర్శించండి..

రామానుజాచార్యులు చేసిన సంఘ సంస్కరణలూ, ఆయన చేసిన గొప్ప కార్యాలూ, మానవాళికిచ్చిన అద్భుత సందేశాలూ, మన తదుపరి వీడియోలో తెలియపరుస్తాను..

Link: https://www.youtube.com/post/UgwAgKbCxmOjq19AaCt4AaABCQ

No comments: