జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మార్గం!
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (06 - 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 6 నుండి 10 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/uvycEbQbhwc ]
బంధు ప్రీతి వలనా, తనలో కలిగిన మోహం వలనా, శాంతిని కొల్పోయిన అర్జునుడు, శ్రీ కృష్ణుడి శరణాగతిని వేడుకుంటున్నాడు. పార్థుడూ, శ్రీ కృష్ణుడి మధ్య సంభాషణ ఇలా సాగింది..
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః ।
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ।। 6 ।।
ఈ యుద్ధం యొక్క ఫలితం ఏలాంటిదో, మనకు మేలైనదో కాదో కూడా తెలియదు. వారిని మనం జయించడమో, లేదా వారు మనల్ని జయించడమో జరుగుతుంది. ధృతరాష్ట్ర పుత్రులను చంపి, మేము జీవించాలన్న కాంక్ష కలగడం లేదు. అయినా, వారు మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.
క్షత్రియ ధర్మమైన యుద్ధంపై, అర్జునుడు విముఖత కలిగి ఉన్నాడు. తన వారితో యుద్ధం చేయడం కన్నా, భిక్షాటన మేలని భావిస్తున్నాడు. ఇరు పక్షాలూ యుద్ధం చేసినా, ఎవరు విజయం సాధిస్తారో, కచ్చితంగా చెప్పడం అసాధ్యం. ఒకవేళ పాండవులు యుద్ధంలో గెలిచినా, తమ సొదరులైన కౌరవులను చంపగా వరించిన విజయం, దుర్లభమైనది. ఇటువంటి భావాలను కలిగి ఉన్న అర్జునుడు, గొప్ప భగవద్భక్తుడే కాకుండా, గొప్ప జ్ఞానీ, మనస్సూ, ఇంద్రియములపై పూర్తి నియంత్రణ కలిగిన వాడని తెలుస్తోంది. ఇంద్రియములను నియంత్రంచకుండా, జ్ఞానస్థితికి వెళ్ళడానికి అవకాశముండదు. జ్ఞానం లేనిదే, ముక్తి నొందడం కుదరదు. ఐహిక సంబంధంలోని ఉత్తమ గుణాలతో పాటుగా, అర్జునుడు అన్ని గుణాలలో యోగ్యుడు.
కార్పణ్యదోషో పహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ।
యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।। 7 ।।
స్వధర్మ విషయమున మోహంతో శాంతిని కోల్పోయి, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు. ఆందోళనా, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో, దానిని ఉపదేశించుము.
ప్రకృతి నియమాలననుసరించి, భౌతిక కర్మలే, ప్రతి ఒక్కరి కలతలకూ, మూల కారణం. ప్రతి అడుగులో కలతలు ఎదరవుతుంటే, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, సరైన మార్గ నిర్దేశకుడు అవసరం. మన జీవితంలో తటస్థపడే కలతలను పరిష్కరించుకోవడానికీ, అందుకు తగిన జ్ఞానాన్ని అవగాహన చేసుకొవడానికీ, ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించమని, మన వేదశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగానే అర్జునుడు, తన కలతలను పటాపంచలు చేసి, తగిన కర్తవ్యమేమిటో తెలియజేయమని, కృష్ణుడి శరణాగతికి చేరాడు.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యఛ్చోకముఛ్చోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।। 8 ।।
నా ఇంద్రియములను శుష్కింప చేసే ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ, తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, దేవతల వంటి అధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
ఎప్పుడైనా, మనము కూడా దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ది, ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే, ఇక ఎక్కువగా ఆలోచించలేదో, అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు, అతని బుద్ది కన్నా పెద్దవిగా పరిణమించడంతో, అతన్ని శోక సముద్రం నుండి కాపాడటానికి, అతనికున్న భౌతిక జ్ఞానం సరిపోదు. అందుకే, శ్రీ కృష్ణుడిని గురువుగా స్వీకరించి, తన దయనీయ స్థితిని వెల్లడిస్తూ, మనస్సులో ఉన్నదంతా చెబుతున్నాడు, అర్జునుడు. ప్రస్తుతమున్న అర్జునుడి పరిస్థితి, అతనిదొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు, అప్పుడప్పుడూ మనకు కూడా ఎదురవుతుంది. మనకు సంతోషం కావాలి.. కానీ దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి.. కానీ, అజ్ఞానపు మేఘాలను తొలగించుకోలేము. పరిశుద్ధమైన ప్రేమని కోరుకుంటాం కానీ, పదేపదే ఆశాభంగము కలుగుతుంది. మనం నేర్చుకున్న విద్య, మరియు లౌకిక పాండిత్యం, జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపించవు. మన జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న నిజమైన గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే, ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి, తెరువబడుతుంది. ఆ మార్గాన్నే, అర్జునుడు ఎంచుకున్నాడు.
సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప ।
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ।। 9 ।।
సంజయుడు అంటున్నాడు: శత్రువులను జయించే గుడాకేశుడైన అర్జునుడు, శ్రీ కృష్ణునితో, "గోవిందా, నేను యుద్ధం చేయను" అని చెప్పి మౌనం వహించాడు.
సూక్ష్మబుద్ధి కలిగిన సంజయుడు, ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో, సహజంగా అతను ప్రస్తావించే వ్యక్తులకు, తగిన పేర్లను వాడతాడు. ఇక్కడ ఆర్జునుడిని 'గుడాకేశ' అని వివరించాడు. అంటే, 'నిద్రని జయించిన వాడు' అని అర్థం. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణీ, ఎప్పుడో ఒకప్పుడు దానికి వశమవ్వాల్సిందే. కానీ, తన ధృడ సంకల్పంతో, అర్జునుడు సొంత అభ్యాసముతో, తాననుకున్న సమయంలోనే, తాను అనుకున్నంత సమయం మాత్రమే నిద్రించగలిగే అసామాన్యుడు. అంతేకాదు, ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి, ఒక విషయం సూచిస్తున్నాడు.. "ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో, ఆ విధంగానే తన నైరాశ్యాన్ని జయిస్తాడు." అని అంతర్లీనంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, శ్రీ కృష్ణుడిని 'హృషీకేశ' అని పలికాడు సంజయుడు. అంటే, 'ఇంద్రియములకూ, మనస్సుకూ అధిపతి' అని. ఇక్కడ సూక్ష్మంగా తెలియజేసేదేంటంటే, "ఇంద్రియములనే అదుపు చేయగలిగే వాడు, అన్నీ కార్యాలూ సక్రమంగా నిర్వహింపబడేటట్లు చూసుకుంటాడు." అర్జునుడిలో నెలకొన్న నైరాశ్యాన్ని రూపుమాపి, తనను సమర్థుడిగా తీర్చిదిద్దగలిగేవాడు, కేవలం కృష్ణ పరమాత్ముడు మాత్రమే.
తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత ।
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ।। 10 ।।
ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరు సేనల మధ్యలో, శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు, మందహాసముగా ఇలా పలికాడు.
అర్జునుడి శోకతప్త మాటలకు విరుద్ధంగా, పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయడం లేదనీ, పైగా తాను నిశ్చింతగా, సంతోషంగా ఉన్నాననీ సూచిస్తూ, శ్రీ కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్ని సందర్భాలలో, ఇలాంటి సమ భావ దృక్పథం ప్రదర్శిస్తారు. మనకున్న అసంపూర్ణ జ్ఞానంతో, మనమున్న పరిస్థితులలో, లోపాలు వెదుకుతాము. వాటిపై సణుగుతూ, అసంతృప్తితో ఉంటాము. వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మన దౌర్భాగ్యానికి, వాటిని బాధ్యులుగా చూస్తాము. కానీ, భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం, అన్ని కోణాలలో, లోపాలు లేని, దోషరహితమైనది. మంచీ, చెడూ, పరిస్థితులన్నీ కూడా, ఒక దివ్య, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే, మన దరిచేరతాయి. అవన్నీ, మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి, దోష రహిత స్థితికి చేరే ప్రయాణంలో, మనలను ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాయి. ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు, ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా, పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కుంటారు.
మన తదుపరి వీడియోలో, అర్జునుడిలోని నైరాశ్యాన్ని తరిమికొట్టడానికి, కృష్ణ భగవానుడు చేసిన జ్ఞాన బోధ గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgyiaNBts3Cp1w4I43V4AaABCQ