దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?
'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 33 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bPRR1Z8dsUs ]
శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..
00:42 - అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।
అక్షరములలో అ-కారమునూ, సమాసములలో ద్వంద్వ సమాసమునూ, అపరిమితమైన కాలమునూ, మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే.
సంస్కృతములో అన్ని అక్షరములు కూడా, సగం అక్షరాన్ని, "అ" కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. కాబట్టి, అ-కారము అనేది, సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యతగలది. "అ" అనేది, అక్షరమాలలో మొదటి అచ్చు. అంతేకాక, అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి, "అ" అనేది మొట్టమొదటే వచ్చే అక్షరం. సంస్కృతమనేది చాలా ప్రాచీనమైన భాషే అయినా, అది అత్యంత నాగరికమైనది, మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో, రెండు కానీ, అంతకంటే ఎక్కువ కానీ పదాలు, వాటి చివరలు కోల్పోతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ 2) బహువ్రీహి ౩) కర్మ ధారయ 4) తత్పురుష 5) ద్విగు 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది. ఎందుకంటే, రెండు పదాలకీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలు కలిపితే, మూడవ పదానికి అర్థం ఇస్తుంది. సృష్టి అనేది అత్యత్భుతమైనది, మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా, సృష్టితో పోల్చితే, అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తునూ తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరు సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడని, శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.
02:38 - మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।
సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా, నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తినీ, సిరిసంపదనూ, చక్కటి వాక్కునూ, జ్ఞానశక్తినీ, మేధస్సూ, ధైర్యము మరియు క్షమాగుణమును.
పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవమూ తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది. అందుకే, “dead end” అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా, వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడతాయి, మరికొన్ని గుణములు, పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడతాయి. నిజానికైతే, అసలు ఈ రెండు రకాల గుణములూ కలిగి ఉండటమే, సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమనే లక్షణములు, స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఇందులో మొదటి మూడు గుణములూ, బాహ్యంగా వ్యక్తమవుతాయి. అలాగే, తరువాతి నాలుగూ, ఆంతరంగముగా వ్యక్తమవుతాయి. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి, ఇరవై నాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. వారు కీర్తి, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ. శ్రీ అనే ఆమె, భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె, బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా, ఈ ఏడుగురు స్త్రీలూ, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.
04:41 - బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।
సామ వేద మంత్రములలో నేనే బృహత్సామమని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాగములో మార్గశీర్ష మాసమునూ, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువునూ నేనే.
ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు సామవేదములో తానే, శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును, అని అంటున్నాడు. సాధారణంగా దీనిని, మధ్యరాత్రి సమయంలో పాడతారు. సంస్కృత భాష, ఇతర భాషలలో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస, మరియు ఛందస్సూ కలిగి ఉంది. వేదాలలోని శ్లోకాలు, ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు, చాలా ఆకర్షణీయమయినది, మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము, గాయత్రీమంత్రము. మార్గశీర్షమనేది, హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో, ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు, లేదా మరీ అంత చల్లగానూ ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది జనులకు చాలా ఇష్టమైన నెల. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు. ప్రకృతి ఆహ్లాదకరంగా, తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వంసత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు, భగవంతుని యొక్క విభూతిని చక్కగా వ్యక్తీకరిస్తుంది.
06:29 - ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।
మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమునూ, ధర్మపరాయణులలో సద్గుణమునూ నేనే.
శ్రీ కృష్ణుడు, సద్గుణాలే కాక, దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదమనేది, ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు. అది కుటుంబాలనూ, వ్యాపారాలనూ, జీవితాలనూ నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్టురుడి బలహీనతే, మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే, అది హానికరం కాదా? మరి అది ఎందుకు నిషేధించబడింది - అంటే, దానికి సమాధానం, భగవంతుడు తన శక్తిని జీవాత్మకు ప్రసాదిస్తాడు. దానితో పాటుగా, నచ్చిన పనిని చేయటానికీ, ఎంచుకోవటానికీ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. మనం ఆయనను మరచిపోవటం ఎంచుకుంటే, మరచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని, ఇంటిని వెచ్చబరచటానికీ, లేదా చల్లబరచటానికీ, రెంటికీ వాడుకోవచ్చు. ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో, వినియోగదారుడి ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా, లేదా దుర్వినియోగం చేసినా సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలూ, సామర్ధ్యమూ ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకను దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికీ విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు, దృఢ సంకల్పమనే గుణానికి, ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా, భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలూ, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు ధృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవని గమనించాలి.
08:40 - వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।
వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని, మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడనని తెలుసుకొనుము, మరియు, గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.
శ్రీ కృష్ణ భగవానుడు, భూ-లోకంలో వృష్ణి వంశములో, వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మ అయినా, భగవంతుడి కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే, పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులైన యుధిష్టిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు, సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు, మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించినవాడు. వేద వ్యాసుడు, మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు "బాదరాయణుడు", మరియు "కృష్ణ ద్వైపాయనుడు" అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేశాడు, మరియు ఎన్నో పురాణాలను, మానవుల సంక్షేమం కోసం వ్రాశాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే.. అలాగే, శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో ఒకడిగా, వేద వ్యాసుడు పేర్కొనబడ్డాడు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని. నీతి, ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో, ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులను తన శిష్యులుగా చేసుకుని, వారి పురోగతికై దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రావీణ్యం వలన, ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.
10:22 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!