Ads

18 April, 2022

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం.. Mahabharatam

 

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం..

భీష్మ నిర్యాణానంతరం విరాగిగా మారిన ధర్మరాజుకు వ్యాసుడు చెప్పిన నిధి రహస్యం!

మహాభారత యుద్ధానంతరం భీష్ముని నిష్క్రమణ, ధర్మరాజును మరింత క్షోభకు గురిచేసింది. చిన్నప్పటి నుండీ చేరదీసి, మంచి బుద్ధులు నేర్పి, ఆయన మరణానికి కారణం తానే అని తెలిసినా, తనను మన్నించి, అడిగిన ధర్మ సందేహాలన్నింటినీ తీర్చిన భీష్ముడు తనువు చాలించడం, ధర్మరాజు మనస్సును కలచి వేసింది. ఆ మనో వేదనతో, ధర్మరాజు వనవాసానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. అందుకు వ్యాసుడు ఆగ్రహించి, తాను చేయవలసిన కార్యం గురించి వివరించాడు. అశ్వమేధ యాగం చేసి, బ్రాహ్మణులకు ఘనంగా దాన ధర్మాలు చేసినట్లయితే, కొంత దు:ఖం తీరుతుందని, హితవు పలికాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yJxaUbjfopE ]

అయితే, యాగానికి సరిపడా ధనం ధర్మరాజు దగ్గర లేదు. అప్పటికే కురుక్షేత్ర యుద్ధంలో, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యంలో కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారిని హింసించి, పన్నులు వేసి, అలా వచ్చిన డబ్బుతో యాగం చేయడం, యుధిష్టురుడికి నచ్చలేదు. అప్పుడు వ్యాసుడు ఒక నిధి గురించి వివరించి, దానిని సొంతం చేసుకుంటే, యాగం అత్యంత ఘనంగా చేయవచ్చని సూచించాడు. వెంటనే ధర్మరాజు, ఆ నిధి సక్రమ సంపాదనా, లేక అక్రమ సంపాదనా? అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసుడు, ఆ నిధి వెనుక దాగిన కథను వివరించాడు. అపార సంపదతో నిండిన ఆ నిధి ఎవరిది? అది ఎలా సంపాదించారు? అసలు అంత నిధి ఎందుకు దాచారు - వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

కృతయుగంలో, మనువుకు ప్రజాని అనే కుమారుడుండేవాడు. అతడి కుమారుడు క్షుతుడు. క్షుతుని కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు, నూరుగురు కుమారులు. వారిలో పెద్దవాడు, వింశుడు. వింశుని కుమారుడు వివంశుడు. వివంశుడికి 15 మంది కుమారులు. వారిలో పెద్ద వాడు ఖనీనేత్రుడు. అతడు అధికమైన బల శౌర్యములు కలవాడు. కానీ, పరమదుర్మార్గుడు. అతడు తన 14 మంది తమ్ములను చంపి, రాజ్యాధికారమును చేజిక్కించుకున్నాడు. ఖనీనేత్రుడు ఎవరినీ నమ్మేవాడు కాదు. ప్రజలను ద్వేషించే వాడు. అతడి ఆగడాలను సహించలేని మంత్రులు, అతడిని పదవీచ్యుతుడిని చేసి, అతడి కుమారుడైన కరంధముడికి పట్టంకట్టారు. అతడు ఎంతో దయామయుడు. ధర్మాన్ని పాటిస్తూ, సదా సత్యమునే పలికే వాడు. కరంధముడు, ఉన్నదంతా దాన ధర్మములు చేసి, చివరకు దరిద్రుడయ్యాడు. కోశాగారంలో ధనములేక, సైన్యములకు జీతభత్యములు కూడా ఇవ్వలేని పరిస్థితి, నెలకొంది. సైన్యము క్షీణించింది.

అది తెలుసుకున్న శత్రురాజులు, రాజ్యము మీద దండెత్తివచ్చి, అతడిని రాజ్యభ్రష్టుడిని చేశారు. చివరకు అడవుల పాలయ్యాడు. కానీ, కరంధముడు ఏ మాత్రం చింతించకుండా, నియమ నిష్ఠలతో తపస్సు చేయనారంభించాడు. అప్పుడొక అద్భుతం జరిగి, అతడి తపోఫలముగా, అపారమైన సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో వెళ్ళి, శత్రువులను జయించి, తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. ఆ రాజ్యాన్ని ధర్మనిష్ఠతోనూ, సత్యవాక్పరిపాలనతోనూ, జనరంజకంగా పాలన చేశాడు కరంధముడు. అతడు అంగీరసుడిని ఉపద్రష్టగా పెట్టుకుని, అనేక యజ్ఞయాగములు చేశాడు. ఆ పుణ్యఫలాల చేత, కరంధముడు సశరీరంగా స్వర్గలోకానికి చేరాడు. కరంధముడి కుమారుడు అవిక్షత్తు కూడా, తండ్రి వలె ప్రజలను కన్న బిడ్డలలాగా పాలించాడు. తదనంతరం, అవిక్షత్తు కుమారుడైన మరుత్తు కూడా, తాత, తండ్రి మాదిరిగా, ఎన్నో యజ్ఞ యాగాలు చేశాడు.  మరుత్తు ధర్మతత్పరుడూ, కీర్తిమంతుడూ, మహాబలవంతుడూ, తేజస్సు కలిగిన వాడూ, వేదవేదాంగ పారంగతుడు. తాను చేసే యాగాలకు ఉపద్రష్టగా, ఇంద్రునకు బదులుగా, బృహస్పతిని ఆహ్వానించేవాడు.

ఒకనాడు ఇంద్రుడు అసూయతో బృహస్పతి చెంతకు వెళ్ళి, 'మరుత్తు తాను చేయబోవు యజ్ఞమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాడు. దేవగురువైన మీరు, ఒక మానవుడు చేయు యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించడం, అవమానం కదా! కనుక మీరు అతడి యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండాలనుకుంటే, నన్ను మరచిపోయి, అతడి దగ్గరే ఉండండి. లేదంటే అది మానుకుని, ఇక్కడే ఉండండి' అని అన్నాడు. అందుకు బృహస్పతి కంగారుపడి, 'దేవేంద్రా! నాకు మీరే కావాలి. నేను మరొకరి యజ్ఞానికి ఎలా ఆధ్వర్యం వహించగలను. నేను మిమ్మల్ని వదలను' అన్నాడు. తరువాత మరుత్తు మరొక యాగానికి సిద్ధం చేసుకుని బృహస్పతి వద్దకు వెళ్ళి, 'మహాత్మా ! నేను అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెట్టాను. మీరు దానికి ఉపద్రష్టగా ఉండి, యజ్ఞాన్ని నిర్వహించండి. తమరు అంగీకరిస్తారని, నేను అన్నీ ఏర్పాట్లూ చేశాను' అని చెప్పాడు. అప్పుడు బృహస్పతి జరిగిన విషయాన్ని దాచి,  మరుత్తుతో, 'నేను రాలేను.. దానికొక కారణం ఉంది. అదే సమయంలో ఇంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. దానికి నేను ఉపద్రష్టగా ఉండి, యజ్ఞ నిర్వహణ చేయాలి' అని సున్నితంగా తిరస్కరించాడు.

దానికి మరుత్తు చిన్నబుచ్చుకుని, 'అలా అంటే ఎలా మహాత్మా! మా తాతగారైన కరంధముడికి, మీ తండ్రి గారైన అంగీరసుడు ఉపద్రష్టగా ఉండి, అనేక యజ్ఞయాగాదులు చేయించారు. అలాగే మీరు కూడా ఉపద్రష్టగా ఉండి, ఎలాగైనా నేను చేయతలపెట్టిన యజ్ఞాన్ని నిర్విజ్ఞంగా జరిగేలా చూడండి' అంటూ అర్ధించాడు. అందుకు బృహస్పతి, 'మరుత్తు మహారాజా! నేను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తాను. కనుక మానవుడవయిన నీకు, ఉపద్రష్టగా ఉండలేను. నీవు వేరే ఉపద్రష్టను నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అంటూ నచ్చచెప్పాడు. ఇక మరుత్తు ఏం మాట్లాడకుండా, అవమాన భారంతో వెనుదిరిగాడు. మార్గ మధ్యంలో నారదుడు కనిపించి, 'మహారాజా! ఎక్కడి నుండి వస్తున్నావు? ఏ పనిమీద వెళుతున్నావు?' అని అడిగాడు. అందుకు మరుత్తు, 'నారద మహర్షీ! నేను తలపెట్టిన అశ్వమేధయాగానికి ఉపద్రష్టగా ఉండమని అడగడానికి, బృహస్పతి వద్దకు వెళ్ళి అర్ధించాను. అందుకతడు, తాను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేస్తుంటాననీ, అందువలన మానవుడనైన నాకు, ఉపద్రష్టగా ఉండలేనని నిరాకరించాడు. నేను అవమాన భారంతో తిరిగి వెళుతున్నాను.

ఇంత అవమానం మోస్తూ బ్రతికి ఉండడం అవసరమా?' అని పలికాడు. నిరాశలో ఉన్న మరుత్తుతో నారదుడు, 'బృహస్పతి కాకుంటే మరొకరు దొరకరా! అంగీరసుడి చిన్న కుమారుడైన సంవర్తనుడిని, అతడి అన్న అయిన బృహస్పతి అవమానించి, ఇంటి నుండి తరిమివేయగా, అతడు విరాగిగా, దిగంబరంగా, అడవుల వెంట తిరుగుతున్నాడు. నీవు ఎలాగైనా అతడిని అర్ధించి, నీ యజ్ఞానికి ఉపద్రష్టగా నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అని సలహా ఇచ్చాడు. ఆ మాటలకు మరుత్తు సంతోషించి, సరైన సమయంలో సలహా ఇచ్చి, తనను ఆదుకున్నందున్నకు నారదుడిని స్తుతించాడు. ఆ సంవర్తనుడు ఎక్కడ ఉంటాడో, అతడిని ఎలా తీసుకు రావాలా? అని ఆలోచిస్తుండగా, నారదుడు, ‘సంవర్తనుడు కాశీ పట్టణంలో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. అతడిని గుర్తించాలంటే, నీవొక పని చేయాలి. నీవు ఒక శవమును పెట్టుకుని, కాశీనగర ముఖద్వారంవద్ద నిలబడి ఉండు. ఆ శవమును చూసి ఎవరు పారిపోతారో, అతడే సంవర్తనుడని తెలుసుకో. నీవు అతడిని వెంబడించి, ఏకాంత సమయం చూసి, భక్తితో ప్రార్ధించి, నీ యాగమునకు ఉపద్రష్టగా ఉండమని అడుగు. అతడు తనను గురించి నీకు ఎవరు చెప్పారు? అని ఆడిగినప్పుడు, నా పేరు తెలియజేయుము. నేను ఎక్కడున్నానని అడిగితే, నాకు మీ సంగతి చెప్పి, అగ్ని ప్రవేశం చేశాడని అతనితో చెప్పు’ అని మరుత్తుకు సలహా ఇచ్చాడు, నారదుడు.

వెంటనే మరుత్తు, సంవర్తనుడి కొరకు కాశీపట్టణం వెళ్ళాడు. ఒక శవమును పెట్టుకుని, నగరముఖద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడకు ఒక వెర్రి వాడు వచ్చి, ఆ శవాన్ని చూసి, దెబ్బతిన్న జంతువులా పరిగెత్తసాగాడు. అతడే సంవర్తనుడని తెలుసుకున్న మరుత్తు, అతడిని వెంబడించి కొంతదూరం వెళ్ళి, అతడి ఎదురుగా నిలిచాడు. ఆ వెర్రివాడు మరుత్తు మీద దుమ్మెత్తి పోసి, అతడి మీద ఊసి, వెర్రిగా ప్రవర్తించాడు. మరుత్తు ఆ సంఘటనలకు కోపించక, అతడిని వెంబడించాడు. నిర్జన ప్రదేశానికి చేరుకున్న ఆ వెర్రివాడు, ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మరుత్తు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి, వినయంగా నిలిచాడు. అప్పుడు సంవర్తనుడు, 'ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపారు?' అని అడిగాడు. అప్పుడు మరుత్తు, 'నారదుడు మీ గురించి తెలియజేశాడు' అని సమాధానమివ్వగా, ‘ఇప్పుడు నారదుడు ఎక్కడున్నాడు?’ అని సంవర్తనుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. ‘మీ గురించి తెలియజేసి, వెంటనే అగ్ని ప్రవేశం చేశాడు నారదుడు’ అని బదులిచ్చాడు మరుత్తు.

దాంతో శాంతించిన సంవర్తనుడు, 'నీవు నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నాతో ఏం పని?' అని ప్రశ్నించాడు. అందుకు మరుత్తు, ‘మహాత్మా! మీరు నేను చేయబోయే యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండి, యజ్ఞమును పూర్తిచేయండి’ అని అర్ధిస్తూ, తన గురించి వివరించాడు. మరుత్తు గురించీ, అతని తాత, తండ్రుల గురించీ తెలుసుకున్న సంవర్తునుడు, అతనిని ప్రీతితో చూస్తూ, నేను మా అన్న బృహస్పతి చేత అవమానించబడి, నా ఇంటినీ, సంపదనూ, అన్ననూ వదిలి, ఇలా అడవుల వెంట విరాగిగా తిరుగుతున్నాను. నాబోటి పేదవాడు, నీకు ఉపద్రష్టగా ఉంటే, నీకు ఏ గౌరవం ఉంటుంది? కనుక బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచుకుని, యాగమును పూర్తి చేసుకో. అలా కాకుండా, నన్నే ఉపద్రష్టగా చేసుకోవాలంటే, నీవు మా అన్నవద్ద అనుమతి తీసుకోవాలి. నాకు మా అన్న అంటే విపరీతమైన గౌరవం ఉంది’ అని అన్నాడు. అందుకు మరుత్తు, 'నేను మీ వద్దకు వచ్చే పూర్వమే, మీ అన్నను ఉపద్రష్టగా ఉండమని కోరాను. కానీ అతడు నన్ను అవమానిస్తూ, దేవతలకు ఉపద్రష్టగా ఉన్న నేను, మానవులకు ఉపద్రష్టగా ఉండలేనని, నన్ను తిప్పి పంపాడు. ఇప్పుడు నేను తిరిగి బృహస్పతి వద్దకు ఎలా వెళ్ళగలను?' అని సావధానంగా పలికాడు. ఇక మరుత్తు మాటలకు సంవర్తనుడు అంగీకరించి, ఉపద్రష్టగా ఉండి, యాగము చేయించడానికి ఒప్పుకున్నాడు. అయితే, అతడు ఒక షరతు విధించాడు.

మరి ఆ షరతుకు మరుత్తు ఒప్పుకున్నాడా? సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న యాగాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించారు? మరుత్తు యాగంలో సోమ పానం తీసుకోవడానికి, దేవతలు వచ్చారా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, మన తరువాయి భాగంలో తెలుసుకుందాము..

No comments: