Ads

09 October, 2022

శరద్ పూర్ణిమ / కోజాగరీ పూర్ణిమ విశిష్టత! Sarad Purnima / Kojagari Purnima


ఈ రోజు '09-10-2022' శరద్ పూర్ణిమ..

ఆశ్వీయుజ పూర్ణిమకే శరద్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరద్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్ర కాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరద్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు, వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట.

ఈ పూర్ణిమకే కోజాగరీ పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అందరికీ శరద్ పూర్ణిమ శుభాకాంక్షలు..

ఓం శ్రీ మాత్రే నమః

05 October, 2022

అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavad Gita

  

అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 27 నుండి 32 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bs3KpJUcTQA ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:43 - ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ।। 27 ।।

గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైఃశ్రవసమును. గజేంద్రములలో నేను ఐరావతమును, మరియు మనుష్యులలో రాజును.

తన వైభవాన్నీ, మహిమనూ తెలియపరచటానికి, ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసమనేది, దేవలోకాల్లో ఉన్న అత్యంత శ్రేష్ఠమైన రెక్కల గుఱ్ఱము. అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది, మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. ఉచ్చైఃశ్రవసము, సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము, ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని ఏనుగు. దానినే, అర్ధ-మాతాంగము అని కూడా అంటారు. అంటే, "మేఘాలలో ఉండే ఏనుగు" అని అర్థం. ఐరావతం, గజములన్నింటిలో అత్యుత్తమమైనది.

01:47 - ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।

ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో, కామదేవుడైన మన్మథుడను,  సర్పములలో వాసుకిని నేను.

వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి, దధీచి మహాముని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధంతోనే, వృత్తాసురుడిని సంహరించాడు. సమస్త లోకాలలో కెల్లా, అన్ని ఆయుధాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం, వజ్రాయుధం. తన దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రమూ, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు సూచికగా ఉదహరిస్తున్నాడు, భగవానుడు. మైథున క్రియ అనేది, మంచి సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు, అది అపవిత్రమయినది కాదు. సంతానోత్పత్తి ద్వారా, మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి, మన్మధుడు కారణం. ఈ లైంగిక వాంఛకు మూలం, భగవంతుని యందే ఉంది. దీనిని ఇంద్రియ తృప్తి కోసం దుర్వినియోగం చేయకూడదు. కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి.

03:04 - అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। 29 ।।

నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో, నేను యమధర్మరాజును.

అనంతుడు అంటే, ఆది శేషుడు. ఇది విష్ణుమూర్తి శయనించే నాగుపాము. ఆయనకు పదివేల పడగలున్నాయి. ఆయన ప్రతియొక్క తలతో, భగవంతుని మహిమలను, సృష్టి ప్రారంభం నుండి గానం చేస్తూనే ఉన్నాడు. వరుణుడు అంటే, సముద్ర దేవత. అర్యముడు అంటే, అదితి యొక్క మూడవ పుత్రుడు. ఆయనను పితృగణముల నాయకునిగా పూజిస్తారు. యముడు అంటే, మృత్యు దేవత. ఈ జన్మలో ఆత్మ చేసిన వాటికి అనుగుణంగా, వచ్చే జన్మలో శిక్షలను, లేదా ఉత్తమగతులను, భగవంతుని తరపున అందిస్తాడు. అవి ఎంత భయంకరముగా, బాధాకరముగా ఉన్నా, తన ధర్మం నుండి కొద్దిగా కూడా తప్పడు. సంపూర్ణ దోషరహిత న్యాయమును అందించే వానిగా, ఆయన భగవంతుని యొక్క మహిమను ప్రకటిస్తున్నాడు.

04:13 - ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ।। 30 ।।

దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడనని తెలుసుకొనుము.

మహాశక్తి శాలి అయిన రాక్షస రాజు హిరణ్యకశిపుడి పుత్రుడిగా, ప్రహ్లాదుడు జన్మించాడు. కానీ, అతను అతి గొప్ప విష్ణు భక్తులలో ఒకనిగా అయ్యాడు. అందుకే, రాక్షసులలో ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విభూతిని ప్రకటిస్తున్నాడు. కాలమనేది, విశ్వములోని అత్యంత బలమైన, గొప్ప అస్థిత్వాలను కూడా లోబరుచుకుంటుంది. గంభీరమైన సింహము, అడవికి రారాజు, మరియు జంతువులలో భగవంతుని యొక్క శక్తి, సింహములో వ్యక్తమవుతుంటుంది. విష్ణు మూర్తి యొక్క దివ్య వాహనమైన గరుత్మంతుడు, పక్షులలో కెల్లా గొప్ప వాడు.

05:11 - పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।।

పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.

ప్రకృతిలో ఉన్న వాయువు, పవిత్రమొనర్చే పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది మలినమైన నీటిని నీటి ఆవిరిగా చేస్తుంది; భూమిపై ఉండే ఏదేనీ దుర్గంధమును తీసుకువెళ్ళిపోతుంది; ప్రాణవాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి, అగ్నిని మండేట్టుగా చేస్తుంది. ఈ విధంగా అది ప్రకృతిలో ఒక గొప్ప పవిత్రమొనర్చే పదార్ధము. శ్రీ రామచంద్రప్రభువు, భూమిపై అత్యంత శక్తివంతులైన యోధులలో ఒకడు. ఆయన విల్లు అత్యంత ప్రాణాంతకాయుధము. అయినా, ఆయన ఒక్కసారి కూడా తను శాసించే ఉన్నత స్థాయిని దుర్వినియోగం చేయలేదు. తను ఆయుధం ఉపయోగించింది, మంచి కోసం మాత్రమే. అందుకే ఆయన శస్త్రధారులలో సర్వోన్నతుడు. రాముడు భగవంతుని అవతారము కూడా. అందుకే శ్రీ కృష్ణుడు, ఆయనను తనుగా సూచిస్తున్నాడు. భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగా నది, ఒక పవిత్రమైన నది. అది స్వర్గ లోకముల నుండి భూమి పైకి దిగినది. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, ఆ నది యొక్క ఒడ్డున తపస్సునాచరిస్తుంటారు. సాధారణ నీటి లాగా కాకుండా, గంగా నది యొక్క నీళ్ళను ఒక బిందెలో పట్టి ఉంచితే, అది ఎన్ని సంవత్సరాలయినా పాడు కాదు. పూర్వ కాలంలో ఇది ఎంతో ప్రస్ఫుటంగా, గమనించదగినట్లుగా ఉండేది. కానీ, ఇప్పటి కాలంలో, కోట్ల లీటర్ల కాలుష్యకారకాలను గంగలో కలిపేయటం వలన, ఈ ప్రభావం కొంచం తగ్గింది. కానీ, ఎన్ని యుగాలు మారినా, గంగ తన స్వచ్ఛతను కొల్పోలేదు.

07:02 - సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికీ ఆది, మధ్య మరియు అంతమని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను, మరియు సంవాదములలో తర్కబద్ద నిర్ణయమును నేనే.

సృష్టి చేయబడిన ఆకాశమూ, గాలీ, అగ్నీ, నీరు మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్తగా ఆది, స్థితికర్తగా మధ్యమ, మరియు లయకర్తగా అంతమును. కాబట్టి, సృష్టి, స్థితి మరియు లయ ప్రక్రియలను, భగవంతుని విభూతిగా పేర్కొనవచ్చు. విద్య అనేది, ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రధానమైనవి పద్నాలుగు: "శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, చ్చందస్సు - ఈ ఆరూ వేదాంగములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగూ వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములూ కలిపి, మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు." ఈ విద్యలు అధ్యయనం చేయటం వలన, బుద్ధి పెంపొందించబడి, జ్ఞానం వృద్ధి చేంది, ధర్మ మార్గ అవగాహన ఏర్పడుతుంది. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, మనుష్యులను భౌతిక, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేసి, వారికి అమరత్వమును ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం, శ్రీ మద్భాగవతం లో కూడా చెప్పబడింది: "సా విద్యా తన్మతిర్యయా" అంటే, భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే, అత్యుత్తమ విద్య అని క్షుణ్ణంగా వివరించబడి ఉంది. వాదోపవాదములు, మరియు తర్కములో జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం, ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే, సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ, అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే, చర్చకు తర్కబద్ధమైన ముగింపును ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికీ, సత్యమును స్థిరపరచటానికీ, తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికీ, మరియు ఉపదేశించటానికీ, తర్కబద్ధమైన స్పృహయే, మూలాధారం. విశ్వవ్యాప్తమైన తర్కబద్ధ సూత్రములే, భగవంతుని శక్తికి నిదర్శనం.

09:39 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

02 October, 2022

'ఆడపిల్ల తండ్రి' భారతీయ సంస్కృతి - రామాయణ నీతి!

 

భారతీయ సంస్కృతి - రామాయణ నీతి!

ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుడు..

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో, జనక మహారాజు ద్వారం వద్దకు చేరాడు..

జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం పలికాడు.

వెంటనే దశరథ మహారాజు, ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు.

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి, సంతోషంతో  ఆలింగనం చేసుకుని,
“రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..
ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?
గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా?” అని అన్నాడు ఆశ్చర్యంగా..

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన సమాధానం చెప్పాడు..
”మహారాజా, మీరు దాతలు.. కన్యదానం చేస్తున్నారు..
నేను మీ ద్వారా కన్యను పొందడానికి వచ్చిన యాచకుణ్ణి..
ఇప్పుడు చెప్పండి.. దాత, మరియు యాచకులలో ఎవరు గొప్ప?” అని అన్నాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళవెంట ఆనందభాష్పాలు స్రవిస్తుండగా..
“ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో, వాళ్ళు భాగ్యవంతులు. ప్రతి కూతురి అదృష్టంలో తండ్రి ఉంటాడు.”

ఇదీ భారతీయత.. ఇదీ మన సనాతన సంస్కృతి.. ఇదీ రామాయణం నీతి!

రేపటి తరానికి బ్రతుకూ, భద్రతలతో పాటు, భారతీయతను కూడా నేర్పిద్దాం..

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!

లోకా సమస్తా సుఖినోభవంతు!