కర్తృత్వాభిమానము - చేసేది నేనే అన్న అహంకారము!
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (44 - 48 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 44 నుండి 48 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bWgzBS2LXo0 ]
ప్రాపంచిక భోగాలనూ, సుఖాలనూ వదిలి, భగవద్ ప్రాప్తి పథంలో ఏ విధంగా ముందుకు పయనించాలో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ।। 44 ।।
భోగమూ, ఐశ్వర్యములకు ఆకర్షింపబడిన మనస్సు, కోరికలతో బుద్ధిని అపహరిస్తుంది. తద్వారా అంత:కరణంలో నిశ్చయమైన బుద్ధి ఉండదు.
మనస్సులో ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు, భోగాలూ, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంపొందించుకోవటానికి, తమ బుద్ధిని వాడుతూ, ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి ఎలా సమకూర్చుకుని, శారీరక సుఖానుభవము మరింత పొందుదామా? అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి, భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి, కావలిసిన ధృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేరు. వారి బుద్ధి, భగవంతుని పాదాలపై నిలకడగా ఉండలేదు.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ।। 45 ।।
అర్జునా, వేదాలు సంసారాన్ని గురించి మాత్రమే చెబుతున్నాయి. త్రిగుణాలకు అంటే, సత్త్వ, రజః, తమో గుణాలకు అతీతుడవై, సుఖదు:ఖాది ద్వంద్వాలనూ, యోగక్షేమాలనూ దాటి, అప్రమత్తుడవై, నిత్యమూ శుద్ధసత్త్వమందు నిలువుము.
సత్వ గుణము, రజో గుణము, తమో గుణము, ఈ మూడూ ప్రకృతి గుణములు. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమతమ పూర్వ జన్మ సంస్కారాల వలన, ప్రతీ వ్యక్తిలో, ఈ గుణాలు వేరువేరు పాళ్ళలో ఉంటాయి. తదనుగుణంగా, ప్రతి ఒక్కరూ, వేరువేరు స్వభావాలూ, ధోరణులూ కలిగి ఉంటారు. ‘శాస్త్రాలు’ తమో గుణం నుండి రజో గుణానికీ, రజో గుణం నుండి సత్వ గుణానికీ ఎదిగేందుకు దోహదపడతాయి. వేదాలు, రెండు రకాల జ్ఞానాన్ని అందిస్తాయి. ప్రాపంచిక మమకారంతో ఉన్నవారికి కర్మకాండలూ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి, దివ్య జ్ఞానమునూ కలిగిస్తాయి. భౌతిక ప్రతిఫలాలనిచ్చే యజ్ఞయాగాది క్రతువులూ, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆ విభాగాల పట్లా, అర్జునుడిని ఆకర్షితుడు కావద్దని, శ్రీ కృష్ణుడు ఉద్దేశపూర్వకంగా వివరిస్తున్నాడు. అర్జునుడిని, దానికి బదులుగా, వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలను అవగాహన చేసుకుని, పరమ సత్యాన్ని గ్రహించి, తనను తాను ఉద్ధరించుకోమంటున్నాడు.
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ।। 46 ।।
చిన్నబావిలోని నీటితో ఎంత ప్రయోజనం ఉంటుందో, అంతటా వ్యాపించియున్న జలాశయంలోని నీళ్ళతోనూ, అంతే ప్రయోజనం ఉంటుంది. వేదోక్త కర్మలవల్ల బ్రాహ్మణునికి ఎంత ప్రయోజనం కలుగుతుందో, పరమాత్మజ్ఞానం వల్లా, అంతే ప్రయోజనం కలుగుతుంది.
వేదములలో ఎన్నో రకాల ఆచారాలూ, పద్ధతులూ, పూజలూ, వైదిక కార్యక్రమాలూ, మరియూ జ్ఞానాన్ని సంపాందించే మంత్రాలూ ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఒకే ఒక ప్రయోజనం కోసం తెలియజేయబడ్డాయి. అది, ఆత్మని పరమాత్మ దగ్గరికి చేర్చటమే. "అన్ని వేద మంత్రములు, కర్మ కాండలు, ఆధ్యాత్మిక ఆచారాలు, యజ్ఞయాగాదులు, జ్ఞాన సముపార్జన, కర్తవ్య నిర్వహణల యొక్క లక్ష్యం, జీవాత్మను భగవంతుని దివ్య చరణముల వద్దకు చేర్చడమే." మనస్సుని ఆ భగవంతుని యందే నిలిపినవాడు, అన్ని వేద మంత్రాల ప్రయోజనాన్నీ పొందినట్లే.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।।
నీకు కర్మలయందే అధికారము. కర్మఫలముల గురించి ఆలోచించవద్దు. కర్మఫలప్రాప్తికి కారణం కావద్దు. అలా అని కర్మ చేయకుండా ఉండవద్దు.
మనం చేసే కర్మలు, పనుల ఫలితాలు, మన అనుభోగము కోసం కాదు. కర్మలు చేయడం అనేది, మానవ స్వభావంలో, అంతర్భాగం. ఈ ప్రపంచంలోకి వచ్చాక, మనందరికీ, మన కుటుంబ పరిస్థితీ, సామాజిక స్థానం, వృత్తి పరంగా వేర్వేరు విధులూ ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు, ఆయా కర్మల ఫలితాలు, మన అనుభోగము కోసం కాదు. ఆ ఫలితాలు, భగవంతుని ఆనందం కోసం, ఉద్దేశించినవి. ప్రతి ఒక్క జీవాత్మా, పరమాత్మ యొక్క అణు అంశ కాబట్టి, మన అన్ని కర్మల ద్వారా, భగవంతునికి సేవ చేయటమే, మనకున్న అంతర్లీన నిజస్వభావం. ప్రాపంచిక, భౌతిక విషయాసక్తి వలన, "నా దగ్గర ఉన్న వాటన్నింటికీ, నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకుని, ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది" అనే ఆలోచనా దృక్పథం కలుగుతుంది. దీనికి విరుద్ధమే, ఆధ్యాత్మిక చైతన్యం. "భగవంతుడే సమస్త జగత్తుకీ స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం, అతని నిస్వార్ధ సేవకుడిని. నాకున్న దాన్నంతా, ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి." అనే భావనను కలిగిస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ప్రకారముగా, అర్జునుడు, కర్మల ఫలములను అనుభవించేది తానే, అని అనుకోవద్దని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు కూడా, చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. అర్జునుడికి, 'కర్తృత్వాభిమానము' అంటే, 'చేసేది నేనే అన్న అహంకారాన్ని' విడిచిపెట్టమని, కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే, మన ఇంద్రియములూ, మనస్సూ మరియు బుద్ధీ, జడ పదార్థములు. భగవంతుడు వీటికి శక్తినిచ్చి, మనం ఉపయోగించుకోవటానికి వీలుగా చేశాడు. దేవునిచే ప్రసాదింపబడిన శక్తి ద్వారానే, మనం పనులు చేయగలుగుతున్నాం కాబట్టి, ‘నేను’ అనే అహాన్ని వదులుకోవాలి.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।। 48 ।।
యోగనిష్ఠయందుండి, కర్మఫలాపేక్ష లేకుండా, కర్మలు చెయ్యి. ఫలమునొందిననూ, పొందకపోయిననూ, సమానంగా భావించు. సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.
అన్ని పరిస్థితులనూ ప్రశాంత చిత్తంతో, సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే, శ్రీ కృష్ణుడు దానిని 'యోగం' అంటున్నాడు. మన కృషి మాత్రమే, మన చేతుల్లో ఉంది.. ఫలితము కాదు.. అని అర్థం చేసుకున్నప్పుడు, మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే, మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే కాబట్టి, అవి ఆయనకే సమర్పించాలి. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్టు రాకపోతే, వాటిని భగవంతుని సంకల్పముగా, ప్రశాంతముగా స్వీకరించాలి. ఈ విధంగా, కీర్తి-అపకీర్తి, జయము-అపజయము, సుఖ-దుఃఖాలు, వీటన్నింటినీ, మనం భగవంతుని సంకల్పంగా పరిగణించి, వాటిని సమానంగా స్వీకరించినప్పుడు, మనలో, శ్రీ కృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధి ఉత్పన్నమవుతుంది. మన శక్తిమేరకు ప్రయత్నం చేస్తూ, తద్వారా వచ్చే ప్రతి ఫలితాన్నీ స్వీకరించడం నేర్చుకుంటే, మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే.. అదే నిజమైన యోగము.
మన తదుపరి వీడియోలో, సమత్వ యోగం గురించి మరింత విపులంగా, శ్రీ కృష్ణుడి ఉపదేశం ఏవిధంగా సాగుతుందో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments:
Post a Comment