Ads

14 December, 2021

దైత్య గురువు శుక్రాచార్యుడి మృతసంజీవనీ విద్య! Mritasanjivani Vidya Story

 

దైత్య గురువు శుక్రాచార్యుడి మృతసంజీవనీ విద్య!

సమస్త లోకాలలో ఆధిపత్యం కోసం, దేవ, దానవుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. దేవతలను ఓడించి, కొన్ని కొట్ల సంవత్సరాల పాటు భూమండాలన్ని పాలించారు, అసురులు. అటువంటి పరిస్థితులలో, దేవతలు తిరిగి ఎలా తమ లోకాలను స్వాధీనపరుచుకున్నారు? దానవ గురువైన శుక్రాచార్యుడు పన్నిన పన్నాగం ఏంటి? సుర, అసుర యుద్ధంలో ఎవరు గెలిచారు? అసుర గురువైన శుక్రాచార్యుడికి, చనిపోయిన వారిని బ్రతికించే మృత సంజీవనీ విద్య ఎలా వచ్చింది - అనేటటువంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/G6arPs1lhQM ]

హిరణ్యకశిపుడు, పదికోట్ల సంవత్సరాలు భూమండలాన్నంతా పాలించాడు. 1,80,072 సంవత్సరాలు, ముల్లోకాలకీ అధిపతిగా ఉన్నాడు. అదే పరంపరలో, బలి చక్రవర్తి రాజై, పదికోట్ల, అరవై వేల, ముప్ఫై లక్షల సంవత్సరాలు పాలించాడు. దాదాపు పదియుగాలపాటు, భూమండలమంతా అసురుల ఆధీనంలోనే ఉంది. తరువాత దేవతలు, యజ్ఞయాగాదులు చేసి, అమితమైన బలాన్ని పుంజుకుని, దానవుల మీదకు దండేత్తి, వారిని ఓడించారు. దాంతో, అసురులంతా భూమ్మీద నివసించడం కుదరదని భావించి, వారి గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి, 'గురుదేవా! మేమిక్కడ ఉండలేము. అనుక్షణం దేవతలు మమ్మల్ని తరుముతున్నారు. వారి బలం బాగా పెరిగిపోయింది. మాకిక పాతాళమే దిక్కు. ఇక మేమంతా అక్కడికే వెళ్ళిపోతాం' అని విన్నవించుకున్నారు. ఆ మాటలకు శుక్రాచార్యుడు బాధపడి, వారిని ఓదార్చి, తన దగ్గరున్న శక్తులను రాక్షసులకు ధారపోసి, యుద్ధానికి పంపించాడు. కానీ, దేవతలు ప్రయోగించిన శస్త్రాస్త్రాల ధాటికి నిలువలేని అసురులు, యుద్ధ రంగం వదిలి, శుక్రచార్యుడి వద్దకు పారిపోయారు.

అప్పుడు గురువైన శుక్రాచార్యుడు, 'అసురులారా! దేవదానవ సంగ్రామాలు ఇప్పటిదాకా పన్నెండు జరిగాయి. వాటిలో ఎంతో మంది అసురులు, దేవతల మాయోపాయాన్ని తెలుసుకోలేక, వారి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అలా అందరూ పోగా, ఇదిగో మీరే మిగిలారు. కొంతకాలం నిరీక్షించండి. మీరు విజయం సాధించడానికి, మహాదేవుడైన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి, ఆయన అనుగ్రహం పొంది, తిరిగి మీ దగ్గరకొస్తాను. మీ అందరినీ శక్తివంతులను చేస్తాను. నాలాగే, మీరు కూడా నార వస్త్రాలు ధరించి, అడవికి వెళ్ళి తపస్సు చేయండి. నేను తిరిగి వచ్చేవరకూ, దేవతలు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మనందరమూ, భక్తవరదుడైన పరమేశ్వరుడి ద్వారా, శత్రునాశకర మంత్రాలను పొంది, విజయాన్ని వరిద్దాం.' అని వారికి ధైర్యం చెప్పాడు శుక్రాచార్యుడు. గురువు మాట ప్రకారం అసురులు, దేవతల వద్దకు వెళ్ళి, వారు ఆక్రమించిన లోకాలను తిరిగి అప్పగించి, ఆయుధాలను వదిలి, అడవి బాట పట్టారు. శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి, శంకరుడికి నమస్కరించి, దేవతలను జయించగలిగే దివ్యమంత్రాన్ని ఉపదేశించమని వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, 'శుక్రాచార్యా! నీవు కోరినట్టు నీకు శత్రుంజయమంత్రాలు లభించాలంటే, బ్రహ్మచర్య దీక్షతో, తలక్రిందులుగా ఉండి, కుండధూమాన్ని ఉపాసించు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది' అని చెప్పాడు.

ఆ విధంగానే, భూమిలోపల నిరంతరం పొగ వచ్చే ఒక కుండాన్ని ఏర్పాటు చేసుకుని, దాని మీద తలక్రిందులుగా వ్రేలాడుతూ, కఠోర దీక్షను ప్రారంభించాడు. శుక్రాచార్యుడు తపస్సులో ఉన్నాడని తెలుసుకున్న దేవతలు, ఆయుధాలు వదిలి, ఒంటరిగా ఉన్న అసురులపై దండెత్తి, తపోదీక్షలో ఉన్నవారిని చంపకూడదన్న కనీస ధర్మాన్ని కూడా మరచి, వారిని సంహరించారు. వారిలో కొంతమంది రాక్షసులు, శుక్రమాత దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి, అమెను శరణు కోరారు. శుక్రమాత దగ్గరున్న అసురులను కూడా, దేవతలు వదిలిపెట్టలేదు. ఆమె ఎదురుగానే, ఇంద్రుడు అసురులపై దాడి చేశాడు. దాంతో ఆగ్రహించిన శుక్రమాత, తన దివ్యశక్తితో, ఇంద్రుణ్ణి స్తంభింపచేసింది. ఆ సంఘటనతో, దేవతలందరూ తలో దిక్కుకూ పారిపోయారు. ఇంద్రుడు స్తంభించబడ్డాడని తెలిసిన శ్రీహరి అక్కడికొచ్చి, సూక్ష్మ రూపంతో, తనలోనికి ప్రవేశించమని చెప్పాడు.

విష్ణువు ఇంద్రుడిని రక్షించాడని తెలుసుకున్న శుక్రమాత, 'ఓ విష్ణూ! ఇంద్రుడితో సహా నిన్నూ, సకల భూతాలూ చూస్తుండగా దహించివేస్తాను.' అని ధ్యానంలోకి వెళ్లింది. ఇంద్రుడు ప్రాణభయంతో వణికిపోతూ, శుక్రమాతను వధించమని, విష్ణువును వేడుకున్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితులలో, విష్ణువు తన సుదర్శనాయుధంతో, శుక్రమాత శిరస్సును ఖండించాడు. విష్ణువు స్త్రీ వధ చేశాడన్న విషయం తెలుసుకున్న భృగువు, తన భార్య మరణానికి కారకుడైన విష్ణువుని, ఏడుసార్లు మానవలోకంలో జన్మించమని శపించాడు. భృగువు తన భార్య శిరస్సునూ, మొండాన్నీ అతికించి, తన తపోబలంతో, ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. శుక్రమాత తిరిగి జీవించడంతో ఇంద్రుడు భయపడి, అమరావతికి పారిపోయాడు. శుక్రమాత తనను ఏం చేస్తుందోన్న భయం, శుక్రాచార్యుడు తన తపస్సు ను ముగించుకుని యుద్ధానికి వస్తాడన్న ఆందోళనతో, ఇంద్రుడికి నిద్ర కరువైంది.

అందుకు ప్రత్యామ్నాయంగా, ఇంద్రడు తన కుమార్తె జయంతిని పిలిచి, కఠోర దీక్షలో ఉన్న శుక్రాచార్యుడికి సపర్యలు చేసి, ఆయనను సంతోషపరచమని చెప్పి, శుక్రాచార్యుడి దగ్గరకు పంపించాడు. తన తండ్రి చెప్పిన విధంగానే, జయంతి శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి, ఆయనను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, కాలం గడిపింది. వేయి సంవత్సరాల కఠోరదీక్ష తరువాత, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శుక్రాచార్యుడు కోరుకున్న మృతసంజీవనీ విద్యను ప్రసాదించాడు. శుక్రాచార్యుడిని ఎవరూ జయించకుండా, చంపకుండా ఉండేలా, వరాలను కురిపించాడు శంకరుడు. దాంతో ఆనందపరవశుడైన శుక్రాచార్యుడు, శివుడి పాదాలపై పడి, త్రిశతి స్తోత్రాన్నీ, త్రిశతి నామావళినీ పఠించాడు. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు ఆనందించి, శుక్రాచార్యుడిని ఆశీర్వదించి, అంతర్థానమయ్యాడు. ఇంత కాలం ఆయనకు సపర్యలు చేస్తున్న జయంతిని చూసి, 'ఇన్నాళ్లుగా నాకెంతో సేవ చేశావు. నీకోరికెంటో చెప్పు. అది ఎంత కష్టమైనా తీరుస్తాను' అని అభయమిచ్చాడు.

అప్పుడు జయంతి వినయంగా, 'స్వామీ! మీరే నాకు దైవం. మీతో కలసి జీవించాలనే, నేను మీ దగ్గరకు వచ్చాను. మిమ్మల్ని సేవిస్తున్నాను. దయచేసి నాకు మీతో సహజీవనంచేసే భాగ్యాన్ని ప్రసాదించండి.' అని వేడుకుంది. జయంతి అందానికీ, వినయానికీ ముగ్ధుడైపోయిన శుక్రాచార్యుడు, ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి, ఆనందంగా జీవించసాగాడు. జయంతి వ్యామోహంలో ఉన్న శుక్రాచార్యుడు, తన విధిని మరచిపోయాడు. తమ గురువు తపస్సు ముగించుకుని, తిరిగి వచ్చాడని తెలుసుకున్న అసురులు, శుక్రాచార్యుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కానీ, తమ గురువు జయంతితో కలిసి ఉండడాన్ని చూసి సహించలేక, ఆవేదనతో వెనక్కి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుడు జయంతితో సంసారం చేస్తున్న సమయంలో, దేవగురువైన బృహస్పతి, శుక్రాచార్యుడి వేషంలో అసురుల దగ్గరకు వెళ్ళి, వారిని నమ్మించి, హితబోధలు చేయడం ప్రారంభించాడు. ఇటు శుక్రుడూ, జయంతిల సంసారం పదిసంవత్సరాల పాటు కొనసాగింది.

జయంతి సద్యోగర్భం ద్వారా, దేవయాని అనే కుమార్తెకు జన్మనిచ్చింది. అలా రోజులు గడుస్తుండగా, ఒకనాడు శుక్రుడికి తన శిష్యులు  గుర్తుకొచ్చారు. 'నా శిష్యులను చూసి వస్తాను. జాగ్రత్తగా ఉండు' అని జయంతికి చెప్పి, బయలుదేరాడు. శుక్రుడు అక్కడకు వెళ్లేసరికి, తనలాగే ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి, తన దివ్య జ్ఞానంతో, ఆ మాయాశుక్రుడు, దేవగురువని గ్రహించాడు. వెంటనే తన శిష్యులతో, 'నేను మీ గురువును. మీకు బోధిస్తున్న వ్యక్తి దేవగురువు. మిమ్మల్ని వంచించి, వలలో వేసుకున్నాడు' అని తన ఆగ్రహాన్ని వెళ్ళగ్రక్కాడు. శుక్రుడి రూపంలో ఉన్న బృహస్పతి మాత్రం, ఏ మాత్రం కంగారుపడకుండా, 'నేనే మీ నిజమైన గురువుని. వీడెవడో మాయావి. మిమ్మల్నీ, నన్నూ విడదీయడానికి వచ్చాడు' అని చెప్పాడు. శిష్యులు కాస్తంత ఆశ్చర్యానికి లోనై, ఇన్ని సంవత్సరాలూ విద్య బోధించినవాడే నిజమైన గురువని భావించి, శుక్రచార్యుడిపై పరుషమాటలతో దాడి చేశారు. దాంతో కోపోద్రిక్తుడైన శుక్రాచార్యుడు, శిష్యులను శపించి, తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. బృహస్పతి పథకం ఫలించినందుకు సంతోషించి, శుక్రుడి శిష్యులందరినీ భ్రష్టుల్ని చేసి, అక్కడి నుండి మాయమయ్యాడు. దాంతో దానవుల కళ్ళు తెరచుకుని, చేసిన తప్పుకు తలదించుకున్నారు. శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యను ఎక్కడెక్కడ, ఎలా ఉపయోగించాడో మరో భాగంలో తెలుసుకుందాము..

మరిన్ని మంచి వీడియోస్ తో, మళ్ళీ మీ ముందుకు వొస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే, మన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. అలాగే, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చెయ్యడం మరచిపోకండి.. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను, క్రింద కామెంట్ బాక్స్ లో, తప్పక తెలియజేయండి. Video క్రింద Description లో పొందుపరిచిన మన social media links కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

No comments: