Ads

01 June, 2022

'మరణం' 2000 తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధాకరంగా ఉంటుంది! Bhagavad Gita

  

'మరణం' 2000 తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధాకరంగా ఉంటుంది!

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-LbeLr3D-NA ]

రాగ, ద్వేషములనే ద్వంద్వములు ఎలా జనిస్తున్నాయో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ।। 26 ।।

అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులన్నీ తెలుసు.. కానీ, నేను ఎవరికీ తెలియదు.

భగవంతుడు సర్వజ్ఞుడు. తాను ‘త్రికాల-దర్శి’. జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవి అన్నీ ఆయనకు తెలుసు. మనకు, కొద్ది గంటల క్రితం ఏమి ఆలోచించామో గుర్తుండదు. కానీ, అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో, ప్రతి సమయంలో, విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలూ, మాటలూ, మరియు పనులన్నీ, భగవంతునికి గుర్తు ఉంటాయి. ఇవే, ప్రతి జీవాత్మ యొక్క ‘సంచిత కర్మలు’. అంటే, అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మల రాశి. కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలనూ, న్యాయాన్నీ జీవులకు అందించటానికి, భగవంతుడు దీని లెక్క గణిస్తాడు. అందుకే, తనకు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ తెలుసంటున్నాడు. భగవంతుడు అన్నీ తెలిసినవాడు. సర్వసాక్షి, మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు, జ్ఞాన మయము. తనకు అన్నీ తెలిసినా, తాను మాత్రం ఎవ్వరికీ తెలియదని, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడంటున్నాడు. భగవంతుడు తన మహిమలూ, కీర్తీ, శక్తులూ, గుణములూ, మరియు వ్యాప్తులలో అనంతుడు. కానీ, మన బుద్ధి పరిమితమైనది కాబట్టి, అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. ఒకే ఒక వ్యక్తిత్వం, భగవంతుడిని తెలుసుకోగలదు. అది ఆ భగవంతుడే. ఆయన ఏదైనా ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే, తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్న సౌభాగ్యవంతమైన జీవాత్మ, అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా, భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో, కృప అనేది అత్యంత ముఖ్యమైనది. 

02:47 - ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ।। 27 ।।

ఓ భరత వంశస్థుడా - రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహమనబడే భ్రాంతి నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా.. ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా, పుట్టుక నుండే వీటిచే, భ్రమింపజేయ బడుచున్నది.

ఈ ప్రపంచమంతా ద్వంద్వముల మయం.. పగలు-రాత్రీ; శీతాకాలం-ఎండాకాలం; సంతోషం-దుఃఖం; ఆనందం-బాధ.. అన్నింటికన్నా పెద్ద ద్వందములు, జనన-మరణములు. ఇవి ఒక జంట లాగా ఉంటాయి. పుట్టుక సంభవించగానే, మరణం కచ్చితంగా ఉంటుంది. మరణం మరల పుట్టుకను కలిగిస్తుంది. జననం-మరణం అనే ఈ రెండు చివరల మధ్య ఉండేదే జీవితం. ఈ ద్వంద్వములు, జీవన ప్రయాణంలో విడదీయలేని భాగాలుగా ఉంటాయి. భౌతిక దృక్పథంలో మనకి ఒకటి నచ్చుతుంది, మరియు ఇంకోకదానిపై రోత పుడుతుంది. ఈ ఇష్టము-ద్వేషము అనేవి, ద్వంద్వముల యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం కాదు.. నిజానికవి మన అజ్ఞానం నుండి ఉద్భవించినవే. తప్పుదారిలో ఉన్న బుద్ధి, భౌతిక సుఖాలు మనకు మంచివనే నిశ్చయంతో ఉంటుంది. బాధ అనేది మనకు హానికరమైనదన్న నిశ్చయంతో జీవిస్తాము. భౌతిక ప్రాపంచిక భోగాలు, ఆత్మపై ఉన్న భౌతిక మాయను మరింత మందంగా చేస్తాయి. అదే సమయంలో, ప్రతికూల పరిస్థితులకు మాయను నిర్మూలించి, మనస్సును ఉద్ధరించే శక్తి ఉందని తెలుసుకోలేకున్నాము. ఈ యొక్క భ్రాంతికి మూల కారణం, అజ్ఞానమే. ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం ఏంటంటే, వ్యక్తి రాగ-ద్వేషాలకూ, ఇష్టా-అయిష్టాలకూ అతీతంగా ఎదిగి, ఆ రెంటినీ భగవంతుని సృష్టిలో ఉన్న విడదీయలేని తత్వాలుగా, స్వీకరించగలగాలి.

04:44 - యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ।। 28 ।।

పుణ్య కార్యములు ఆచరించుటచే, ఎవరి పాపములయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు, నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.

అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో, జ్ఞానులు దానిని పగలు అనుకుంటారు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కోసం అభిలాష మేలుకోల్పబడినదో, వారు బాధ అనేదాన్ని, ఆధ్యాత్మిక పురోగతి, మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా, స్వీకరిస్తారు. ఆత్మను మరింత మరుగు పరిచే భోగాల పట్ల, అప్రమత్తంగా ఉంటారు. అందుకే, వారు సుఖాల కోసం ప్రయాసపడరు, కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు, ఎవరైతే తమ మనస్సులను రాగ-ద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో, వారు భగవంతుడిని స్థిరమైన, దృఢ సంకల్పముతో ఆరాధించగలరు.

05:48 - జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే ।
తే బ్రహ్మ తద్ విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ।। 29 ।।

ముసలితనము, మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మమునూ, తమ ఆత్మ తత్త్వమునూ, సమస్త కర్మ క్షేత్రమునూ తెలుసుకుంటారు.

భగవంతుడు, మన సొంత బుద్ధి బలంచే తెలియబడడు. కానీ, ఆయనకు శరణాగతి చేసిన వారు, ఆయన కృపకు పాత్రులవుతారు. అప్పుడు ఆయన కృప చేత, ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది..

ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, బుద్ధి బలం చేత కానీ, రకరకాల ఉపదేశాలు వినటం వలన కానీ, భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం, ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృపను ప్రసాదిస్తాడో, అప్పుడే ఆ అదృష్ట జీవాత్మ, ఆయనను తెలుసుకోగలదు. అలాగే, ఎప్పుడైతే వ్యక్తికి భగవత్ జ్ఞానం లభిస్తుందో, అతనికి సర్వమూ, ఆయన సంబంధముగానే తెలియబడుతుంది. "భగవంతుడు తెలిస్తే, నీకు అన్నీ తెలుస్తాయి." అని వేదాలు పేర్కొంటున్నాయి. కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు, ఆత్మ-జ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ, ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది, సముద్రములోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మ-జ్ఞానమనేది, బ్రహ్మ-జ్ఞానములో ఒక అతి చిన్న భాగము. నీటి బిందువు గురించి తెలిసిన వారికి, సముద్రము యొక్క లోతూ, వైశాల్యమూ, మరియు శక్తిని గురించీ తెలిసినట్టు కాదు. అదే విధంగా, ఆత్మ గురించి తెలిసినవారికి, భగవంతుని గురించి తెలిసినట్టు కాదు. కానీ, భగవంతుని గురించి తెలిసినవారికి, అప్రయత్నంగానే, భగవంతునిలోనే ఉన్న సమస్త అంగాలూ తెలిసిపోతాయి. కాబట్టి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయననీ, ఆత్మనీ, మరియు సమస్త కర్మ క్షేత్రమునే, ఆయన కృపచే తెలుసుకుంటారు.

07:45 - సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ।। 30 ।।

సమస్త భౌతిక జగత్తుకూ, అధి దేవతలకూ, మరియు సమస్త యజ్ఞాలకూ అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.

శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో, వారు తన దివ్య ధామాన్ని చేరుకుంటారు. కానీ, మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవటం, చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే, మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది 2000 తేళ్ళు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సూ, లేదా బుద్ధికి సహింపశక్యము కానిది. మరణం సంభవించకముందే, మనస్సూ, బుద్ధీ పని చేయటం ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. అందుకే, మరణ సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవడం, అసాధ్యం. ఇది కేవలం శారీరక సుఖాల, మరియు బాధలకు అతీతంగా ఉన్నవారి వల్లనే, సాధ్యమవుతుంది. ఇటువంటి వారు, స్పృహతోనే శరీరాన్ని విడిచి పెడతారు. తననే అధిభూత, అధిదైవ, మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్న వారు, మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు. ఇది ఎలాగంటే, యదార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారి తీస్తుంది. మనస్సు సంపూర్ణముగా భగవంతునిలోనే నిమగ్నమవుతుంది. ఆ కారణముగా, అది శారీరక స్థాయిలోని కోరికల, బాధల నుండి విడిపోతుంది. ఇటువంటి జీవాత్మ, శారీరక స్పృహలో ఉండదు. 

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే, జ్ఞాన విజ్ఞాన యోగో, నామ సప్తమోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని భక్తిషట్కం, ఏడవ అధ్యాయంలోని జ్ఞాన విజ్ఞాన యోగంలోని, 30 శ్లోకాలూ సంపూర్ణం.

09:51 - ఇక మన తదుపరి వీడియోలో, భక్తి షట్కంలోని ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగంలో శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: