'కారణం' – కారణమే కార్యమునకు బీజము..
'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/A35A7oIap1s ]
అర్జునుడికి భగవంతుడు, తన శక్తి గురించి ఈ విధంగా విశదీకరిస్తున్నాడు..
00:44 - ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ।। 6 ।।
సమస్త జీవ రాశులూ, నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయని, తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికీ మూల ఉత్పత్తిస్థానం, మరియూ నా లోనికే, ఇదంతా లయమై పోతుంది.
ఈ జడపదార్ధము, మరియు జీవశక్తుల సంయోగం వలననే, భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది. పదార్ధము జడమైనది. ఆత్మకి శరీర రూపంలో ఒక వాహనం అవసరం. ఈ రెండు శక్తుల సంయోగం వలన, ప్రాణులు వ్యక్తమవుతాయి. భగవంతుడే ఈ రెండు శక్తులకూ మూల స్థానం. సమస్త సృష్టీ, ఆయన నుండే వ్యక్తమవుతుంది. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల అంతంలో, ఈ సృష్టి చక్రం ముగింపు దశకు చేరుకున్నప్పుడు, భగవంతుడు ఈ సృష్టిని లయం చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మతత్వాలలో విలీనమవుతాయి. ఐదు సూక్ష్మ తత్వాలు, అహంకారంలో విలీనమవుతాయు. అహంకారము, మహత్తులోనికి లీనమవుతుంది. మహత్తు అనేది, ప్రకృతి లోనికి విలీనమవుతుంది. ప్రకృతి కూడా, శ్రీ మహా విష్ణువు శరీరంలోనికి వెళ్లి కూర్చుంటుంది. ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో, మోక్షము పొందలేక పోయిన జీవులు కూడా, భగవంతుని శరీరంలో అవ్యక్త రూపంలో, తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు. మరొకసారి, భగవంతుడు సృష్టి చేయటం సంకల్పించినప్పుడు, ఈ చక్రం తిరిగి మొదలవుతుంది. కాబట్టి, సమస్త అస్థిత్వానికీ, భగవంతుడే జన్మ స్థానం, ఆధారం, మరియు అంతిమ శాంతి స్థానం.
02:28 - మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।
నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జునా! పూసలన్నీ దారముతో గుచ్చి ఉన్నట్లు, సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
సర్వోత్కృష్ట భగవానుడైన శ్రీ కృష్ణుడు, ఇక అన్నింటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించీ, తన ఆధిపత్యం గురించీ మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్తా, స్థితికర్తా, లయకర్త. ఆయనే, అన్నింటి అస్తిత్వానికీ మూలాధారము. దారంలో గుచ్చిన పూసల మాదిరిగా, జీవాత్మలు, తమకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే.. అందరినీ సంరక్షించేది ఆయనే.. ఆయన యందే, అందరూ ఉంటారు. భగవంతునితో సమానమైనది ఏదీ లేదు. ఆయన కన్నా ఉన్నతమైనది, ఏమీ లేదు. భగవానుడు, అర్జునుడి ముందు నిలుచుని ఉన్న తన యొక్క శ్రీ కృష్ణ సాకార రూపంలో ఉన్న ఆయనే, సర్వోన్నత, సర్వోత్కృష్ట పరమ సత్యమని, స్పష్టంగా చెబుతున్నాడు.
03:38 - రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ।। 8 ।।
ఓ కుంతీ పుత్రుడా, నీటి యందు రుచిని నేను. సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో, నేను పవిత్ర 'ఓం' కారమును. ఆకాశములో శబ్దమును. మనుష్యులలో వారి సామర్ధ్యమును.
మనం ఏదైనా పండు తిన్నప్పుడు, ఆ రుచిలో ఉన్న తియ్యదనం, అందులో చక్కెర ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. అదే విధంగా, శ్రీ కృష్ణుడు తన శక్తి యొక్క సమస్త రూపాంతరాలలో, తన ఉనికిని ప్రకటిస్తున్నాడు. అందుకే, నీటి యందున్న రుచి తానే అంటున్నాడు. నీటి యొక్క రుచి, దాని ప్రత్యేక సహజ స్వభావము. ఎవరైనా నీటి యొక్క రుచిని, నీటి నుండి వేరు చేయగలరా? మిగతా అన్ని భౌతిక శక్తులైన వాయువూ, అగ్నీ, ఘన పదార్థములూ, తమ రుచిని వ్యక్తీకరించటానికి నీరు కావాలి. తేమ లేని, ఎండిన నాలుకపై ఎదైనా ఘన పదార్ధమును పెట్టి చూడండి. మనకు ఎటువంటి రుచీ తెలియదు. కానీ, ఆ ఘన పదార్ధములు, నోటిలోని లాలాజలములో కరిగినప్పుడు, వాటి యొక్క రుచి, నాలికపైనున్న రసాంకురములకు తెలుస్తుంది. అప్పుడు మనం దాని రుచిని అనుభవించగలం. అదే విధంగా, ఆకాశం, శబ్దమునకు వాహకంగా పని చేస్తుంది. శబ్దమే, ఎన్నో రకాల భాషలుగా రూపాంతరం చెందుతుంది. ఆకాశంలో ఉండే శబ్దము, ఆ భగవంతుడి శక్తి స్వరూపము. తానే, వేద మంత్రాలకు ముఖ్యమైన 'ఓం' కారమునూ, ప్రణవమునని అంటున్నాడు. సమస్త మానవులలో వ్యక్తమయ్యే సామర్ధ్యానికి కూడా, ఆ భగవానుడే మూల శక్తి.
05:20 - పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ।। 9 ।।
భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేనే, అగ్ని లోని తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సునూ నేనే.
అన్నిటికీ మూల సూత్రము తానే అని, శ్రీ కృష్ణుడు ఇంకా విఫులంగా చెబుతున్నాడు. శారీరక సుఖాలను త్యజించి, బుద్ది పూర్వకంగా, చిత్తశుద్ధి కోసం, నియమ-నిష్ఠలను పాటించటమే, తాపసుల ప్రత్యేకత. ఆయనే, వారి తపస్సు చేసే సామర్ధ్యము అని, భగవంతుడంటున్నాడు. భూమిలో ఉన్న సుగంధము ఆయనే.. అదే దాని ప్రధానమైన గుణము. అగ్నిలో జ్వాల యొక్క వెలుగు, ఆయనే.
06:08 - బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।। 10 ।।
ఓ అర్జునా! సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే.
‘కారణమే’ కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చు. మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికీ, తానే బీజమునని, శ్రీ కృష్ణుడంటున్నాడు. జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ, భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమయిన భగవంతుని శక్తులే. తెలివిగలవారు, తమ ఆలోచన, మరియు ఉపాయములలో, ఉన్నతమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు, తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి తానే అని, భగవంతుడంటున్నాడు. ఎప్పుడైనా, ఎవరైనా, ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా, అత్యత్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించినప్పుడు, భగవంతుని శక్తి, వారి ద్వారా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. మహాత్ములు సహజంగానే, తమ పని యొక్క అందాన్నీ, ప్రజ్ఞనూ, మరియు జ్ఞానాన్నీ, భగవత్ కృపకే ఆపాదించారు, ఆపాదిస్తారు.
07:32 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన శక్తులను ఏ విధంగా విఫులీకరిస్తున్నాడో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!