శ్రీ కృష్ణుడి అష్టభార్యల పరిణయం వెనుక దాగిన రహస్యాలు!
శ్రీ మహావిష్ణువు లోక కళ్యానార్ధం, ఎన్నో అవతారలనెత్తాడు. వాటిలో దశావతరాలు ప్రఖ్యాతిగాంచినా, కృష్ణావతారం, ఎనలేని ప్రాముఖ్యతను సంతరించుకుంది. ద్వాపరయుగంలో, సాక్షాత్తూ విష్ణు మూర్తే, కృష్ణుడిగా అవతారం దాల్చి, ఎన్నో లీలల్నీ, మాయల్నీ చేసి, నేటి సమాజానికి అవసరమయ్యే ఎన్నో నిగూఢ సత్యవచనాలను ప్రబోధించాడు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/IKbw0J6koIU ]
కృష్ణుడనగానే, మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఆయన అష్టమహిషులూ, పదహారు వేల మంది గోపికలు. ఇంతమందికి ప్రియసఖుడైన కృష్ణుడు, మనస్సుకు ఎటువంటి మలినం అంటని బ్రహ్మచారి అని, మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే, కృష్ణుడు 8 మందిని పెళ్లి చేసుకోవడం, పదిహారు వేల మంది గోపికలను చేరదీయడం వెనుక, వారి గత జన్మల పుణ్య చరిత్ర దాగి ఉంది. సాధారణంగా, మనకు కృష్ణుడి భార్యలు అనగానే రుక్మిణీ, సత్యభామ మాత్రమే గుర్తుకు వస్తారు. మరి మిగిలిన ఆరుగురు భార్యల గురించి తెలిసింది, చాలా తక్కువమందికే. కృష్ణుడు ఎనిమిది మంది స్త్రీ లను ఎందుకు వివాహం చేసుకున్నాడు? అందుకు గల కారణాలేంటి? కృష్ణుడిని భర్తగా పొందడం కోసం, వారు చేసిన త్యాగాలేంటి? కృష్ణుడి అష్టమహిషుల పరిణయం వెనుక దాగిన రహస్యాలేంటి? అనే విషయాలు, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
రుక్మిణీ దేవి..
విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి. ఆమెకు అయిదుగురు సొదరులు. రుక్మీ, రుక్మరతా, రుక్మకేతూ, రుక్మబాహు, రుక్మ నేత్ర. అత్యంత సౌందర్యరాశి అయిన రుక్మిణికి యుక్త వయస్సు రాగా, సోదరుడైన రుక్మి, శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని చూశాడు. కానీ, కృష్ణుడి పరాక్రమాల గురించి తెలుసుకున్న రుక్మిణి, మనస్సులో తననే భర్తగా ఊహించుకుంది. కృష్ణుడు కూడా, వసుదేవ నందనుడి ద్వారా రుక్మిణీ దేవి అందచందాల గురించీ, భక్తి తత్పరత గురించీ తెలుసుకుని, ఆమెను భార్యగా పొందాలనుకున్నాడు. రుక్మి, శిశుపాలుడితో వివాహం నిశ్చయించగా, అది ఇష్టం లేని రుక్మిణి, అగ్నిద్యోతనుడనే పండితుడి ద్వారా, తన ప్రేమను వ్యక్తపరచి, తనను పెళ్ళి చేసుకోవల్సిందిగా కృష్ణుడికి వర్తమానం పంపించింది. రుక్మిణి ప్రేమను తెలుసుకున్న కృష్ణుడు, తనను తీసకురావడానికి సన్నద్ధమయ్యాడు. పథకం ప్రకారం, ఊరి చివరనున్న సర్వలోకేశ్వరి దేవాలయానికి వచ్చిన రుక్మిణిని తన రథంపై ఎక్కించుకుని, ద్వారకకు ప్రయాణమయ్యాడు కృష్ణుడు. మార్గమధ్యంలో రుక్మీ, శిశుపాలుడూ అడ్డుపడి యుద్ధం చేయగా, వారిని ఓడించి, రుక్మిణిని ద్వారకకు తీసుకువెళ్లి వివాహమాడాడు. రుక్మిణీ దేవి సాక్ష్యాత్తూ, లక్ష్మీ దేవి అంశ.
సత్యభామ, జాంబవతి..
సత్రాజిత్తు కుమార్తె, సత్యభామ. వినాయక వ్రత కల్పంలోని కథలో, కృష్ణుడూ, సత్యభామా, జాంబవతిల వివాహ వృత్తాంతం ఉంది. శమంతకమణి కోసం, తన సోదరుడైన ప్రసేనుడిని చంపి, ఆ మణిని దొంగలించాడని, సత్రాజిత్తు కృష్ణుడిని నిందించాడు. ఆ నీలాపనిందను పోగొట్టుకోవడానికి కృష్ణుడు, అడవికి వెళ్లి, ప్రసేనుడు చనిపోయిన ప్రాంతంలో వెదుకుతుండగా, శమంతకమణి ఒక గుహాలో దొరికింది. దానిని తీసుకోబోతుండగా, జాంబవంతుడు వచ్చి అడ్డుపడడం, దానితో వారివురి మధ్యా యుద్ధం జరగడం, తరువాత కృష్ణుడు సాక్ష్యాత్తూ, విష్ణు మూర్తి అవతారమని తెలుసుకుని, తన కూతురైన జాంబవతినిచ్చి వివాహం చేయడం, మనందరికీ తెలుసిందే. అలా జాంబవతిని పెళ్లి చేసుకుని, శమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకిచ్చి, జరిగిన విషయం చెప్పాడు శ్రీ కృష్ణుడు. దాంతో తన తప్పు తెలుసుకుని, కృష్ణుడిని మన్నించమని వేడుకుని, తన కుమార్తె అయిన సత్యభామనిచ్చి వివాహం చేశాడు. సత్యభామ భూదేవి అంశ. గోదాదేవి అవతారం. జాంబవతి గత జన్మలో, చంద్రుని పుత్రిక. నిత్యం పురాణాలను వింటూ, ప్రతి క్షణం భగవత్ స్మరణలో మునిగి ఉండేది. జాంబవతి, శ్రీ హరిని మనస్సునిండా నింపుకుని, స్వామి చరణ దాసి కావాలని తపిస్తుండేది. ఒకనాడు సోముడు, తన కూతురు జాంబవతీ, కుల గురువు జైగీషవ్యమహర్షితో కలసి, తీర్థయాత్రలకు బయలుదేరారు. వారు శేషాచలంలోని ప్రతి తీర్థాన్నీ దర్శిస్తూ, వేంకటాద్రి మాహాత్మ్యాన్నీ, భాగవతోత్తముల పుణ్యకథలనూ వింటూ, ఆనందరసాబ్ధిలో మునిగిపోయారు. ముందుగా కపిల తీర్థం చేరుకుని, గురువు గారి మాట ప్రకారం, సోముడు అక్కడ శిరోముండనం చేయించుకున్నాడు. తరువాత నారసింహ తీర్థానికి చేరుకుని, ఆ స్థల ప్రాశస్త్యం గురించీ, ప్రహ్లాదుడికి ప్రాప్తించిన విష్ణు మూర్తి దర్శనం గురించీ మహర్షి చెబుతుండగా విని, పులకించి పోయారు. ఆ సమయంలో శ్రీ హరి వారికి ప్రత్యక్షమయ్యాడు. జాంబవతి నిశ్చేష్టురాలై, స్వామిని చూసి ఆనందిస్తూ, తనను చరణ దాసిగా స్వీకరించమని వేడుకుంది. అందుకు శ్రీ హరి, వేంకటేశ మంత్రాన్ని ఉపదేశించి, ‘నీవిక్కడే ఉండి దానిని జపిస్తూ, తపస్సు చేయ్యి’, అని ఆమెను అనుగ్రహించాడు. తరువాత జాంబవతి, మిగిలిన తీర్థాలన్నింటినీ దర్శించి, చివరకు రుషి తీర్థాన్ని చేరుకుని, అక్కడ తపస్సునారంభించి, యోగధారణతో తన శరీరాన్ని త్యజించి, తిరిగి భక్తశిఖామణి అయిన జాంబవంతుడి ఇంట జన్మించింది.
మిత్రవింద..
కృష్ణుడి అయిదవ మేనత్త, సుమిత్ర అనబడే రాజాథి దేవి. ఈమె అవంతీ దేశపు రాజు జయసేనుడి భార్య. వీరి కుమార్తె మిత్రవింద. కృష్ణుడిని ప్రేమించిన మిత్రవింద, తన సోదరులైన విందానువిందులకు తెలియకుండా, శ్రీ కృష్ణుడిని స్వయంవరానికి ఆహ్వానించింది. తన సోదరులకు కృష్ణుడంటే, అయిష్టం. అందుకే, వారు కృష్ణుడిని ఆహ్వానించలేదు. కానీ, మిత్రవింద కోరిక మేరకు స్వయంవరానికి విచ్చేసి, ఇతర రాజకుమారులందరినీ ఓడించి, ఆమెను చేపట్టాడు శ్రీ కృష్ణుడు. మిత్రవింద గత జన్మలో, హరిని మిత్రునిగా చేసుకోవడానికి తపించింది. భగవంతుడిని చేరడానికి, అన్ని సాధనలలోకెల్లా శ్రేష్ఠమైనది, భగవానుని కథలను వినడమే అని భావించింది. తన తండ్రి అనుమతితో, విష్ణుమూర్తి సత్కథలను వింటూ, అను నిత్యం, ఆయన గురించి ఆరాటపడుతూ, తనువు చాలించింది.
భద్ర..
కృష్ణుడి మేనత్తా, కైకేయ దేశపు రాజు భార్యా అయిన శృతకీర్తి కుమార్తె, భద్ర. మొదటగా ఆమె పేరు, కైకేయి అనుకున్నారు. కానీ, మునులూ, పెద్దలూ, ఆమె లక్షణాలను చూసి, భద్ర అని నామకరణం చేశారు. భద్ర, సలక్షణ సమన్విత. మంచి నడవడిక కలది. మరదలు వరసైన భద్రను, శ్రీ కృష్ణుడు పెద్దలందరి సమక్షంలో వివాహమాడాడు. కృష్ణుడిని భర్తగా పొందిన భద్ర, పూర్వజన్మలో సామాన్యుడైన నలుడి ఇంట, దివ్యజ్ఞాన సంపన్నరాలిగా జన్మించింది. ప్రతి రోజూ పూజలూ, వ్రతాలూ, ఉపవాసాలతో, విష్ణు మూర్తి సాన్నిధ్యంలో గడిపేది. నలుడు తన కూతురికి వివాహం చేయదలవగా, అందుకు భద్ర సున్నితంగా నిరాకరించింది. సర్వకాల సర్వావస్థలలో, హరిని స్మరించడం, పూజించడం, జపించడం, స్తుతించడం, మానవుల ప్రథమ కర్త్యవం. శాశ్వతమైన కీర్తినీ, స్థానాన్నీ సంపాదించిపెట్టేవాడు, ఆ హరి. అందుకే, తన జీవితాన్ని ఆయనకే అంకితం చేసింది. ఆ శ్రీహరిని ధ్యానిస్తూనే, ఆ జన్మలో తన శరీరాన్ని త్యజించింది భద్ర.
నాగ్నజితి (నీల)..
కుంభకుడి ఇంట జన్మించింది నీల. యుక్త వయస్సుకు రాగా, ఆమె వివాహానికి స్వయంవరం ప్రకటించాడు తండ్రి. శివుని వరం వల్ల, ఆయనకు సంక్రమించిన ఏడు వృషభాలను అదుపులోకి తీసుకురాగలిగిన వారికే, నీలనిచ్చి వివాహం జరిపిస్తానని, చాటింపు వేయించాడు. భగవదంశ గలవాడూ, శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న వాడూ అయిన శ్రీ కృష్ణుడు, వాటిని అదుపులోకి తెచ్చుకున్నాడు. కానీ, నీలను కొందరు రాజులు అపహరించబోగా, వారిని అడ్డగించి, యుద్ధం చేసి, నీలను గెలుచుకున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ నీల పూర్వజన్మలో, అగ్నిదేవుని రూపమైన కవ్యవాహుని పుత్రిక. ఈమె నాగ్నజితిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహా విష్ణువుని పతిగా పొందాలని, అనన్య చింతనతో, ఆయననే స్మరిస్తూ, పూజిస్తూ, జీవించింది. ఆమెకు వివాహ వయస్సు రాగా, తండ్రి వరుడిని చూడగా, తాను నీల మేఘశ్యాముడిని తప్ప, వేరొకరిని వరించనని భీష్మించుకుంది. శ్రీ హరి అనుగ్రహం కోసం తపస్సు చేయదలచి, శేషాచల పర్వతంపైకి చేరుకుంది. తండ్రి ఇక చేసేదేమిలేక, ఆమెకు రక్షణ ఏర్పాట్లు చేశాడు. నాగ్నజితి, పాపవినాశక తీర్థానికి ఉత్తరదిశలో, మూడు కోసుల విస్తీర్ణంలో ఉన్న ఒక గుహలో, తపస్సుకు ఉప్రకమించింది. ఆమె కఠోర తపస్సుకు శ్రీ హరి ప్రత్యక్షమై, ‘కృష్ణావతారంలో నీ పతినవుతాను’, అని వరమిచ్చాడు. శ్రీ హరి అనుగ్రహించడంతో, ఆమె యౌగిక రీతిలో శరీరాన్ని విడిచింది.
కాళింది..
వివస్వంత రూపంలో ఉన్న సూర్యునికి పుట్టిన కుమార్తె, కాళింది. ఈమెను యమునా, యమానుజ అని కూడా అంటారు. కాళింది, విష్ణుపత్ని కావాలనే ఆకాంక్షతో, విశిష్ట తపస్సు చేసింది. పూర్వజన్మలో చేసిన పాపాలు దగ్ధమవ్వడానికి చేసే తపస్సును, పాపానుతాపమని అంటారు. గత జన్మలో ఎవరైతే భగవంతుడిని తలచుకోకుండా, ఆయనను పూజించకుండా జీవిస్తారో, వారు ఈ తపస్సునాచరించడం వలన, ఆ ముకుందుని పాదాలను చేరుకోవచ్చు. కాళింది కూడా, తాను గత జన్మలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, యమునా తీరాన తపమునాచరించింది. ఒకనాడు అర్జునుడితో కలిసి శ్రీ కృష్ణుడు యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ కాళిందిని చూసి, వివరాలు కనుక్కోమని అర్జునుడిని పంపగా, ఆమె కథను తెలుసుకుని, శ్రీ కృష్ణుడికి వివరించాడు పార్థుడు. తరువాత ఒక శుభ ముహుర్తంలో, శ్రీ కృష్ణుడూ, కాళింది పాణిగ్రహణం జరిగింది.
లక్షణ..
మద్ర దేశాధీశుడైన బ్రుహత్సేనుని పుత్రిక, లక్షణ. మహావీరుడైన ఆమె తండ్రి, మత్స్యయంత్రాన్ని ఛేదించగలవానికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని, ప్రకటించాడు. ఆమె గత జన్మ కోరికను తీర్చడానికి, శ్రీ కృష్ణుడు స్వయంవరానికి వెళ్లి, ఆ యంత్రాన్ని ఛేదించి, లక్షణను పెళ్లి చేసుకున్నాడు. లక్షణ పూర్వజన్మలో, సకల వేదపారంగతుడైన అగ్నిదేవుని పుత్రిక. అన్నీ శుభలక్షణాలతో పుట్టడం వలన, ఈమెకు సులక్షణ అనే పేరు పెట్టారు. సంపూర్ణ పురుషుడు కేవలం మహా విష్ణువే అని భావించి, నిరంతరం ఆయనను పూజించింది, సులక్షణ. ‘నేను మాధవుని భక్తురాలిని. ఇంకొకరిని నాథునిగా ఊహించలేను’ అని తండ్రితో చెప్పి, ‘నాకు శ్రీ హరే పతిగా రావాలి’ అని కోరుకుంటూ, ప్రాణ పరిత్యాగం చేసింది సులక్షణ.
పదహారువేల మంది గోపికలు..
నరకాసురుడనే రాక్షసుడు, పదహారు వేల మంది మహిళలను బంధించాడు. శ్రీ కృష్ణుడు, సత్యభామ సహితుడై, నరకాసురుడిని వధించిన తరువాత, ఆ పదహారు వేల మందీ, విముక్తి పొందారు. కానీ, వారిని తిరిగి ఆదరించడానికి, వారి తల్లి దండ్రులూ, భర్తలూ నిరాకరించారు. దాంతో, శ్రీ కృష్ణుడు వారందరినీ చేరదీసి, వారికి నివాస స్థలాన్ని కల్పించి, వారి బాగోగులను ఒక భర్తగా చూసుకున్నాడు. ఇలా శ్రీ కృష్ణుడి చెంతకు చేరిన స్త్రీలు, గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని, విష్ణువును కావాలనుకున్నవారే. సంపూర్ణానంద స్వరూపుడైన శ్రీ కృష్ణుడికి, ఏ సుఖాభిలాషా లేదు. ఈ వివాహాలన్నీ, కేవలం భక్తానుగ్రహ దృష్టివల్ల మాత్రమే జరిగాయి. అందుకే, ఇంతమంది భార్యలున్నా, ఆయన బ్రహ్మచారిగానే చెప్పబడుతున్నాడు.
ఇక రాధా కృష్ణుల ప్రణయం, ఒక అద్భుతం. శ్రీ కృష్ణుడు రాధను ఎందుకు ప్రేమించాడు? పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? రాధ గత జన్మ రహస్యం ఏంటి? అనే విషయాలు, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgwTmDzQt5EqUCxNoL14AaABCQ
No comments:
Post a Comment