బ్రహ్మదేవుడి సృష్టి గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన వాస్తవాలు!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (10 - 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bgxb1EtLtN8 ]
బ్రహ్మదేవుడి సృష్టి గురించి, శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 10 ।।
సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు మానవజాతిని, వారి విధులతో పాటుగా సృష్టించి, ఇలా చెప్పాడు.. "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ధి చెందండి. ఇవే మీ సమస్త కోరికలనూ తీరుస్తాయి."
ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములూ, భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అన్ని అంశములూ సహజంగానే, తమ మూలభాగము నుండి గ్రహిస్తాయి, దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి, ప్రాణుల జీవనానికి అవసరమైన వేడినీ, వెలుగునూ ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి, మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమే కాక, నాగరిక జీవన శైలి కోసం, ఎన్నో ఖనిజాలను, తన గర్భంలో దాచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది, మరియు శబ్దతరంగ శక్తి ప్రసరణకు, దోహద పడుతుంది. మానవులమైన మనం కూడా, భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలీ, నడిచే నేలా, త్రాగే నీరూ, వచ్చే వెలుతురూ, ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం, వీటన్నింటినీ వాడుకుంటున్నప్పుడు, వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములను, భగవత్ సేవ లాగా చేయటం ద్వారా, ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో, మనం తప్పకుండా పాలుపంచుకోవాలి. ఆయన మననుండి కోరుకునే యజ్ఞం అదే. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే, మన స్వ-ప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది.
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।। 11 ।।
మీ యజ్ఞముల ద్వారా, దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన, అందరికీ శేయస్సూ, సౌభాగ్యం కలుగుతుంది.
ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని, వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు, భౌతిక జగత్తు యొక్క పరిధిలోనే ఉంటారు. అవే, స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే, భగవంతుడు కారు. వారూ మనవంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి, నిర్దిష్ఠమైన పదవులలో ఉంటారు. మన ప్రభుత్వంలోని ఒక్కో పరిధికి, ఒక్కో అధికారిలాగా, ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి, అగ్ని దేవుడూ, వాయు దేవుడూ, వరుణ దేవుడూ, ఇంద్రుడూ వంటి వారు, పదవులను అధిరోహించి ఉంటారు. గత జన్మలలో చేసిన పుణ్య కార్యముల ఫలముగా, ఎంపిక చేయబడిన జీవాత్మలు, ఈ పదవులలో ఉండి, విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు.
దేవతలను సంతృప్తి పరచటానికి, వేదాలు ఎన్నో రకాల కర్మకాండలనూ, ప్రక్రియలనూ చెప్పాయి. ప్రతిఫలంగా, దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే, ఆ నీరు పువ్వులకూ, ఫలములకూ, ఆకులకూ, కొమ్మలకూ, చిగురులకూ ఎలా చేరుతుందో, అదే విధంగా, మనం చేసే యజ్ఞం, ఆ భగవంతుని సంతోషం కోసం చేసినప్పుడు, అప్రయత్నపూర్వకంగా, దేవతలు కూడా సంతోషిస్తారు. ప్రీతి నొందిన దేవతలు, భౌతిక ప్రకృతి మూల-భూతములను జీవులకు అనుకూలంగా మార్చటం ద్వారా, తిరిగి వారికి సంపత్తీ, సౌభాగ్యాన్నీ కలిగిస్తారు.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ।। 12 ।।
యజ్ఞములు చేయడం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, దేవతలకు తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.
ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే, మనకు వర్షం, గాలీ, పంటలూ, చెట్లూ, చేమలూ, ఖనిజములూ, సారవంతమైన నేల వంటివి ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నింటినీ పొందిన మనం, వారికి ఋణపడి ఉండాలి. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. అలాగే, మనం కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని, వారు ఆశిస్తారు. దేవతలందరూ, ఆ దేవదేవుని సేవకులే కాబట్టి, ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే, వారందరూ ప్రీతి చెంది, ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి, సహకరిస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని, ఈశ్వర సేవ కోసం కాకుండా, మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే, అది దొంగ మనస్తత్వం అవుతుంది.
యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః ।
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ।। 13 ।।
యజ్ఞములో మొదట నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక మనసున్న సత్పురుషులు, సర్వ పాపముల నుండి ముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు, పాపమునే భుజింతురు.
వైదిక సంప్రదాయంలో, ఆహారాన్ని భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథంతోనే వండేవారు. ఆహార పదార్థాలన్నీ, కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో ఉంచి, భగవంతుడిని వాటిని స్వీకరించమని, శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు. అలా నైవేద్యం చేసిన తరువాత, ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం, 'ప్రసాదం' గా పరిగణించబడుతుంది. ఆ పళ్ళెంలో, ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం, భగవదనుగ్రహముగా పరిగణించబడి, ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది. ముందుగా భగవంతునికి నైవేద్యం చేసి తినటం వలన, మన పాపములనుండి విముక్తి కలుగుతుంది. అలాకాకుండా, భగవంతునికి నివేదన చేయకుండా అన్నం తినేవారు, పాపం చేస్తున్నట్టే అని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. మన ఇంద్రియ భోగం కోసమే తింటే, ప్రాణహాని వలన కలిగే కర్మ బంధాలలో చిక్కుకుంటాము. యజ్ఞంలో, భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు, ఆ దృక్పథం మారుతుంది. మన శరీరాన్ని భగవంతుని సొత్తుగా, దాన్ని భగవంతుని సేవకోసం ఉపయోగించటానికి, మన సంరక్షణలో ఉంచబడినట్టు పరిగణిస్తాము. అనుమతించబడిన ఆహారాన్ని, ఆయన అనుగ్రహంగా, శరీర పోషణ కోసము స్వీకరిస్తాము. ఈ మనోభావంతో, ఆ ప్రక్రియ అంతా పవిత్రమవుతుంది.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।
ప్రాణులన్నీ ఆహారం వలననే జీవిస్తాయి. ఆహారం వర్షము వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన, వానలు కురుస్తాయి. నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే, యజ్ఞము జనిస్తుంది.
శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమవుతుంది. ధాన్యం భుజించబడి, రక్తముగా మారుతుంది. రక్తము నుండి వీర్యము జనిస్తుంది. వీర్యమే, మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు. వీటిచే ప్రీతినొందిన దేవతలు, వానలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.
ఇక మన తదుపరి వీడియోలో, సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడి వివరణ తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!