Ads

Showing posts with label ఏవి ‘పాపములు’?. Show all posts
Showing posts with label ఏవి ‘పాపములు’?. Show all posts

13 July, 2022

ఏవి ‘పాపములు’? హృదయం మలినమవటానికి అసలు కారణం ఏంటి? Bhagavad Gita

  

ఏవి ‘పాపములు’? హృదయం మలినమవటానికి అసలు కారణం ఏంటి?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (01 - 05శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/e-cOeyLHNdc ]

ఈ అధ్యాయంలో, మనలో విస్మయాన్నీ, పూజ్య భావాన్నీ, మరియు భక్తినీ ఉత్పన్నం చేసే - తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి, శ్రీ కృష్ణుడు తెలియజేయ బోతున్నాడు..

00:54 - శ్రీ భగవానువాచ ।
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 1 ।।

శ్రీ కృష్ణ భగవానుడిలా పలుకుతున్నాడు. ఓ అర్జునా, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్నీ, మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్నీ, ఇప్పుడు నేను నీకు తెలియజేస్తున్నాను; ఇది తెలుసుకున్న తరువాత, నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు.

గర్వం మరియు దురభిమానం వలన, అసూయ వంటి ధోరణి జనిస్తుంది. అది ఒక వ్యక్తి యొక్క భక్తి పూర్వక పూజ్య భావాన్ని, దెబ్బ తీస్తుంది. భగవంతునికి తనకంటూ కావలసినది ఏమీ లేదు. కాబట్టి, ఆయన చేసే ప్రతి కార్యం, జీవాత్మల సంక్షేమం కోసమే అన్న సామాన్య విషయాన్ని కూడా, ఈర్ష్యతో ఉన్న జనులు అర్థం చేసుకోలేరు. జీవుల భక్తిని ఇనుమడింపచేయటానికే, తన కీర్తిని తాను చెప్పుకుంటాడు. అంతేకానీ, మనకున్న అహంభావమనే ప్రాపంచిక దోషము ఆయనకు లేదు. అర్జునుడు ఉదారుడు, విశాలహృదయము కలవాడు, ఈర్ష్య అనే దోషము లేనివాడు కాబట్టి, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పబోయే దానికి, అర్జునుడు సంపూర్ణంగా అర్హుడు. 

02:16 - రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ ।
ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ।। 2 ।।

ఈ జ్ఞానము అన్ని విద్యలకూ రారాజు, మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని, పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.

శ్రీ కృష్ణుడు, తాను ఉపదేశించే జ్ఞానం యొక్క సర్వోత్కృష్ట స్థాయిని వక్కాణించటానికి, “రాజ” అన్న ఉపమానం వాడుతున్నాడు. తన ఉపదేశాన్ని, విశ్వాసము, మతము, అభిప్రాయము, ఆచారము, లేదా నమ్మకము అని ఆయన అనటంలేదు. తను అర్జునుడికి చెప్పబోయేది, అన్ని శాస్త్రాలలో కెల్లా రారాజు అని ప్రకటిస్తున్నాడు. ఈ జ్ఞానము అత్యంత గోప్యమైనది కూడా. స్వేచ్ఛ ఉన్నచోటే, ప్రేమ సాధ్యమవుతుంది కాబట్టి, కావాలనే, భగవంతుడు తను నేరుగా, సునాయాసముగా కనబడకుండా, తనను తాను దాచి ఉంచుకుంటాడు. దీని ద్వారా ఆత్మకు భగవంతుడిని ప్రేమించాలా లేదా అనే స్వేచ్ఛను ఇస్తాడు. ఒక యంత్రము ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. మనం ఆయనను ప్రేమించాలని, భగవంతుడు కోరుకుంటాడు. అందుకే మనకు, ఆయనను కోరుకోవాలా, లేదా, అన్న స్వేచ్ఛను ఇస్తున్నాడు. దాన్ని మన ఇష్టానికే వదిలి వేస్తున్నాడు. కేవలం మనం ఎంచుకున్న మార్గం వలన కలిగే పరిణామాలను మాత్రం, తెలియచెబుతాడు. అలాగే, ఏ మార్గం అవలంభించాలనే స్వేచ్ఛను మనకే వదిలివేస్తాడు. భక్తి యొక్క జ్ఞానము అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే, అది అల్పమైన స్వార్ధముచే కళంకితం కానిది. భక్తుడి యొక్క పాపములూ, బీజములూ, మరియు అవిద్యను, భక్తి సాధన నాశనం చేస్తుంది. ‘పాపములు’ అంటే, జీవుడి అనంతమైన పూర్వ-జన్మల నుండీ ఉన్న పాపరాశి. నిప్పు గడ్డిమోపును భస్మం చేసినట్టు, పాపరాశినంతటినీ భక్తి దహించివేస్తుంది. ‘బీజములు’ అంటే, మనస్సులో ఉన్న మాలిన్యములు. ఇవి పాపపు పనులు చేయటానికి ఉన్న మూల కారణం. ఈ బీజములు ఉన్నంత కాలం, కేవలం పూర్వ జన్మల పాపపు పనులను నిర్మూలిస్తే సరిపోదు. ఎందుకంటే, పాపపు పనులు చేయాలనే కోరిక హృదయంలో ఉండిపోతుంది. వ్యక్తి తిరిగి పాపపు పనులు చేసే అవకాశం ఉంటుంది. భక్తి, హృదయాన్ని పవిత్రం చేస్తుంది. పాపాల యొక్క మూల బీజాలైన కామము, క్రోధము మరియు లోభములను నాశనం చేస్తుంది. కానీ, ఈ బీజముల నాశనం కూడా సరిపోదు. హృదయం మలినమవటానికి ఉన్న అసలు కారణం, అవిద్య. దీనిచే మనలని మనం ఈ దేహమే అనుకుంటాం. దాంతో, శారీరిక కోరికలను సృష్టించుకుని, అవే మనకు సంతోషాన్నిస్తాయి అనుకుంటాము. ఇటువంటి భౌతిక, ప్రాపంచిక కోరికలు తీర్చుకోవటం అనేది, మరింత కామ, క్రోధ, లోభములూ, ఇంకా ఇతర మలినముల వృద్ధికి దారి తీస్తుంది. మనస్సు పరిశుద్ధి చేయబడినా, అజ్ఞానము, అవిద్య ఉన్నంత కాలమూ, అది మరలా మలినమైపోతుంది. భక్తి అనేది అంతిమంగా - ఆత్మ మరియు భగవంతుని యొక్క అనుభవపూర్వక జ్ఞానానికి దారి తీస్తుంది. అది భౌతిక, ప్రాపంచిక అస్థిత్వము యొక్క అజ్ఞానాన్ని, నాశనం చేస్తుంది. 

05:50 - అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప ।
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ।। 3 ।।

ఓ శత్రువులను జయించేవాడా.. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు. వారు పదేపదే జనన-మరణ చక్రంలో, ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.

జ్ఞానము ఎంత అద్భుతమైనదైనా, మార్గము ఎంత ప్రభావశీలమైనదైనా, దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించేవానికి, అది నిరర్ధకమైనది. భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము, శ్రద్ధ. అప్పుడు వ్యక్తి, స్సత్సంగములలో పాలు పంచుకోవటం మొదలు పెడతాడు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు, దారి తీస్తుంది. తరచుగా జనులు, తాము దేనినైతే ప్రత్యక్ష్యంగా గ్రహింపగలుగుతామో, దాన్ని మాత్రమే నమ్ముతామని అంటూ ఉంటారు. అయితే, భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి, ఆయనను నమ్మరు. కానీ, నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడక పోయినా, ఎన్నో విషయాలను నమ్ముతాం. పాలల్లో దాగి ఉన్న వెన్న మనకు కనబడకపోయినా, వెన్న పాలలో ఉందని నమ్ముతాం. అలాగే భగవంతుడు కూడా మనకు కనపడకపోయినా, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయనను చూడటానికి ఒక పక్రియ ఉంది. విశ్వాసము ఉంటే, మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది, మరియు భగవత్ ప్రాప్తిని పొందుతాము. భగవంతుని మీద నమ్మకం అనేది, మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర-చిత్తమును ఉపయోగించుకుని, భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి. కౌరవుల సభలో, దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయటానికి ప్రయత్నించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఆమె చీరను పొడిగించి, ఆమెను అవమానమూ, సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూశారు కానీ, శీ కృష్ణుని సర్వశక్తిత్వముపై నమ్మికను ఉంచటానికి, తిరస్కరించారు. నిజాన్ని అర్థంచేసుకోలేకపోయారు. ఆధ్యాత్మిక పథంపై విశ్వాసం అవసరం లేదని నిర్ణయించుకున్న వారు, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు, మరియు జనన-మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు.

08:12 - మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ।
మత్-స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ।। 4 ।।

ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులూ, నా యందే స్థితమై ఉన్నాయి కానీ, నేను వాటి యందు స్థితుడనుకాను.

భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఆ తరువాత ఈ ప్రపంచమంతా బాగానే నడుస్తున్నదా లేదా అని, ఆ సప్త లోకాల పై నుండి తొంగి చూస్తుంటాడనే సిద్ధాంతాన్ని, వైదిక తత్వము ఒప్పుకోదు. వైదిక శాస్త్రాలన్నీ, భగవంతుడు లోకంలో సర్వ వ్యాపి అని పదే పదే ప్రతిపాదించాయి. దేవుడు ఒక్కడే. ఆయనే అందరి హృదయములలో స్థితుడై ఉన్నాడు, ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలో వ్యాప్తమై ఉన్నాడు, మరియు ఇక ముందు ఉండే అన్నింటిలో వ్యాపించి ఉంటాడు. భగవంతుడు సర్వ వ్యాపి అన్న విషయాన్ని, పలు విధాలుగా అర్థం చేసుకుంటారు. అది భగవంతుని యొక్క మాయా శక్తి అనే భౌతిక శక్తి ద్వారా సృష్టించబడినది. జీవాత్మలు కూడా భగవంతుని శక్తి స్వరూపమే కానీ, వారు ఆయన యొక్క ఉత్కృష్ట స్థాయి జీవ శక్తి. కాబట్టి, ఈ ప్రపంచము, మరియు దానిలో ఉన్న అన్ని జీవులూ, భగవంతుని శక్తి స్వరూపములే, మరియు ఆయన వ్యక్తిత్వములోని భాగములే. అయినా, ఆయన సర్వ భూతములకూ అతీతుడు. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను విడుదల చేస్తున్నా, ఆ అలలన్నీ సముద్రములోని భాగములే అయినా, సముద్రమనేది, ఈ సమస్త అలల మొత్తానికన్నా ఎంతో ఎక్కువే. అదే విధంగా, జీవులు, మరియు మాయ, భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమే అయినా, ఆయన వాటికన్నా ఉన్నతుడు, అతీతుడు.

10:04 - న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ।। 5 ।।

అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను, మరియు నిర్వాహకుడనూ అయినా, నేను వాటిచే కానీ, లేదా భౌతిక ప్రకృతిచే కానీ, ప్రభావితము కాను.

మాయా శక్తీ, జీవ శక్తీ అనే ఈ రెండు శక్తులకు అతీతంగా, భగవంతునికి ఒక మూడవ శక్తి ఉంది. అదే, దివ్య యోగమాయా శక్తి. యోగమాయ అనేది, భగవంతుని యొక్క సర్వ-శక్తివంతమైన శక్తి స్వరూపము. దానిని కర్తుం-అకర్తుం-సమర్థః అంటారు. అంటే, "అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది" అని. ఆయన వ్యక్తిత్వానికి మనం ఆపాదించే అద్భుతమైన విషయాలకు మూలశక్తి ఇదే. ఉదాహరణకి, భగవంతుడు మన అందరి హృదయములలో ఉన్నాడు. అయినా, మనకందరికీ అయన తెలియడు. ఎందుకంటే, అయన దివ్య యోగమాయ శక్తి, ఆయన నుండి మనలను దూరంగా ఉంచుతుంది. అదేవిధంగా, భగవంతుడు కూడా తనను తాను మాయా ప్రాబల్యం నుండి దూరంగా ఉంచుకుంటాడు. మాయ అనేది, భగవంతుని ముందు నిలబడలేదు. భగవంతుడు, భౌతిక, ప్రాకృతిక శక్తి మాయలో వ్యాప్తమై ఉన్నా, దానికి అతీతుడు. ఒకవేళ ప్రపంచం భగవంతుడిని ప్రభావితం చేయగలిగితే, అప్పుడు ఈ లోకం క్షయమై పోయినా, లేదా వినాశనము చేయబడ్డా, ఆయన యొక్క స్వభావము, మరియు వ్యక్తిత్వము కూడా కృశించి పోవాలి. కానీ, ఈ ప్రపంచంలో అన్ని మార్పులూ చేర్పులూ జరుగుతున్నా కూడా, భగవంతుడు తన నిజ-అస్థిత్వంలోనే స్థితుడై ఉంటాడు.

11:54 - ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుని దివ్యయోగమాయ శక్తి గురించి, మరింత స్పష్టంగా తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!