Ads

16 March, 2022

'సమాధి' - శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం! Samadhi Sthithi

 

'సమాధి' - శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (16 - 22 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 16 నుండి 22 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/0z_x3TolkZY ]

మనస్సు, భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండడానికి ఏం చేయాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ।। 16 ।।

ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో, లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో, లేదా మరీ తక్కువ నిద్ర పోతారో - వారు యోగములో విజయం సాధించలేరు.

శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించినవారు, యోగములో సాఫల్యం సాధించలేరని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆధ్యాత్మిక పథంలో కొత్తగా అడుగిడిన వారు, అసంపూర్ణ జ్ఞానంతో, ఇలా చెబుతుంటారు. "నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి, శారీరక నిర్వహణ మరచిపోయి, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము." కానీ, ఇటువంటి సిద్ధాంతం, మనిషిని ఎక్కువ దూరం తీసుకు వెళ్ళలేదు. మనము ఈ శరీరమే కాదన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మనం జీవించి ఉన్నతకాలం, మనకు వాహనం. దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. “శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం” అంటే, "ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము". ఒకవేళ శరీరం అనారోగ్యంపాలయితే, ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడుతాయని, ఆయుర్వేద గ్రంథమైన చరకసంహిత తెలియజేస్తుంది. ఇక రామాయణంలో, ‘తను బిను భజన వేద నహీఁ వరనా’ అంటే, ‘ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్నా, శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేద’ని, పేర్కోంది. నిజానికి, భౌతిక, ప్రాపంచిక శాస్త్ర సహాయంతో, మన శరీరాన్ని చక్కగా చూసుకొమ్మని ఉపదేశిస్తున్నాయని, వేద ప్రమాణాలు.

02:27 - యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।।

కానీ ఎవరైతే తినటంలో, మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో, అన్ని దుఖములనూ ఉపశమింపచేయవచ్చు.

యోగం అంటే, ఆత్మ భగవంతునితో ఎకమవ్వటం. యోగమునకు వ్యతిరేకమైనది భోగం. అంటే, ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం, శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది. అది రోగాలకు దారి తీస్తుంది. శరీరం రోగ గ్రస్థమయితే, అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా, శారీరక కార్యకలాపాలలో మితంగా ఉండి, యోగాభ్యాసము చేయటం వలన, మనము అన్ని శారీరిక, మానసిక దుఃఖాల నుండి విముక్తిని పొందవచ్చు.

03:24 - యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।
నిఃస్పృహస్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।

వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమ శ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సు మీదనే, లగ్నం చేస్తారు. ఇటువంటి వారు, యోగములో ఉన్నారని చెప్పబడతారు. వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.

ఒక మనిషి, యోగ సాధనను ఎప్పుడు పూర్తి చేసినట్లవుతుందంటే, నిగ్రహింపబడిన మనస్సు, ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలచి స్థితమై పోతుందో, అప్పుడే యోగం పరిపూర్ణమవుతుంది. అదేసమయంలో, మనస్సు దానంతట అదే, ఇంద్రియ లౌల్యముల నుండీ, మరియు ప్రాపంచిక భోగాల నుండీ వీగిపోయి, దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని, 'యుక్తుడు' గా పరిగణించవచ్చు.

04:18 - యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ।। 19 ।।

గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు, ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.

బాహ్య ప్రదేశంలో వీచేగాలికి, దీపజ్యోతి సహజంగానే చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానిని నియంత్రించటం, అసాధ్యం. కానీ, గాలిలేని చోట, దీపం ఒక బొమ్మ లాగా, నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా, మనస్సనేది సహజంగా చంచలమైనదీ, నిగ్రహించటానికి చాలా క్లిష్టమైనది. కానీ, ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు, సంపూర్ణంగా భగవంతునితో ఏకమై ఉంటుందో, అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి, భక్తి యొక్క బలంచే నిలకడగా, తన మనస్సుని వశమునందుంచుకుంటాడు.

05:15 - యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాఽఽత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।

ఎప్పుడైతే మనస్సు, భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడా యోగి, పరిశుద్ధమైన మనస్సు ద్వారా, ఆత్మను దర్శించగలడు. తదుపరి, ఆత్మానందములోనే రమిస్తాడు.

ధ్యానం చేసే పద్ధతినీ, ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధిస్థితినీ వివరించిన శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను, శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా, తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, ఒక పాత్రలో మురికి నీరుంటే, దాని అడుగుభాగాన్ని, మనం చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది. ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తక జ్ఞాన స్థాయి లోనే ఉండిపోతుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు పవిత్రమవుతుందో, ఆత్మ అనేది, అంతర్గత విజ్ఞానం ద్వారా, నేరుగా అనుభవంలోనికి వస్తుంది.

06:32 - సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ ।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ।। 21 ।।

సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అపరిమితమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి, నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు.

ఆనందము కోసం అన్వేషణ అనేది, ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనం, ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశలము, అన్న వాస్తవం నుండి, ఇది జనించింది. మనం పరిపూర్ణ ఆనందం కోసం, ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాము. మనం చేసే ప్రతి పనీ, ఆ ఆనందం కోసమే. కానీ, భౌతిక సుఖాలనిచ్చే వస్తు-విషయముల నుండి, మనస్సూ, ఇంద్రియములూ, కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే, అనుభవిస్తాయి. ఇంద్రియ ఇష్టసిద్ధి అనేది, ఆత్మ యొక్క తీవ్ర అభిలాషను తృప్తి పరచలేదు. అనంతమైన భగవంతుని ఆనందం కోసమే, ఆత్మ పరితపిస్తుంది. మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ, వర్ణింపశక్యముకాని, ఉత్కృష్టమైన, ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాజ్ఞయంలో ఈ స్థితినే, 'సమాధి' అంటారు. సమాధి స్థితిలో, సంపూర్ణ తృప్తి, మరియు సంతుష్టి అనుభవించే ఆత్మకు, కోరికలు ఇంకేమీ ఉండవు. ఆ ప్రకారంగా, ఒక్క క్షణం కూడా విడిపోకుండా, పరమ సత్యము నందే, దృఢముగా స్థితమై ఉంటుంది.

08:04 - యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।

ఆ స్థితిని పొందిన తరువాత, మరేదీ అంతకంటే గొప్పది కాదని, భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు, ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా, ఏమాత్రం చలింపడు.

భౌతిక జగత్తులో ఎంత మేర సంపాదించినా, వ్యక్తి సంపూర్ణ తృప్తిని పొందలేడు. ఒక పేద వాడు, ధనవంతుడు కావటానికి ఎంతో కష్ట పడతాడు. తను లక్షాధికారి కాగానే, తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ, అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరున్ని చూడగానే, అసంతృప్తి మొదలవుతుంది. ఆ కోటీశ్వరుడు కూడా, ఇంకా ఎక్కువ ఐశ్వర్యంగల వాడిని చూసినప్పుడు, అసంతృప్తి చెందుతాడు. మనం ఎంత సంతోషం పొందినా, అంత కన్నా ఎక్కువ సంతోషం ఉందనుకున్నప్పుడు, ఎదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ, యోగ స్థితి యందు పొందిన ఆనందమనేది, ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దాని కంటే ఇంకేదీ ఉన్నతమైనది లేదు కాబట్టి, ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ సహజంగానే, తన లక్ష్యాన్ని చేరుకున్నట్లు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము, నిత్యమైనది, శాశ్వతమైనది. ఆ స్థితిని ఒకసారి సాధించిన యోగి నుండి, దానిని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన జీవి, భౌతిక శరీరంలోనే నివసించి ఉన్నా, భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి, బాహ్యంగా చూస్తే - అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో, ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్లగుపిస్తుంది. కానీ, అంతర్లీనంగా ఆ మహాత్ముడు, భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి, దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఎంత తీవ్రమైన కష్టమైనా, అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతునితోనే ఏకమైన స్థితిలో ఉండి, ఆ మహాత్ముడు శారీరక దృక్పథం నుండి అతీతంగా ఎదిగి, శారీరక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా మన పురాణాలలో, ప్రహ్లాదుడు - పాముల గుంటలో వేయబడినా, ఆయుధాలతో హింసించబడినా, అగ్నిలో ఉంచబడినా, కొండపై నుండి విసిరివేయబడినా; ఇవేవీ కూడా ప్రహ్లాదునికి, భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.

ఇక మన తదుపరి వీడియోలో, నిలకడ లేని మనస్సును, నిరంతరం భగవంతుని మీదే కేంద్రీకరించాలంటే ఏం చేయాలో,  తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxgj4c14t8gaUcYUTRo8lml0B13s3I_RXm

No comments: