Ads

Showing posts with label భిక్షాటన మేలు!. Show all posts
Showing posts with label భిక్షాటన మేలు!. Show all posts

16 June, 2021

నెత్తుటితో తడిసిన భోగాలకన్నా, భిక్షాటన మేలు! Bhagavadgita

 

నెత్తుటితో తడిసిన భోగాలకన్నా, భిక్షాటన మేలు!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (01 - 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 1 నుండి 5 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/OOlvgb9OwHY ]

ఈ సాంఖ్య యోగంలో, అర్జునుడు తాను ఇరుక్కున్న సందిగ్ధావస్థనుండి తప్పించమనీ, తనకు దిశానిర్దేశం చేయమనీ, శ్రీ కృష్ణుడిని వేడుకుంటున్నాడు. శరీరము నశించినా.. నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెబుతూ, దివ్య జ్ఞానాన్ని విశదీకరించాడు కృష్ణ భగవానుడు. సామాజిక భాధ్యతల గురించీ, ధర్మాన్ని పరిరక్షించడం గురించీ, యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతల గురించీ, మానసిక క్లేశములైన కామ, క్రోధ, లోభాలను ఏ విధంగా నిర్మూలించవచ్చో, కృష్ణుడు దశలవారీగా అర్జునుడికి వివరించడం, ఈ యోగంలో మనం తెలుసుకోవచ్చు.

సంజయుడు ధ్రుతరాష్ట్రుడితో, అర్జునుడి దీన స్థితిని గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు..

సంజయ ఉవాచ ।

తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।

విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 1 ।।

సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుడిని చూసిన శ్రీ కృష్ణుడు, ఈ విధంగా అంటున్నాడు.

జాలీ, చింతా, అశృవులూ అనేవి, ఆత్మ జ్ఞాన రాహిత్యానికి చిహ్నాలు. ఈ శ్లోకంలో కృష్ణుడిని మధుసూదన అని సంబోధించాడు అర్జునుడు. ‘మధు అనే రాక్షసిని సంహరించిన వాడా.. నాలో దాగిన భ్రాంతి అనబడే రాక్షసిని కూడా సంహరించు’ అని కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఎదుటివారిలో శారీరక కష్టాలని చూసినప్పుడు, మనకు కలిగేది భౌతికమైన కరుణ. ఇది కేవలం ఒక మహనీయమైన భావమే కానీ, అది సంపూర్ణంగా సరియైనది కాదు. ఈ కరుణ అనేది, నీటిలో మునిగిపోతున్న మానవుని బాహ్యమైన దుస్తులపై, జాలి చూపించడం వంటి మూర్ఖపు చర్య. అజ్ఞాన సాగరంలో పడి, బాహ్య దుస్తులైన ఈ స్థూల శరీరాన్ని కాపాడుకోవడం వలన, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం అర్థం కాక, బాహ్య వస్త్రమైన దేహం కోసం చింతించేవాడు, వ్యర్థుడు. క్షత్రియుడైన అర్జునుడికి, ఇటువంటి చింతనే ఏర్పడింది. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై, అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న భగవానుడు, తనను సమాధాన పరచడానికి, కర్మ సిద్ధాంతాన్ని వివరించబోతున్నాడు..

శ్రీ భగవానువాచ ।

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ ।

అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ।। 2 ।।

శ్రీ కృష్ణ భగవానుడు, ఈ విధంగా అంటున్నాడు. ఓ అర్జునా! ఈ విపత్కర పరిస్థితులలో, నీకు ఈ మోహం ఎక్కడనుండి వచ్చింది? ఇది జీవితపు విలువలు తెలిసిన ఆర్యులకు సరికాదు. అంతేకాదు, ఉన్నత లోకాలకు అడ్డుకట్ట వేస్తూ, అపకీర్తిని తెచ్చిపెడుతుంది.

కృష్ణుడు దేవాదిదేవుడు. అందుకే, ఈ భగవద్గీత మొత్తంలో, ఆయనను భగవానుడిగానే సంబోధించడం జరిగింది.  దేహాత్మబుద్ధి కలిగిన వారు, పరతత్వమైన భగవానుడిని అనుభూతి పొందడమే జీవిత లక్ష్యమని ఎరుగక, ఈ భౌతిక జగత్తులోని బాహ్య లక్షణాలకు ఆకర్షింపబడతారు. భౌతిక బంధాల నుండి విముక్తి పొందలేని వారు, అనార్యులుగా పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ, యుద్ధం చేయకుండా, భౌతిక బంధాలపై మోహం పెంచుకుని, విద్యుక్త ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అర్జునుడి యొక్క ఈ ఆలోచనలు, అధ్యాత్మిక జీవన పురోగతికి ఉపయోగపడదు. అందుకే కృష్ణుడు, అర్జునుడిలోని బంధు ప్రీతిని ఆమోదించడం లేదు.

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 3 ।।

ఓ పార్థా, శత్రువులను జయించే నీవు, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లేచి నిలబడు.

క్షత్రియుడు యుద్ధం చేయకపోతే, అతడు నామ మాత్రపు క్షత్రియడిగానే మిగిలిపోతాడు. తనకు మిక్కిలి ఆప్తమిత్రుడైన అర్జునుడు, అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా మిగిలిపోవడానికి, కృష్ణుడు అంగీకరించలేదు. అందుకే, ప్రత్యక్షముగా రథమునందుండి, అతనికి మార్గనిర్దేశనం చేస్తున్నాడు. అర్జునుడిని ఆవహించి ఉన్న అధైర్యమును వదలి, యుద్ధానికి సిద్ధమవ్వమని, కృష్ణ భగవానుడు సూచిస్తున్నాడు.

అర్జున ఉవాచ ।

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।

ఇషుభి: ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ।। 4 ।।

అర్జునుడు అంటున్నాడు.. శత్రువులను సంహరించే మధుసూదనా, పెద్దలూ, గురువులూ, పూజ్యులూ అయినటువంటి భీష్మ, ద్రోణులను నా బాణాలతో ఎలా ఎదురించగలను? అని కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు.

పితామహుడైన భీష్ముడూ, గురువైన ద్రోణాచార్యుడూ, ఎల్లప్పుడూ పూజింపదగిన వారు. వారితో వాగ్వాదమునకు దిగడమే పాపకార్యం. మరి అటువంటి పెద్దలపై,  కఠినంగా నా బాణాలతో ఎలా యుద్ధం చేయగలను? వారిని ఎలా ఎదుర్కొనగలను? అని అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు. 

గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।

హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।

పెద్దలను చంపి, నెత్తుటితో తడిసిన ఈ భోగాలను అనుభవించడం నావల్ల కాదు. మహానుభావులను చంపడం కన్నా, ఈ లోకంలో భిక్షాటనజేసుకుని బ్రతకడం ఉత్తమం.

శాస్త్రాదేశముల ఆధారంగా, అధర్మ కార్యాలకు పాల్పడుతూ, యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన వారిని త్యజింపవచ్చు. దుర్యోధనుడి నుండి ఆర్థిక సహకారం పొందుతున్న భీష్మ ద్రోణులిరువురూ, తప్పని పరిస్థితులలో, వారి పక్షమున నిలబడవలసి వచ్చింది. అధర్మం పక్షాన నిలబడిన వారు, గురువులుగా వారి గౌరవాన్నీ, మర్యాదనూ కొల్పోతారని తెలిసినా, వారు గౌరవింపదగిన వారేనని, అర్జునుడు భావిస్తున్నాడు. వారిని సంహరించడం ద్వారా వచ్చే రక్తసిక్తమైన భోగాలు అనుభవిస్తూ, రాజ్య పాలన చేయడం కన్నా, ఏదో ఒక చోట భిక్షాటనతో జీవించడమే ఉత్తమమని, అర్జునుడు తన అభిప్రాయాన్ని కృష్ణుడితో వ్యక్తపరుస్తున్నాడు.

మన తదుపరి వీడియోలో, బంధు ప్రీతితో తనలో కలిగిన మోహం కారణంగా శాంతిని కొల్పోయిన అర్జునుడు, శ్రీ కృష్ణుడి శరణాగతిని వేడుకునే సందర్భంలో, వారి సంభాషణ గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugw_nAXIu-nPFgXgt7l4AaABCQ