కర్మ, అకర్మ మరియు వికర్మ గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!
'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (01 - 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7xnctA7uUDA ]
ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు కర్మల స్వభావాన్ని విశదీకరిస్తున్నాడు. కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే మూడు సూత్రాలను గురించి, చెప్పబోతున్నాడు.
శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।
శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును, సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకీ, మనువు ఇక్ష్వాకునికీ, దీనిని ఉపదేశించాడు.
అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా, చెపితే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు, దాని విలువను తెలుసుకుని, గౌరవించి, ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే, వారు తమ జీవిత నడవడికలో, దానిని ఆచరించటానికి కావలసిన శ్రమ చేస్తారు. అర్జునుడికి తాను ఉపదేశించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయతనూ, ప్రాముఖ్యతనీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తాను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం, ఆర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, ఇప్పటికిప్పుడు పుట్టించినది కాదనీ, సృష్టి ఆరంభం నుండే ఉందనీ, అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదటగా, వివస్వానుడికి, అంటే, సూర్య భగవానుడికి ఈ యోగ శాస్తాన్ని, బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకీ; మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికీ, బోధించాడు.
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।
ఓ శత్రువులను జయించేవాడా, ఈ విధముగా, పరంపరాప్రాప్తమైన ఈ యోగ శాస్త్రము, రాజర్షులకు తెలిసింది. కానీ, కాలగమనంలో అది లుప్తమైపోయినది.
దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తిని తెలిపే శాస్త్రాన్ని, గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు. ఆ గురువు, తన గురువు నుండి ఇలాగే అందుకుంటాడు. ఈ విధమైన సాంప్రదాయంలోనే రాజర్షులైన నిమీ, జనకుడూ, యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. భగవంతుడు, సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రధమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో, తెలియపరిచాడు. ఆయన నుండి ఈ సంప్రదాయం, కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం వలన, కాల క్రమంలో, ఈ జ్ఞానం క్షీణించిపోయింది. ప్రాపంచిక మనస్తత్వం కలిగిన కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథంతో, బోధనలను అన్వయిస్తుంటారు. కొద్ది తరాల్లోనే, ఆ జ్ఞానం యొక్క శక్తి మలినమైపోతుంది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం, తిరిగి సుస్థిరపరుస్తుంటాడు. ఆ పనిని, తానే ఈ లోకంలో అవతరించి గానీ, లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ, చేస్తాడు.
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ।। 3 ।।
అదే ప్రాచీనమైన, పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును, నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు, మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.
ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి, రెండు కారణాలుంటాయి. ఒకటి, రహస్యం తనకే తెలియాలనే స్వార్థం, రెండోది, ఆ విషయాన్ని దుర్వినియోగం కాకుండా, కాపాడడం కోసం. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి, ఈ రెండు కారణాలూ కాక, వేరే కారణం ఉంది. అదేమిటంటే, దీనిని అర్థం చేసుకోవడటానికి, ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతే, 'భక్తి'. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశాన్ని, కేవలం పాండిత్యంతోనో, లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి, కుదరదు. దీనికి భక్తి అవసరం. ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి, ఆయన అణు-అంశలుగా, ఆయన సేవకులుగా, మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది. అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవటానికి తగిన విద్యార్థి. ఎందుకంటే, అతను భగవంతుని భక్తుడు. అర్జునుడు భగవంతుడిని, తన మిత్రునిగా ఆరాధించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనితో మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు. భక్తి నిండిన హృదయం లేకుండా, భగవద్గీత యొక్క సందేశాన్ని, వాస్తవరూపంలో అర్థం చేసుకోవడం, అసాధ్యం.
అర్జున ఉవాచ ।
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవు వివస్వనుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే, నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
శ్రీ కృష్ణుడి మాటలతో, అర్జునుడు కొంత అయోమయానికి గురయ్యాడు. సూర్య భగవానుడు, సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు. కానీ, శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఈ యోగ విద్యని, సూర్య భగవానుడికి ఎలా చెప్పాడనే విషయంపై, అర్జునుడి సంశయం మొదలైంది. అందుకే ఇలా అడుగుతున్నాడు.
శ్రీ భగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పరంతపా! మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరచిపోయావు. కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి.
భగవంతుడు లోక కళ్యాణం కోసం, ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాడు. కానీ, అతని దైవిక గుణాలూ, దివ్య శక్తులూ ఏమాత్రం తగ్గవు. జీవాత్మకీ, పరమాత్మ అయిన భగవంతునికీ, చాలా పోలికలున్నాయి. రెండూ సత్-చిత్-ఆనందములే. కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వ వ్యాపి. జీవాత్మ, తానున్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది.. భగవంతుడు సర్వశక్తివంతుడు. కానీ జీవాత్మకి, తనను తాను మాయా మొహం నుండి కూడా, భగవంతుని కృప లేకుండా, విడిపించుకునే శక్తి లేదు.. భగవంతుడు, ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. ఆత్మ ఈ నియమాలకు బద్దుడై ఉంటుంది.. సమస్త సృష్టినీ నిర్వహించేవాడు భగవంతుడు. జీవాత్మ కూడా, అతనిచేతనే నిర్వహింపబడుతుంది.. భగవంతుడు సర్వజ్ఞుడు. కానీ జీవాత్మ, ఒక్క విషయంపై కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు. జీవాత్మకీ, పరమాత్మకీ చాలా తారతమ్యం ఉంటుంది.
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।
నేను పుట్టుకలేని వాడనూ, సమస్త ప్రాణులకూ ప్రభువునూ, నాశములేని వాడినై ఉండి కూడా, ఈ లోకంలో నేను, నా దివ్య శక్తి యోగమాయచే కనిపిస్తుంటాను.
భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడన్న అభిప్రాయాన్ని, చాలా మందిఒప్పుకోరు. వారు, నిరాకార, సర్వ వ్యాపి, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే నమ్మకాన్ని, కలిగి ఉంటారు. భగవంతుడు కచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ, అంతమాత్రాన, ఆయన అదే సమయంలో, ఒక రూపము తీసుకోలేడని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి, ఆయనకి తన సంకల్పంచే, ఒక స్వరూపంతో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి, "భగవంతుడు నిరాకారుడు" అనేది, అసంపూర్ణ ప్రతిపాదన. అదే విధంగా, "భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు" అంటే, అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి, రెండు అస్థిత్వాలున్నాయి - వ్యక్తిగత స్వరూపం, మరియు నిరాకార అస్తిత్వం. నిజానికి, జీవాత్మకి కూడా, తన అస్థిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి, శరీరాన్ని, మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు, కనిపించదు. అదేవిధంగా, అది శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది - ఒక సారి కాదు. అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమవుతూ, మారుతూ ఉంటుంది. సూక్షమైన ఆత్మకే, ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి కూడా, ఆ శక్తి ఉంటుందనేది, అందరూ అంగీకరించాల్సిన సత్యం.
ఇక మన తదుపరి వీడియోలో, జీవన్మరణాలలో జీవాత్మ తిరుగుతూ ఉండకుండా, శాశ్వత మోక్షాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments:
Post a Comment