Ads

Showing posts with label ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా!. Show all posts
Showing posts with label ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా!. Show all posts

16 February, 2022

ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా! Bhagavadgita

 

ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (25 – 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 25 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/60lPB4Sy6dA ]

భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభించాలంటే ఏం చేయాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ।। 25 ।।

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు నియమబద్ధమైనవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు, భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.

కరుణా స్వభావము అనేది, ఋషులకున్న స్వాభావిక గుణము. దానిచే స్ఫూర్తినొంది, వారు తమ వాక్కూ, మనస్సూ, శరీరములనూ, పరుల సంక్షేమం కోసమే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక సంక్షేమం, భౌతిక దుఃఖాల మూల కారణాన్ని తాకుతుంది. ఆత్మ యొక్క భగవత్ స్పృహని మేల్కొలపటానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి, అత్యున్నత సంక్షేమ కార్యం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మని, భగవంతునితో ఏకం చేయటమే. పవిత్రమైన మనస్సున్న మహోన్నత జీవులు, ఈ రకమైన సంక్షేమ పనులే చేస్తుంటారు. ఈ విధమైన సంక్షేమ కార్యాలు, మరింతగా భగవత్ కృపని ఆకర్షిస్తాయి. దాంతో వీరు ఈ మార్గంలో, మరింత ఉన్నతమైన దశకు చేరుకుంటారు. చివరికి వారు సంపూర్ణ అంతఃకరణ శుద్ధిని సాధించిన తరువాత, పరిపూర్ణమైన శరణాగతి చేసిన తరువాత, మోక్షము పొంది, పరమ పదమును పొందుతారు.

02:08 - కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ।। 26 ।।

నిరంతర ప్రయాస ద్వారా, కామ-క్రోధముల నుండి బయట పడిన వారూ, మనస్సుని నిగ్రహించిన వారూ, ఆత్మ-జ్ఞానంలో ఉన్నవారూ అయినటువంటి సన్యాసులకు, ఇహ పర లోకాలలో, భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభిస్తుంది.

కర్మ యోగమనేదే, అత్యధిక జనులకు సరిపోయే సురక్షిత మార్గం. అందుకే, శ్రీ కృష్ణుడు దానిని అర్జునుడికి సూచించాడు. కానీ, ప్రాపంచిక జగత్తు నుండి నిజముగా వైరాగ్యం కలిగిన వానికి, 'కర్మ సన్యాసం' కూడా సరిపోతుంది. దీనిలో ఉన్న అనుకూలత ఏమిటంటే, ప్రాపంచిక విధుల వైపు, మన సమయం, శక్తీ, ఖర్చు కావు. మనం పూర్తిగా ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నమవ్వవచ్చు. చరిత్రలో ఏంతో మంది మహాత్ములైన సన్యాసులున్నారు. ఇటువంటి కర్మ సన్యాసులు కూడా, అత్యంత త్వరితంగా పురోగతిని సాధించి, సర్వత్రా శాంతిని పొందుతారు. కామ-క్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను నిర్మూలించి, మనస్సుని వశపరుచుకున్న ఇటువంటి వారు, ఈ జన్మలో, పై జన్మలలో, సంపూర్ణ శాంతిని పొందుతారు. మన జీవితంలో శాంతి లోపించడానికి కారణం, ‘బాహ్య పరిస్థితులు’ అనే తప్పుడు దృక్పథంలో ఉంటాం. పరిస్థితులు ఎప్పుడు మారతాయా, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుందా, అని ఎదురు చూస్తాం. కానీ, శాంతి అనేది బాహ్య పరిస్థితులపై ఆధార పడి ఉండదు. అది శుద్ధి చేయబడిన ఇంద్రియ, మనో, బుద్ధుల వల్ల ఉత్పన్నమయ్యే ఫలితం. సన్యాసులు తమ మనస్సునూ, ఆలోచనలనూ, తమలో అంతర్లీనంగా తిప్పుకోవటం వలన, బాహ్య పరిస్థితులకు అతీతంగా, అపారమైన శాంతిని పొందుతారు. ఈ విధంగా, తమ అంతర్గత యంత్రాంగమంతా సరియైన ప్రకారంగా ఉండటం వలన, వారు అంతటా శాంతినే అనుభవిస్తారు. అంతేకాకుండా, ఇక్కడే విముక్తిని పొందుతారు.

04:04 - స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।।

04:15 - యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేఛ్చాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ।। 28 ।।

అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులనూ త్యజించి, దృష్టి కను బొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రముల లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నిలిపి, ఈ విధంగా ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధిని నిగ్రహించి, కామ, క్రోధ, భయ రహితుడైన ముని, సర్వదా, మోక్ష స్థితి యందే వసించును.

తరచుగా సన్యాసులు, తమ నిష్ఠలతో పాటుగా, అష్టాంగ యోగ, లేదా హఠ యోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్రమైన వైరాగ్యం, వారిని భక్తి మార్గం వైపుకు అంతగా పోనివ్వదు. దానికి, భగవంతుని నామములూ, రూపాలూ, లీలలూ, మరియూ ఆయన ధామములపై ధ్యానం, అవసరం. సన్యాసులు తమ దృష్టీ, శ్వాసలను నియంత్రించటం ద్వారా, ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరకు రానివ్వరు. తమ దృష్టిని కను బొమల మధ్యే, కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే, నిద్ర రావచ్చు. ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే, చుట్టూ ఉన్నవాటి వలన, ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ రెండు దోషాలనూ నివారించటానికి, సన్యాసులు కళ్ళు సగమే తెరచి, తమ దృష్టిని కను బొమల మధ్యన, లేదా నాసికాగ్రాన నిలుపుతారు. బయటకు వెళ్ళే శ్వాసా, లోనికి వచ్చే శ్వాసా, రెండూ యోగ సమాధిలో నిలిచి పోయేవరకూ అనుసంధానం చేస్తారు. ఇంద్రియ, మనస్సు, బుద్ధులను నియంత్రించటానికి, ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు, భౌతిక, ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే, తమకున్న ఏకైక లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్ఠల అభ్యాసం, ఆత్మ-జ్ఞానానికి దారి తీస్తుంది కానీ, బ్రహ్మ-జ్ఞానానికి కాదు.

06:06 - భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ।। 29 ।।

సమస్త యజ్ఞములకూ, తపస్సులకూ, భోక్తను నేనే అనీ, సమస్త లోకములకూ అధిపతిని అనీ, సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడననీ తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందుతాడు.

బ్రహ్మ- జ్ఞానము పొందాలంటే, భగవంతుని కృప ఉండాలి, అది భక్తి ద్వారా వస్తుంది. సన్యాస మార్గం కూడా, అన్ని తపస్సులకూ, నియమ నిష్ఠలకూ, భగవంతుడే భోక్త అన్న జ్ఞానంతో, ఈశ్వర శరణాగతి ద్వారానే, పరిపూర్ణత పొందుతుందని ఉద్ఘాటిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అనాది నుండీ జీవాత్మ, భగవంతుని నుండి విడిపోయి ఉంది. జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేదే, నిజమైన యోగం. కాబట్టి, భక్తి కలపకుండా, ఏ ఒక్క యోగ విధానం కూడా, సంపూర్ణం కాదు. ఈ గీత ద్వారా శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక సాధనకున్న అన్ని కచ్చితమైన మార్గాలనూ, అద్భుతంగా వివరించాడు. కానీ, ప్రతిసారీ లక్ష్యం సాధించటానికి భక్తి అనేది, ఈ అన్ని మార్గాలలో కూడా అవసరం అని చెప్పి, వాటికి పరిపూర్ణతను తెచ్చాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే, కర్మసన్న్యాస యోగో నామ పంచమోధ్యాయః

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, అయిదవ అధ్యాయం, కర్మసన్న్యాసయోగంలోని 29 శ్లోకాలూ, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని ఆరవ అధ్యాయం, ఆత్మసంయమయోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!