Ads

15 June, 2022

మనస్సుతో చేసే ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి! Bhagavad Gita

  

మనస్సుతో చేసే ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి!

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (07 – 11 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 07 నుండి 11 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/CavNgpd9-ew ]

మన మనస్సునూ, బుద్ధినీ, భగవంతుడికి శరణాగతి చేసి సమర్పించనట్లయితే, మనం ఏం పొందగలమో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:50 - తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 7 ।।

కాబట్టి, సర్వ కాలముల యందూ నన్ను స్మరిస్తూనే ఉండుము, మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు.

"నీ మనస్సుని నా యందే లగ్నం చేయుము, మరియు శరీరంతో నీ ప్రాపంచిక కర్తవ్యాన్ని చేయుము." అని శ్రీ కృష్ణుడు చెప్పిన ఈ మాట, అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది. అయితే, అర్జునుడికి సంబంధించినంత వరకు, అతను ఒక క్షత్రియుడు, ఆయన ధర్మం, యుద్ధం చేయటమే. కాబట్టి, అతను, మనస్సుని కృష్ణుని యందు ఉంచి, తన కర్తవ్యాన్ని చేయాలని ఉపదేశించబడుతున్నాడు. కొంతమంది, తాము ఆధ్యాత్మిక జీవితం అవలంభిస్తున్నామన్న మిషతో, తమ ప్రాపంచిక విధులను ఆలక్ష్యం చేస్తారు. మరికొంత మంది, ప్రాపంచిక పనుల నెపంతో, ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యం చేస్తారు. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక వ్యవహారములు, పరస్పర-విరుద్ధమైనవని, జనులనుకుంటారు. కానీ, భగవంతుని సందేశం, మన సంపూర్ణ జీవితాన్ని పవిత్రము గావించటమే. ఈ విధమైన కర్మ యోగము అభ్యాసము చేసినప్పుడు, ప్రాపంచిక పనులేవీ నిర్లక్ష్యం చేయబడవు. ఎందుకంటే, శరీరము వాటిలోనే నిమగ్నమై ఉంటుంది. కానీ, మనస్సు భగవంతుని యందే నిమగ్నమవటం వలన, ఈ పనులు వ్యక్తిని కర్మ బంధాలలో పెనవేయవు. ఏ పనులను మమకారాసక్తితో చేస్తామో, అవే మనలను కర్మ బంధాలతో పెనవేస్తాయి. ఎప్పుడైతే పని ఆసక్తి రహితంగా ఉంటుందో, ప్రాపంచిక న్యాయము కూడా, మనలను ఆ పనులకు అపరాధిగా పరిగణించదు. ఇదే సూత్రం, కర్మ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుంది. అందుకే, మహా భారత యుద్దంలో, శ్రీ కృష్ణుడి ఉపదేశాన్ని పాటిస్తూ, అర్జునుడు యద్ధరంగంలో తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం ముగిసేటప్పటికి, అర్జునుడు ఎలాంటి చెడు కర్మనూ పొందలేదు. ప్రాపంచిక లాభం కోసం, లేదా కీర్తి కోసంగనుక అర్జునుడు ఆ యుద్దం చేసి ఉంటే, అతను కర్మ బంధాలలో చిక్కుకుని ఉండేవాడు. కానీ, అతని మనస్సు శ్రీ కృష్ణుడితో అనుసంధానమై ఉంది. స్వార్ధ పూరిత ఆసక్తి లేకుండా, ఈ లోకంలో తన విధులు నిర్వర్తిస్తూ ఉండటంచేత, ఆయన చేసేది సున్నాతో గుణించబడుతున్నది. ఒక కోటి సంఖ్య నైనా సున్నాతో గుణిస్తే వచ్చేది, సున్నానే. కర్మ యోగమునకు కావలసిన నియమం, ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మనస్సనేదానిని, నిరంతరం భగవంతుని ధ్యాసలో ఉంచటానికి ఉపయోగించాలి. మనస్సు ఒక్క క్షణం అయినా భగవంతుడిని మరచిపోతే, మరుక్షణం అది మాయ యొక్క సైన్యంలోని యోధుల దాడికి గురవుతుంది. అంటే, కామము, క్రోధము, లోభము, ఈర్ష, ద్వేషము వంటివి. అందుకే, దానిని ఎల్లప్పుడూ భగవంతుని యందే నిమగ్నం చేయాలి. తరచుగా జనులు తాము కర్మ, మరియు యోగా చేస్తున్నాము కాబట్టి, తమని తాము కర్మయోగులమనుకుంటారు. రోజులో చాలా భాగము వారు కర్మ చేస్తారు, మరియు కొద్ది నిముషాలు, వారు 'యోగం' అంటే భగవంతుని పై ధ్యానము చేస్తారు. కానీ, ఇది కాదు శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగ నిర్వచనము. కర్మలు చేస్తూనే ఉన్నా, మనస్సు మాత్రం భగవంతుని స్మరణ యందే నిమగ్నమై ఉండాలి. భగవంతుని స్మరణ, అప్పుడప్పుడూ కాకుండా, రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి.

04:33 - అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ।। 8 ।।

ఓ పార్థా, అభ్యాసముతో, నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక, పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు.

మనస్సుని సర్వదా భగవంతుని యందే ధ్యానంలో నిమగ్నం చేయమని, ఇప్పటికే ఎన్నో సార్లు ఉపదేశించాడు, శ్రీ కృష్ణ భగవానుడు. అభ్యాసము, అంటే, మనస్సుకి భగవంతుని యందే ధ్యాస ఉంచే శిక్షణనివ్వడం. ఇటువంటి అభ్యాసము, ఏదో ఒక స్థిరమైన, నిర్దిష్ట సమయాల్లో కాకుండా, అవిచ్ఛిన్నంగా, అంటే, నిరంతరంగా, రోజువారీ పనులతో పాటుగా చేయాలి. ఎప్పుడైతే మనస్సు భగవంతునితో అనుసంధానమవుతుందో, ప్రాపంచిక విధులలో ఉన్నా, అది శుద్ధి అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనం మనస్సుతో చేసే ఆలోచనలే, మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కానీ, మనం శరీరంతో చేసే పనులు కావు. భక్తిలో నిమగ్నమవ్వాల్సింది, మనస్సు మాత్రమే.. మరియు శరణాగతి చేయాల్సింది కూడా, మనస్సే. భగవత్ ధ్యాసలో మనస్సు నిమగ్నమవ్వటం పరిపూర్ణమయితే, మనకు భగవత్ కృప అందుతుంది. భగవంతుని కృప ద్వారానే, వ్యక్తి భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతాడు. అనంతమైన దివ్య ఆనందాన్నీ, దివ్య జ్ఞానాన్నీ, మరియు భగవంతుని దివ్య ప్రేమనూ పొందుతాడు. అటువంటి జీవాత్మ, ఈ శరీరముతోనే భగవత్ ప్రాప్తిని పొందుతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, భగవత్ సన్నిధానాన్ని చేరుకుంటుంది.

06:16 - కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః ।
సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।।

06:27 - ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ ।
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।

భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు. సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు, మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకూ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు కచ్చితంగా ఆయనను పొందుతారు.

భగవంతుని పై ధ్యానం అనేది, ఎన్నో రకాలుగా ఉంటుంది. నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామము లేదా ఆయన పరివారము, ఇలా వీటి మీద ధ్యానము చేయవచ్చు. ఇవన్నీ భగవంతునికి సంబంధించినవే, ఆయన కన్నా, అబేధములే. మన మనస్సుని వీటిలో దేనిపైనయినా అనుసంధానం చేస్తే, మనస్సు భగవత్ ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది, మరియు పరిశుద్ధి చెందుతుంది. కాబట్టి, వీటిలో దేనినైనా, లేదా అన్నింటినైనా, మన ధ్యాన విషయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగే భగవంతుని ఎనిమిది గుణములు వివరించబడ్డాయి..

కవి అంటే, కావ్యకర్త, లేదా జ్ఞాని.. అదే పథంలో దాని వ్యాప్తిచే, సర్వజ్ఞుడని కూడా చెప్పవచ్చు. భగవంతుడికి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ తెలుసు.

పురాణ అంటే, ఆదిరహితము, మరియు అత్యంత ప్రాచీనము అని. భగవంతుడే, సమస్త భౌతిక, మరియు ఆధ్యాత్మిక విషయములకు ఆదిమూలము కానీ, ఆయన మరొక దేనినుండో రాలేదు, మరియు ఆయన కన్నా ముందున్నది, ఇక ఏమీ లేదు.

అనుశాసితారం అంటే, పరిపాలించేవాడు. భగవంతుడు, ఈ విశ్వం నిర్వహించబడటానికి ఉన్న నియమనిబంధనలను సృష్టించేవాడు. ఆ విశ్వం యొక్క వ్యవహారాలను, తనే స్వయంగా, మరియు ఆయన నియమించిన దేవతల ద్వారా అజమాయిషీ చేస్తాడు. ఈ విధంగా ప్రతిదీ, ఆయన ఆధీనంలోనే ఉంటుంది.

అణోరణీయాన్ అంటే, సూక్ష్మాతి సూక్ష్మమయినది. ఆత్మ అనేది, భౌతిక పదార్ధము కంటే, సూక్ష్మమయినది. కానీ, భగవంతుడు, ఆత్మలోపల స్థితుడై ఉంటాడు కాబట్టి, ఆత్మ కన్నా సూక్ష్మమైనవాడు.

సర్వస్య ధాతా అంటే, అన్నిటికీ ఆధారమైనవాడు. అన్ని అలలకూ ఆధారము, సముద్రమయినట్టుగా..

అచింత్య రూపా అంటే, ఊహకందని స్వరూపము ఉన్నవాడు అని. మన మనస్సు కేవలం భౌతిక రూపములు మాత్రమే గ్రహింపగలదు కాబట్టి, భగవంతుడు ఈ భౌతిక మనస్సు కంటే అతీతుడు. కానీ, ఆయన కృప చేస్తే, తన యోగమాయా శక్తి చేత, ఆయన మన మనస్సుని దివ్యమైనదిగా చేస్తాడు. అప్పుడు మాత్రమే, ఆయన కృప చేత, ఆయన మన ఊహకు అందుతాడు.

ఆదిత్య వర్ణ అంటే, ఆయన సూర్యుని వలె తేజోవంతుడు..

తమసః పరస్తాత్ అంటే, అజ్ఞానపు చీకటి కంటే అతీతుడు. ఎలాగైతే ఒక్కోసారి మబ్బులు సూర్యుడికి అడ్డు వచ్చినా, సూర్యుడు ఎప్పటికీ మబ్బులచే కప్పివేయబడలేడో, భగవంతుడు కూడా, ఈ లోకంలో మాయతో సంధానమైయినా, భౌతిక శక్తి మాయచే, ఆయన కప్పివేయబడలేడు.

భక్తి ప్రక్రియలో, మనస్సు భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు వంటి వాటిపైనే నిమగ్నమవుతుంది. కేవలం భక్తిని మాత్రమే చేస్తే, దానిని శుద్ధ భక్తి అంటారు. దానిని అష్టాంగ యోగంతో పాటుగా చేస్తే, దానిని యోగ-మిశ్ర భక్తి అంటారు. భగవద్గీత యొక్క ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే, అది చాలా రకాల ‘సాధనా’లను పేర్కొన్నది. ఎన్నో రకాల వైవిధ్యం, వేరు వేరు రకాల ఆచారాలూ, కుంటుంబాలూ, వ్యక్తిత్వాల నుండి వచ్చిన మనుష్యులను అక్కున చేర్చుకున్నది. పాశ్చాత్య విద్యావంతులు, గురువు సహాయం లేకుండా, హిందూ వేద శాస్త్రాలను చదవటానికి ప్రయత్నిస్తే, వారు చాలా సార్లు ఎన్నో రకాల మార్గాలూ, ఉపదేశాలూ, మరియు తత్వ కోణాలచే, అయోమయానికి గురి అవుతారు. కానీ, ఈ వైవిధ్యం నిజానికి ఒక వరం. అనంతమైన పూర్వ జన్మ సంస్కారాల వలన, మనందరికీ వేరు వేరు స్వభావాలూ, అభిరుచులూ ఉంటాయి. ఒక నలుగురు బట్టలు కొనటానికి వెళితే, వారందరూ వేరు వేరు రంగుల, వేరు వేరు రకాల వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ కొట్టులో ఒకే రకం రంగు, ఒకే రకం రూపము ఉన్న బట్టలు ఉంటే, అది మానవులలో అంతర్గతంగా ఉన్న వైవిధ్యాన్ని, తృప్తి పరచలేదు. అదే విధంగా, ఆధ్యాత్మిక పథంలో కూడా, జనులు ఎన్నో రకాల సాధనాలు, పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు. వైదిక శాస్త్రాలు, ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తాయి. అదే సమయంలో, "భక్తి" యే వీటన్నిటినీ ఉమ్మడిగా ఉంచి, ఒక్కటిగా కట్టివేసే త్రాడని, నొక్కిచెప్పాయి. అష్టాంగ యోగములో, ప్రాణ శక్తి, వెన్ను పూసలోని సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది మూడవ కన్ను స్థానమైన కను బొమల మధ్యకు, తేబడుతుంది. తదుపరి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని యందే, గాఢమైన భక్తితో, కేంద్రీకరించబడుతుంది.

12:00 - యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।

వేద పండితులు, ఆయనను నాశము చెందని వాడని చెబుతారు. ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు, బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు.

ఇప్పుడా లక్ష్యం యొక్క మార్గాన్ని, క్లుప్తముగా విశదపరుస్తాను. వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలవబడ్డాడు. వాటిలో కొన్ని: సత్, అవ్యాక్రిత్, ప్రాణ్, ఇంద్ర, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, పురుష్. ఎన్నో చోట్ల, భగవంతుని నిరాకార తత్వాన్ని సూచించేటప్పుడు, ఆయన 'అక్షర' అన్న పేరుతో కూడా పిలవబడ్డాడు. అక్షర అంటే, 'నాశము లేనిది' అని అర్థం. అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే, సూర్యుడు, చంద్రుడు తమ స్థానాల్లో నిలుప బడుతున్నారు. ఈశ్వరుని నిరాకార తత్వాన్ని పొందటానికి, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, యోగ-మిశ్ర-భక్తిని వివరిస్తున్నాడు. సంగ్రహేణ అంటే, "క్లుప్తంగా" అని అర్థం. మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ మార్గాన్ని, ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఈ మార్గము, అందరికీ అనుకూలమైనది కాదు. ఈ మార్గంలో, వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్ఠలను పాటించాలి. ప్రాపంచిక కోరికలను వదిలి వేసి, బ్రహ్మచర్యం పాటించాలి. కచ్చితమైన ఇంద్రియనిగ్రహమును అలవరచుకోవాలి. బ్రహ్మచర్యము ద్వారా, వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి, ఆ తరువాత సాధన ద్వారా, అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది. సాధకుడు, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి, బ్రహ్మచర్యం పాటించటం వలన, తన జ్ఞాపక శక్తి, మరియు మానసిక సామర్ధ్యాలను పెంచుకుంటాడు.

13:58 - ఇక మన తదుపరి వీడియోలో, పరమ గతిని పొందేటందుకు గల మార్గాన్ని, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: