'యోగమాయ' – నశ్వరమైన దేవతల ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా నశించిపోయేవే!
'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (21 – 25 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 21 నుండి 25 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ex7Ad5FAOk0 ]
అక్షరమైన, సర్వోత్కృష్టమైన భగవంతుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకునే వారి గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..
00:49 - యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ।। 21 ।।
భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.
పరమేశ్వరుడి ఆరాధనలో విశ్వాసం అనేది, మనకు అత్యంత ప్రయోజనకరమైన విశ్వాసం. అది నిజమైన జ్ఞానం ద్వారానే లభిస్తుంది. కానీ, ప్రపంచంలో మన చుట్టూ చూసుకుంటే, వివిధ దేవతలను ఆరాధించే అసంఖ్యాకమైన భక్తులు కూడా కనబడుతుంటారు. వీరు తమ భక్తిలో ధృడమైన, మరియు నిస్సంకోచమైన విశ్వాసంతో ఉంటారు. దేవతలపై విశ్వాసం కూడా తానే కలిగిస్తున్నాడని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. జనులు భౌతిక, ప్రాపంచిక కోరికలను నెరవేర్చుకోవటానికి, దేవతల ఆరాధన చేయటం చూసినప్పుడు, ఆయనే వారి విశ్వాసాన్ని బలపరచి, వారి భక్తిలో సహాయపడతాడు. దేవతలకు తమంతతామే, భక్తులలో విశ్వాసం పెంచే సామర్థ్యం లేదు. జనులలోనే స్థితమై ఉన్న పరమాత్మయే, వారిలో శ్రద్ధని ప్రేరేపిస్తాడు. జీవాత్మలు, భౌతిక వస్తు సంపద కోసం దేవతారాధన చేసినప్పుడు, ఈ అనుభవం వారి ఆత్మ ఉద్ధరణకు మున్ముందు ఉపయోగపడుతుందనే ఆశతో, భగవంతుడే వారి శ్రద్ద/విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ తరువాత, ఏదో ఒక రోజు జీవాత్మ, భగవంతుడే పరమపురుషార్థమని తెలుసుకుని, ఆ పరమేశ్వరునికి శరణాగతి చేస్తుంది.
02:26 - స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ।। 22 ।।
శ్రద్ధా, విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు, ఆ దేవతనే ఆరాధించును, మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి ఆ ప్రయోజనాలను సమకూర్చి పెట్టేది నేనే.
దేవతల యొక్క భక్తులు, వారు కోరుకున్న వాటిని ఆయా దేవతల ఆరాధనతో పొందుతారు. కానీ, నిజానికి వాటిని ప్రసాదించేది భగవంతుడేగానీ, దేవతలు కాదు. భౌతిక ప్రయోజనాలను సమకూర్చి పెట్టే అధికారం, దేవతలకు లేదనీ, భగవంతుడు ప్రసాదించినప్పుడే, వాటిని దేవతలు ఆయా భక్తులకు అనుగ్రహిస్తారనీ, ఈ శ్లోకం స్పష్టంగా చెపుతున్నది. కానీ, మిడిమిడి జ్ఞానంతో ఉన్న జనులు, వారు ఆరాధించే దేవతల ద్వారానే ఇవి వస్తున్నాయని అనుకుంటారు.
03:20 - అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ ।
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ।। 23 ।।
కానీ, ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము, తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు, ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో, నా భక్తులు మాత్రం, నన్నే చేరుకుంటారు.
ప్రాథమిక పాఠశాల అవసరమే.. కానీ, విద్యార్థులు దానిని ఏదో ఒక రోజు మించి పోవాలి. ఒకవేళ ఏ విద్యార్థి అయినా, ప్రాథమిక పాఠశాలలో అవసరానికి మించి ఉండదలచితే, ఉపాధ్యాయులు వారిని హర్షించరు. అంతేకాక, ఆ విద్యార్థికి జీవితంలో ముందుకెళ్ళటానికి శిక్షణ ఇస్తారు. అదే విధంగా, దేవతలను ఆరాధించదలిచే ప్రారంభ దశలో ఉన్న భక్తుల యొక్క విశ్వాసాన్ని, శ్రీ కృష్ణుడు బలపరుస్తాడు. కానీ, భగవత్ గీత ఆనేది, ప్రాథమిక దశ విద్యార్థుల కోసం కాదు. కాబట్టి, ఆయన ఆర్జునుడిని ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. "మనిషి తను ఆరాధించే వస్తువునే పొందుతాడు. దేవతలను ఆరాధించేవారు, ఆయా దేవతల లోకాలకు, మరణించిన పిదప వెళ్తారు. నన్ను ఆరాధించే వారు, నా దగ్గరికి వస్తారు." అని శ్రీ కృష్ణుడు స్వయంగా వివరిస్తున్నాడు. దేవతలే నశ్వరమైన వారు కాబట్టి, వారి ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా, నశించిపోయేవే. కానీ, భగవంతుడు నిత్యుడూ, శాశ్వతుడూ కాబట్టి, ఆయన ఆరాధనతో లభించేవి కూడా నిత్యమైనవి, శాశ్వతమైనవి. భగవంతుని భక్తులు, ఆయన యొక్క నిత్య, శాశ్వత సేవనూ, మరియు ఆయన ధామమునూ పొందుతారు.
05:05 - అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ।
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ ।। 24 ।।
పరమేశ్వరుడనైన నన్ను, శ్రీ కృష్ణుడిని - ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి, ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని, అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని, వారు అర్థం చేసుకోలేకున్నారు.
భగవంతుడు నిరాకారుడు మాత్రమే అని, కొందరు జనులు గట్టిగా వాదిస్తారు. మరికొందరు, పరమేశ్వరుడు కేవలం సాకార రూపంలోనే ఉంటాడని, అంతే గట్టిగా వాదిస్తారు. ఈ రెండు దృక్పథాలు కూడా, పరిమితమైనవీ, అసంపూర్ణమైనవీ. భగవంతుడు సంపూర్ణుడు, మరియు దోషరహితుడు. కాబట్టి, ఆయన నిరాకారుడు, మరియు సాకారుడు కూడా. ఆయన రూపం, నిరాకార బ్రహ్మం నుండి వ్యక్తమయినది కాదు. భగవంతుడు తన దివ్య మంగళ స్వరూపంతో, అనాదిగా దివ్య లోకాల్లో ఉన్నాడు. నిరాకర బ్రహ్మాం అనేది, ఆయన అలౌకిక శరీరము నుండి ఉద్భవించే కాంతి. "భగవంతుని దివ్య మంగళ స్వరూపము యొక్క కాలి గోళ్ళ నుండి జనించే కాంతినే, జ్ఞానులు బ్రహ్మంగా ఆరాధిస్తారు" నిజానికి ఆయన సాకార, మరియు నిరాకార తత్వాల మధ్య ఏమీ తేడా లేదు. వీటిలో ఒకటి ఎక్కువ, ఇంకోటి తక్కువ అని ఉండదు. నిరాకార బ్రహ్మంలో కూడా, భగవంతుని అన్ని శక్తులు, మరియు సామర్ధ్యాలు తప్పకుండా ఉంటాయి. కానీ, అవి అవ్యక్తము. ఆయన వ్యకిగత సాకార రూపంలో, తన నామాలూ, రూపమూ, లీలలూ, గుణములూ, ధామాలూ, మరియు పరివారమూ, అన్నీ తన దివ్య శక్తి ద్వారా ప్రకటించబడి, వ్యక్త మవుతాయి.
06:50 - నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ।। 25 ।।
నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను, అందరికీ వ్యక్తమవ్వను. కాబట్టి, జ్ఞానము లేని వారు, నేను పుట్టుక లేని వాడననీ, మరియు మార్పుచెందని వాడననీ తెలుసుకోలేరు.
పరమేశ్వరుడైన శ్రీ విష్ణు మూర్తికి, మూడు ముఖ్యమైన శక్తులున్నాయి - యోగమాయ, ఆత్మ మరియు మాయ. సర్వోత్కృష్ట శక్తిమంతుడైన శ్రీ కృష్ణుడికి, అనంతమైన శక్తులున్నాయి. వీటిలో, యోగమాయ, ఆత్మలు, మరియు మాయ అనేవి, ప్రధానమైనవి. ఆ యోగమాయా దివ్య శక్తి, భగవంతుని యొక్క సర్వ-శక్తిమంతమైన సామర్ధ్యము. దీని ద్వారానే, తన యొక్క దివ్య లీలలనూ, దివ్య ప్రేమానందమునూ, మరియు దివ్య ధామమునూ వ్యక్త పరుస్తాడు. ఆ యొక్క యోగమాయా శక్తి ద్వారానే, భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు, మరియు తన దివ్య లీలలను, ఈ భూలోకంలో కూడా ప్రకటిస్తాడు. ఇదే యోగమాయా శక్తిచే, తనను తాను మన నుండి గోప్యంగా ఉంచుకుంటాడు. భగవంతుడు మన హృదయంలోనే కూర్చుని ఉన్నా, ఆయన మనలోనే ఉన్న అనుభూతి మనకు తెలియదు. మనకు ఆయన దివ్య దర్శనం చూడగలిగే అర్హత లభించేవరకూ, ఆయన దివ్యత్వాన్ని యోగమాయ మననుండి కప్పివేసి ఉంచుతుంది. కాబట్టి, మనం ఈశ్వరుడిని, ప్రస్తుతం ఆయన సాకార రూపంలో చూసినా, ఆయనే భగవంతుడని గుర్తు పట్టలేము. ఎప్పుడైతే యోగమాయా శక్తి తన కృప మనపై చూపిస్తుందో, అప్పుడే మనకు భగవంతుడిని చూసి, గుర్తుపట్టగలిగే దివ్య దృష్టి లభిస్తుంది. ఈ యోగమాయా శక్తి, నిరాకారమైనది, ఒక రూపంలో కూడా వ్యక్తమవుతుంది. రాధా, సీతా, దుర్గా, కాళీ, లక్ష్మీ, పార్వతీ మొదలైన రూపాలన్నీ, యోగమాయా శక్తి యొక్క దివ్య మంగళ స్వరూపాలే. ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయంలో, విశ్వానికే మాతృ మూర్తిగా పూజించబడ్డాయి. వీరు అమ్మ గుణాలైన సున్నితత్వమూ, వాత్సల్యమూ, క్షమా, కృప మరియు అకారణ ప్రేమలను ప్రసరిస్తారు. మనకు ఇంకా ముఖ్యముగా, జీవాత్మలకు దివ్య కృపను ప్రసాదించి, ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానాన్ని అందించటం ద్వారా, వాటికి భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తిని, వీరు ప్రసాదిస్తారు. ఈ విధంగా యోగమాయ, రెండు పనులూ చేస్తుంది. ఇంకా అర్హత సాధించని జీవాత్మల నుండి, భగవంతుడిని దాచి పెడుతుంది. శరణాగతి చేసిన జీవాత్మలకు, తన కృపను ప్రసాదించి, దానితో వారు భగవంతుడిని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఈశ్వరుడికి విముఖంగా ఉన్నవారు, మాయచే కప్పివేయబడతారు. వారు యోగమాయ కృపకు దూరమైపోతారు. ఈశ్వరుడికి సన్ముఖంగా ఉన్నవారు, యోగమాయ రక్షణలోకి వస్తారు, మరియు మాయ నుండి విముక్తిని పొందుతారు.
09:46 - ఇక మన తదుపరి వీడియోలో, రాగ ద్వేషములనే ద్వందములు ఎలా జనిస్తున్నాయో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!