జననమరణాల గురించి కృష్ణుడు చెప్పినది వింటే ప్రతివొక్కరి ఆలోచనా విధానం మారుతుంది!
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (16 - 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 16 నుండి 20 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/hG9-V6YKBCw ]
భౌతిక శరీరం గురించీ, జీవాత్మ గురించీ, కృష్ణ భగవానుడి బోధన ఇలా సాగుతోంది..
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టొంఽతః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
క్షణభంగురమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్నీ అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు, ఈ విషయాన్ని యదార్థముగా గమనించి ఉన్నారు.
వేద మంత్రములన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే, భగవంతుడూ, జీవాత్మా మరియు మాయా, ఇవన్నీ నిత్యము, శాశ్వతము. భగవంతుడు నిత్యశాశ్వతుడు. ఆత్మ నాశనములేనిది. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది.
దేని నుండయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే. కానీ, మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులూ, ఒకప్పుడు వచ్చినవే.. మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. కాబట్టి, వాటిని తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు.. ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ, అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు.
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ ।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ।। 17 ।।
శరీరమంతయూ వ్యాపించి ఉన్న ‘ఆత్మ’, నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అవ్యయమైన ఆత్మను నశింపచేయలేరు.
ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా, శరీరానికీ, జీవాత్మకీ ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు, శ్రీ కృష్ణుడు. అంటే, పరమాత్మ యొక్క ఉద్దేశం, ఆత్మ సచేతనమైనది. అంటే, చైతన్యము కలిగినది. శరీరము జడమైనది.. అంటే, చైతన్యము లోపించినది. కానీ, ఆత్మ శరీరంలో ఉంటూ, తన చైతన్య గుణమును, శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా, ఆత్మ నిండి, నిబిడీకృతమై, తన చైతన్యాన్ని వ్యాపింపచేస్తుంది. అటువంటి దానిని, ఎవరూ నాశనం చేయలేరు.
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ।। 18 ।।
ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; కానీ, అందున్న జీవాత్మ నాశరహితమైనదీ, కొలవశక్యము కానిదీ, మరియు సనాతనమైనదీ, నిత్యమైనదీ. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.
స్థూల శరీరము యథార్థముగా, మట్టితో తయారయినదే. మట్టియే, కూరగాయలుగా, ఫలములగా, ధాన్యముగా, పప్పుదినుసులుగా, మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి, పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము.. వీటినన్నింటినీ భుజించగా, అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి, శరీరము మట్టితో తయారయిందని అనటంలో, అతిశయోక్తి లేదు. మరణ సమయంలో, ఆత్మ వెళ్ళిపోయిన తరువాత, శరీరము మూడు రకాలుగా అంతమవ్వవచ్చు. క్రిమి, విద్ లేదా భస్మ. అది కాల్చివేయబడితే, అప్పుడు అది భస్మముగా మారి, మట్టిగా అయిపోతుంది. లేదా, పాతి పెట్టబడితే, అప్పుడు క్రిమికీటకాలు దానిని తిని, మళ్లీ మట్టిగా మారుస్తాయి. లేదా అది నది లో విసిరి వేయబడవచ్చు.. అప్పుడు నీటిలో ఉండే ప్రాణులు, దానిని తమ ఆహారంగా చేసుకుని, వ్యర్ధంగా విసర్జిస్తాయి. అది చిట్టచివరికి, సముద్రగర్భంలోని మట్టిలో కలిసి పోతుంది. ఈ ప్రకారంగా, జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనవుతుంది. అది ఆహారంగా మారుతుంది, శరీరాలు ఆ ఆహారంతో తయారవుతాయి, మరల ఈ శరీరాలు, తిరిగి మట్టిలోనికి చేరుతాయి. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు, ‘భౌతిక శరీరంలోని నిత్యమైన, నాశరహితమైన అస్థిత్వం ఒకటి ఉంది.. అది మట్టితో చేయబడలేదు. అదే, దివ్యమైన ఆత్మ, నిజమైన 'నేను' అని అర్థం.. నీవు ఆ విషయాన్ని గ్రహించి, లేచి యుద్ధంలో పాల్గోను’.
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ।
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ।। 19 ।।
ఆత్మ ఇతరులను చంపును అని అనికునేవాడూ, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకునేవాడూ, ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.
మనలను మనం, ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన, మరణం అనే భ్రాంతి కల్పింపబడింది. మన తల తెగిపోతున్నట్టుగా కల గంటే, ఆ నొప్పి మనం నిద్రలేచే వరకూ అనుభూతిలోనే ఉంటుంది. కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి.. కానీ, దాని వలన కలిగిన నొప్పీ, అనుభవం, మనం నిద్ర లేచి, ఆ భ్రాంతిని పోగొట్టుకునేవరకూ, బాధిస్తునే ఉంటుంది. అదే విధంగా, మనం ఈ శరీరమే అన్న భ్రాంతిలో పడి, మరణానికి భయపడతాం. జ్ఞానోదయం అయిన వారికి మాయ తొలిగిపోయి, ఈ మరణం యొక్క భయం నశిస్తుంది.
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ।। 20 ।।
ఆత్మకి పుట్టుక లేదు.. ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించి పోయినప్పుడూ, అది నశించదు.
పుట్టుకకూ, మరణానికీ అతీతమై, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత, నిత్యమైన తత్త్వం, ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే, ‘గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల, మరియు మరణించుట’ అనే ఈ శరీరం యొక్క పరిణామాలు, ఆత్మకు వర్తించవు. మనం అనుకునే చావు, కేవలం శరీర వినాశనం మాత్రమే కానీ, నిత్యమైన ఆత్మ, శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు. వేదాలలో ఈ విషయాన్ని చాలా సార్లు ప్రతిపాదించారు. ‘ఆత్మ మహిమాన్వితమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, వృద్ధాప్యము లేనిది, శాశ్వతమైనది మరియు భయములేనిది’ అని, కఠోపనిషత్తులో వివరించబడింది.
మన తదుపరి వీడియోలో, కృష్ణుడు ఆత్మ స్వభావాన్ని ఏ విధంగా వివరిస్తున్నాడో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgynpyV8cnpJHu64mRR4AaABCQ
No comments:
Post a Comment