Ads

Showing posts with label భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు?. Show all posts
Showing posts with label భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు?. Show all posts

08 December, 2021

భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు? Bhagavadgita

  

భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు?

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (07 - 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 07 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/5dd980Ubhro ]

జీవన్మరణాలలో జీవాత్మ తిరుగుతూ ఉండకుండా, శాశ్వత మోక్షాన్ని ఏ విధంగా పొందాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।

ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.

ధర్మము అంటే, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకీ, పురోగతికీ సహకరించే విహిత కర్మలు. అధర్మం అంటే, దీనికి విరుద్ధం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్తా, నిర్వహణాధికారీ అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకుని దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే, అవతారము అంటాము. భగవంతునికి అనంతమైన అవతారములున్నాయని, వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి. అవతారములు నాలుగు రకాలుగా, వర్గీకరించబడ్డాయి.

1. ఆవేశావతారములు – ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టటం, మరియు, ఆ జీవాత్మ ద్వారా, కార్యకలాపాలు చేయటం. నారద ముని, ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ.

2. ప్రాభవావతారములు – ఇవి భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులను ప్రదర్శించిన అవతారములు. దేవుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమై, తన కార్యాన్ని పూర్తిచేసి వెళ్లిపోయేవి. హంసావతారము, దీనికి ఒక ఉదాహరణ. ఈ అవతారంతో, కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి, వెళ్ళిపోయాడు భగవానుడు. ఇక భూలోకంలో, చాలా ఏళ్లు ఉండే అవతారాలు.. పద్దెనిమిది పురాణాలనూ, మరియు మహాభారతాన్నీ వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతార రూపమే.

3. వైభవావతారములు – తన దివ్య రూపంలో దిగివచ్చి, తనకున్న మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారమూ, కూర్మావతారమూ, వరాహావతారములు, వైభవావతారముల ఉదాహరణలు.

4. పరావస్థావతారములు – భగవంతుడు తన సర్వ మహోన్నత శక్తులను, తన దివ్య స్వరూపంలో వ్యక్తపరచినవి. శ్రీ కృష్ణుడూ, శ్రీ రాముడూ, నృసింహావతారమూ, పరావస్థావతారములకు ఉదాహరణలు.

“భగవంతుని యొక్క అన్ని అవతారములూ, ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి. అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితమయినవి.” ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తాను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా, తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు, ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।

ధర్మాత్ములను కాపాడటానికీ, దుష్టులను నిర్మూలించటానికీ, మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికీ, నేను ఈ లోకంలో ప్రతీ యుగమునందు అవతరిస్తాను.

జీవాత్మ చేయగలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు, తన అవతారం ద్వారా వృద్ధి నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, తన దివ్య రూపములూ, నామములూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం, ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికీ, అనుసంధానమవటానికీ ఒక రూపం అవసరం. అందుకే, భగవంతుని నిరాకార తత్త్వాన్ని ఆరాధించడం, చాలా కష్టం. అదే సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, చాలా సులభం. జీవాత్మలు భక్తిలో నిమగ్నమై, తమ అంతఃకరణ శుద్ధికి సహకరించటానికి, తన నామములూ, రూపములూ, లీలలూ, గుణములూ, ధామములూ, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి, భగవంతుడు అవతరిస్తాడు.

భగవంతుని లీలల్లో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు. వీరు విష్ణు నివాసమైన వైకుంఠ ద్వారపాలకులు, జయ-విజయులు. వారు రాక్షసులుగా నటించి, రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దేవతలు కాబట్టి, మరెవ్వరి వలనా సంహరింపబడలేరు. కాబట్టి, దేవుడే అటువంటి రాక్షసులను తన లీలల్లో భాగంగా, సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు. ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి, తగినంత ఉన్నతిని పొంది ఉన్నారు. అందుకే, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగించాడు.

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సొఽర్జున ।। 9 ।।

ఓ అర్జునా, నా యొక్క జన్మ, మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత, తిరిగి జన్మనెత్తరు, నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు.

భగవంతునిపై ప్రేమ పూర్వక స్మరణ ద్వారా, మన మనస్సు శుద్ది అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మంపై ఉండవచ్చు, లేదా సాకార రూపంపై ఉండవచ్చు. నిరాకార బ్రహ్మంపై ఉండే భక్తి, అగోచరమైనది. భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి? దేనితో అనుసంధానమవ్వాలి? అనేది వారికి తెలియదు. ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి, సులువైనది, మరియు ఆచరణీయమైనది. అలాంటి భక్తికి, భగవంతుని వ్యక్తిత్వంపై, దైవిక భావాలు అవసరం. భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే దైవిక భావాల వలన, రాతి విగ్రహాలను ఆరాధించటంతో, ప్రజలు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలే, భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి. "భగవంతుడు కట్టెలో లేడు, రాతిలో లేడు. భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి, విగ్రహాన్ని ప్రేమ పూర్వక భావంతో ఆరాధించుము" అని మనువు చెప్పిన అక్షర సత్యం.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ।। 10 ।।

రాగ-ద్వేష-క్రోధ రహితముగా ఉండి, నా యందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి, ఎంతో మంది ఇంతకు పూర్వం, నా యొక్క జ్ఞానంచే పవిత్రులయ్యారు. ఆ విధంగానే, నా దివ్య ప్రేమను పొందారు.

మమకారానురాగాలూ, భయం, మరియు కోపం త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. నిజానికి భయానికీ, కోపానికీ, రెండింటికీ కారణం, మమకారమే. మనం అనుబంధం పెంచుకున్న వస్తువు, మన నుండి దూరమవుతుందేమో అన్న భావనే, భయాన్ని కలుగ చేస్తుంది. మనం మమకారం పెంచుకున్న వస్తువుని పొందటంలో వచ్చే అడ్డంకి వలన, క్రోధం జనిస్తుంది. అందుకే, మమకారానుబంధమే, మనస్సు మలినమవటానికి మూల కారణం. ఈ మాయా ప్రపంచం, ప్రకృతి యొక్క త్రి-గుణములచే సమ్మిళితమై ఉంటుంది. మన మనస్సుని ఏదో ఒక భౌతిక వస్తువు, లేదా వ్యక్తి యందు లగ్నం చేస్తే, మన మనస్సు కూడా త్రిగుణములచే ప్రభావితమవుతుంది. బదులుగా, అదే మనస్సుని, త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే, అలాంటి భక్తి, మనస్సుని పవిత్రం చేస్తుంది.

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 11 ।।

ఓ అర్జునా, నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే.

తనకు శరణాగతి చేసిన వారందరికీ, తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారికి, ఆయన కర్మ సిద్ధాంత రూపంలో, కలుస్తాడు. వారి హృదయాల్లో ఆసీనుడై, వారి కర్మలకు తగిన ఫలితాలను ఇస్తుంటాడు. ఎటువంటి నాస్తికులైనా, ఆయన సేవ చేయకుండా, తప్పించుకోలేరు. వారు దేవుని భౌతిక శక్తి అయిన ‘మాయ’కు సేవ చేయాల్సిందే. మాయ అనేది, ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది. సంపదా, భోగాలూ, బంధువులూ, కీర్తీ, మొదలగునవి. మాయా శక్తి, వారిని కామ, క్రోధ, లోభ గుణములతో బంధించివేస్తుంది. అదే సమయంలో, ప్రాపంచిక, భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి, భగవంతుడే తమ లక్ష్యము, ఆశ్రయముగా బ్రతికేవారి ఆన్ని అవసరాలనూ.., తల్లి తన బిడ్డ బాగోగులు చూసుకున్నట్లుగా, ఆయనే చూసుకుంటాడు. ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మలను నాశనం చేస్తాడు, మాయా బంధనము నుండి విముక్తులను చేస్తాడు, భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు, దివ్యానందాన్నీ, దివ్య జ్ఞానాన్నీ మరియు దివ్య ప్రేమనీ ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్ధంగా ప్రేమించటం నేర్చుకుంటాడో, తానే స్వయంగా వారి ప్రేమకు బానిసయిపోతాడు.

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ।। 12 ।।

ఈ లోకంలో, భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు, దేవతలను పూజిస్తారు. ఎందుకంటే, భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.

భౌతిక లాభాల కోసం ప్రయత్నించే వారు, వరముల కోసం, దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు, భౌతికమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే, వారు ఆ వరాలను ఇవ్వ గలుగుతున్నారు. అల్ప జ్ఞానం ఉన్నవారు, వారిని ఆశ్రయిస్తారు. కానీ, నిజంగా తెలివైనవారు, తమ తమ కోరికల నివృత్తి కోసం, ఆ సర్వ శక్తివంతుడైన భగవంతుడినే ఆశ్రయిస్తారు.

ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా, కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే, ఏం చేయాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!