Ads

20 October, 2022

దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita


దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 33 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bPRR1Z8dsUs ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:42 - అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।

అక్షరములలో అ-కారమునూ, సమాసములలో ద్వంద్వ సమాసమునూ, అపరిమితమైన కాలమునూ, మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే.

సంస్కృతములో అన్ని అక్షరములు కూడా, సగం అక్షరాన్ని, "అ" కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. కాబట్టి, అ-కారము అనేది, సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యతగలది. "అ" అనేది, అక్షరమాలలో మొదటి అచ్చు. అంతేకాక, అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి, "అ" అనేది మొట్టమొదటే వచ్చే అక్షరం. సంస్కృతమనేది చాలా ప్రాచీనమైన భాషే అయినా, అది అత్యంత నాగరికమైనది, మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో, రెండు కానీ, అంతకంటే ఎక్కువ కానీ పదాలు, వాటి చివరలు కోల్పోతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ 2) బహువ్రీహి ౩) కర్మ ధారయ 4) తత్పురుష 5) ద్విగు 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది. ఎందుకంటే, రెండు పదాలకీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలు కలిపితే, మూడవ పదానికి అర్థం ఇస్తుంది. సృష్టి అనేది అత్యత్భుతమైనది, మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా, సృష్టితో పోల్చితే, అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తునూ తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరు సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడని, శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.

02:38 - మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।

సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా, నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తినీ, సిరిసంపదనూ, చక్కటి వాక్కునూ, జ్ఞానశక్తినీ, మేధస్సూ, ధైర్యము మరియు క్షమాగుణమును. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవమూ తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది. అందుకే, “dead end” అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా, వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడతాయి, మరికొన్ని గుణములు, పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడతాయి. నిజానికైతే, అసలు ఈ రెండు రకాల గుణములూ కలిగి ఉండటమే, సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమనే లక్షణములు, స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఇందులో మొదటి మూడు గుణములూ, బాహ్యంగా వ్యక్తమవుతాయి. అలాగే, తరువాతి నాలుగూ, ఆంతరంగముగా వ్యక్తమవుతాయి. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి, ఇరవై నాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. వారు కీర్తి, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ. శ్రీ అనే ఆమె, భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె, బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా, ఈ ఏడుగురు స్త్రీలూ, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.

04:41 - బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।

సామ వేద మంత్రములలో నేనే బృహత్సామమని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాగములో మార్గశీర్ష మాసమునూ, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువునూ నేనే.

ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు సామవేదములో తానే, శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును, అని అంటున్నాడు. సాధారణంగా దీనిని, మధ్యరాత్రి సమయంలో పాడతారు. సంస్కృత భాష, ఇతర భాషలలో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస, మరియు ఛందస్సూ కలిగి ఉంది. వేదాలలోని శ్లోకాలు, ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు, చాలా ఆకర్షణీయమయినది, మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము, గాయత్రీమంత్రము. మార్గశీర్షమనేది, హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో, ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు, లేదా మరీ అంత చల్లగానూ ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది జనులకు చాలా ఇష్టమైన నెల. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు. ప్రకృతి ఆహ్లాదకరంగా, తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వంసత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు, భగవంతుని యొక్క విభూతిని చక్కగా వ్యక్తీకరిస్తుంది.

06:29 - ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।

మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమునూ, ధర్మపరాయణులలో సద్గుణమునూ నేనే.

శ్రీ కృష్ణుడు, సద్గుణాలే కాక, దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదమనేది, ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు. అది కుటుంబాలనూ, వ్యాపారాలనూ, జీవితాలనూ నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్టురుడి బలహీనతే, మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే, అది హానికరం కాదా? మరి అది ఎందుకు నిషేధించబడింది - అంటే, దానికి సమాధానం, భగవంతుడు తన శక్తిని జీవాత్మకు ప్రసాదిస్తాడు. దానితో పాటుగా, నచ్చిన పనిని చేయటానికీ, ఎంచుకోవటానికీ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. మనం ఆయనను మరచిపోవటం ఎంచుకుంటే, మరచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని, ఇంటిని వెచ్చబరచటానికీ, లేదా చల్లబరచటానికీ, రెంటికీ వాడుకోవచ్చు. ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో, వినియోగదారుడి ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా, లేదా దుర్వినియోగం చేసినా సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలూ, సామర్ధ్యమూ ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకను దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికీ విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు, దృఢ సంకల్పమనే గుణానికి, ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా, భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలూ, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు ధృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవని గమనించాలి.

08:40 - వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని, మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడనని తెలుసుకొనుము, మరియు, గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.

శ్రీ కృష్ణ భగవానుడు, భూ-లోకంలో వృష్ణి వంశములో, వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మ అయినా, భగవంతుడి కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే, పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులైన యుధిష్టిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు, సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు, మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించినవాడు. వేద వ్యాసుడు, మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు "బాదరాయణుడు", మరియు "కృష్ణ ద్వైపాయనుడు" అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేశాడు, మరియు ఎన్నో పురాణాలను, మానవుల సంక్షేమం కోసం వ్రాశాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే.. అలాగే, శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో ఒకడిగా, వేద వ్యాసుడు పేర్కొనబడ్డాడు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని. నీతి, ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో, ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులను తన శిష్యులుగా చేసుకుని, వారి పురోగతికై దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రావీణ్యం వలన, ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.

10:22 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

17 October, 2022

‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! Uddhava Gita


‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఉద్ధవుని గురించి తెలుసుకుంటే గానీ అర్ధం కాదు. ఉద్ధవుడు చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడికి ఎన్నో సేవలు చేశాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కానీ, తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు, భగవంతుడిని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తికి ముందు, ఉద్ధవుడితోనే మాట్లాడాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ధర్మాన్ని బోధించాడు. అది భగవద్గీతగా, ముఖ్య పారాయణ గ్రంధంగా ప్రజ్వరిల్లుతోంది. అలాగే, శ్రీ కృష్ణుడు చివరిగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు, ‘ఉద్ధవ గీత’గా ఖ్యాతి గడించింది. అసలు ఉద్ధవ గీతలో ఏముంది? ఉద్ధవుడు శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? కర్మ గురించి వాసుదేవుడు వివరించిన సందేశం ఏంటి -  వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/buXxa_0VE5w ]

ఉద్ధవ గీత అనేది, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అనడం సమంజసం. ఈ ‘ఉద్ధవ గీత’ అనేది, శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభమై, ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం "ఉద్ధవ గీత"లో, వెయ్యికి పైగా శ్లోకాలున్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే, ఉద్ధవగీతగా జగత్ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే, ‘ఉద్ధవ గీత’, భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. పరమాత్మలోని దివ్య సుగుణాలన్నీ, ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి, ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్నీ.., వాయువు నుంచి పరోపకారాన్నీ, ప్రాణస్థితి నిలకడనూ.., ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అనీ.., జలం నుంచి నిర్మలత్వాన్నీ, పావనత్వాన్నీ.., అగ్ని నుంచి దహించే శక్తినీ గ్రహించి, తన దేహం పాంచ భౌతాత్మకమనీ, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలనీ తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది, ఉద్ధవ గీత.

శ్రీ కృష్ణుడు ఉద్ధవుడితో, ఏదైనా వరం కోరుకో అని చెప్పగా అందుకు ఉద్ధవుడు, ‘దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు కానీ, నిన్ను ఓక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. అడుగవచ్చునా?’ అని, వినయంగా ఇలా అడిగాడు.. ‘కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి, నన్ను అనుగ్రహించండి.’ అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు.’ అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.

‘కృష్ణా, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసినవాడవు. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి, కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తినంతా పోగొట్టుకుని, వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి, వాళ్ళను కాపాడి ఉండవచ్చును కదా? కౌరవులు దుర్బుద్ధితో, పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో, పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు, ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని, గొప్ప పేరుపొందావు. కానీ, ముందే నీవు కలుగచేసుకుని ఉంటే, ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. మరి, నీవు చేసినదేమిటి కృష్ణా?’ అని ఉద్ధవుడు ఎంతో బాధతో, కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్ధించాడు. నిజానికి ఈ సందేహములు, మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ‘ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం, అన్ని విధాలా జాగ్గ్రత్త పడి, తగిన చర్యలను తీసుకునే వాడే, గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా, ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం, ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.

ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమునూ కోరలేదు. ఒకవేళ శకునితో నేను జూదమాడి ఉంటే, ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే ఆలోచించుము..? సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా, కృష్ణుడు రాకూడదు అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక, చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే.. భీముడూ, అర్జునుడూ, నకుల సహదేవులు కూడా, ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ, ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా, నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక, గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని రక్షించలేదా?’ అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.

కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి, ‘కృష్ణా! అలాగైతే, మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా, నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చేడు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మము’ అని వివరించాడు. ఆ సమాధానానికి ఉద్ధవుడు ఆశ్చర్య చకితుడై, ‘అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి, పాపములను మూట కట్టుకుంటుంటే, నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము కృష్ణ’ అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు. నీకే అర్ధమవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడనీ, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడనీ గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరచినప్పుడే, మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు, జూదము గురించి నాకు తెలియదనుకోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే, ఆట పాండవులకు అనుగుణంగా సాగేది’ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు. వాసుదేవుడు బోధించిన మధురమైన గీతను విని, ఉద్ధవుడు ఎంతో ఆనందించి, తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో, కృష్ణుడికి నమస్కరించాడు. పూజలూ, ప్రార్థనలూ భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే. కానీ, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే, అంతటా ఆయనే కనిపిస్తాడని, సమస్త మానవళికీ తెలియజేసేదే ‘ఉద్ధవ గీత’.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxmu0PlOYJc2H3O7EySIXJqt_kOxH60_Ha

09 October, 2022

ఆదికవి వాల్మీకి జయంతి! Valmiki Jayanthi


అందరికీ 'ఆదికవి వాల్మీకి జయంతి' శుభాకాంక్షలు! 09-10-2022

మహర్షి వాల్మీకి, గొప్ప భారతీయ ఇతిహాస గ్రంథమైన 'శ్రీమద్ రామాయణ' గాధ రచయిత. ఆయన మొదటి సహస్రాబ్ది ప్రారంభంలో నివసించిన ఒక హిందూ మహర్షి. ఆయన 'ఆదికవి'గా పేరుగాంచారు. హిందూ 'స్లోకం' యొక్క అసలు సృష్టికర్త.

[ వాల్మీకి మహర్షి చరిత్ర = https://youtu.be/ceNwjWyMyeg ]

నిజానికి 'వాల్మీకి' భృగు వంశానికి చెందిన పుట్టుకతో ఒక బ్రాహ్మణుడు. విధి అతన్ని దొంగల కుటుంబానికి అప్పగించింది. సప్తర్షులు, మరియు నారద మహర్షితో అనుకోకుండా ఏర్పడిన పరిచయం, ఆయన జీవితాన్ని మార్చివేసింది. రామ నామాన్ని, లేదా రాముని పేరును పునశ్చరణ చేయడం ద్వారా, ఆయన 'మహర్షి', లేదా గొప్ప 'ఋషి' అనే అత్యున్నత స్థితిని పొందారు. దీర్ఘ కాలం తపస్సు చేసిన సమయంలో ఆయన శరీరంపై ఒక 'వల్మీకం' లేదా 'పుట్ట' పెరిగింది. తద్వారా ఆయనకు 'వాల్మీకి' అనే పేరు వచ్చింది.

మహర్షి నారదుడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు, ఆయనను సముచిత గౌరవంతో ఆహ్వానించి, ఆయనను వాల్మీకి ఒక ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో ఆదర్శ పురుషుడు ఎవరు? అని. అప్పుడు నారద మహర్షి ఇచ్చిన సమాధానమే, వాల్మీకి 24,000 శ్లోకాలతో కూడిన అద్భుతమైన కావ్యానికి పునాదిగా మారింది. ఈ కథలో లోతుగా మునిగి, వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి తమసా నదికి బయలుదేరాడు.

ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన నది, ఆయనకు కథానాయకుడి యొక్క పరిపక్వత, మరియు నిరాడంబరమైన గుణాన్ని, చూసేవారికి గుర్తు చేసింది. లోతైన నీటిలో ప్రతిబింబించే స్వచ్ఛమైన, మరియు పవిత్రమైన వ్యక్తి యొక్క మనస్సును, ఆయన దృశ్యమానం చేశాడు. మరుసటి క్షణంలో, హృదయం లేని వేటగాడు, ప్రేమ పక్షుల జంటలోని మగ పక్షిని కనికరం లేకుండా చంపడాన్ని ఆయన చూశాడు. బాధలో ఉన్న ఆడపక్షి యొక్క దయనీయమైన రోదన, ఋషి హృదయాన్ని ఎంతగానో కదిలించింది. ఆయన వేటగాణ్ణి శపించాడు. ఆ శాపం, ఆయన నోటి నుండి 'శ్లోకం' రూపంలో వెలువడింది. ఋషి 'కవి'గా మారాడు..

ఆయన తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు, చతుర్ ముఖ బ్రహ్మ ఆయనకు కనిపించాడు. నారద మహర్షి రాముడి కథపై ఒక పురాణ కావ్యాన్ని రచించమని ఆదేశించాడు. నారద మహర్షి ఆయనకీ అన్ని సంఘటనల దర్శన వరం, మరియు కథతో అనుసంధానించబడిన అన్ని రహస్యాలనూ బహిర్గతం చేశాడు. తదనుగుణంగా వాల్మీకి ఇతిహాసాన్ని రచించాడు. దానికి రామాయణం అని పేరు పెట్టాడు. సదరు రామాయణం, యుగయుగాలుగా, ఒక మనిషి ధర్మ బద్ధంగా జీవించడానికి నిలువెత్తు నిదర్శనంగా 'శ్రీరాముణ్ణి' చూపిస్తుంది.

ఈ వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హిందువూ మహర్షి వాల్మీకి విరచిత రామాయణాన్ని చదివి, ప్రభువులకే ప్రభువైన శ్రీ రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని, ధర్మ బద్ధమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను..

ధర్మో రక్షతి రక్షితః!