Ads

15 December, 2021

కర్మ బంధాల్లో చిక్కుకోకూడదంటే.. శ్రీ కృష్ణుడు! Bhagavadgita

 

కర్మ బంధాల్లో చిక్కుకోకూడదంటే.. శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (13 - 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 13 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/S1NFp3tN_l8 ]

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।

జనుల గుణములూ, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చే సృష్టింపబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా, నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.

వేదములు జనులను, నాలుగు రకాల వృత్తుల వారీగా విభజించాయి. ఇవి కేవలం వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ, వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం, ప్రతి సమాజంలోనూ ఉంటుంది. వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం, భౌతిక శక్తి, మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది. అవి, సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారు స్వాభావికంగా, చదువు చెప్పటం మరియు పూజాది కార్యక్రమాలు చేయడంపై, ఆసక్తి కలిగి ఉంటారు. క్షత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, కొంచెం సత్వ గుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు, రజో గుణమూ మరియు కొంత తమో గుణమూ మిళితమై ఉంటారు. కాబట్టి, వారు వ్యాపారమూ మరియు వ్యవసాయమూ ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు.. వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది, జన్మతహా వచ్చినవీ కావు, మార్చలేనివీ కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది, జనుల స్వభావమూ మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన దీనికి అకర్త. భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు. కానీ, ఆ శక్తితో ఏం చేయాలనే విషయంపై, పూర్తి స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. కాబట్టి, మన చర్యలకు భగవంతుడు కారణం కాదు.

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।

కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.

మనం అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛతను కోల్పోదు. అగ్ని స్వచ్ఛమైనది, అందులో మనం ఏది వేసినా, అది కూడా శుద్ధమైపోతుంది. అలాగే, ఎన్నో మురికి కాలువలు పవిత్రమైన గంగా నదిలో కలుస్తుంటాయి. అంతమాత్రాన అది మురికి కాలువ కాదు. పవిత్రమైన గంగా నది, ఆ మురికి కాలువలన్నింటినీ పవిత్రంగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా, తాను చేసే కర్మల వలన కళంకితుడు కాడు. చేసే పనుల వలన వచ్చే ఫలములను, తన భోగం కోసం చేస్తే, ఆ కర్మలు మనలను కర్మబంధములతో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు, స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు. ఆయన చేసే ప్రతి చర్యా, జీవులపై కరుణతో చేసేవే. కాబట్టి, ఆయనకు కర్మ బంధములు అంటవు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ।। 15 ।।

ఈ సత్యమును తెలుసుకుని, ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా, తమ కర్మలను ఆచరించారు. కాబట్టి, ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ, నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.

భగవత్ ప్రాప్తి కోసం ఆశించే మునులకు, భౌతిక లబ్దిపై ఆసక్తి ఉండదు. వారు ఈ ప్రపంచంలో చేసే కర్మలు, భగవత్ సేవ కోసం, ఆయన ప్రీతి కోసం. వారు భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మ బంధనాలు, వారికి అంటవు. స్వార్ధ ప్రయోజనం ఏ మాత్రమూ లేని యోగులూ, మునులు కూడా, భగవత్ ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. భక్తితో పని చేయటం కూడా, భగవత్ కృపకి పాత్రులవడానికి దోహద పడుతుంది. అందుకే, అర్జునుడిని కూడా, తన కర్మలను చేయమంటున్నాడు శ్రీ కృష్ణుడు.

కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 16 ।।

కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? అని, వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో, తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవటం ద్వారా, నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.

చేయదగిన పని ఏమిటి? చేయకూడని పని ఏమిటి? అనే విషయాన్ని నిర్ణయించుకోవటం, గొప్ప ఋషులకూ, దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం. ధర్మము స్వయంగా, భగవంతునిచే సృష్టించబడింది, మరియు ఆయన మాత్రమే దానిని యదార్ధముగా ఎఱుగగలడు. శ్రీ కృష్ణుడు అర్జునునికి వివరించే గోప్యమైన కర్మ, అకర్మల విజ్ఞానంతో, అర్జునుడు భౌతిక బంధములనుండి తనను తాను విడిపించుకోవచ్చు.

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మ, వికర్మ, అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యదార్థం, నిగూఢమైనది, మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

పని అనేది, మూడు రకాలుగా వర్గీకరించబడింది. కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ, మరియు చిత్త శుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమయిన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు. ఇవి హాని కారకమైనవి, మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా, కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ, ప్రతిక్రియలూ ఉండవు. ఇవి జీవాత్మను బంధించవు.

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్మనుశ్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ।। 18 ।।

ఎవరైతే అకర్మ యందు కర్మనూ, మరియు కర్మ యందు అకర్మనూ దర్శించుదురో, వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలనూ చేస్తూనేవున్నా, యోగులుగా పిలువబడతారు.

అకర్మలో కర్మ: ఒక రకమైన అకర్మ పద్ధతిలో, జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలిచి, వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలి పెట్టినా, వారి మనస్సు, ఇంద్రియ వస్తు-విషయములపైనే చింతిస్తూ ఉంటుంది. అటువంటి మనుష్యులు ఏమీ చేయనట్లు కనపడినా, నిజానికి వారి సోమరితనమే, పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయనన్నప్పుడు, అది పాపమని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

కర్మలో అకర్మ: కర్మ యోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలములను భగవంతునికే అంకితం చేస్తూ, పని చేస్తారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, వారు కర్మ బంధాలలో చిక్కుకోరు. ఎందుకంటే, వారు తమ భోగం కోసం ఆశించరు. భారత చరిత్రలో ఏంతో మంది మహారాజులు - ధ్రువుడూ, ప్రహ్లాదుడూ, యుధిష్టురుడూ, పృథువూ, అంబరీషుడూ తమ రాజ ధర్మాలను తమ శక్త్యానుసారం నిర్వర్తించారు. అదే సమయంలో, భౌతిక వాంఛల యందు వారి మనస్సు లేదు కాబట్టి, వారి పనులు అకర్మగా పరిగణించబడతాయి.

ఇక మన తదుపరి వీడియోలో, ఏ పాపమూ అంటకుండా, మనస్సూ, ఇంద్రియములనూ ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: