Ads

Showing posts with label ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు. Show all posts
Showing posts with label ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు. Show all posts

23 March, 2022

'బ్రహ్మ-భూతం' పొందటం ఎలా? ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు.. Bhagavad Gita

 

'బ్రహ్మ-భూతం' పొందటం ఎలా? ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు..

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (23 – 27 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 23 నుండి 27 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/3-ixcOv5iUs ]

నిలకడ లేని మనస్సును, నిరంతరం భగవంతుని మీద ఏ విధంగా కేంద్రీకరించాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:48 - తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।

స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే, యోగమని అంటారు. ఈ యోగమును, దృఢ సంకల్పముతో, ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా, అభ్యాసం చేయాలి.

భౌతిక జగత్తు, మాయ యొక్క అధీనంలో ఉంది. భౌతిక శక్తి అయిన మాయ, చీకటితో పోల్చబడుతుంది. అది మనలను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి, మనలను ఈ లోకంలో బాధలకు గురి చేస్తుంది. కానీ, భగవంతుడనే వెలుగుని మన హృదయం లోనికి తెచ్చినప్పుడు, మాయా రూప చీకటి, సహజంగానే నిర్మూలించబడుతుంది. భగవంతుడు వెలుగు వంటి వాడు, మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో, ఆవిధంగానే, మాయ అనేది, ఎన్నటికీ భగవంతుణ్ణి జయించలేదు. ఇక భగవంతుని సహజ-స్వభావం, దివ్య ఆనందం. అదే సమయంలో, మాయ యొక్క పరిణామం దుఃఖం. అందుకే, భగవంతుని దివ్య ఆనందాన్ని పొందినవాడు, మాయ కలిగించే దుఃఖములకు ఎన్నటికీ ఇక లోనుకాడు. ఈ విధంగా, యోగ స్థితి అంటే, ఆనంద ప్రాప్తీ, దు:ఖ నివృత్తీ, రెండూ ఉన్నట్లే.

02:06 - సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః ।

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ।। 24 ।।

02:16 - శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ।

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ।। 25 ।।

ప్రాపంచిక తలంపులలో నుండి వచ్చిన అన్ని కోరికలనూ త్యజించి, ఇంద్రియములను, అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా, మరియు నిశ్చయముగా, బుద్ధిలో దృఢవిశ్వాసంతో, మనస్సు భగవంతుని యందే స్థితమగును. ఇక మరే విషయం గురించీ ఆలోచించదు.

ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం. మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి తీసివేయటం, మరియు దానిని భగవంతుని యందే స్థిర పరచటం. మనస్సుకి ప్రపంచంతో అనుబంధంతో ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తువులూ, మనుష్యులూ, సంఘటనల వంటివాటి తలపులు, మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో తలంపులు, ‘స్ఫూర్ణా’ రూపంలో ఉంటాయి. అంటే, అప్పుడప్పుడూ వచ్చిపోయే అనుభూతులూ, ఆలోచనలూ. మనం ఈ యొక్క ‘స్ఫూర్ణ’ కావాలని గట్టిగా కోరుకున్నప్పుడు, అది ‘సంకల్పమ’వుతుంది. ఈ విధంగా ఆలోచనలు, అవి అనుకూలమైనవో, లేదా ప్రతికూలమైనవో, దానిని బట్టి, సంకల్పముగా అంటే, ఆయా వస్తు విషయాల కోసం పాటు పడటం.. వికల్పములుగా అంటే, వాటిని ద్వేషించటంగా మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు, కోరికలనే మొక్కగా మారతాయి. సంకల్ప వికల్పములనే ఈ రెండూ, మనస్సుపై తక్షణమే వాటి ముద్రను వేస్తాయి. ఈ విధంగా, అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి, ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది. ఈ నాటి చిన్న కోరికే, కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా, ధ్యానంలో విజయం పొందాలనే అభిలాష ఉంటే, భౌతిక వస్తు-విషయముల పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇక రెండవ ప్రక్రియ, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు. దృఢ సంకల్పముతో శ్రమిస్తే, విజయం నెమ్మదిగా చేకూరుతుంది. వేద శాస్త్రాలకనుగుణంగా ఉన్న దృఢ సంకల్పాన్ని, ‘ధృతి’ అంటారు. ఈ దృఢ సంకల్పం, బుద్ధి యొక్క గట్టి విశ్వాసం వలన వస్తుంది. చాలా మంది ప్రజలు, ఆత్మ తత్త్వము గురించీ, ప్రాపంచిక పరుగుల నిరర్ధకత్వము గురించీ, వేద శాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ, వారి దైనందిన జీవితం, వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు. అంతేకాక, పాపిష్ఠి పనులూ, లైంగిక వాంఛలూ, మరియు మత్తుపదార్ధలతో కూడిన పనులు కూడా చేస్తుంటారు. ఇది ఎందుకంటే, వారి బుద్ధి ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకాన్ని కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అనిత్యము, మరియు భగవంతునితో తనకున్న శాశ్వత సంబంధాల మీద బుద్ధి ధృఢ విశ్వాసం కలిగి ఉంటే, అప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని, క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు. అంటే, ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహరములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయటం ద్వారా, క్రమక్రమంగా సాధించబడుతుంది.

05:41 - యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।

ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన, నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో, దానిని తిరిగి తెచ్చి, నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.

ధ్యానంలో విజయం, ఒక్క రోజులో రాదు. పరిపూర్ణ సిద్ధిని పొందే మార్గం, సుదూరమైనదీ, మరియు క్లిష్టమైనదీ. భగవంతునిపై మనస్సును కేంద్రీకరించాలని, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడనుకుంటాము. కానీ, క్రమంగా భౌతిక విషయాలపైకి మనస్సు, ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో పరిభ్రమించిపోతుంది. కాబట్టి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది:

1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం, ఈ ప్రపంచము మన లక్ష్యం కాదని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. 

2. మరల, బుద్ధి విచక్షణ శక్తి చే, భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి, భగవంతుని పైనే కేంద్రీకరించాలి.

3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి, మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దానికదే, అనాయాసముగా అయిపోతుంది.

ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు. అయితే, మనస్సు చంచలమైనదే.. మనం ఎంత ప్రయత్నించినా, అది సహజంగానే, తనకు ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుందని, ముందే అనుకోవాలి. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి బుద్ధి యొక్క విచక్షణా శక్తితో, దానిని భగవంతుడి వైపుకు మళ్లించాలి. ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమ క్రమంగా, మనస్సు భగవంతునిపై అనుసంధానాన్ని పెంచుకుంటుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా సులువవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి, సిద్ధపడాలి.

07:50 - ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ।। 27 ।।

మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడూ, ఆవేశ-ఉద్వేగాలు శాంతింపజేసేవాడూ, పాపరహితుడూ, అన్నింటినీ భగవత్ సంబంధముగా చూసేవాడూ అయిన యోగికి, అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది.

మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేస్తున్న యోగికి, ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి. మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది కానీ, ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు, అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు. ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో, మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ, ఆయన యందే నిమగ్నమై ఉంటుంది. అటువంటి భక్తుడు, ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు. ఆయన గురించే మాట్లాడతాడు, ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం, ప్రారంభిస్తుంది. మన అంతర్గత, అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది మన మనస్సు నియంత్రించబడుతుండటానికీ, మన అంతఃకరణ, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికీ, ఒక నిదర్శనం. ఇక్కడ మనము, 'శాంత-రాజసం' మరియు 'అకల్మషం' అయినప్పుడు, మనం 'బ్రహ్మ-భూతం'  అంటే, భగవత్ ప్రాప్తిని పొందుతాము. ఆ స్థితిలో, మనం అత్యున్నత ఆనందమును అనుభవిస్తాము.

ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుడు పరిపూర్ణ యోగులుగా ఎవరిని పరిగణిస్తాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkx4Ly8Jkv2ufJrfPPc8XnOLQwMddbQLId8