Ads

05 January, 2022

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం! Bhagavadgita

  

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (31 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 31 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GT_2nUOrUyU ]

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ ।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ।। 31 ।।

యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి, పరమ సత్యము దిశగా పురొగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్టుడా, ఏ విధమైన యజ్ఞమూ చేయని వారు, ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ, ఎటువంటి సుఖమునూ పొందలేరు.

ఒక కార్యాన్ని భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగి ఉండటమే, యజ్ఞము యొక్క రహస్యం. భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే, దాన్ని స్వీకరిస్తారు. ఆ నివేదన అనంతరం, పళ్ళెంలో ఉన్న శేషాన్ని, ఆయన ప్రసాదంగా తీసుకుంటారు. అటువంటి అమృతతుల్యమైన ప్రసాదం, మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత, మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి. అదేవిధంగా, భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే, వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటారు. ఎప్పుడైతే వస్తువులు, లేదా పనులు, భగవంతునికి యజ్ఞంగా సమర్పిస్తారో, ఆ శేషం, అంటే ప్రసాదం, ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహము వంటిది. అలా కాకుండా, యజ్ఞాన్ని ఆచరించని వారు, కర్మ-ఫల బంధాలలో చిక్కుకుని, మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు. వారు ఎప్పటికీ, సుఖ సంతోషాలను పొందలేరు.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।

ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ, వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి, అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.

వేదముల యొక్క అధ్బుతమైన లక్షణం ఏమిటంటే, అవి ఎన్నో, విభిన్నరకాల మానవ స్వభావాలను గుర్తించి, వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. రకరకాల మనుష్యులకు, రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నింటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే, ఇవన్నీ భక్తితో, భగవత్ అర్పితముగా చేయాలి. కాబట్టి, వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా, మనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ, భౌతిక బంధాల నుండి విముక్తి పొందే జ్ఞానాన్ని, సముపార్జించాలి.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।

ఓ శత్రువులను లోబరుచుకునే వాడా, యాంత్రికముగా, ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా, జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏది ఏమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలూ జ్ఞానమునందే పరిసమాప్తమవుతాయి.

పూజాది క్రియలూ, ఉపవాసాలూ, మంత్ర జపాలూ, తీర్థ యాత్రలూ, ఇవన్నీమంచివే కానీ, వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా, ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ, మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికి, అవి సరిపోవు. చాలా మంది ప్రజలు, భగవన్నామాన్ని జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లె వేస్తుంటారు, పవిత్ర ధామాలను సందర్శిస్తుంటారు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటువంటి భౌతిక క్రియలతోనే, భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో, ఇవన్నీ చేస్తుంటారు. అయితే, జ్ఞాన సముపార్జనతో, భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. భగవంతునిపై, మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవటం వలన, మన భక్తి భావన వృద్ధిచెందుతుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।। 34 ।।

ఒక ఆధ్యాత్మిక గురువును చేరి, పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలడుగుతూ, ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని, నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే, అతను స్వయంగా, యథార్థమును దర్శించినవాడు.

ఆత్మ యొక్క బుద్ధి, అనంత జన్మల అజ్ఞానంచే కప్పివేయబడి ఉంటుంది. అవిద్యచే ఆవరింపబడి ఉండి, బుద్ధి తన అజ్ఞానాన్ని తన సొంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా, ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి, సేవించాలి. అలా చేసినట్లయితే, ఆయన శాస్త్ర జ్ఞానాన్నీ, మరియు వివేచనాత్మకతను ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు. గురువుకి శరణాగతి చేయకుండా, భౌతిక మాయ నుండి ముక్తి లభించదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ, ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా, విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం, బోధకునికి రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది, శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు. దానిని ఎంతో కొంత రుసుము చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయమూ, నమ్రతా పెంపొందించుకుంటాడో, సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమవుతాడో, అది గురుకృపచే శిష్యుని హృదయంలో, ప్రకటించబడుతుంది.

యజ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ।। 35 ।।

ఈ మార్గాన్ని అనుసరిస్తూ, గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు తిరిగి మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులూ భగవంతుని భాగాలే అనీ, అవి నా యందే స్థితమై ఉన్నాయనీ, గ్రహిస్తావు.

ఏ విధంగానయితే సూర్యుడిని చీకటి కప్పివేయలేదో, అదే విధంగా, మాయ అనేది, ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మని, వశపరుచుకోలేదు. భగవంతుడిని ఎరిగిన వారు, ఎప్పటికీ ఆ భగవత్ ధ్యాసలోనే ఉంటారు. మాయ యొక్క భ్రాంతిలో, మనం ప్రపంచాన్ని ఆ భగవంతుని కంటే వేరుగా చూస్తాము. తోటి వారు, మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా అన్న విషయంపై, మనం వారితో స్నేహం, లేదా శతృత్వం పెంచుకుంటాము. జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్య ఆధ్యాత్మిక వివేకము, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చి వేస్తుంది. జ్ఞానోదయమైన మాహాత్ములు, ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు. వారికి లభించినదంతా, ఆ భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు. అందరు మనుష్యులూ, ఆ భగవంతుని అంశలే అని భావించి, అందరి పట్లా దైవీ భావన కలిగి ఉంటారు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।

పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారని పరిగణించబడిన వారు కూడా, ఈ ప్రాపంచిక భవసాగరాన్ని, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి, దాటిపోవచ్చు.

భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది. దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు, మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల కష్టాలకు గురి చేస్తుంది.

ఆది ఆత్మిక అంటే, తన శరీరం, మనస్సూ  పెట్టే బాధలు; 
ఆది భౌతిక అంటే, ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; 
ఆది దైవిక అంటే, వాతావరణ, మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు.

ఈ యొక్క భౌతికబద్ధ స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు. ఈ బాధలు భరిస్తూ, అనంత జన్మలు గడిచిపోతుంటాయి. ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం, ఈ భౌతిక భవ సాగరాన్ని దాటడానికి, ఒక పడవనిస్తుంది. అవివేకులు కర్మలు చేసి, వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా, జ్ఞానులు ముక్తిని సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి, సహకరిస్తుంది.

ఇక మన తదుపరి వీడియోలో, అలౌకిక జ్ఞానంతో, శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: