Ads

Showing posts with label కార్తీక పురాణం!. Show all posts
Showing posts with label కార్తీక పురాణం!. Show all posts

25 November, 2020

కార్తీక పురాణం! (దశమాధ్యాయము - పదవ రోజు పారాయణము)

 

అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము:

జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించ వలసినది " గాప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా! అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి, "ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి, అజామీళుని విమాన మెక్కించి, వైకుంఠమునకు దీసుకొని పోయిరి. మేము చేయునది లేక, చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' అని భయ కంపితులై విన్నవి౦చుకొనిరి.

"ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృ త్తాంతము తెలుసుకొని "ఓహొ! అది యా సంగతి! తన అవసాన కాలమున "నారాయణ" అని వైకుంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను, విష్ణు దూతలు వచ్చి, వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని, తెలిసిగాని, మృత్యు సమయమున హరి నామ స్మరణమెవరు చేయుదురో, వారికి వైకుంఠప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను, బలము చేతను, గర్విష్టియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమునపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక, దుష్ట సహవసములను మరిగి, విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్క ప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరు౦డెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే, చేయునది లేక, ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి, భిక్షాటనకై వురూరా తిరుగుచూ, ఏదో వేళకు యింటికి వచ్చి, కాలం గడుపుచు౦డెడి వాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి, పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన బెట్టుకొని వచ్చి, అలిసిపోయి, "నాకు యీ రొజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము", అని భార్యతో ననెను. అందులకామె ఛీదరించుకోనుచు, నిర్లక్ష్యముతో, కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని వంక కన్నెత్తి యైననూ చూడక, విటునిపై మనస్సు గలదియై, మగని తూలనాడుట వలన, భర్తకు కోపం వచ్చి, అటనున్న కఱ్ఱతో బాదెను. 

అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగుకొని, భర్తను రెండితలు కొట్టి, బైటకు త్రోసి తలుపులు వేసివేసెను. అతడు చేయునది లేక, భార్యపై విసుగు జనించుట వలన, ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి, దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై, వీధి అరుగు పై కూర్చుండి యుండగా, ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి "ఓయీ! నీవీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు ర"మ్మని కొరెను. అంత నా చాకలి "తల్లి! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను, చాకలి వాడిని. మీరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ది చెప్పి, వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు, లోలోన నవ్వుకొని, అచ్చటనుండి బయలుదేరి, ఆ గ్రామ శివార్చకుని కడకేగి, తన కామవా౦ఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి, ఆ రాత్రంతయు అతనితో గడిపి, వుదయమున యింటికి వచ్చి, "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడి గట్టితిని? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి, క్షణికమయిన కామవాంఛకు లోనయి, మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపమొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి, తన భర్తను వెదకి తీసుకు రావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత, భర్త యింటికి రాగా, పాదములపై బడి, తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి, మంచి నడవడిక నవలంభించి, భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. 

కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి, దిన దినము క్షీణి౦చుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి, నానా బాధలు పొంది, మరల నర జన్మమెత్తి సత్య వ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నది స్నానము చేసి, దేవత దర్శనము చేసి యుండుట వలన, నేడు జన్మముల పాపములు నశించుట చేత, అజా మీళుడై పుట్టెను. అప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా ' అని శ్రీ హరిని స్మరించుట వలన, వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా, రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాత నలనను భవించి, ఒక మాలవాని యింట జన్మించెను. ఆ మాలవాడు, ఆ పిల్ల జన్మ రాశి చూపించగా, తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడా శిశువును తీసుకొనిపోయి, అడవి యందు వదలి పెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు, పిల్ల యేడుపు విని, జాలి కలిగి, తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే, అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో, శ్రీ హరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ హరి కథలను ఆలకించుట, కార్తిక మాస స్నాన ప్రభావముల వలన, నెటువంటి వారైననూ మోక్షమొందగలరు. గాన, కార్తిక మాసము నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొందగలరు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్య మందలి 'దశమాధ్యాయము - పదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgyMU4qjNm1zef77f-J4AaABCQ

24 November, 2020

కార్తీక పురాణం! (నవమాధ్యాయము - తొమ్మిదవ రోజు పారాయణము)

 

విష్ణు పార్షద, యమదూతల వివాదము:

'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, 'విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యములను, సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు, రాత్రి౦బవళ్లు, సంధ్య కాలం సాక్షులుగా వుండి, ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునికి చూపించి, ఆ మనుజుని అవసాన కాలమున, మమ్ము పంపి, వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి, వేద శాస్త్రముల నిందించు వారును, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృతిని తిట్టి, హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం, చొరత్వంచే భ్రష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండిండ్లు, శుభకార్యములు జరగనివ్వక, అడ్డుతగిలే వారునూ, పాపాత్ములు. వారు మరణించగానే, తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి, దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా, ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారములకు లోనై, కుల భ్రష్టుడై, జీవ హింసలు చేసి, కామాంధుడై, వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు?' అని యడగగా విష్ణు దూతలు, 'ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. 

సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువరును, తటాకములు త్రవ్వి౦చువరును, శివ కేశవులను పూజి౦చు వారును సదా హరి నమ స్మరణ చేయువారును మరణ కాలమందు 'నారాయణా'యని శ్రీ హరినిగాని, 'శివ' అని శివుని గాని స్మరించు వారును, తెలిసిగాని తెలుయక గాని, మరే రూపమున గాని, హరి నామ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి, అజా మీళుడు ఎంత పాపాత్ముడైనను, మరణకాలమున 'నారాయణా' అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది, 'ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు, శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము, ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో 'నారాయణా' యని నంత మాత్రమున, నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి, వైకంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడ! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది.' అని పలుకుచు, సంతోషముగా విమాన మెక్కి, వైకంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి బాధ కలిగించునో, అటులనే, శ్రీ హరిని స్మరించిన యెడల, సకల పాపములును నశించి, మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'నవమాధ్యాయము - తొమ్మిదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxipebW3_e9K1qs-4N4AaABCQ

23 November, 2020

కార్తీక పురాణం! (ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదవ రోజు పారాయణము)

 

శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం:

వశిష్టుడు చెప్పినదంతా విని 'మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగుననియూ, అది నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు, నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణ సంకరులై, రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు, యింత తేలికగా మోక్షము పొందుట, వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున, దీని మర్మమును విడమర్చి, విపులీకరించ ప్రార్ధించుచున్నాను' యని కోరెను.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి, 'జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పటి౦చితిని. వానిలో కూడా, సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి, ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము, అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమనగా- ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

ఆజా మీళుని కథ: 

పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. 

ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, 'నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని 'నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. 

ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక 'నారాయణా నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట 'నారాయణా'యను శబ్దము వినబడగానే, యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగు శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి 'ఓ యమ భటులారా! వీడు మావాడు. మేము వీనిని వైకు౦ఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా, యమదూతలు 'అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా, విష్ణు దూతలు యిట్లు చెప్పదొడ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgzJ5dPoe5PGSgIQKMN4AaABCQ