కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ!
'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (01 – 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/25KAu1L4LQs ]
ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాస మార్గాన్ని విశదీకరిస్తున్నాడు. బాహ్యమైన భోగ సంబంధ తలపులను త్యజించి, కామ, క్రోధ, భయముల నుండి స్వేచ్ఛను పొందడమెలాగో, చెప్పబోతున్నాడు.
00:53 - అర్జున ఉవాచ ।
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।
యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీవు పనులను త్యజించే కర్మ సన్యాసాన్నీ, మరియు భక్తితో పనిచేసే కర్మయోగాన్నీ ప్రశంసించావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో, కచ్చితముగా తేల్చి చెప్పుము.
శ్రీ కృష్ణుడు, పనులను త్యజించడాన్నీ, భక్తితో పని చేయడాన్నీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో, తెలియజేప్పమన్నాడు. మొదటి అధ్యాయంలో, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి, పూనుకున్నాడు. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనదీ, నాశము లేనిదీ కావడంవలన, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు కాబట్టి, శోకించటం తెలివితక్కువ పని అని, చెప్పాడు. అర్జునుడు ఒక వీరుడిగా, తన సామాజిక విధిని నిర్వర్తిస్తూ, యుద్ధంలో ధర్మ పక్షాన పోరాడి, ఆ కర్మలను భగవత్ అర్పితం చేయమన్నాడు. మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం, అవశ్యకమైనది. ఎందుకంటే, అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుందని, పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధిని సాధించిన వ్యక్తి, ఎలాంటి సామాజిక విధులనూ నిర్వర్తించే అవసరం లేదని కూడా చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో, భగవత్ ప్రీతి కొరకు చేసే రకరకాల కార్యముల గురించి, విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే, జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని, పేర్కోన్నాడు. కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేశాడు. అయితే, ఈ ఉపదేశాలన్నీ, అర్జునుడిని అయోమయానికి గురి చేశాయి. అతను కర్మ సన్యాసమూ, మరియూ కర్మ యోగమూ, రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవని అనుకున్నాడు. ఈ రెండింటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. అందుకే, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేశాడు.
03:09 - శ్రీ భగవానువాచ ।
సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।
భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: పనులను త్యజించే కర్మ సన్యాస మార్గము, మరియు భక్తితో పనిచేసే కర్మ యోగ మార్గము, రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగమనేది, కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.
ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక, మరియు సామాజిక ధర్మాలు రెండింటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో, సామాజిక ధర్మాలు చేయబడతాయి. కర్మ సన్యాసమనేది, శారీరక దృక్పథం నుండి పైకి వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసం. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమవడం వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా, ఆధ్యాత్మిక విధులనే నిర్వర్తించే మనిషి, కర్మ సన్యాసి. వారు తమని తాము శరీరం అనుకోరు. తత్ఫలితంగా, వారు తమ శారీరిక ధర్మాలను నిర్వర్తించే అవసరం లేదని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు, తమ పూర్తి సమయాన్ని, ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు, తమకున్న సమయాన్ని, ప్రాపంచిక విధులకూ, ఆధ్యాత్మిక విధులకూ విభజించాల్సి ఉంటుంది. అందుకే, కర్మ సన్యాసులు, భగవంతుని దిశగా వేగంగా వెళ్ళ గలుగుతారు. కర్మ యోగులు, సామాజిక విధుల భారంతో, నెమ్మదిగా సాగుతారు. కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు. ఎందరో సాధువులు, తమకు వైరాగ్యం కలిగిందనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు. కానీ, వారి మనస్సు, భగవంతునిపై పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన, వారు ఆధ్యాత్మిక పథంలో, దివ్య ఆనందాన్ని అనుభవించలేక పోయారు. బైరాగుల్లా కాషాయ వస్త్రాలు ధరించి, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే, తమ సోమరితనాన్ని వైరాగ్యమని, తప్పుగా అర్థం చేసుకుంటారు.
05:17 - జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।
నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ విముచ్యతే ।। 3 ।।
దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను, నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకూ అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు.
బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తుంటారు. కాబట్టి, అనుకూల, ప్రతికూల ఫలితాలు రెండింటినీ సమ దృష్టితో, ఈశ్వరానుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే, అది మన క్రమానుసార ఉన్నతి కొరకు, సంతోషాన్నీ, దుఃఖాన్నీ అనుభవింప చేస్తుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ, మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మం మనం చేస్తూ ఉంటే, ఈ ప్రపంచం సహజంగానే, క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపుకు, తీసుకువెళ్తుంది. అనంతమైన జన్మలలో, ప్రపంచంపై ఉన్న మమకారం వలన, మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే, తమ మనస్సుని లగ్నం చేయటానికి, నిత్యం అభ్యాసం చేస్తుంటారు.
06:42 - సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।
ఏక మప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విన్దతే ఫలమ్ ।। 4 ।।
అజ్ఞానులు మాత్రమే, కర్మలను త్యజించుట, లేదా కర్మ సన్యాసము, మరియు భక్తితో పని చేయటము, లేదా కర్మయోగము, భిన్నమైనవని చెబుతారు. ఈ రెండింటిలో, ఏ ఒక్క మార్గమును అవలంభించినా, ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చని, యదార్థము తెలిసినవారు చెబుతారు.
సన్యాసమనేది, రెండు రకాలుగా ఉంటుంది. అవి, ఫాల్గు వైరాగ్యమూ, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు కష్టాలనూ, బాధ్యతలనూ వదిలించుకోవటం కోసం దానిని త్యజిస్తారో, అది ఫాల్గు వైరాగ్యమనబడుతుంది. ఇది పలాయనవాద దృక్పథంలో ఉంటుంది, అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం, కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో, కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలెదురైనప్పుడు, దానిని కూడా మరల వదిలేసి, తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి, ఆశిస్తారు. ఇక యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా, భగవంతుని శక్తిగా చూస్తారు. వారికున్న దానిని, వారికి చెందినదిగా పరిగణించరు, మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో, ఆ భగవంతుని సేవ చేయటానికే, ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము, స్థిరమైనది, కష్టాలకు చలించనిది. కర్మ యోగులు, బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా, యుక్త వైరాగ్య భావాలు పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులుగా, మరియు భగవంతుడిని, భోక్తగా పరిగణిస్తారు. అందుకే, ప్రతిదీ, భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో, స్థితులవుతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ, భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో, సమానంగా ఉంటుంది. కర్మ యోగికీ, కర్మ సన్యాసికీ మధ్య, నిజమైన జ్ఞానం విషయంలో, ఏటువంటి తేడా కనపడదు.
08:44 - యత్సాంఖ్యై: ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ।। 5 ।।
కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని, భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా, పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము, మరియు కర్మ యోగము, ఒక్కటే అని చూసినవాడే, నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు. ఆధ్యాత్మిక సాధనలో, మనస్సు యొక్క ఉద్దేశమే ప్రధానమైనది. బాహ్యమైన క్రియలు కావు.
ఒక వ్యక్తి, పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా, అతని మనస్సు బాహ్య కోరికలపై మళ్ళితే, అది పరిపూర్ణత కాదు. మరొకరు బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నా, నిరంతరం బృందావనాన్నే తలుస్తుంటే, భగవంతునిపైనే మనస్సును నిమగ్నం చేస్తే, అతడు పరిపూర్ణ స్థితిని పొందుతాడు. మన మానసిక స్థితిని బట్టి, మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుందని, సమస్త వైదిక శాస్త్రాలూ పేర్కొంటున్నాయి. బంధము, మరియు మోక్షమనేవి, మనస్సు యొక్క స్థితి మీద అధారపడతాయి. ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నా, మనస్సుని మాత్రం, భగవంతుని ధ్యానములోనే నిమగ్నం చేయాలి. ఆధ్యాత్మిక దృష్టి లేనివారు, కర్మ సన్యాసికీ, కర్మ యోగికీ ఉన్న బాహ్యమైన తేడాలను చూసి, కర్మ సన్యాసియే ఉన్నతమైనవాడని, భావిస్తారు. కర్మ సన్యాసులు, మరియు కర్మ యోగులు కూడా, తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి, జ్ఞానులు, వారిద్దరూ ఒకే, సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్లు, గమనిస్తారు.
10:18 - సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్ఛతి ।। 6 ।।
ఓ గొప్ప బాహువులు కలవాడా. భక్తి యుక్తముగా పని చేయకుండా, పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట, చాలా కష్టం. కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని, శీఘ్రముగా పరమాత్మను పొందుతాడు.
ఒక వ్యక్తి ఈ లోకములో, తన ధర్మములు నిర్వర్తిస్తూ, క్రమక్రమంగా కోపము, లోభము, మరియు కామములకు అతీతంగా ఎదగడానికి, ప్రయత్నించాలి. అలా కాక, ఎవరైనా తన విధులను త్యజిస్తే, మనస్సును పరిశుద్ధం చేసుకోవటం, చాలా కష్టం. పరిశుద్ధమైన మనస్సు లేకుండా, నిజమైన వైరాగ్యం పొందడమంటే, సుదూరపు స్వప్నముగానే మిగిలి పోతుంది. మనమందరమూ, మన సహజ స్వభావంచే పని చేయటానికి, ప్రేరేపింపబడతాము. అర్జునుడు ఒక యోధుడు. కానీ, కృత్తిమంగా తన ధర్మమును త్యజించి, అడవులకు పారిపోతే, అతని స్వభావం, అక్కడ కూడా తన కర్తవ్యాన్ని ప్రవర్తిస్తుంది. అలా కాకుండా, తన సహజ గుణాలనీ, ప్రతిభనీ భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే, అది ఏంతో ఫలదాయకంగా ఉంటుంది. పిందెగా ఉన్న పండు, తనను మోసి, పోషించే చెట్టుకి, గట్టిగా అతుక్కుని ఉంటుంది. అదే పండు, పూర్తిగా పండినప్పుడు, తనకు ఆధారంగా ఉన్న దాని నుండి, విడిపోతుంది. అదే విధంగా, సంపూర్ణ విజ్ఞానంతో పరిపక్వత చెందే అనుభవం, కర్మ యోగికి, ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసేవారికే గాఢ నిద్ర పడుతుందో, కర్మ యోగము ద్వారా, మనస్సుని పరిశుద్ధమొనర్చుకున్నవారికే, గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది.
ఇక మన తదుపరి వీడియోలో, యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, ఆత్మ శుద్ధి కోసం ఆచరించే కర్మల గురించి, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!