Ads

09 March, 2022

‘ధ్యానం’ - చెడు సంస్కారాలనూ మరియూ అలవాట్లనూ నిర్మూలించటానికి! Bhagavadgita

 

‘ధ్యానం’ - చెడు సంస్కారాలనూ మరియూ అలవాట్లనూ నిర్మూలించటానికి!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (11 - 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WzL6jhGivwA ]

మన మనస్సుని ఏకాంత ధ్యానం ద్వారా ఎలా పరిశుద్ధమొనర్చుకోవాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుఛ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ।। 11 ।।

యోగాభ్యాసము చేయటానికి, శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి. దీనిని, కుశ గడ్డీ, జింక చర్మము, మరియు ఒక వస్త్రమును, ఒక దానిపై మరొకటి వేసి సిద్ధం చేసుకోవాలి. ఈ ఆసనము, మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, అలాగే మరీ తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు.

ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, బాహ్య సాధన గురించి చెబుతున్నాడు. ప్రారంభిక దశలో, బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కుశగడ్డితో చేసిన చాప, నేల నుండి వేడిమీ, చలి నుండీ రక్షణనిస్తుంది. వ్యక్తి ధ్యానములో నిమగ్నమై ఉన్నప్పుడు, పైనున్న జింక చర్మం, విషపూరిత ప్రాణులైన పాములూ, తేళ్ళ వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే, పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే, నేలపై పురుగులూ, కీటకాల వంటి వాటితో, ఇబ్బంది కలుగవచ్చు.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।।

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।

దానిపై స్థిరముగా కూర్చుని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలనూ, కార్యకలాపాలనూ నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమునూ, మెడనూ, మరియు శిరస్సునూ, స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి, ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనం ఆవహించి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో, ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ, మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు. కానీ, ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో, మధ్యలో నిద్దురలోనికి జారుకునే వారు, చాలా మంది ఉంటారు. ఇలా కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోమంటున్నాడు. అయితే, కొందరు మోకాలు నొప్పుల వలన గానీ, ఏదైనా గాయాల వలన కానీ, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు. ఎందుకంటే, వారు కుర్చీలో కూర్చునయినా ధ్యానం చేయవచ్చు. కానీ, తప్పకుండా నిటారుగా, మరియు నిశ్చలంగా కూర్చోవాలన్న నియమాన్ని, పాటించాలి. దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి. అది అటూ ఇటూ పోకుండా, రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా, ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో, సహకరిస్తాయి. బాహ్యమైన ఆసనం, శరీరాన్ని ఉంచిన తీరూ, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి. ధ్యానం అనేది యదార్ధంగా, ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించు కోవచ్చు, మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం, మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికీ, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికీ, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికీ, దోహద పడుతుంది. ధ్యానం, చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అది ప్రతికూల పరిస్థితులలో కూడా, మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి, దోహదపడుతుంది. జీవితంలో విజయంకోసం కావలసిన దృఢసంకల్పబలాన్ని, పెంపొందిస్తుంది. చెడు సంస్కారాలను, మరియు అలవాట్లను నిర్మూలించటానికీ, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికీ, దోహదపడుతుంది.

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ।। 14 ।।

ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, నిశ్చల మనస్సుతో, బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి.

ధ్యానంలో సాఫల్యం సాధించటానికి, బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని, శ్రీ కృష్ణుడుద్ఘాటిస్తున్నాడు. జంతువులలో, సంతానోత్పత్తి కోసం, లైంగిక కోరికలు దోహదపడతాయి. జంతువులు ప్రధానంగా, సంతానం కోసమే ఈ చర్యలో పాల్గొంటాయి. చాలా వరకు జీవజాతుల్లో, సంభోగానికి ఒక నిర్ధిష్ట కాలం ఉంటుంది. జంతువులు ఈ క్రియలో యథేచ్చగా పాల్గొనవు. మనుష్యులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేతా, యథేచ్చగా చేసే స్వేచ్ఛ ఉండటం చేతా, సంతానోత్పత్తి క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయ బడింది. బ్రహ్మచర్యం పాటించటం వలన, శారీరక శక్తి పెరగటం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్ప బలం, చక్కటి జ్ఞాపక శక్తి, మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధీ కలుగుతాయి. అది కళ్ళలో తళుకునూ, బుగ్గలలో మెరుపునూ కలుగచేస్తుంది. బ్రహ్మచర్యం యొక్క నిర్వచనంలో, కేవలం శారీరక క్రియను మాత్రమే ఆపడం కాదు. ఈ ఎనిమిది రకాల క్రియలనూ నియంత్రించాలి: 1) దాని గురించి ఆలోచించటం. 2) దాని గురించి మాట్లాడటం, 3) దాని గురించి హాస్యాస్పదం చేయటం. 4) దానిని ఊహించటం. 5) దానిని కోరుకోవటం. 6) ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టటం. 7) దాని మీద ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించటం. 8) దానిలో పాల్గొనటం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే, వారు వీటన్నింటినీ త్యజించి ఉండాలి.

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।

ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపి, క్రమశిక్షణతో కూడుకున్న మనస్సును కలిగిన యోగి, 'నిర్వాణమును' పొందును. నా యందే పరమ శాంతితో, స్థితుడై ఉండును.

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులున్నాయి. కానీ, ఏ పద్ధతిలో ధ్యానం చేసినా, మనస్సుని భగవంతుని యందే నిలిపి ఉంచాలి. ధ్యానము యొక్క లక్ష్యము, కేవలం ఏకాగ్రతను పెంపొందించటమే కాదు. మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాసా, చక్రాలూ, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం, ఏకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి, కచ్చితంగా మనస్సుని, సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతుని యందు నిలిపితేనే సాధ్యం. ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో, వారి మనస్సు కూడా, త్రిగుణముల కంటే అతీతంగా మారుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం, అలౌకికమైనదని, అభ్యాసకులు చెబుతారు. కానీ, నిజమైన అలౌకిక ధ్యానం అనేది, భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది. మనం అన్ని భగవంతుని దివ్య లక్షణములైన - నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ, పరివారమూ - వీటిపై ధ్యానం చేయవచ్చు. వీటిలో దేనిపైనయినా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. చాలామంది సాధకులకు, కేవలం నామము మాత్రమే, మనస్సుని రంజిప చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన, మనస్సు సహజంగానే, స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు. ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దానిని దేవుని గుణములపై - అయన దయా, సౌందర్యం, జ్ఞానం, ప్రేమా, ఉదారతా, కృపా, ఇంకా ఎన్నో... ఇలా వీటిపై చింతన చేయటం ద్వారా, మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా, ధ్యానంలో మరింత పురోగతిని సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టూ, అర్చన చేసినట్టూ, ఆయనకు పాట పాడినట్టూ, పాద సేవ చేసినట్టూ, విసనకర్ర వీచినట్టూ, స్నానం చేయించినట్టూ, ఆయనకై వంట చేసినట్టూ, ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానస సేవ' అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలూ, రూపాలూ, గుణాలూ, లీలలూ మొదలైన వాటిపై, ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా, ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.

ఇక మన తదుపరి వీడియోలో, ‘మనస్సు’ భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా, నిశ్చలంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: