Ads

Showing posts with label ‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు. Show all posts
Showing posts with label ‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు. Show all posts

02 March, 2022

‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు.. Bhagavadgita

  

‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు..

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (06 - 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/DglWrsZAmOA ]

ఇంద్రియములను జయించిన వారై, ప్రశాంతంగా ఎలా జీవించాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - బంధు రాత్మాఽఽత్మన స్తస్య యేనాత్మై వాత్మనా జితః ।
అనాత్మ నస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ ।। 6 ।।

మనస్సుని జయించినవారికి, అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.

మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తిలో చాలా భాగాన్ని వెచ్చిస్తాం. అయితే, మన వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, ఈర్ష్యా, భ్రాంతీ మొదలైనవి, మనలోనే ఉంటాయని చెబుతున్నాయి. ఈ అంతర్గత శత్రువులు, బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బాహ్య శత్రువులు మనలను కొంత వరకే బాధిస్తాయి. కానీ, మనలోనే ఉండే శత్రువులు, మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేస్తాయి. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ సొంత మనస్సు వలన, మానసిక కుంగుబాటూ, ద్వేషమూ, ఆందోళన, బెంగ, మరియు ఒత్తిడి వంటి వాటితో, దౌర్భాగ్యమైన జీవితం గడిపిన వారూ, గడుపుతున్న వారూ, అనేక మంది ఉన్నారు. వైదిక తత్వ శాస్త్రం, వ్యాధులనేవి, వైరస్, బ్యాక్టీరియాల వలన మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనల వలన కూడా వస్తాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా పొరపాటుగా మీ మీదకు రాయి విసిరితే, అది కొద్ది సేపు మాత్రమే మిమ్మల్ని బాధిస్తుంది. కానీ, తరువాతి రోజు దాని గురించి మనం మరచిపోతాము. అదే మనల్ని బాధించే మాట అంటే, అది ఎన్నో సంవత్సరాల వరకూ మనలను బాధిస్తూనే ఉంటుంది. ఇదే ఆలోచనల యొక్క శక్తి.

02:24 - జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ।। 7 ।।

మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములూ, సుఖదుఃఖములూ, మానావమానముల వంటి ఈ ద్వంద్వములకు అతీతంగా, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు, ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.

ఇంద్రియములకూ, ఇంద్రియ వస్తువిషయ సంపర్కంచే మనస్సుకీ, శీతోష్ణములూ, సుఖదుఃఖాలూ అనుభవంలోనికి వస్తాయి. మనస్సు నిగ్రహింపబడని వరకూ, వ్యక్తి ఇంద్రియ భోగ-సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి, ఈ క్షణభంగురమైన, తాత్కాలికమైన పరిణామాలను, శారీరక, ఇంద్రియ పనులుగా గుర్తించి, అవి నిత్య శాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకుని, వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి, శీతోష్ణములూ, సుఖ-దుఃఖాలూ మొదలైన వాటికి, అతీతంగా ఉంటాడు. మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలున్నాయి. ఒకటి మాయా లోకం, మరొకటి భగవత్ లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక, ఇంద్రియ ద్వందములకు అతీతంగా ఎదగ గలిగితే, అది సునాయాసంగా భగవంతుని యందు నిమగ్నమవుతుంది. ఈ విధంగా, పురోగమించిన యోగి యొక్క మనస్సు, భగవంతుని ధ్యాసలో, సమాధి యందు స్థితమవుతుంది.

03:51 - జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థొ విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ।। 8 ।।

జ్ఞానమూ, విజ్ఞాన విచక్షణా కలిగి, తృప్తితో ఉన్నయోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టీ, రాళ్ళూ, మరియు బంగారమూ, వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు.

జ్ఞానము అంటే, గురువు గారి దగ్గర విని, శాస్త్ర గ్రంధములు చదివి, సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే, అంతర్గతంగా, అనుభవ వేద్యమైన జ్ఞానము. ఇది అంతర్గంతంగా విచ్చుకునేది. ఈ జ్ఞానమూ, విజ్ఞానములనే రెండింటిచే, ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి, ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగిఉన్న యోగి, అన్ని భౌతిక వస్తువులను కూడా, భౌతిక శక్తి యొక్క ప్రతి రూపాలుగా చూస్తాడు. అన్ని వస్తువులనూ, భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి, అన్ని వస్తువులూ ఆయన సేవ కొరకే ఉన్నాయి. పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఇటువంటి వ్యక్తి, భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలుపెడతాడు. కాబట్టి, తృప్తాత్మ అవుతాడు. అంటే, అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంచే, సంపూర్ణ తృప్తిని పొందుతాడు.

05:11 - సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ।। 9 ।।

శ్రేయోభిలాషులనూ, మిత్రులనూ, శత్రువులనూ, సాధువులనూ, పాపులనూ - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు.

మిత్రులూ, సహచరులూ, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువులూ, బంధువుల పట్లా తటస్థంగా, మరియూ పుణ్యాత్ములూ, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి, మానవులలో సర్వ శ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. మిత్రుల పట్లా, శత్రువుల పట్లా వేర్వేరు విధంగా స్పందించటం, మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం, వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగి ఉన్న ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టినీ భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులనూ సమ దృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా, చాలా స్థాయిలలో ఉంటుంది:

1. "అన్ని ప్రాణులూ దివ్యాత్మలు. కాబట్టి, భగవంతుని అంశలే." అందుకే వారు సమానంగా చూడబడతారు. నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు కాబట్టి, తన లాంటి వారిగానే చూస్తాడు."

2. అంతకన్నా ఉన్నత మైన దృష్టి ఇది: "భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి, అందరూ గౌరవింపబడదగిన వారే."

3. అత్యున్నత స్థాయిలో, యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు: "ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే." జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని, వైదిక వాఙ్మయం పదే పదే పేర్కొంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోటా నిండి ఉన్నాడు. ప్రతిదీ, ఆయన శక్తి స్వరూపమే. కాబట్టి, అత్యున్నత యోగి, ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉన్నవారే, యోగులు.

07:02 - యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ।। 10 ।।

యోగస్థితిని పొందగోరేవారు, నియంత్రించబడిన మనస్సూ, శరీరంతో, భగవత్ ధ్యానంలో, కోరికలనూ, భోగ వస్తువులనూ త్యజించి, ఏకాంతంలో ఉండాలి.

ఏదైనా ఒక విషయంలో నైపుణ్యత సాధించాలంటే, ప్రతి రోజూ సాధన అవసరం. అనుదినమూ అభ్యాసం చేసినవాడే, ప్రావీణ్యతను సాధిస్తాడు, విజేత అవుతాడు. అభ్యాసం అనేది, ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా, చాలా అవసరం. ప్రతి రోజూ ధ్యానాభ్యాసము ద్వారా, ఆధ్యాత్మిక ప్రావీణ్యతను సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాం. ఈ ప్రాపంచిక కార్యక్రమాలూ, జనులూ, వారి మాటలూ, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి కొంత సమయాన్ని, ప్రతి రోజూ, ఏకాంత సాధనకు ఉపయోగించాలి. పాలను నీళ్ళలో పోస్తే, అది తన స్వీయ అస్థిత్వాన్ని నిలుపుకోలేదు. ఎందుకంటే, నీరు దానితో కలిసి పోతుంది. కానీ, అదే పాలను నీటి కంటే వేరుగా ఉంచి, దానిని పెరుగు చేసి, ఆ పెరుగునుండి తీసిన వెన్నను నీటిలో వేస్తే, దాని అస్థిత్వాన్ని కోల్పోదు. అలానే, మన మనస్సు పాల వంటిది. ఈ ప్రపంచం నీళ్ళ వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన, మనస్సు దానిచే ప్రభావితమై, ప్రాపంచికంగా అవుతుంది. కానీ, ఇంద్రియ వస్తువిషయములతో అతితక్కువ సంబంధం కలిగి ఉండే ఏకాంత వాతావరణం, మనస్సుని పై స్థాయికి తీసుకెళ్ళి, భగవంతునిపై కేంద్రీకరించటానికి, అనుకూలంగా ఉంటుంది. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి, మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికీ, మరియూ భగవంతునిపై కేంద్రీకరించటానికీ, 'సాధన' చేయాలి. ఇలా రోజుకి ఒకటి, లేదా రెండు గంటలు అభ్యాసం చేస్తే, ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా, దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా, ఏకాంతంలో రోజువారీ సాధన ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని, కాపాడుకోవచ్చు.

ఇక మన తదుపరి వీడియోలో, మన మనస్సుని ఏకాంత ధ్యానం ద్వారా ఎలా పరిశుద్ధమొనర్చుకోవాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!