మహాభారతంలో, కురుక్షేత్ర యుద్ధం ఒక ముఖ్య ఘట్టం. ఈ యుద్ధం, దాయాదులైన కౌరవులకూ పాండవులకూ మధ్య, హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ కురుక్షేత్ర సంగ్రామం, 18 రోజుల పాటు సాగింది. పాండవుల పక్షాన ద్వారక, కాశీ, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, యదు మొదలుగు రాజ్యాలూ, కౌరవుల పక్షాన, ప్రాగ్‌జ్యోతిష, అంగ, సింధు, మాహిష్మతీ, అవంతీ, మద్ర, గాంధారమూ, బహ్లిక, యవన, సాకా, తుషారులతో కలిపిన కాంభోజ రాజ్యంతో పాటు, మరికొన్ని రాజ్యాలు యుద్ధంలో పాలుపంచుకున్నాయి. ఈ యుద్ధంలో, వేల మంది వీరులు నేలకొరిగారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో, కౌరవులతోపాటు, కర్ణుడూ, ద్రోణచార్యుడి లాంటి మహావీరులందరూ, వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో ప్రాణాలతో మిగిలినవారు, పది మంది. పాండవులూ, శ్రీ కృష్ణుడూ, అశ్వత్థామ, కృపాచార్యుడూ, సాత్యకీ, కృతవర్మ మాత్రమే. యుద్ధంలో కౌరవులకూ, పాండవులకూ సహకరించిన వందల మంది రాజులూ, వేల మంది సైనికులూ అసువులు బాశారు. నూరు మంది కౌరవులూ, కురుక్షేత్రంలో కుప్పకూలారు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dJfrj1R6fZI ]
ఈ కురుక్షేత్ర యుద్ధంలో, తన కుమారులనూ, సన్నిహితులనూ, సహోదరులనూ కోల్పోయిన ధ్రుతరాష్ట్రుడు, క్రుంగిపోయాడు. ఐశ్వర్యం పోగోట్టుకున్నాను, బంధువులంతా నాశనమయ్యారు.. ఇంత దారుణం జరిగినా, తనకు చావెందుకురాలేదని, కలత చెందాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వేదవ్యాసుడు, ధ్రుతరాష్ట్రుడిని ఓదారుస్తూ, ‘కుమారా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనసుకు పట్టించుకున్నావంటే, దుఃఖం నీ చెంతకు రాదు. అయినా, ఇప్పుడు విచారిస్తున్నావు కానీ, జూదమాడేనాడు, విదురుడెంత చెప్పినా విన్నావా? కృష్ణుడు రాయబారానికి వచ్చిన నాడు, నీ కుమారుడు ఒప్పుకున్నాడా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా? జరగాల్సింది తప్పక జరుగుతుందని, హితవచనాలు చెప్పాడు. అంతేకాకుండా, కౌరవుల మరణానికి గల కారణాన్నీ, శ్రీ హరి భూదేవికిచ్చిన వరాన్నీ వివరించాడు వేదవ్యాసుడు. పాండవుల చేతిలో కౌరవులు హతమవ్వడానికీ, కౌరవుల తల్లి గాంధారి శాపం కారణంగా, యదు వంశం నాశనమవ్వడానికీ, భూదేవి శ్రీ హరి దగ్గర తీసుకున్న ప్రమాణానికీ సంబంధం ఏంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం..
ఒకనాడు వేదవ్యాసుడు దేవసభకు వెళ్లి, దేవతలూ, మహామునులతో మట్లాడుతున్న సమయంలో, భూదేవి ఏడుస్తూ అక్కడికి వచ్చింది. నా మీదున్న పాప భారం తొలగిస్తానని, బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికి, మీరిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో, తెలియడం లేదు. నా భారం తొలగే మార్గమేంటి? అని దేవతలను భూమాత నిలదీసింది. అప్పుడు శ్రీమహావిష్ణువు ఓ చిరుమందహాసం చేస్తూ, భూదేవిని ఓదార్చాడు. ‘ధ్రుతరాష్ట్రుడనే రాజుకు, నూరుగురు కుమారులు జన్మిస్తారు. వారిలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల, నీ భారమంతా నశిస్తుంది. అతడిని చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చిన, భూమ్మీదున్న రాజులంతా, తమ సేనలతో సహా, కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా, తన సోదరులతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. నీవు నిశ్చింతగా వెళ్లి, భూతధారణం చెయ్యి’ అని శ్రీమన్నారాయణుడు పలికిన విషయాన్ని, వ్యాసుడు ధ్రుతరాష్ర్టుడితో వివరించాడు. ‘విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది? విధిని ఎవరు తప్పించగలరు? అంటూ ధైర్యం చెప్పాడు. వ్యాసుడి మాటలతో ధ్రుతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని, గాంధారీ, కుంతీ, కోడళ్లనూ వెంటబెట్టుకుని, యుద్ధభూమికి బయలుదేరాడు. పెదతండ్రి వస్తున్నాడని తెలిసి, పాండవులూ, ద్రౌపదీ, కృష్ణుడూ అక్కడకు చేరుకున్నారు.
ధర్మరాజును చూడగానే, కౌరవుల భార్యలు తన్నుకొచ్చిన దుఃఖం, అవేశంతో, పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు. వారి బాధను అర్థం చేసుకున్న ధర్మనందనుడు, కన్నీరు కారుస్తూ, వారికి సమాధానం చెప్పలేక, మౌనంగా తల వంచుకున్నాడు. అనంతరం, ధ్రుతరాష్ట్రుడూ, గాంధారిల పాదాలకు నమస్కరించాడు. కుమారుల మరణాన్ని తట్టుకోలేక, కోపంతో ఊగిపోయిన గాంధారి, ‘శత్రువులను సహరించొచ్చు కానీ, ఈ అంధులకు ఊతకర్రగా, ఒక్కడినైనా మిగల్చకుండా, అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం తలపెట్టనివాడు, వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? వాడిని ప్రాణాలతో వదిలేస్తే, మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? వాడు మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?’ అంటూ ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది. యుధిష్ఠరుడు ఆమె ముందు నిలబడగా, గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. కండ్లకు కట్టుకున్న వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి, లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ల మీద పడటంతో, అవి వెంటనే ఎర్రగా కందిపోయాయి. ఆమె ఆగ్రహాన్ని చూసి హడలిపోయిన అర్జునుడు, కృష్ణుడి వెనుక దాక్కున్నాడు.
ఇక తన కోపాన్ని అణచుకుని, వెళ్ళి కుంతీదేవిని పరామర్శించమని చెప్పింది. అయితే, దీనికంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల గాంధారికి, క్రోధం కట్టలు తెంచుకుంది. కృష్ణుడి దగ్గరకు వెళ్లి, ‘వాసుదేవా! కురు పాండవులు తమలో తాము కలహించుకున్నప్పుడు, నువ్వు నచ్చజెప్పకపోయావు. కయ్యానికి కాలుదువ్వినప్పుడూ అడ్డుపడలేకపోయవు. సమర్ధుడవై ఉండి కూడా, ఉపేక్షించి అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించాల్సిందే. నా పాతివ్రత్య తపశ్శక్తితో పలుకుతున్నాను. వీళ్ళందరినీ ఇలా చంపావు కాబట్టి, ఈనాటి నుండి ముప్ఫై ఆరో సంవత్సరంలో, నీ జ్ఞాతులు కూడా వీరిలాగే, పరస్పరం కలహించుకుని, చస్తారు. అదే సమయాన నువ్వూ, దిక్కులేని చావు చస్తావు. మీ కుల స్త్రీలు కూడా ఇలాగే అందరినీ తలుచుకుని, కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇది తథ్యం’ అని శపించింది. గాంధారి శాపానికి కృష్ణుడు కంగారుపడకుండా, చిరునవ్వు నవ్వుతూ, ‘తల్లీ! ఈ శాపం యాదవులకు ఇదివరకే కొందరు మునులు ఇచ్చారు. నువ్విప్పుడు చర్విత చర్వణం చేశావు.
ఒకనాడు విశ్వామిత్రుడూ, కణ్వుడూ, నారదుడూ కలిసి, ద్వారకకు చేరుకున్నారు. ఈ మహర్షులను చూసిన యాదవులకు, వారిని కాసేపు ఆటపట్టించాలని అనిపించింది. దాంతో ఆగ్రహించిన కణ్వ మహర్షి, సాంబుడనే యాదవుని దుస్తులలో ఒక ముసలం పుడుతుందనీ, ఆ సంఘటన తరువాత, యదు వంశం సర్వ నాశనం అవుతుందనీ శపించాడు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. కాబట్టి, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. తల్లీ, యదు వంశం నశించిపోవాలన్న ఈ శాపం వలన, నీకు ఒరిగే మంచేమిటి? అని ప్రశ్నించాడు. పుత్రశోకంతో పరితపిస్తూ, అవధులెరగని ఆక్రోశంతో శపించిన గాంధారి, కృష్ణపరమాత్ముడి మాటలకు జవాబు చెప్పలేక, చిన్నబుచ్చుకుని, అక్కడి నుండి వెళ్లిపోయింది. శ్రీ హరి చెప్పిన విధంగానే, దుర్యోధనుడు తన అహంకారంతో, తన మరణానికీ, తన సొదరుల మరణానికీ కారకుడయ్యాడు. గాంధారి శపించినట్లుగానే, కురుక్షేత్రం ముగిసిన 36 సంవత్సరాల తరువాత, యాదవులంతా మద్యం సేవించి, ఒకరితో ఒకరు కలహించుకుని, చంపుకున్నారు. శ్రీ కృష్ణుడు వేటగాడి బాణం తగిలి, తన అవతారాన్ని చాలించాడు. పాండవులూ, ద్రౌపదీ కలసి, హిమాలయాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ద్రౌపదీ, భీముడూ, అర్జునుడూ, నకులుడూ, సహదేవుడూ మరణించారు. ధర్మదేవుడు, యుధిష్టిరుడిని సశరీరంగానే, స్వర్గలోకానికి ఆహ్వానించాడు.
కృష్ణం వందే జగద్గురుమ్!
Link: https://www.youtube.com/post/UgzhhfJhIElhl74Fish4AaABCQ
No comments:
Post a Comment