Ads

04 August, 2021

స్వర్గలోక ప్రాప్తి కలిగి, పుణ్యం ఖర్చయిపోయిన తరువాత? Bhagavadgita

  


పుణ్యకార్యాలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది! మరి పుణ్యం ఖర్చయిపోయిన తరువాత?

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (38 - 43 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 38 నుండి 43 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wdf1JGH0tZI ]

బుద్ధియోగం గురించి, అర్జునుడితో శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు..

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।

సుఖ-దుఃఖాలనీ, లాభ-నష్టాలనీ సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయి. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన, నీకు ఎన్నటికీ పాపం అంటదు.

శత్రువులైనా, సొంత వారిని సంహరించటం వలన పాపం అంటుకుంటుందని, అర్జునుడు భయపడ్డాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా, తన కర్తవ్యాన్నినిర్వర్తించమని, అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు, కృష్ణ భగవానుడు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు, మనం కర్మలను సృష్టిస్తాం. అవి తదుపరి కాలంలో, తమ ప్రతిచర్యలను కలుగచేస్తాయి. మంచి పనులు చేస్తే, స్వర్గ లోకాలకు వెళతాం. చెడు పనులు చేస్తే, నరక లోకాలకు వెళతాం. ఈ రెండింటినీ కలిసి చేస్తే, మళ్ళీ ఈ భూ లోకానికి తిరిగి వస్తాం. ఏ విధంగా అయినా, మనం కర్మ బంధాల్లో చిక్కుకోవలసినదే. ఈ విధంగా, లౌకికమైన మంచి పనులు కూడా, మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన సుఖాలను కలుగచేస్తాయి. అవి కర్మ రాశిని పెంచి, ఈ లోకంలో ఆనందం ఉందన్న భ్రమను మరింత పెంచుతాయి. స్వార్థ ప్రయోజనాలను వదిలివేస్తే, ఇక మన చర్యలు, కర్మ బంధాలను సృష్టించవు. జయాపజయాలనీ, సుఖదుఃఖాలనీ ఒకలాగే పరిగణిస్తూ, సమ దృష్టితో పోరాడితే, శత్రువులను సంహరించినా, అతనికి పాపం అంటదు.

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।

బుధ్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ।। 39 ।।

ఇప్పటివరకు నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఓ పార్థ, ఇప్పుడు నేను బుద్ది యోగాన్ని విశదీకరిస్తాను. నీవు అవగాహనతో పని చేసినప్పుడు, కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.

శ్రీ కృష్ణుడు ఇప్పటివరకూ అర్జునుడికి, నిత్యమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానం, అంటే, 'సాంఖ్య' యొక్క ఇంకొక స్వరూపాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా, కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేస్తున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద, నిర్లిప్తత అవసరం. నిర్మోహము, నిర్లిప్తత అనే వాటిని, బుద్దిని ఉపయోగించి, వివక్షతతో సాధన చెయాలి. అందుకే, శ్రీ కృష్ణుడు దీనిని 'బుద్ధి యోగము' అన్నాడు.

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే ।

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ।। 40 ।।

ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ, వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా, అది మనలను పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది.

వచ్చే జన్మలో మనకు మానవ శరీరం లభించక పోవచ్చు.. ఇంకా నిమ్న స్థాయి జీవ జాతులలోకి, అంటే, పశువులూ, పక్షులూ వంటివి, లేదా అథో లోకాలకు వెళ్ళవచ్చు. మరణించిన తరువాత తిరిగి మానవునిగా జన్మిస్తామని చెప్పలేము. ఎందుకంటే, మన తదుపరి జన్మ మన కర్మలను బట్టీ, మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టీ నిర్ణయింపబడుతుంది. "ఓ మానవుడా, మానవ జన్మ చాలా దుర్లభమైనది. దీనిని నీవు, నీ లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే, చాలా నష్టపోతావు. భగవత్ప్రాప్తి కోసం, ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించక పొతే, నీవు ఎన్నో జన్మలలో, 84 లక్షల రకాల జీవ రాశులలో పడి, తిరుగుతుంటావు" అని కఠోపనిషత్తు విశదీకరిస్తుంది. మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధనలో ప్రయాణం మొదలుపెడితే, అది ఈ జన్మలో పూర్తి కాక పోయినా, భగవంతుడు మన ఉద్దేశాన్ని గమనిస్తాడు. కాబట్టి, ఆ ప్రయాణాన్ని, ఎక్కడ ఆగిపోయిందో, అక్కడనుండే మొదలు పెట్టడానికి, మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ప్రస్తుత జీవితంలో, మనం కూడబెట్టుకున్న భౌతిక సంపదంతా, మరణ సమయంలో, ఇక్కడే వదిలి వేయాలి. కానీ, యోగ పథంలో, మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తే, భగవంతుడు దానిని భద్రపరచి, దాని ప్రతిఫలాలు వచ్చే జన్మలో ఇచ్చి, మళ్లీ ఎక్కడయితే వదిలామో, అక్కడినుండి తిరిగి పురోగతిని సాధించేటట్లు చేస్తాడు.

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన ।

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।

కురునందనా! నిశ్చయాత్మకమైన బుద్ధే శ్రేయస్కరమైనది. చంచలచిత్తం గల వారి బుద్ధులకు, అంతం అనేది ఉండదు.

మమకారాసక్తి అనేది, మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే, మమకార విషయాల వైపు పరుగులు తీస్తుంది. అవి వ్యక్తులూ, ఇంద్రియ విషయాలూ, ప్రతిష్ఠా, శారీరక సుఖాలూ, పరిస్థితులూ, మొదలగునవి కావచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి, లేదా వస్తువు యొక్క తలపులు, పదేపదే మనస్సుకు వస్తుంటే, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉండటం వలన, అయి ఉండవచ్చు. మన శరీరంలో, సూక్ష్మ మైన 'అంతఃకరణ' ఉంటుంది. వ్యవహారికంగా, దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో, 'బుద్ధి' అనేది, 'మనస్సు' కంటే ఉన్నతమైనది. 'బుద్ధి' నిర్ణయాలు చేస్తుంది. మనస్సు కోరికలను సృష్టించి, ఆ బుద్ధి నిశ్చయించిన విషయ వస్తువులతో, అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ 'బుద్ధి' గనుక, సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది.

ఒకవేళ బుద్ధి, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు, కీర్తి, ప్రతిష్టల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధిలో ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను కల్పిస్తుంది. మన బుద్ధిని మనం, సాధనతో నియత్రించగలం. మనం సరైన విజ్ఞానంతో, బుద్ధిని పెంపొందించుకుని, సరైన దిశలో, మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి, దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్ని పనులూ, భగవంతుని ఆనందం కోసమే అని, ధృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా, కర్మ ఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండగలిగే, కళ. కానీ, ఎవరి బుద్ధి అయితే పలు-విధాలుగా ఉంటుందో, వారి మనస్సు, ఎన్నో దిశలలో పరిగెడుతుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క, ఏకాగ్రతను పెంపొందించుకోలేరు.

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః ।

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।।

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।

అర్జునా! వేదోక్తకర్మలయందు అనురక్తులైన అవివేకులూ, వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప, మరొకటి లేదు అనేవారూ, పుష్పించిన పూలవలె, శోభాయమానమైన మాటలు పలుకుతారు. వారు వాంఛాపరులు. స్వర్గమే అత్యత్తమము అన్న అభిప్రాయం కలవారై, భోగైశ్వర్యప్రాప్తి కొరకు చేయవలసిన అనేక క్రియావిశేషాలు చెబుతారు. వారు చెప్పిన కర్మలు, జన్మలకు కారణం.

వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి.. కర్మకాండ, జ్ఞాన-కాండ, ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం, స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మకాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు, వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు. దేవతాలోకాల్లో, ఉన్నతమైన భౌతిక విలాసములుంటాయి. అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు, అనువుగా ఉంటాయి. కానీ, స్వర్గ లోకాలకు ఉద్ధరణ అనేది, ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గ లోకాలు కూడా, భౌతిక, ప్రాపంచిక జగత్తులోని భాగమే.. అక్కడికి వెళ్లిన పిదప, పుణ్యం ఖర్చయిపోయిన తరువాత, తిరిగి భూలోకానికి రావలసిందే. అవివేకులూ, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారూ, వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని, ఆ స్వర్గాది లోకాలకోసం పాటుపడుతారు. ఈ విధంగా వారు, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించక, జీవన్మరణ చక్రంలో పడి, తిరుగుతూనే ఉంటారు. అందువల్ల, ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు, స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు.

మన తదుపరి వీడియోలో, ప్రాపంచిక భోగాలూ, సుఖాలనూ వదిలి, భగవత్ ప్రాప్తి పథంలో, ఏ విధంగా ముందుకు పయనించాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgyhtOy9OaCD87K74-54AaABCQ

No comments: