Ads

07 September, 2022

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు? Bhagavadgita

 

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/YCh5RGla9Fo ]

సమస్త జనులూ ఏ విధంగా అవతరించారో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:44 - మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ।। 6 ।।

సప్త ఋషులూ, వారి పూర్వం నలుగురు మహాత్ములూ, పద్నాలుగు మనువులూ – వీరందరూ, నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే, ఈ లోకంలోని సమస్త జనులూ అవతరించారు.

తానే విశ్వములోని సమస్త వస్తు విషములకూ ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెబుతున్నాడు, శ్రీ కృష్ణుడు. ఇంతకు ముందు ఇరవై గుణస్వభావాలను పేర్కొన్నాడు. ఇప్పుడిక ఇరవై ఐదు ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే – ఏడుగురు ఋషులూ, నలుగురు అత్యున్నత మహాత్ములూ; పద్నాలుగు మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వము యొక్క వంశపారంపర్య విధానాన్ని కూడా, క్లుప్తంగా చెప్పాడు.

బ్రహ్మదేవుడు, విష్ణు మూర్తి యొక్క హిరణ్యగర్భ శక్తి నుండి జన్మించాడు. బ్రహ్మ నుండి నలుగురు మాహాత్ములు జనించారు – వారే, సనక, సనందన, సనత, సనాతనులు. వీరినే నలుగురు కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో, ఈ నలుగురు కుమారులు, బ్రహ్మ దేవునికి అందరి కంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మ దేవుని మనస్సు నుండే జన్మించారు కాబట్టి, వారికి తల్లి లేదు. వారు నిత్య ముక్తులైన జీవాత్మలు, మరియు యోగ శాస్త్రములో నిష్ణాతులు కాబట్టి, ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి, వారికి శక్తి ఇవ్వబడింది. కుమార ఋషుల తరువాత, సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రీ, పులస్త్యా, పులహా, క్రతూ మరియు వశిష్టులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత పద్నాలుగు మనువులు వచ్చారు. స్వాయంభువా, స్వారోచిషా, ఉత్తమా, తమసా, రైవతా, చక్షుషా, వైవస్వతా, సవర్ణీ, దక్షసావర్ణీ, బ్రహ్మసావర్ణీ, ధర్మసావర్ణీ, రుద్ర-పుత్రా, రోచ్యా మరియు భావుత్యక. వారికి మనష్య జాతిని దేవతాలోకాల నుండి నిర్వహించే, మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాము. అందుకే,  ఈ కాలాన్ని వైవస్వత మన్వంతరము అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో, ఇంకా ఏడుగురు మనువులు ఉంటారు. విశ్వమును నిర్వహించటానికి, దేవ లోకాలలో చాలా మంది దేవతలు ఉంటారు. వీరందరూ, బ్రహ్మ యొక్క పుత్రులు, మనుమలు.. ‘బ్రహ్మ’ విష్ణు మూర్తి నుండి పుట్టాడు. విష్ణు మూర్తి కూడా, శ్రీ కృష్ణుని యొక్క అబేధమైన స్వరూపమే. కాబట్టి, శ్రీ కృష్ణుడే అందరు మూల పురుషులకూ మూల పురుషుడని చెప్పవచ్చు.

03:31 - ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ।। 7 ।।

నా మహిమలనూ మరియు దివ్య శక్తులనూ యదార్థముగా తెలిసినవారు, నిశ్చలమైన భక్తి యోగము ద్వారా, నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

మహిమ అన్న పదం, విశ్వములో ప్రకటితమయ్యే, భగవంతుని యొక్క గొప్ప శక్తిని సూచిస్తుంది. యోగము అన్న పదం, ఈ అద్భుతమైన శక్తులతో, భగవంతుని యొక్క సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అద్భుతమైన వైభవాల పట్ల అవగాహన పెంచుకుంటామో, మరియు మనకు ఆయన మహిమలపై నమ్మకం కలుగుతుందో, మనం సహజంగానే, ఆయన భక్తిలో నిమగ్నమౌతాము. భగవంతుని వైభవం పట్ల జ్ఞానము, భక్తుల యొక్క ప్రేమను పెంచుతుంది. వారి భక్తిని ఇనుమడింప చేస్తుంది. భగవంతుని పట్ల సరియైన అవగాహన/జ్ఞానము అనేది, ఆయన పట్ల భక్తిని పెంపొందించుతుంది.  అనంతమైన బ్రహ్మాండాల పనితీరులో ప్రకటితమయ్యే భగవంతుని అద్భుతమైన వైభవాన్ని విశదీకరించిన పిదప, శ్రీ కృష్ణుడు తెలియజేసినదేమిటంటే, ఎవరైతే ఈ జ్ఞానము యందు స్థితులై ఉంటారో, వారు అచంచలమైన భక్తితో, ఆయన తోనే ఏకమై ఉంటారు.

04:54 - అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ।। 8 ।।

నేనే సమస్త సృష్టికీ మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు, నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.

శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని, "అహం సర్వస్య ప్రభవో" అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే, "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమునూ, మరియు సర్వ కారణ కారణమునూ" అని. ఈ విషయం భగవద్గీతలో చాలా సార్లు ప్రకటితం చేశాడు, శ్రీ కృష్ణుడు. "నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను. వారిని పురుషులుగా, లేదా స్త్రీలగా చేస్తాను. వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను. ఏదేని జీవాత్మను, బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను."

ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు, దృఢ విశ్వాసం పెంచుకునీ, మరియు ప్రేమయుక్త భక్తితో, ఆయనను ఆరాధిస్తారని, బుుగ్వేదంలో పేర్కొనబడింది. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, ఈ భౌతిక జగత్తుకీ మరియు ఆధ్యాత్మిక జగత్తుకీ, రెండింటికీ సర్వేశ్వరుడు. కానీ, కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. శ్రీ కృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టీ, స్థితీ, లయములో నిమగ్నం కాడు. శ్రీ కృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే, మోక్షము సాధించిన జీవులతో, తన దివ్య ధామము గోలోకములో, ప్రేమ యుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం, ఆయనే కారణోదక్షాయి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు, ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఈ విధంగా, అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే, మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడని కూడా అంటారు. ఆయన కారణ సముద్రంలోని దివ్య నీటిలో ఉంటూ, అనంతమైన బ్రహ్మాండాలను, తన శరీర రోమ కూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే, ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో, వ్యాప్తించి ఉంటాడు. ఆయననే ద్వితీయ పురుషుడంటారు. గర్భోదక్షాయి విష్ణు నుండి, బ్రహ్మ జన్మించాడు. ఆయనే, సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు. విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్ధాలనూ, ప్రకృతి నియమాలనూ, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులూ మొదలైన అన్నింటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి, బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు. నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త. గర్భోదక్షాయి విష్ణువు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువునే, తృతీయ పురుషుడని అంటారు. విశ్వం పైన ఉంటాడు కానీ, తానే పరమాత్మ రూపంలో, సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలను అందచేస్తూ ఉంటాడు. అందుకే, ఆయనను విశ్వ స్థితికారకుడంటారు. ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ, శ్రీ కృష్ణుడి కన్నా అబేధములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక, మరియు భౌతిక సృష్టీ, ఆయన నుండే వచ్చాయని అంటున్నాడు.

08:29 - మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।। 9 ।।

వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ, మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ, అత్యంత తృప్తినీ, పరమానందమునూ అనుభవిస్తుంటారు.

మనస్సు యొక్క స్వభావమేమిటంటే, దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది. ఆయన యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన, భగవంతుని భక్తులు, ఆయనను గుర్తుచేసుకుంటూ, స్మరించటంలో నిమగ్నమై పోతారు. ఆయన పట్ల భక్తియే, వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది. దాని నుండే వారి జీవిత పరమార్ధం, లక్ష్యం, బ్రతికేందుకు శక్తినీ పొందుతారు. ఒక చేపకు నీరు ఎలా అవసరమో, వారికి భగవత్ స్మరణ అలా అవసరమని భావిస్తారు. వ్యక్తుల హృదయానికి ఏది ఇష్టమైనదో తెలుసుకోవాలంటే, వారు తమ మనస్సూ, శరీరమూ, మరియు సంపదనూ దేనికి అంకితం చేస్తారో, దానిని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ వారు ఖరీదైన వాహనాల కోసం డబ్బు ఖర్చు పెడుతుంటే, వారి మనస్సు, వాటిపై ఉన్నట్టు. ఒకవేళ వారు విలాసవంతమైన సెలవులపై బాగా ఖర్చు పెడుతుంటే, అదే వారికి బాగా నచ్చే విషయమన్నట్టు. ఒకవేళ వారు జబ్బుతో బాధపడేవారికి సహాయం చేస్తుంటే, ఆ విషయమే వారి యొక్క మనస్సులో ఉన్నట్టు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది, వారి పట్ల సమయమూ, డబ్బూ వెచ్చించే వైనంతో మనకు తెలుస్తుంది. ఇదే విధంగా, భక్తుల యొక్క ప్రేమ అనేది, వారు భగవంతునికి అంకితమయ్యే తీరుతో ప్రకటితమవుతుంది. భక్తులు తమ జీవితాన్ని భగవంతుడికి చేసే శరణాగతి నుండి, తృప్తి లభిస్తుంది. భక్తులు తమ కార్యకలాపముల ఫలితాన్ని, వారికి ఇష్టమైన భగవంతునికే సమర్పిస్తారు కాబట్టి, వారు ప్రతి సందర్భమూ, ఆయన నుండే వస్తున్నదని భావిస్తారు. కాబట్టి, వారు అనుకూల, మరియు ప్రతికూల పరిస్థితులను కూడా, భగవత్ సంకల్పముగా చూస్తారు. ఈ రెంటిలో కూడా, సమత్వ బుద్ధితో ఉంటారు. కొంతమంది భగవంతుని వైభవాల, కీర్తన, మరియు శ్రవణ ప్రక్రియలలో వారు ఆనందం అనుభవించటమే కాక, దానిని ఇతరులతో కూడా పంచుకుంటారు. తమలో, తమ ఆధ్యాత్మిక పురోగతి కోసం, భగవంతుని దివ్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటారు.

11:03 - తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ।। 10 ।।

మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో, నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు.

మన సొంత తెలివితేటలతో, భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివి ఉన్నా, చివరికి మన బుద్ధి, భౌతిక శక్తిచే తయారుచేయబడినదని ఒప్పుకోవలసినదే. కాబట్టి, మన ఆలోచనలూ, కుశలతా, మరియు వివేకమూ, భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు, మరియు ఆయన యొక్క దివ్య జగత్తూ, మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు, ధృడముగా ఈ విషయాన్నినొక్కి వక్కాణించాయి.

11:54 - ఇక మన తదుపరి వీడియోలో, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: