పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో తెలిపిన శ్రీ కృష్ణుడు!
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (69 - 72 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 69 నుండి 72 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MYC7nNPuZpU ]
అహంకార రహితంగా ఉండడం వలన, పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69 ।।
సర్వ భూతములకూ ఏది పగలో, అది పండితునికి అజ్ఞానపు రాత్రి.. మరియు సర్వ భూతములకూ ఏది రాత్రో, అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.
లౌకిక దృక్పథంలో ఉండేవారు, భౌతిక వస్తు-విషయముల భోగమే, నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే, జీవితంలో విజయమనుకుంటారు. "పగలు" అంటే, ఇంద్రియ సుఖాలు లేకపోవడం, "చీకటి" అంటే, రాత్రి అనుకుంటారు. దివ్య జ్ఞానం కలిగిన వివేకవంతులు, ఇంద్రియ భోగాలను ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి, వాటిని "రాత్రి" గా పరిగణిస్తారు. ఇంద్రియ విషయముల నుండి దూరంగా ఉండటమే, ఆత్మ ఉద్ధరణకి అవసరమని భావించి, దానిని "పగలు"గా పరిగణిస్తారు.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ।। 70 ।।
ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా, ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి, శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి, దానిని పొందడు.
ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తున్నా, సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే అపూర్వమైన సమర్థత ఉంది. ప్రపచంలోని అన్ని నదులూ, సముద్రాలలోనికి వచ్చి పోర్లిపోతుంటాయి.. కానీ, సముద్రం మాత్రం పొంగదూ, తగ్గదు. వానా కాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా, అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు. అదే విధంగా, జ్ఞానోదయమైన ముని, శారీరిక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా, లేదా అవేమీ లేకపోయినా సరే, ప్రశాంత చిత్తంతో ఉండి, చలించకుండా ఉంటాడు. కేవలం అలాంటి యోగి మాత్రమే, నిజమైన శాంతిని పొందుతాడు.
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।
ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలనూ త్యజించి, అత్యాశ లేకుండా, నేను, నాది అన్న భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే, ఆ తరుణమే, లోభమూ, క్రోధముల ఉచ్చు లోకి వెళ్ళినట్లే. ఎలాగైనా మనము చిక్కుకు పోతాము. కాబట్టి, అంతర్గత ప్రశాంతతకి దారి, కోరికలను తీర్చుకోవటంలో లేదు. వాటిని నిర్మూలించుకోవటంలోనే ఉంది. ప్రపధమంగా, భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది, మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే. అంతేకాక, అదొక అంతులేని పరుగు. అభివృద్ధి చెందిన దేశాలలో, చాలా కొద్ది మందికి మాత్రమే తిండీ, బట్టలకు లోటు ఉంది. అయినా, వారు అశాంతితో ఉంటారు. ఎందుకంటే, వారిలో తృష్ణ, అత్యాశ, ఇంకా తీరలేదు. సంతృప్తి అనే సంపత్తి కలిగినవారే, గొప్ప ఐశ్వర్యవంతులు. మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకూ పొట్లాటలు, ''అహం" వల్లనే జనిస్తాయి. అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా, దానిని త్యజించటంలోనే, ప్రశాంతతకి మార్గముంది. "నాది" అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది. ఎందుకంటే, ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లి పొతాము. మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి, అని ఎలా అనుకోగలం?
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।
ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత, ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా, ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.
'బ్రహ్మం' అంటే భగవంతుడు, మరియు 'బ్రాహ్మీ స్థితి' అంటే, భగవత్-ప్రాప్తి నొందిన స్థితి. జీవాత్మ అంతఃకరణ శుద్ధిని సాధించిన తరువాత, భగవంతుడు తన దివ్య కృపని ప్రసాదిస్తాడు. ఆయన కృపచే, దివ్య జ్ఞానాన్నీ, దివ్య ఆనందాన్నీ, మరియు దివ్య ప్రేమనీ, జీవాత్మకి ప్రసాదిస్తాడు. ఇవన్నీ, భగవత్ ప్రాప్తి సమయంలో, భగవంతునిచే ఇవ్వబడే దివ్యమైన శక్తులు. అదే సమయంలో, జీవాత్మను, మాయా బంధనం నుండి దేవుడు విడిపిస్తాడు. 'సంచిత కర్మలు' నశిస్తాయి. 'అవిద్య'.. అంటే, భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి, లోపలున్న అజ్ఞానం పోగొట్ట బడుతుంది. భౌతిక ప్రకృతిలో త్రి-గుణముల యొక్క ప్రభావం, అంతరించి పోతుంది. భౌతిక పరిస్థితిలో ఉన్న త్రి-దోషములు, ముగుస్తాయి. పంచ-క్లేశములు, అంటే, ప్రాపంచిక బుద్ధి యొక్క ఇదు దోషాలు, నశిస్తాయి. పంచ-కోశములు భస్మమైపోతాయి. ఆ సమయం నుండి, జీవాత్మ శాశ్వతంగా, మాయా బంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది. ఎప్పుడైతే జీవాత్మ, ఈ భగవత్ ప్రాప్తి దశను సాధిస్తుందో, అది 'జీవన్ ముక్త' అనబడుతుంది. అంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడే, ముక్తి సాధించినట్లు. తరువాత మరణ సమయంలో, ముక్త జీవాత్మ అంతిమంగా, తన భౌతిక శరీరాన్ని త్యజించి, భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది. ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత, అది ఎల్లప్పుడూ, దేవునితోనే ఉంటుంది. ఆ తరువాత, అజ్ఞానపు మాయ, జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకోలేదు. మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని, 'నిర్వాణం', 'మోక్షం' అని అంటారు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ:
శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, రెండవ అధ్యాయం, సాంఖ్యయోగంలోని 72 శ్లోకాలు, సంపూర్ణం.
ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని మూడవ అధ్యాయం, కర్మ యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments:
Post a Comment