ఆమె తన 7 గురు కొడుకులనూ ఎందుకు చంపుకున్నది? వశిష్ఠుడి శాపమే కారణమా?
మన పురాణ ఇతిహాసాలలో, స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సృష్టి మొదలు, మృత్యువు వరకూ ప్రతీ విషయంలో, స్త్రీ మూర్తుల ప్రాముఖ్యత కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం, ఎంతో మంది స్త్రీలను మనం నేటికీ పూజిస్తూనే ఉన్నాం. అలా ప్రముఖంగా చెప్పబడే వారిలో, గంగాదేవి ఒకరు. అయితే, శివుడి శిరస్సును అధివసించిన గంగాదేవి గురించిన చాలా విషయాలు, మనలో కొందరికి తెలియవు. మన మహాభారతంలో, అరివీర పరాక్రమవంతుడిగా పేరు గడించిన భీష్ముడు, గంగాదేవి కుమారుడు. గంగ, శాపవశాత్తు భూలోకంలో జన్మించిన శంతనుడిని వివాహం చేసుకుని, అతని ద్వారా పొందిన ఏడుగురు సంతానాన్ని నీళ్ళపాలు చేసింది. శంతనుడు భూలోకంలో జన్మించడానికీ, గంగను వివాహం చేసుకోవడానికీ గల కారణం ఏంటి? ఒక తల్లిగా గంగా దేవి తన కుమారులను ఎందుకు చంపింది? భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించడానికి, వశిష్ఠుడి శాపమే కారణమా - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dPPKVSNIjGk ]
పూర్వం ఇక్ష్వాకు వంశంలో, మహాభిషుడునే చక్రవర్తి, వెయ్యి అశ్వమేధ యాగాలూ, నూరు రాజసూయ యాగాలూ చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి, అక్కడ దేవతలతోనూ, మహాఋషులతోనూ, బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచి, గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకిలేచి, గంగాదేవి తొడలు కనిపించాయి. దేవతలందరూ తలలు పక్కకు తిప్పుకున్నారు కానీ, మహాభిషుడు ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవునికి కోపం వచ్చి, “మహాభిషా, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించు” అని శపించాడు. తన తప్పు తెలుసుకున్న మహాభిషుడు “బ్రహ్మదేవా, భూలోకంలో ప్రతీపుడనే పుణ్యాత్ముడు ఉన్నాడు. కాబట్టి, అతనికి కొడుకుగా జన్మిస్తాను. దయచేసి నా కోరికను మన్నించండి” అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు సరేనన్నాడు. ఇదిలా ఉండగా, గాలికి చీర తొలగినప్పుడు, తన తొడలను చూసిన మహాభిషుణ్ణి చూసి, గంగాదేవి మోహించింది. అతనినే తలచుకుంటూ భూలోకానికి వస్తుంటే, ఎనిమిది మంది వసువులు ఆమెకు ఎదురు పడ్డారు. దీనంగా ఉన్న వారిని చూసి, కారణం ఏమిటని ప్రశ్నించింది గంగాదేవి.
అప్పుడు అష్ట వసువులు, “అమ్మా గంగాదేవి, మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలెనని పోతున్నాము. నువ్వు ఎదురు పడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభిషుడు, మానవలోకంలో ప్రతీపునకు, శంతనుడిగా జన్మిస్తాడు. నీకూ అతనికీ సంగమము అవుతుంది. నీకూ, శంతనునికీ మేము జన్మిస్తాము” అని అడిగారు. అందకు గంగాదేవి కూడా సంతోషించింది. ‘మీ కోరిక తప్పక తీరుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి’, అని చెప్పింది. అయితే అష్టవసువులు మరొక కోరిక కోరారు.
“అమ్మా, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ, మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు. దానికి వశిష్ఠ మహర్షి కూడా అనుమతి ఇచ్చారు” అని చెప్పారు. దాంతో ఆలోచించి, “అందరూ పుట్టగానే కాలం చేస్తే, తల్లిగా శోకాన్ని భరించడం కష్టతరం కాదా? నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక్క కుమారుడున్నా చాలు” అని అడిగింది గంగా దేవి. అప్పుడు వసువులు, “అమ్మా గంగాదేవి, మాలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశలతో దీర్ఘాయువుగా, నీ కన్న కొడుకై మానవ లోకంలో ఉంటాడు” అని చెప్పారు. దాంతో గంగాదేవి సంతోషంగా, అష్టవసువులతో ఒప్పందం చేసుకుంది. తరువాత కొంతకాలానికి, మానవ లోకంలో ప్రతీపుడనే మహారాజు రాజ్య భోగాలను అనుభవించి, గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షం అయింది. ఒక దివ్య కాంత రూపంలో, అతని కుడి తొడమీద కూర్చుంది. ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. “నీవు ఎవరు? నా తొడమీద ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు. అందుకు గంగ, “ప్రతీప మహారాజా, నేను జహ్ను మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను అవుదామని వచ్చాను. నన్ను స్వీకరించు” అని అడిగింది.
“ఓ జాహ్నవీ, నాకు ఇప్పటికే పెళ్లయినది. నేను నా భార్యను తప్ప, మరొక స్త్రీని మనస్సులో కూడా తలవను. అయినా, నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? పైగా, ఆడవారు భర్త ఎడమ తొడమీద కూర్చుంటారు. సంతానం, తండ్రి కుడి తొడపై కూర్చుంటారు. నువ్వు నా తొడపై కూర్చున్నావు కాబట్టి, నా కొడుకును వరించి పెళ్లి చేసుకొనుము” అని ప్రతీపుడు చెప్పగా, అక్కడి నుండి గంగాదేవి అంతర్థానమయింది. ప్రతీపునకూ, అతని భార్య అయిన సునందకూ, బ్రహ్మ శాపం ప్రకారం మహాభిషుడు, శంతనుడిగా జన్మించాడు. ఒకరోజు ప్రతీపుడు శంతనుని పిలిచి, “కుమారా, ఒకరోజు గంగానదీ తీరాన ఒక కన్యను చూశాను. నువ్వు నా కొడుకుకు భార్యవు కమ్మని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహము చేసుకొనుము. ఆమెను గురించిన వివరాలేమీ అడగకుండా, ఆమె కోర్కె తీర్చు” అని చెప్పాడు. తండ్రి మాటకు సరే అన్నాడు శంతనుడు. నిజానికి శంతనుడికి తన శాపం గురించి గుర్తులేదు. శంతనుడికి గంగను గురించి చెప్పిన తరువాత, ప్రతీపుడు తపోవనానికి వెళ్లిపోయాడు.
శంతనుడు రాజ్యభారాన్ని తీసుకున్నాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్లగా, అక్కడ గంగానదీ తీరంలో, గంగాదేవి ఒక మానవస్త్రీ రూపంలో, శంతనుడికి కనిపించింది. ఆమె మనోహర రూపానికి ముగ్ధుడై, ఆమెనే చూస్తుండిపోయాడు, శంతనుడు. ఆమె కూడా శంతనుని అందానికి పరవశించి, అతనినే చూస్తూ ఉంది. వెంటనే తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శంతనునికి. పైగా ఆమె మీద మనసు పడడంతో, గంగాదేవి చెప్పిన షరతులన్నింటికీ అంగీకరించి, తనను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏమి చేసినా, ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించకూడదని, ముందుగానే మాట తీసుకుంది గంగాదేవి. ఆ తరువాత గంగకూ, శంతనుడికీ, అష్ట వసువులు ఒకరి వెంట ఒకరుగా, కుమారులుగా జన్మించారు.
గంగ వారందరినీ, పుట్టిన వెంటనే గంగానదిలో పడవేసింది. తన కుమారులు నిర్జీవులుగా మారుతుండడంతో, శంతనుడికి మనసులో బాధగా ఉన్నా, గంగాదేవి పెట్టిన షరతు ప్రకారం, ఏమీ ప్రశ్నించేవాడు కాదు. అలా శంతునుడి ద్వారా గంగకు ఏడుగురు వసువులు పుట్టారు, చనిపోయారు. వారందరి తరువాత, అష్టమ వసువు అయిన ప్రభాసుడు జన్మించాడు. ఈసారి శంతనుడు ఊరుకోలేదు. “ఇప్పటిదాకా, పుట్టిన వారందరిని గంగలో పడవేశావు. నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు. ఎందుకిలా చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు. “శంతన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు. నేను వెళ్లిపోతున్నాను. నేనెవరినని అనుకుంటున్నావు? నేను గంగను. అష్ట వసువులు వశిష్ఠ మహాముని శాపంతో, మానవ లోకంలో పుట్టారు. వారు కోరిన కోరిక ప్రకారం, నా గర్భాన జన్మించారు. పుట్టగానే వారికి విముక్తి కలిగించాను. ఈ ఎనిమిదవ వాడు, చిరకాలం జీవిస్తాడు. కీర్తి మంతుడవుతాడు” అని చెప్పింది గంగ. ఆ మాటలను విన్న శంతనుడు ఆశ్చర్యపడి, “ఓ గంగా, వసువులు దేవతలు, దోషము లేనివారు కదా? వశిష్ట మహాఋషి, వారిని ఎందుకు శాపించారు? అందులో ఎనిమిదవ వాడు మాత్రం, మానవ లొకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తాడు? వివరంగా చెప్పు” అని అడిగాడు. అప్పుడు గంగ వసువుల శాప వృత్తాంతాన్ని వివరించింది.
“శంతన మహారాజా, వరుణుడి కుమారుడైన వశిష్ఠుడనే మహాముని, మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్ఠుని ఆశ్రమంలొ, నందిని అనే కామధేనువు ఉంది. అది వశిష్ఠునికి కావలిసిన వస్తువులన్నింటినీ ఇస్తూ, అతనికి సేవచేస్తూ ఉండేది. ఒకరోజు అష్ట వసువులు వారి భార్యలతో కలసి, వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ కామధేనువును చూసి, దాని మహిమకు అశ్చర్యపోయారు. అందులో ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో, “నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి, రోగం, ముసలి తనము లేకుండా బ్రతుకుతారంటారు కదా? మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడయి ఉండాలి? కాబట్టి, ఈ ధేనువును నా ప్రాణ స్నేహితురాలు జీతవతికి కానుకగా ఇవ్వాలని, కోరికగా ఉన్నది” అని అడిగింది. దానికి మిగిలిన వసువులు కూడా, ఆమెకు వంత పాడారు. తన భార్య కోరికను నెరవేర్చడానికి, ఎనిమిదవ వసువైన ప్రభాసుడు, కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్లాడు. వశిష్ఠ మహాముని తన యోగ దృష్టితో, ఇదంతా చూసి ఆగ్రహించాడు. దాంతో, మదమాత్సర్యాలకు లోబడిన మీరందరూ, మానవులై పుట్టండని శపించాడు. వెంటనే తప్పు తెలుసుకున్న వసువులందరూ, వశిష్ఠుని కాళ్ల మీద పడ్డారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని, మహర్షిని వేడుకున్నారు. అందుకు వశిష్ఠుడు, మీ కోరిక నెరవేరుతుంది. కాని అసలు నేరం చేసిన వాడు, ఈ ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుడు మాత్రం, తన జీవితాన్ని మానవలోకంలో గడుపుతాడు. భార్య కోసం ఇటువంటి కార్యానికి ఒడిగట్టినందుకు, ఆజన్మాంత బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా బ్రతుకుతాడు” అన్న వశిష్ఠుడి మాటలనూ, అష్ట వసువుల శాపం గురించీ చెప్పి, తన కుమారుడిని తీసుకుని, గంగా దేవి శంతనుడుని విడిచి వెళ్లింది. దాంతో జరిగినదానికి విచారిస్తూ, శంతనుడు తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. కొంతకాలం తరువాత, ఒకరోజు శంతనుడు వేట నిమిత్తము గంగానదీ తీరానికి వెళ్లాడు. ఒక చోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. శంతనుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ, గంగానది వెంట నడుస్తుండగా, అక్కడ ఒక చోట బాలుడు గంగా నదికి అడ్డంగా, తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు.
అతనే గంగా శంతనుల కుమారుడు దేవవ్రతుడు. కానీ, శంతనుడు ఆ కుమారుని గుర్తించలేదు. ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చి, “ప్రభూ, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రుడూ, బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలను అభ్యసించాడు. పరశురామునితో సమానంగా, ధనుర్విద్యను ఆకళింపుజేసుకున్నాడు. ఇక ఇప్పుడు, నీ కుమారుని స్వీకరించుము” అని దేవవ్రతుడిని శంతనునికి అప్పగించి, గంగ వెళ్లిపోయింది. వీరుడూ, ధీరుడూ, గుణవంతుడూ, సకల విద్యాపారంగతుడూ అయిన కొడుకును చూసి, శంతనుడు ఉప్పొంగిపోయాడు. కొడుకును హస్తినాపురానికి తీసుకువచ్చి, దేవవ్రతునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత శంతనుడు, యోజన గంధిగా పిలువబడే సత్యవతిని చూసి, వివాహం చేసుకోవాలనుకున్నాడు. సత్యవతి, తన కుమారులకు మాత్రమే రాజ్యపట్టాభిషేకం చేయాలనీ, భీష్ముడు బ్రహ్మచారిగా ఉండాలనీ, షరతు విధించింది. దానికి శంతనుడు అంగీకరించలేదు. కానీ, ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు, సత్యవతి తండ్రి దాశరాజు వద్దకు వెళ్లి, ఆమె కోరక మేరకు, వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవిస్తాననీ, రాజ్యం ఆమె పుత్రులకే అప్పగిస్తాననీ చెప్పి, వారిని ఒప్పించి, తండ్రికి పెళ్లి చేశాడు. అలా వశిష్ఠుడి శాపం ప్రకారం, సత్యవతి షరతు కారణంగా, భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించి, తనువు చాలించాడు.
కృష్ణం వందే జగద్గురుం!
No comments:
Post a Comment