Ads

14 September, 2022

జ్ఞాన దీపం! భగవద్గీత Enlightenment - Bhagavad Gita


జ్ఞాన దీపం! భగవంతుడిని మనం ఎందుకు చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (11 – 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tm0zK9cT8kk ]

అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

00:49 - తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థొ జ్ఞానదీపేన భాస్వతా ।। 11 ।।

వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.

అజ్ఞానమనేదానిని మనం చీకటితో పోల్చుతుంటాము. కానీ, భగవంతుడు ఉదహరించే ఈ జ్ఞాన దీపము వేరు. ప్రస్తుతం మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, అన్నీ కూడా ప్రాకృతికమైనవే.. కానీ భగవంతుడు దివ్యమైనవాడు. కాబట్టి, మనం ఆయనను చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము, లేదా ఆయనతో ఏకమవ్వలేకున్నాము. భగవంతుడు తన కృపను ప్రసాదించినప్పుడు, తన దివ్యమైన యోగమాయా శక్తిని, ఆ జీవాత్మపై కరుణిస్తాడు. దానినే, శుద్ధ సత్త్వమని అంటారు. ఇది మాయా సత్త్వ గుణము కంటే వేరైనది. మనకు ఆ శుద్ధ సత్త్వ గుణ శక్తి లభించినప్పుడు, మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, దివ్యమైనవిగా అయిపోతాయి. దీనినే సరళంగా చెప్పాలంటే, ఆయన కృప చేత, భగవంతుడు తన దివ్యమైన ఇంద్రియములనూ, దివ్య మనస్సునూ, మరియు దివ్య బుద్ధినీ, ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు. ఈ దివ్య ఉపకరణాలను కలిగి ఉన్న పిదప, ఆ జీవాత్మ భగవంతుడిని చూడగలుగుతుందీ, భగవంతుడిని వినగలుగుతుందీ, మరియు భగవంతునితో ఏకమవ్వగలుగుతుంది. కాబట్టి, వేదాంత దర్శనం పేర్కొన్నట్టు, భగవంతుని కృప ద్వారానే, ఎవరికైనా దివ్య జ్ఞానము కలుగుతుంది. శ్రీ కృష్ణుడి యొక్క దివ్య శక్తి యే, ఆ జ్ఞాన దీపము. భగవంతుని దివ్య శక్తి యొక్క కాంతిచే, భౌతిక శక్తి యొక్క చీకటి పటాపంచలై పోతుంది.

02:30 - అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ ।। 12 ।।

02:49 - ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన, పవిత్రమొనర్చే వాడవూ, నిత్య సనాతన భగవంతుడవూ, ఆది పురుషుడవూ, జన్మ రహితుడవూ, మరియు అత్యున్నతమైన వాడవూ. మహర్షులైన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, మరియు వ్యాసుడి వంటివారు, ఇది చాటిచెప్పారు. ఇప్పుడు స్వయముగా, నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

భగవంతుడి మాటలను విన్న తరువాత, అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయిపై, సంపూర్ణ నమ్మకం కలిగింది. మరియు, తనలో ఇప్పుడు కలిగిన ధృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెబుతారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే, అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడూ, అసితుడూ, దేవలుడూ మరియు వ్యాసుడి వంటి వారు, శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు, మరియు సర్వ కారణ కారకుడని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో, ఒక పద్యంలో ఎంతో మంది, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. "శ్రీ కృష్ణుడే సర్వ జగత్తులకూ సృష్టికర్త, మరియు అందరి మదిలోని భావాలనూ ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరు దేవతలకూ ప్రభువ"ని, నారదుడు స్తుతించాడు. "శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం, మరియు నియమనిష్ఠల సారం. ఆయనే, సమస్తమునకూ భూత, వర్తమాన, భవిష్యత్తు" అని, మార్కండేయ మహర్షి వివరించాడు. "ఆయన దేవ దేవుడు, మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపమ"ని, భృగు మహర్షి పేర్కోన్నాడు. "ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువువు, నీవే ఇంద్రుడికీ, మరియు ఇతర దేవతలకూ శక్తిని ప్రసాదించావు" అని వేద వ్యాసుడు వెల్లడించాడు. ఇంకా ఎందరో మహర్షులు, కృష్ణ భగవానుడిని స్తుతించారు. ఆ మహోన్నతమైన, ప్రామాణికమైన మహాత్ములను ఊటంకిస్తూ అర్జునుడూ, ఇప్పుడు శ్రీ కృష్ణుడే, సర్వ కారణ కారకుడనని చెప్పటం ద్వారా, స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు.

05:14 - సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ।। 14 ।।

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యధార్థ స్వరూపమును తెలుసుకోలేరు.

శ్రీ కృష్ణుడి దివ్య వైభవమునూ, మరియు అనంతమైన ఔన్నత్యమునూ, క్లుప్తముగా, శ్రద్ధతో విన్న పిదప, అర్జునుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీ కృష్ణుడు ఇంకా తన వైభవములు చెప్పాలనీ, తనకు పూర్తి విశ్వాసం కలిగిందనీ, భగవంతునికి నమ్మిక కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు చెప్పినదంతా యధార్ధమనీ, ఎటువంటి ఊహాకల్పిత వివరణా కాదనీ వక్కాణిస్తున్నాడు, అర్జునుడు. ‘భగవాన్’ అంటే, శక్తీ, జ్ఞానమూ, సౌందర్యమూ, యశస్సూ, ఐశ్వర్యమూ, మరియు వైరాగ్యమనే ఈ ఆరు ఐశ్వర్యములనూ, అనంతమైన మాత్రంలో కలిగి ఉన్న వాడని అర్ధం. దేవతలూ, దానవులూ, మానవులూ, వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు సంపూర్ణ భగవత్ తత్త్వాన్ని తమంత తాము తెలుసుకోలేరు.

06:27 - స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ।। 15 ।।

ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయిన వాడా.. సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే! నిజానికి, నిన్ను నీవు మాత్రమే, నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.

శ్రీ కృష్ణుడు సర్వోత్కృుష్ట పరమ పురుషోత్తముడని వక్కాణిస్తూ, అర్జునుడు ఆయనను అలా సంబోధిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది. "భగవంతుడిని ఎన్నటికీ అధిగమించలేము; ఆయన అన్నింటికీ అతీతుడు." భగవంతుడు ఎవ్వరి చేతనూ తెలుసుకోబడలేడని, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడింది. ఇది స్పష్టంగా తర్కబద్ధమైనదే. సమస్త జీవులూ, పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. కానీ, భగవంతుడు అనంతమైనవాడు. కాబట్టి, ఆయన వారి బుద్ధి పరిధికి అతీతమైనవాడు. ఇది ఆయనను ఏమీ తక్కువ చేయదు సరికదా, ఆయనను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, తుదకు భగవంతుడేమిటో తెలిసినవాడొక్కడున్నాడు.. అతను స్వయానా భగవంతుడే. ఈ విధంగా, శ్రీ కృష్ణుడికి మాత్రమే, తానెవరో, తానేమిటో తెలుసు. ఒకవేళ తానే తన శక్తులను ఏదేని జీవాత్మకు ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ కూడా, ఆయనను తెలుసుకోగలుగుతుంది.

07:57 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఎలా స్మరిస్తూ ఉండాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: