Ads

12 January, 2022

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి! Bhagavadgita

  

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (37 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 37 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7rwg9mZpgVw ]

అలౌకిక జ్ఞానంతో శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।। 37 ।।

ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని, కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా, భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ, భస్మము చేయును.

మనందరికీ కూడా, అనంత జన్మల నుండి చేసిన పుణ్య, పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి, పేరుకుని పోయి ఉంటుంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ, తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. అంతేకాక, ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని ప్రక్రియగా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నింటినీ, ఈ జన్మ లోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే, ఆత్మ యొక్క జ్ఞానం, మనలను భగవంతుని శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు. ఎలా అయితే ఒక చిన్న నిప్పు తునక మహా జ్వాలగా మారి, ఒక పెద్ద కొండను సైతం భస్మం చేయగలదో, అలాగే, మనలో రగిలే జ్ఞానాగ్ని, మన క్రియలన్నింటినీ భస్మం చేస్తుంది.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్దః కాలేనాత్మని విందతి ।। 38 ।।

దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది, ఈ లోకంలో వేరే ఏమీ లేదు. చాలా కాలం, యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.

ఒక వ్యక్తిని పవిత్రమొనర్చి, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి, ముక్తిని ప్రసాదించి, మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి, కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. కాబట్టి, అది మహోన్నతమైనదీ, అత్యంత పవిత్రమైనది. వేద శాస్త్రాలను చదవటం, మరియు గురువు గారి ప్రవచనాలను వినటం ద్వారా, ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ, ఈ పుస్తక పరిజ్ఞానం సరిపోదు. ఆత్మ, భగవంతుడూ, మాయ, కర్మ, జ్ఞానం, భక్తీ అనే విషయముల మీద, సంపూర్ణ అవగాహన, కేవలం గురువు గారి దగ్గర నుండే నేర్చుకోగలం. ఈ పద్ధతిలో కాకుండా భగవత్ ప్రాప్తి నొందడం, ఎవరికైనా అసాధ్యం. ఎప్పుడైతే వారు తెలుసుకున్న పుస్తక జ్ఞానం ప్రకారంగా సాధన చేస్తారో, అది వారి అంతఃకరణను శుద్ధి చేస్తుంది. అప్పుడు, ఆత్మ తత్వము, దానికీ భగవంతునికీ ఉన్న సంబంధం, హృదయంలో అంతర్గతంగా ప్రకటితం చేస్తుంది.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 39 ।।

గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారూ, మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారూ, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠమైన, అలౌకిక జ్ఞానంతో, వారు అతిత్వరగా, శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.

అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ, తక్షణమే అర్థం కావు. కొన్నింటిని ఆధ్యాత్మిక పథంలో, ఉన్నతమైన స్థాయిని చేరుకున్న తరువాతే, అనుభవించగలము. గురువు, మరియు శాస్త్రముల పట్ల ధృఢ విశ్వాసమునే, శ్రద్ధ అంటారు. ఒకవేళ ఇలాంటి శ్రద్ధ, తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారి తీస్తుంది. కానీ, అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే, అది శాశ్వత సంక్షేమం దిశగా, మనలను తీసకువెళుతుంది. అదే సమయంలో, గుడ్డి విశ్వాసం కూడా మంచిది కాదు. ఒక గురువు గారి మీద, అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి, ఆ గురువు పరమ సత్యాన్ని ఎరిగినవాడనీ, దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడనీ, నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, అటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి, కృషిచేయాలి. అదేవిధంగా, వారి మార్గదర్శకత్వంలో, భగవంతునికి శరణాగతి చేయాలి. గురువు, మరియు భగవంతునిపై, నిస్సంకోచమైన, దృఢమైన విశ్వాసం కలవారికి, వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియ చేయబడుతుంది.

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ।। 40 ।।

జ్ఞానమూ, విశ్వాసమూ, రెండూ లేని వారూ, అనుమానపడే స్వభావం కలవారూ, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి, ఈ లోకంలో, ఇంకా, పర లోకంలో కూడా, సుఖం ఉండదు.

సాధకులను వారి విశ్వాసం, మరియు జ్ఞాన స్థాయిలను బట్టి, మూడు రకాలుగా వర్గీకరించాయి, శాస్త్రాలు. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండి, దృఢ విశ్వాసం కలిగినవాడు, అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా, గురువు, మరియు భగవంతుని పై విశ్వాసం కలిగి ఉన్నవాడు, మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, విశ్వాసం కూడా లేనివాడు, నిమ్న స్థాయి సాధకుడు. ఈ మూడవ రకం వారు, ఈ జన్మలో గానీ, లేదా, ఆ పై జన్మలలో గానీ, ఎన్నటికీ సుఖాన్ని పొందలేరు. ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా, నమ్మకం, ఎంతో అవసరం.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।

ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ సందేహాలన్నీ నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని, కర్మలు బంధించవు.

కర్మ అంటే, విహిత ఆచారములూ, మరియూ సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములూ. సన్యాసం అంటే, “త్యజించుట/విడిచిపెట్టుట”. “యోగ” అంటే, “భగవంతునితో ఐక్యత”. ఇక్కడ శ్రీ కృష్ణుడు, యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు. అంటే, “పూజాది అన్ని కర్మలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మ లను భగవంతునికే అంకితం చేసేవారు” అని అర్థం. అలాంటి వారు, తమ క్రియలన్నింటినీ, భగవత్ సేవగానే చేస్తారు. భక్తి యుక్తంగా వారు చేసే పనులు, వారిని కర్మ బంధములలో పెనవేయవు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే, వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే, పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేస్తామో, వాటికి, కర్మ ప్రతిక్రియలుండవు. అంటే, సంఖ్యలను సున్నాతో గుణించినట్టే. పదిని సున్నాతో గుణించినా, కోటిని సున్నాతో గుణించినా, ఫలితం శూన్యమే. అదే విధంగా, జ్ఞానోదయం అయిన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు. ఎందుకంటే, వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు. కర్మలను భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.

తస్మాదజ్ఞానసంభూతం హృత్-స్థం జ్ఞానాసినాత్మనః ।
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ।। 42 ।।

కాబట్టి, జ్ఞానమనే ఖడ్గంతో, నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మ యోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము.

అర్జునుడి ఆధ్యాత్మిక గురు స్థానంలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన శిష్యునికి కర్మ యోగాభ్యాసం ద్వారా, లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్నీ, విశ్వాసాన్నీ ఉపయోగించుకుని, తన మనస్సులో ఉన్న సందేహాలను పెకలించివేయమని ఉపదేశిస్తున్నాడు. అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం, లేచి, తన విధిని, కర్మ-యోగ దృక్పథంలో నిర్వర్తించమని, పిలుపునిస్తున్నాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్థోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, నాలుగవ అధ్యాయం, జ్ఞానకర్మసన్న్యాసయోగంలోని, 42 శ్లోకాలూ, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని అయిదవ అధ్యాయం, కర్మసన్న్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: