మరణించిన తరువాత ఆత్మ వేరే శరీరాన్ని తీసుకునే మధ్యలో ఏం జరుగుతుంది!?
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (26 - 31 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్య యోగంలోని 26 నుండి 31 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/CGnNJReBIp4 ]
అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి శ్రీ కృష్ణుడు, జనన మరణాల గురించిన జ్ఞానాన్ని, ఈ విధంగా వివరిస్తున్నాడు..
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ ।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ।। 26 ।।
ఒకవేళ నీవు, ‘ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది’ అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించటము తగదు.
భారతీయ తత్వశాస్త్రం, చారిత్రాత్మకంగా, పన్నెండు సంప్రదాయాలను కలిగి ఉంది. వీటిలో ఒక ఆరు, వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి. అందుకే, వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. ఇవి, మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య, మరియు యోగ దర్శనములు. మరల వీటిలో ఇంకొన్ని శాఖలున్నాయి. ఉదాహరణకి, 'వేదాంత'మనేది, మరో ఆరు రకాలుగా విభజించబడింది. అద్వైత వాదం, ద్వైత వాదం, విశిష్టాద్వైత వాదం, విశుద్ధాద్వైత వాదం, ద్వైతాద్వైత వాదం, మరియు అచింత్య-భేదాభేద వాదం. వీటిలో మళ్ళీ కొన్ని ఉపశాఖలున్నాయి. ఉదాహరణకి, అద్వైత వాదం అనేది, ఇలా పునర్విభజించబడింది. దృష్టి-సృష్టి వాదం, అవచ్ఛేద వాదం, బింబ-ప్రతిబింబ వాదం, వివర్త వాదం, అజాత వాదం, మొదలగునవి. ఈ సిద్ధాంతాలన్నీ, వేదములను ప్రామాణికంగా అంగీకరించాయి. వీటి ప్రకారముగా, నిత్యమైన, మారని ఆత్మయే, మన స్వీయ స్వరూపమని, అర్థమవుతుంది. మిగిలిన ఆరు తత్వ శాస్త్ర సిద్ధాంతాలు, వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి, చార్వాక వాదం, నాలుగు బౌద్ధ సిద్ధాంతాలైన, యోగాచార వాదం, మాధ్యమిక వాదం, వైభాశిక వాదం, సౌతాంత్రిక వాదం, మరియు జైన మతం. ఇవన్నీటికీ, ఆత్మ తత్త్వం గురించి, వాటి వాటి వివరణలున్నాయి. జైన మతం ప్రకారం, ఆత్మ అనేది, శరీరమంత పరిమాణములో ఉంటుంది. కాబట్టి, అది ప్రతి జన్మకీ, మారుతూ ఉంటుంది. బౌద్ధ మతంలో ఉన్న సిద్ధాంతాలు, శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు. దీనికి బదులుగా, జీవిత కాలం నుండి, జీవిత కాలమునకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుదనీ, ఇది వ్యక్తి యొక్క అస్థిత్వ కొనసాగింపుని కలిగిస్తుందనీ, పేర్కొంటున్నాయి. ఆత్మ, ‘జీవితం నుండి జీవితానికి, జీవ చైతన్య ప్రవాహాన్ని కలిగి ఉంటుందని’ నీవు అంగీకరించినా, ఆ విషయం గురించి శోకింపవద్దని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు తెలియజేస్తున్నాడు.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।
పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి, అనివార్యమైన దాని కోసం, నీవు శోకించ వద్దు.
ప్రతీ ఒక్కరి జీవితంలో, అత్యంత కచ్చితమైన విషయం ఏమిటంటే, మనం ఏదో ఒకరోజు, మృత్యువును కలవడం.. అందరి జీవితాలలో అతిపెద్ద భయం, ‘మరణ భయం’ అని, మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. మహాభారతంలో, ఈ మరణం గురించిన ఒక ఘటన చెప్పబడింది. పాండవులు అడవిలో సంచరిస్తున్న సమయంలో, దాహం వేసి, ఒక బావి దగ్గరకి చేరుకున్నారు. యుధిష్టురుడు, అందరికీ నీరు తెమ్మని, భీముడిని పంపించాడు. భీముడు ఆ బావి దగ్గరికి వెళ్ళగానే, ఒక యక్షుడు బావి లోపల నుండి మాట్లాడటం మొదలు పెట్టాడు.. ‘మొదట నా ప్రశ్నలకు సమాధానం చెపితేనే, నేను నీళ్ళు తీసుకోనిస్తాను’ అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా, నీళ్ళు తీసుకోవటానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి లాగేశాడు. కాసేపటి తరువాత, భీముడు తిరిగి రాక పోయేసరికి, కలత పడ్డ యుధిష్టురుడు, ఏమయ్యిందో తెలుసుకుని, నీళ్ళు తెమ్మని, ఆర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ బావి దగ్గరికి వెళ్ళగానే, ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, ‘నేను ఇప్పటికే నీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్ప గలిగితే తప్ప, నీటిని తీసుకోవడానికి ప్రయత్నించకు’ అని అన్నాడు. అర్జునుడు కూడా, ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దాంతో యక్షుడు, అతన్ని కూడా లోపలికి లాగేశాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళైన నకులుడు, సహదేవుడికి కూడా, ఇదే గతి పట్టింది. చివరకు యుధిష్ఠిరుడు, తానే స్వయంగా, ఆ బావి దగ్గరకు వెళ్లాడు. ‘నీవు బావి నీరు తాగాలంటే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదా, నీ నలుగురు తమ్ముళ్ళ లాగానే, నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను’ అని అన్నాడు యక్షుడు. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి, యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు. స్వయానా, మారు వేషంలో ఉన్న మృత్యు దేవత అయిన యమధర్మ రాజు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలలో ఒకటి, ‘కిం ఆశ్చర్యం?’ అంటే, ‘ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’ అని.. దానికి యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘ప్రతి నిమిషం, మనుష్యులు చని పోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు, ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా, ఏదో ఒక రోజున మనమూ చని పోతామని అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది?’ యుధిష్ఠిరుడు చెప్పిన ఈ సమాధానం, సత్యం. ‘జీవితం అనేది, తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఖచ్చితంగా, మరణంతో అంతమయ్యేదే. కాబట్టి, తెలివైన వాడు, అనివార్యమైన ఈ మరణం గూర్చి శోకించడు,’ అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ।। 28 ।।
ఓ భరత వంశీయుడా.. సృష్టింపబడిన ప్రాణులన్నీ, పుట్టుకకు ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప, అవ్యక్తములు. కావున, శోకించుట ఎందులకు?
మనం ఈ యొక్క వ్యక్తిత్వాన్ని, నిత్యమైన ఆత్మగా భావించినా, లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా, లేదా, ఊహకందని ఈ రెండింటి కలయికగా భావించినా, శోకించ కూడదు. శోకమునకు మూల కారణం, భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే. భౌతిక జగత్తులో, ప్రతి యొక్క జీవాత్మ, మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది. అవి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.
స్థూల శరీరమనగా, భూమీ, నీరూ, అగ్నీ, వాయువు, ఆకాశమనే పంచ భూతములతో తయారు చేయబడినది..
సూక్ష్మ శరీరమనగా, ఐదు ప్రాణవాయువులూ, ఐదు కర్మేంద్రియములూ, ఐదు జ్ఞానేంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, మరియు అహంకారమనబడే, పద్ధెనిమిది మూల వస్తువులతో కూడినది.
కారణ శరీరమనగా, అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి, మునుపటి జీవితాల నుండీ వున్న సంస్కారములతో కూడి ఉన్నది.
మరణ సమయంలో, ఆత్మ, తన స్థూల శరీరాన్ని విడిచి పెట్టి, తనతో పాటు, సూక్ష్మ, కారణ శరీరములను తీసుకుని వెళుతుంది. భగవంతుడు, మరల ఆత్మకి మరియొక స్థూల శరీరాన్ని, దాని సూక్ష్మ, కారణ శరీరాలకనుగుణంగా ఇచ్చి, దానికి తగిన తల్లి గర్భం లోనికి ప్రవేశపెడతాడు. ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలి వేసిన తరువాత, వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో, ఒక పరివర్తన దశ ఉంటుంది. ఈ దశ, కొన్ని క్షణాల నుండి, కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. కాబట్టి, పుట్టుక ముందు, ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా, అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే, అది వ్యక్తమవుతుంది. కాబట్టి, శోకించడానికి మరణం కారణం కాకూడదని తెలియజేస్తున్నాడు, కృష్ణ పరమాత్ముడు.
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ।। 29 ।।
కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా, దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.
సూక్ష్మమైన పరమాణువుల నుండి గొప్ప నక్షత్రాలూ, పాలపుంతల వరకూ, మొత్తం జగత్తు ఆశ్చర్యకరమైనది. అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టే. ఆత్మ అనేది, భగవంతుని యొక్క అంశ కాబట్టి, ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది. ఎందుకంటే, అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది. ఏవిధంగా భగవంతుడు దివ్యమో, ఆ భగవంతుని అంశ అయిన ఆత్మ కూడా, దివ్యమే. ఈ కారణం వలన, ఆత్మను అర్థం చేసుకోవటానికి, కేవలం బుద్ది కుశలత మాత్రమే సరిపోదు. ఆత్మ అస్తిత్వమూ, ఆత్మ తత్త్వమూ అర్థం చేసుకోవటం, చాలా కష్టం.
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత ।
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ।। 30 ।।
ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది. కాబట్టి, ఏ ప్రాణి గురించి కూడా, నీవు శోకించుట తగదు.
అమరత్వం కలిగిన ఆత్మ ఉన్న ప్రాణి మరణించినా, మనం దుఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే, ఆత్మ మరల ఏదో ఒక స్థూల శరీరాన్ని పొంది, తిరిగి జీవిస్తుంది.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్చ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ।। 31 ।।
ఇంకా, నీ యొక్క క్షత్రియ స్వధర్మమమును అనుసరించి, నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి, ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దాని కన్నా మించిన కర్తవ్యం లేదు.
స్వధర్మనేది వేదాలకనుగుణంగా, ఒక వ్యక్తి చేయవలసిన విధి. రెండు రకముల స్వధర్మములున్నాయి. 'పర ధర్మ' అంటే ఆధ్యాత్మిక విధులు, మరియు 'అపర ధర్మ' అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు, భగవంతుడిని ప్రేమించి, భక్తితో సేవించడమే, చేయవలసిన విధి. దీనిని 'పర ధర్మం' అంటారు. కానీ, మానవాళిలో ఎక్కువ శాతం మంది, ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి, తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా, వేదాలు విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క వర్ణ, ఆశ్రమాలకనుగుణంగా, ఈ ధర్మాలు నిర్వచించబడ్డాయి. వీటిని అపర ధర్మం, లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత, మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు, ఆధ్యాత్మిక విధులూ, మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తి పరంగా అర్జునుడు యోధుడు కాబట్టి, ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం, యోధుడిగా తన వృత్తి ధర్మం. దానినే శ్రీ కృష్ణుడు అర్జునుడుకి గుర్తుచేస్తున్నాడు.
మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు క్షత్రియ ధర్మం గురించి, అర్జునుడితో ఏ విధంగా సంభాషిస్తున్నాడో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgyL4Fsp6_uM1Z8pIvR4AaABCQ
No comments:
Post a Comment